భారత్ -అమెరికా బంధాలు దృఢమవుతూనే ఉన్నాయని, తాజా పరిణామాలూ చెబుతున్నాయి. అదే సమయంలో చైనాపై అమెరికా పోరాట వైఖరి కూడా కొనసాగుతూనే ఉంటుందని అర్ధమవుతోంది. భారతదేశం విషయంలో చైనా దురాక్రమణ ధోరణితోనే వ్యవహరిస్తోందని, దీన్ని అడ్డుకొని తీరాలని అమెరికా కాంగ్రెస్ (చట్టసభలు) అధికారికంగా తీర్మానించాయి. మొన్న మంగళవారం రక్షణ విధానం బిల్లుపై జరిగిన చర్చ సందర్బంగా ఈ తీర్మానాన్ని ఆమోదించాయి. దిగువ సభలో డెమోక్రాటిక్ పార్టీ సభ్యుడు, ఇండియన్ అమెరికన్ రాజా కృష్ణమూర్తి దీనికి సంబంధించిన సవరణలు ప్రతిపాదించారు.
ఉభయ పార్టీల ఆమోదం
పార్టీలకు అతీతంగా ఎగువ, దిగువ సభల్లో భారీ మెజారిటీతో ఈ సవరణలు ఆమోదం పొందడం గమనార్హం. ఈ బిల్లుపై ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆమోదముద్ర పడితే, జాతీయ రక్షణ అనుమతి చట్టంగా ఇది మారుతుంది. ఈ దిశగా పలు తీర్మానాలు కూడా చేశారు. సైనికపరంగా భారత్ ను రెచ్చగొడితే ఊరుకోబోమని అమెరికా ప్రభుత్వం నుండి చైనాకు స్పష్టమైన సందేశం పంపించాలి. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకునే దిశగా భారత్ కు అండగా ఉండడం మొదలైన తీర్మానాలు ఇందులో ఉన్నాయి.
కొత్త శక్తిని ప్రసాదించే పరిణామాలు
ఈ పరిణామాలు భారతదేశానికి నైతికంగానూ, మౌలికంగానూ ఎంతో ఉత్సాహాన్ని, శక్తిని ఇచ్చే అంశాలు. మరి కొద్ది రోజుల్లో, వచ్చే 20వ తేదీ నాటికే, అమెరికాలో కొత్త ప్రభుత్వం వస్తుంది. కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ పరిపాలనా పగ్గాలు తీసుకోబోతున్నారు. ఇప్పటి దాకా పరిపాలించిన రిపబ్లికన్ పార్టీ చైనా విషయంలో భారత్ కు సంపూర్ణంగా మద్దతును ఇచ్చింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్య వ్యక్తిగత స్నేహం కూడా వికసించింది.
చైనా పట్ల ట్రంప్ రాజీలేని శత్రుభావం
అదే విధంగా, ట్రంప్ చైనా పట్ల గతంలో ఎప్పుడూ లేనంత వ్యతిరేక వైఖరిని అవలంబించారు. తాజాగా, ఉభయ సభల్లో పెట్టిన రక్షణ బిల్లుకు ట్రంప్ తప్పకుండా ఆమోదముద్ర వేసి, భారత్ పట్ల తన అభిమానాన్ని, చైనా పట్ల వ్యతిరేకతను చాటుకుంటారు. ఈ బిల్లు ఆమోదముద్ర పొందడం భారత్ కు ఎంతో కలిసొచ్చే అంశం. ఇప్పుడు అధికారం స్వీకరించబోతోంది డెమోక్రాటిక్ పార్టీ. అమెరికాలో ఉండే భారతీయులు మొదటి నుండీ ఎక్కువ శాతం డెమోక్రాటిక్ పార్టీకి మద్దతుదారులుగానే ఉన్నారు. నిన్న జరిగిన ఎన్నికల్లోనూ అదే ఉత్సాహం, ప్రోత్సాహం, సహకారం చూపించి, జో బైడెన్ గెలుపులో కీలక భూమిక పోషించారు.
జోబైడెన్ మనపక్షమే
గతంలో బరాక్ ఒబామా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా జో బైడెన్ భారత్ వైపు బలంగా ఉన్నారు. ఇప్పుడు అది మరింత పెరిగి, రెండు దేశాల బంధాలు ఇంకా పరిపుష్ఠమవుతాయని విశ్వసించవచ్చు. ఉపాధ్యక్షురాలుగా కుర్చీలో కూర్చో బోతున్న కమలా హ్యారిస్ భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి. మాతృభూమిపై ప్రేమ, భక్తి చాటుకుంటారనే బలంగా భావించాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత్ కు అమెరికా సహకారం చాలా అవసరం. మనకంటే ఎంతో బలమైన దేశంగా చైనా ఎదిగింది.
ఇప్పటికైనా కళ్ళు తెరవాలి
నేటి ప్రపంచంలో అమెరికా, చైనా అన్నిరకాలుగా అభివృద్ధి చెందిన అగ్ర దేశాలు. మన పాలకుల నిర్లక్ష్యం, చైనా, అమెరికాలను ఎక్కువగా నమ్మడం, వారిపై ఆధారపడడం వల్ల భారతదేశం అభివృద్ధి చెందాల్సినంతగా అభివృద్ధి చెందలేదు. కనీసం, ఇప్పుడైనా కళ్ళు తెరచి, ముందుకు సాగితే త్వరలోనే అభివృద్ధి చెందిన దేశంగా అవతరించి, ప్రపంచంలోని మొదటి మూడు దేశాల్లో భారత్ ఒకటిగా ఉంటుంది.
స్వావలంబనే ప్రధానం
గాల్వాన్ ఘటన దేశ సెంటిమెంట్ నే మార్చిందని, భారత్ -చైనా సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయని సాక్షాత్తు భారత విదేశాంగమంత్రి ఎస్. జై శంకర్ తాజాగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో, ఇప్పటి నుండీ భారత్ వేసే ప్రతి అడుగూ కీలకమైంది. చైనాతో దౌత్యపరంగా చర్చలు కొనసాగిస్తూ, అమెరికాతో సత్ సంబంధాలను కొనసాగిస్తూ, ఈ రెండు దేశాలను నమ్మినట్లు నటిస్తూ, మేక్ ఇన్ ఇండియా భావనను ఆచరణలో అమలుచేస్తూ, స్వశక్తిని పెంచుకుంటూ ముందుకు సాగడమే భారత్ ముందున్న కర్తవ్యం, చారిత్రక అవసరం. నైతికత, రాజనీతిని సమ్మేళనం చేసుకుంటూ వ్యవహరించడమే వివేకం.