Thursday, February 2, 2023

తిరుమంత్రమై శ్రీకృష్ణుని కాచే యశోద

17వ పాశురంలో తిరుప్పావై కథలు

నందుడు రాజయితే యశోద కన్నయ్యకు కన్న తల్లి. మనకు తెలుసు ఆమె కన్న తల్లి కాదని, కాని ఆమెకు తాను పెంపుడుతల్లినని తెలియదు. తెలిసినా నమ్మదు. తానే కన్నతల్లి. కళ్లలో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత తనదని ఆమె విశ్వాసం. శ్రీకృష్ణుడు అసాధారణమైన శిశువు. చిన్ననాడే పూతనను శకటాసురుని మరెందరో అసురులను చంపిన బలశాలి. అయినా తానే రక్షించాలని, తాను దగ్గరుంటే రక్షణ అని నమ్ముతున్నది. అది తల్లిప్రేమ.  కౌసల్య రాముడి బాల్యాకౌమార దశలను దగ్గరుండి చూసిన భాగ్యశాలి, కాని పట్టాభిషేక రాముడిని చూడాలనుకున్నదశలో అడవులకు పంపే విషాదం సంభవించింది. 14 ఏళ్ల తరువాత మళ్లీ ఆమెకు ఆ భాగ్యం కలిగింది. యశోదాదేవి ఒడిలో పుట్టినది యోగమాయే అయినా తనకు తెలియదు ఆ పసికందు క్రిష్ణయ్యే అని తెలుసు. అక్రూరుడు మధురకు క్రిష్ణయ్యను తీసుకుపోయేదాకా యశోదాదేవిని శ్రీకృష్ణసంశ్లేష భాగ్యాన్ని సంపూర్ణంగా అనుభవించి తరించిన తల్లి. ఆమెను ప్రస్తుతించి మేలుకొలుపుతున్నారు.

Also read: భాగవత సహవాసం వల్లనే గురుకృప

ఆమె సహజంగా మార్దవమైనది, ప్రబ్బలి చెట్టువలె సున్నితమైన మహిళలలోకెల్లా చిగురువంటిది అని గోదాదేవి ఆమెను పోలుస్తున్నారు. ఏమిటీ ప్రబ్బలి చెట్టు గొప్పదనం? అది నీటి ఒడ్డున ఉంటుంది. నీరు వేగంగా ప్రవహిస్తే వంగిపోతుంది. నీరు వెళ్ళిపోయిన తరువాత లేచి నిలబడుతుంది. పరిస్తితులను భర్తకు, అనుగుణంగా ఒదిగి ఉండడం, తన ధర్మాన్ని తాను నిర్వరిస్తూ ఉండడం ఆమె లక్షణం. యదు మహిళాశిరోమణి.గోపాలవంశానికి కులదీపము. స్త్రీజాతికి చిగురు అంటే శ్రేష్ఠమైనది.  యశోద మంత్రము. మంత్రము వలె భగవానుని గర్భములో నిమిడ్చికొని కాపాడునది. ఆశ్రితులకుదప్ప ఇతరులకు కనబడకుండా కుమారుడిని కాపాడుతున్నది.మాస్వామిని, యశోదా లేవమ్మా.

ఇక శ్రీకృష్ణుడు సామాన్యుడు కాదు. వామనుడై వచ్చి త్రివిక్రముడై ఎదిగి ఆకాశాన్ని రెండుగా చీల్చుకుంటూ పైపైకి పెరిగిన వాడు, నిత్యసూరులకు రారాజు, శ్రీకృష్ణమూర్తీ లేవయ్యా అంటున్నారు.

మరో మహానుభావుడు అవతార పురుషుడు బలరాముడు. తమ్ముడి రక్షణకోసమే పుట్టినాడా అనిపిస్తుంది. స్వచ్ఛమైన ఎఱ్రని బంగారంతో చేసిన కడియాన్ని ధరించిన బలదేవా, నీవూ నీ తమ్ముడూ ఇద్దరూ లేవండి, అని గోపికలు మేలుకొలుపులుపాడుతున్నారు.

Also read: మన మనసును నిర్మించేది మనం తినే ఆహారమే

లక్ష్మీదేవి స్వామిని, శ్రియఃపతి స్వామి. నంద యశోదలు తమకు సర్వేశ్వరుని అందించే వారు గనుక వీరినే స్వామినీ, స్వామి అని సంబోధిస్తున్నారు. యశోద మంత్రము. మంత్రము వలె భగవానుని గర్భములో నిమిడ్చికొని కాపాడునది. ఆశ్రితులకు దప్ప ఇతరులకు కనబడకుండా కుమారుడిని కాపాడుతున్నది యశోద.శ్రీకృష్ణుడే భగవంతుడు. బలరాముడెవరు?విష్ణువుకు పానుపై, శ్రీరామునికి లక్ష్మణుడై, శ్రీకృష్ణుడికి అన్నయైన ప్రక్కతోడు. బలరాముడే భాగవతుడని 17వ పాశురం సారాంశం.  యశః =కీర్తిని ద=యిచ్చునది. పరమాత్మే యశస్సు. ఆ పరమాత్మనుఇచ్చేది యశోద. అన్నిమంత్రాలలో తిరుమంత్రము వంటిదే యశోద. మంత్రో మాతా, గురుఃపితా = మంత్రమే తల్లివంటిది, గురువే తండ్రి వంటి వాడు. భగవంతుడినే కుమారుడిగా పొందిన కౌసల్య, దేవకి, యశోద అనే ముగ్గురిలో శ్రేష్ఠమైనది యశోద. కుమారుని కట్టివేయడమే కాక కోపించి కొట్టే అధికారం కూడా సాధించి సాగించుకున్న తల్లి యశోద. భగవంతుడిని పూర్తిగా వశపరుచుకునే శక్తి యశోదకు ఉన్నట్టు తిరుమంత్రానికి మాత్రమే ఉంది.

ఓ పక్క క్రిష్ణయ్యకు పాలిస్తూ మరొక పక్క భర్త నందుడిని కూడా ఆనందింపజేసే సతి యశోద. ఆమె జీవికి పరమాత్మకు అనుసంధానం కల్పించే లక్ష్మీస్వరూపి. జీవుడికి దేవుడికి మధ్య నిలిచి ఇరువురిని పట్టుకునే తల్లి ఆమె.

ఓం అనే ప్రణవాక్షరంలో అ ఉ మ అనే మూడక్షరాలు ఉంటాయి. అ కారము పరమాత్మ, మ కారము జీవుడు, ఉ మధ్యలో ఉండే తల్లి. నంద శ్రీకృష్ణుల మద్య యశోద.  భగవద్రామానుజులు దేవ దేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరమ్ అని కీర్తించినారు.

సీత నారీణాముత్తమా వధూః అంటారు. లంకలో తనను బాధించిన రాక్షస స్త్రీలను కూడా కరుణించి కాపాడిన ఉత్తమురాలు ఆమె. ఆ విధంగా ఉత్తమురాలివి నీవు అని యశోదను పిలవడంలో తమను ఆదుకొమ్మనే అభ్యర్థన ఉంది.

Also read: శంఖు చక్రాలతో పుట్టిన చిన్ని శ్రీకృష్ణుడుశంఖు చక్రాలతో పుట్టిన చిన్ని శ్రీకృష్ణుడు

లోకాలు కొలిచి కష్టపడిన పాదాలు

శ్రీమన్నారాయణుడు తనవారనుకున్నవారిని కాపాడడానికి వామనుడై దిగి వస్తాడు. త్రివిక్రముడై ఎదిగిపోతాడు. బలి మంచివాడే కాని ఇంద్రుడి రాజ్యం ఆక్రమిస్తాడు. అహంకరిస్తాడు. అతని అహంకారాన్ని తొలగించి అవసరమైనంత వరకే శిక్షించి అతన్ని కూడా కాపాడతాడు. సర్వలోకాలకు ప్రభువైన తనకే తన లోకాలనే దానం చేసే ఘనతను బలికి ఇస్తాడు.

తన పాదాలతో ముల్లోకాలను కొలిచే శ్రమ పడతాడు ఎగుడుదిగుడు ప్రదేశాలపై పాదాలను మోపి బాధ పెట్టినాడట. ఎంత ప్రేమ, ఎంత వాత్సల్యము. ఇంద్రుడి రాజ్యాన్ని ఇంద్రుడికి అప్పగిస్తాడు. కాడు మ్రోడులున్న భూమిని ఇతర లోకాలను కొలిచి కష్టపడి అలసి పోయి నిద్రిస్తున్నావా, మాకోసం నీవు లోకాలు కొలిచే అవసరం లేదు, కన్నులు తెరిచి మమ్ముచూస్తే చాలు అంటున్నారు గోపికలు.

ద్రౌపదీ రక్షకుడు

ఎవరూ ఆదుకోలేని దుర్దశలో ఉన్న ద్రౌపది, దుశ్శాసనుని దుర్మార్గానికి తపిస్తూ గోవిందా అని పిలిస్తే శ్రీకృష్ణుడు ఆమె మానాన్ని కాపాడతాడు. ఏం జరిగిందో తెలియదు. ఎవరూ చెప్పలేరు, చీర లాగలేక దుశ్శాసనుడు కుప్పగూలిపోయాడు. శ్రీకృష్ణుడు మాత్రం నేను అవమానం జరగకుండా ఆపగల్గినాను కాని ఇంకా చేయవలసినంత సాయం చేయలేదని బాధపడుతూ ఉంటాడట.

నారాయణుడు అంటే నారములున్నచోటు అని, నారములంటే జీవులని, అంటే సర్వ సర్వజీవులయందు తానుండి  సర్వజీవులను నిలుపువాడు నారాయణుడని అర్థం.

బలరాముడు

ముందుగా నన్ను కాదు మా అన్నను నిద్రలేపాలని శ్రీకృష్ణుడు గోపికలు పరోక్షంగా సందేశం ఇస్తున్నాడు.  త్రేతాయుగంలో లక్ష్మణుడని తమ్ముడిగా పుట్టి రాముని సేవించి, ద్వాపరంలో అన్నగాపుట్టి శ్రీకృష్ణుడిని కాపాడడమే బాధ్యత నిర్వహించిన వాడు బలరాముడు. ఆయనను లేపకుండా తనను లేపడం సరికాదని ఆయన  మౌనంగా పరుండిపోయినాడు.

Also read: లక్ష్మణుడు యోగి, భరతుడు ముని

శ్రీకృష్ణుడు మధురకు వెళ్లిన తరువాత మళ్లీ బృందావనానికి వ్రేపల్లెకు రాడు.

ఓ సారి బలరాముడు వస్తాడు. తన ప్రేమపూరిత మధురవచనాలతో గోపికలను ఊరడిస్తాడు. శ్రీకృష్ణుని సందేశాన్ని వినిపిస్తాడు. అంతగా సాయపడిన బలరాముడిని లేపిన తరువాత వారితోపాటు తానూ లేస్తానని శ్రీకృష్ణుడంటాడు. బలరాముడు కాలుకు బంగారుకడియం ధరించాడు. ఆయన పాదాలు ఆశ్రయిస్తేనే శ్రీకృష్ణ సందర్శనం సాధ్యమవుతుంది.  లక్ష్మణుడు బలరాముడు ఆది శేషుని అవతారాలు. అంటే విష్ణువుకు శయ్య, ఆ శయ్యపైనున్న విష్ణువు నిద్రించాడంటే సరే కాని శయ్యకూడ నిద్రిస్తుందా అని కొంటె ప్రశ్నవేస్తారట గోపికలు. ఆయన మేల్కొనాలనే గోపికల లక్ష్యం.

గోదమ్మ పాదాలకు శరణు శరణు

Also read: రామదర్శనంతో దశరథుడికి యవ్వనం

మాడభూషి శ్రీధర్

1.1.2022

Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles