Monday, April 29, 2024

ఇక అడవికి రక్షణ  ఏదీ?

అంతర్జాతీయ వేదికల మీద, దేశాల శిఖరాగ్ర సమావేశాల ‘డిక్లరేషన్’ పత్రాలలో పర్యావరణ పరిరక్షణ గూర్చి చెప్పే ఉపన్యాసాలు, ధీర్ఘ, గంభీర ప్రకటనలు, విన్నప్పుడు,  చదివినప్పుడు మనకు కడుపు నిండిపోతూ వుంటుంది. తీరా కార్యక్షేత్రంలో  అదే నాయకుల నిర్వాకం చూసినప్పుడు కడుపు తరుక్కుపోతూ వుంటుంది. ఆషాఢభూతులు, గిరీశాలు వీరిముందు దమ్మిడీకి పనికిరారు. మొన్న G 20 డిక్లరేషనే చూడండి. అందులో  పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని పిలుపు ఇచ్చారు. ఇక్కడేమో 1980  అటవీ సంరక్షణ  చట్టానికి నడుములు విరగ్గొట్టారు.

Also read: ‘5వ తబ్సీలు లిస్టు చూడుము’

అడవులు, ఆదివాసీల హక్కులకు సంబంధించి ప్రస్తుత మోడీ సర్కార్ ఈ దిగువ చట్టాలలో మార్పులు తీసుకువస్తున్నది. ఆ మార్పులు పర్యావరణాన్ని మరింతగా  కాపాడటం కోసం, ఆదివాసీల హక్కులను మరింతగా బలపర్చడం కోసం మాత్రం కాదు.

మహాసభలో వేదిక

అటవి సంరక్షణ చట్టం 1980

అటవి భూములను అటవేతర ప్రయోజనాలకు మళ్ళించడానికి ఈ చట్టం అడ్డంకిగా మారిందని కార్పోరేట్ శక్తులు చలా కాలం కిందటే గుర్తించాయి. దానిని మార్చేవేయడం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తూ ఇప్పుడు సఫలీకృతం అయినాయి.  చట్టంలో నిర్దేశించిన పద్దతులు పాటించడంకంటే తమకు మార్గం సుగమం చేసే విధంగా చట్టాన్ని సవరిస్తే పీడా పోతుందని ఏలికలు సమకట్టారు.

ఈ చట్టం లేకముందు, 1980 వరకూ  ఒక కోటి ఎకరాల అటవీ భూమిని అటవేతర ప్రయోజనాల కోసo మళ్ళించారు. చట్టo వచ్చిన తరువాత ఈ 43 ఏళ్లలో 25 లక్షల ఎకరాలు మాత్రేమే మళ్ళించగలిగారు. అంటే అటవి భూముల సంరక్షణలో చట్టం, ఎంతో కొంత,  ఒక రక్షణ కవాటంగా నిలిచిందని తెలుస్తున్నది. నిజానికి 1980లో ఈ చట్టం వచ్చేనాటికి పర్యావరణ సంక్షోభం రాబోతున్న  ఒక విపత్తుగానే వుంది. నేడు మనం, మొరోకాలో భుకంపం, లిబియా వరదలు, మన పొరుగు దేశమైన పాకిస్తాన్ లో వరదలు, మన దేశంలోనే ఎదో ఒక చోట నిత్యం చూస్తున్న మెరుపు వరదలు,  పర్యావరణ విపత్తు మన ముంగిట నిలించిoదనడానికి సాక్ష్యాలు. సరిగ్గా ఈ సమయంలో చట్టం సవరణకు ప్రభుత్వం సిద్దం అయ్యింది.

Also read: కటు దుఖం… పటు నిరాశ

అటవి సంరక్షణ చట్టం వున్నా, జరిగే పని జరిగిపోతూనే వుంది. ఫారెస్ట్ అడ్వయిజరి కమిటి, రీజనల్ అడ్వయిజరి కమిటి, ఆ కమిటి, ఈ కమిటి, వన్య మృగ సంరక్షణ బోర్డులు  ఇలా అటవీ పర్యావరణ అనుమతులను పరిశీలించి, పర్యవేక్షంచడానికి పెట్టుకున్న సంస్థలు, వాటిలోని  పెద్ద పెద్ద అధికారులు  అనుమతులకు  పచ్చ జెండా చూపించడమే వాటిపనిగా మారింది. ఉదాహరణకు, 2020లో,  14,855 హెక్టార్లు ( షుమారుగా 37,137 ఎకరాలు) అటవీ భూమిని మళ్ళించడానికి 367 ప్రతిపాదనలు రాగా అందులో 3 మాత్రమే తిరస్కరించబడినాయి. ఇది చట్టం వుండగా వున్న పరిస్థితి.

కొత్త చట్టంలో కీలకైన మార్పు ఏమిటoటే, ‘అటవి’కి అర్ధం, నిర్వచనంకు తెస్తున్న మార్పు. 1980 తరువాత రికార్డులలో అటవి భూమిగా నమోదై వున్న భూమిని  మాత్రమే ఇక నుండి  ‘అటవీ భూమి’గా గుర్తిస్తారు. ఒక వేల అక్కడ అడవి వుంది కాని అది రికార్డులో ‘అటవీ భూమి’గా నమోదు కాలేదనుకుందాo అప్పుడు సదరు భూమి సాంకేతికంగా ‘అడవి’ కాదు. గనులకు దాని మళ్లింపుకు ఇబ్బంది లేదు. లేదా ఇక అది అటవీ సంరక్షణ చట్టం పరిధిలోకి రాదు. ఇది మరికొన్ని చట్టాలను, సుప్రీం కోర్టు తీర్పును పూర్వపక్షం చేస్తుంది.

అటవి చట్టం – 1927 (1967) : 

ఒక భూఖండాన్ని లేదా కొంత భూభాగాన్ని అడవి భూమిగా ప్రకటించడానికి ప్రభుత్వానికి అధికారం ఇచ్చే చట్టాలు రెండు వున్నాయి. అవి కేంద్ర అటవీ చట్టం 1927. ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టం 1967. నిజానికి ఈ రెండింటికి పెద్దగా తేడా లేదు. 1878 ఇండియన్ ఫారెస్ట్ చట్టం, నైజాం అటవి చట్టం, ఫసలి 1310 (1900 AD) రెండు కలసి  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ చట్టంగా 1967గా  కుదురుకున్నాయి. కేంద్ర చట్టం, రాష్ట్ర చట్టం రెండిటిలోను  చాలా సెక్షన్ లు ఒకటే. అందుచేత మనం రాష్ట్ర చట్టం గూర్చి చెప్పుకుందా. ఈ చట్టం అనుసరించి, సెక్షన్ 15 ద్వారా కొంత భూమిని “రిజర్వు ఫారెస్ట్ (Reserved Forest)” గా ప్రకటించ వచ్చు. లేదా సెక్షన్ 24 “ప్రొటేక్టెడ్  ఫారెస్టుగా ( Protected Forest) ప్రకటించ వచ్చును. 

అలా ప్రకటితo గాకముందు ఆ భూమి స్వభావం ఏమిటి? అది రికార్డు దాఖలు అటవి భూమి అవుతుందా?

ఒక భూమిని “అటవీ భూమిగా” (సెక్షన్ 15 లేదా 24) ప్రకటించడానికి ప్రభుత్వం తన ఉద్దేశాన్ని (intention)ను సెక్షన్ 4 ద్వారా వ్యక్తం చేస్తుంది. ఉదాహరణకు ‘ఏడువారాల కొండ’ అనే ఒక పర్యతo వుంది. దాని నిండా  అడవి వుంది. ఆ కొండను “అటవీ భూమిగా” (సెక్షన్ 15 లేదా 24)గా మార్చడానికి ప్రభుత్వం ప్రాధమిక ప్రకటన ఇచ్చింది. అదే సెక్షన్ 4 నోటిఫికేషన్. ఇప్పుడు సెక్షన్ 4 నుండి ఆ భూమి “రిజర్వు ఫారెస్ట్ (Reserved Forest)”  లేదా  “ప్రొటేక్టెడ్ ( Protected Forest) గా మార్పు చెయడానికి కొంత ప్రక్రియ వుంది (నేను కావాలనే ఆ వివరాలలోకి వెళ్ళడం లేదు. ఆ ప్రక్రియ  ఇంకా పూర్తి కాలేదని అనుకుందాo. ఈ మధ్య కాలంలో అది అటవీ భూమి అవుతుందా అవ్వదా? ఇప్పుడు కొత్త అటవీ సంరక్షణ చట్టం అనుసరించి ఈ భూమి,  1980 తరువాత రికార్డులో అటవి భూమిగా నమోదు కాలేదు  ( అంటే సెక్షన్ 15 లేదా 24 ప్రాసెస్ పూర్తి కాలేదు) గనుక సాంకేతికంగా అది అటవీ భూమి అవుతుందా, అవ్వదా? ఇది అటవీ భూమి కాదని వాదించ వచ్చు. కొత్త అటవీ సంరక్షణ చట్టం అందుకు అవకాశం ఇస్తుంది.

Also read: మూడు నిశ్చల చిత్రాలు-అనిశ్చిత జీవితాలు!

ఇప్పటి వరకు అలాంటి భూమిని ‘డీమ్డ్ ఫారెస్ట్’ అని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. పోలవరం ప్రాజెక్టులో, మునిగిపోతున్న అటవి భూమిలో  ఇలాంటి “డీమ్డ్ ఫారెస్ట్” (సెక్షన్ 4 నోటిఫికేషన్) భూమికి కూడా అనుమతి తీసుకోవాలని ఆనాడు కేంద్ర ఏజెన్సిలు  అభ్యంతరం లేవదీసాయి.

మన ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి డీమ్డ్ ఫారెస్ట్ భూమి 25 లక్షల ఎకరాల వరకు వున్నది ( 9,93,551.84 హెక్టార్లు). కోస్తా తీర ప్రాంతంలో చాల భూమి డీమ్డ్ ఫారెస్ట్ గా  ప్రకటితమైన భూమే. ఇది ఇప్పుడు రికార్డు దాఖల అటవి భూమి కాదని, కొత్త అటవీ సంరక్షణ చట్టం ద్వారా వాదించినా  మనం ఆశ్చర్యపోనసరం లేదు. 

రికార్డులో వుoటేనా అడవా?

ఇది చాల కీలకమైన ప్రశ్న. అడవిని బట్టి రికార్డా లేక రికార్డును బట్టి అడవా?

అడవులు సహాజసిద్దంగా పుట్టిపెరిగినవి. రికార్డులు మనం రాసుకున్నవి. కొంత భూమిపై అడవి వుంది కాని రికార్డులో అది అడవిగా నమోదు కాలేదు (సెక్షన్ 15,24). అప్పుడు అది అడవి అవుతుందా లేదా దానికి అటవి సంరక్షణ చట్టం వర్తిస్తుందా లేదా? ఈ ప్రశ్నకు టీఎన్ గోదావర్మన్ ( Godavarman) వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీం కోర్టు, రికార్డుతో సంబంధం లేకుండా అక్కడ అడవి వున్నది లేనిది చూడాలని, అడవి వుంటే విధిగా అటవీ సంరక్షణ చట్టం 1980 వర్తిస్తుందని చెప్పింది. ముందు చెప్పిన అటవీ చట్టం 1967 చట్టo (డీమ్డ్ ఫారెస్ట్ భూమి), సుప్రీం కోర్టు తీర్పు నుoడి తప్పించుకోవడం కొత్తగా తెచ్చిన అటవి సంరక్షణ చట్టం ఉద్దేశాలలో ఒకటి.

అటవి హక్కుల చట్టం 2006

అడవుల విషయంలో ఆదివాసీలకు జరిగిన అన్యాయాన్ని సరిచేయడానికి ఈ చట్టం తెచ్చామని పార్లమెంట్ లో చెప్పుకున్నారు.  ఈ చట్టం అనుసరించి,  అటవి భూమిపై ఆదివాసీలకు గల సాగు హక్కును, ఉమ్మడి సాముదాయక హక్కును అటవీ హక్కుల చట్టం  గుర్తిస్తుంది. అది ఎప్పుడు గుర్తిస్తుంది?  అటవి భూమిని అటవేతర ప్రయోజనాలకు మళ్ళించడానికి గ్రామ సభను సంప్రదించాలి. సదరు అటవీ భూమిని అటవేతర ప్రయోజనాలకు మార్పు చేయాలంటే అక్కడ అటవీ హక్కుల చట్టం అమలు ప్రక్రియను పూర్తి చేయాలి. పోలవరం ప్రాజెక్టు విషయంలో అదే జరిగింది. ఈ ప్రక్రియను పూర్తీ చేయడం, గ్రామ సభ అనుమతి అనే రెండు షరతులును అధిగమించడo కోసం ఆనాటి ప్రభుత్వం ఒక ‘ట్రిక్’ చేసింది. ప్రోజెక్టులో మునిగిపోతున్న 10 వేల ఎకరాల అటవి భూమిలో  హక్కులు కల్పించమని తమకు  ‘క్లయిం’లు ఏవి రాలేదని కనుక తాము చట్టాని అమలు చేసేశామని కేంద్రానికి లేఖ రాసింది. ఇప్పుడు కొత్త అటవీ సంరక్షణ చట్టం వలన ఆ అవసరం లేదు. ముందు చెప్పిన రెండు షరతులను పూర్తి చేయకుండానే “ప్రాజెక్టుల”కు ముందస్తు అనుమతి ఇచ్చేయవచ్చును.

మహాసభలో సభికులు

సహజ అడవి పెంచిన అడవి

ప్రకృతి సహజ సిద్దంగా ఎదిగిన  అడవిని రద్దు చేసి, అందుకు ప్రత్యామ్నాయంగా మరో చోట అడవిని పెంచవచ్చునా? ఒక ఖాళి ప్రదేశంలో చెట్లు పెంచేతే అది సహజ అడవికి  సరి సమానం అవుతుందా? కాదు. సహజ అడవికి వాతావరణంలో వున్న  కర్బన వాయువు (బొగ్గుపులుసు వాయువు -Co2)ను పీల్చుకొనే శక్తిలో పెంచిన అడవికి (దానిని ‘అడవి’ అని మనం అనుకుంటే)  40 శాతం తక్కువ.

ఒక చోట సహజ సిద్దమైన అడవిని తీసివేసి మరో చోట దానికి ప్రత్యామ్మయంగా చెట్లు పెంచాలoటే, ప్రజలకు అందుబాటులో వుండి, వారి అవసరాలకు ఉపయోగపడే (ప్రభుత్వ) భూములను  ఇందుకు కేటాయిoచవలసి వుంటుంది. అప్పటి వరకు గ్రామ సాముదాయక అవసరాలకు ఉపయోగపడిన ఈ ‘రెవిన్యూ’ భూములు ‘అటవీ’ భూములుగా అటవీ శాఖ చేతిలోకి పోతాయి.

Also read: ముప్పయ్ సెంట్లు కోసం మూడేళ్ళుగా …

రక్షణ కోల్పోనున్న అడవి

‘అడవి’ అంటే రికార్డులొ ‘అడవి’ గా నమోదైన భూమి అని మాత్రేమే అనే పరిమిత అర్ధం చెప్పుకుంటే, అటవీ చట్టం ప్రాధమిక ప్రకటన ద్వారా,  సుప్రీం కోర్టు ‘అటవి’కి  ఇచ్చిన విస్తృత నిర్వచనం ద్వారా ‘అడవి’గా వున్న భూమికి రక్షణ లేకుండా పోతుంది. అప్పుడు అది ‘అటవీ సంరక్షణ చట్టం’ పరిధిలోకి రాకుండా బయట వుండిపోతుంది. ఇప్పటికే వున్న అటవీ భూమిలో 27.62 % భూమి రక్షణకు బయట వుండిపోతుంది.

వివిధ రంగాలలో పని చేసిన 400 మంది  విశ్రాంత అధికారులు, శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు  కొత్త అటవీ సంరక్షణ బిల్లును ఉపసహంరించుకోమని కోరుతూ లేఖ రాశారు. అయితే కార్పోరేట్ ప్రయోజనాలు – ప్రర్యావరణ పరి రక్షణలలో మొదటిదానికే ప్రభుత్వాలు, పాలకులు మొగ్గు చూపుతారని హిమాలయ ప్రాంతoలో అభివృద్ధి పేరుతొ జరుగుతున్న విధ్వంసం, దాని ఫలితాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. పర్యావరణాన్ని పరిరక్షించాలoటూ చెప్పే ఉపన్యాసాలకు, విధాన నిర్ణయాలకు నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా వుంది. అయితే మనల్ని మనం మభ్యపెట్టుకోవచ్చు, కాని ప్రకృతిని కాదు.

Also read: నాన్ షెడ్యూల్ ఏరియా ఆదివాసీలకు రక్షణ కల్పించాలి

(2023 సెప్టంబర్ 12, 13 తేదిలలో, విశాఖపట్నం, సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో  ఆలిండియా ఖేత్ మజ్దుర్ కిసాన్ సభ (AIKMKS) జరిగింది. ఆ మహాసభలో చేసిన సంక్షిప్త  ప్రసంగానికి, వివరణాత్మక వ్యాస రూపం)

P.S. అజయ్ కుమార్

జాతీయ కార్యదర్శి

అఖిల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం (AIARLA)

అజయ్ కుమార్ పీ ఎస్
అజయ్ కుమార్ పీ ఎస్
పీఎస్ అజయ్ కుమార్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో సోషల్ వర్కులో మాస్టర్స్ డిగ్రి (MSW) చేశారు. గత 30 ఏళ్లుగా ఆదివాసీల భూమి సమస్య, నిర్వాసిత, గ్రామీణ కార్మికుల హక్కుల కోసం పని చేస్తున్నారు. ‘ప్రభుత్వ భూమి పేదలదే’, ‘భూమి సమస్య – వ్యాసాలు 1, 2’, ‘కళ్యాణలోవ కధలు’ ప్రచురితమైన పుస్తకాలు. భూమి సమస్య వ్యాసాలు – 1కి, DNF Rural Journalist award foundation –Hyderabad వారి Rural journalist award for year 2008 లభించింది. ప్రస్తుతం అఖల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles