Wednesday, May 15, 2024

‘5వ తబ్సీలు లిస్టు చూడుము’

ఫొటో రైటప్: 09జూన్ 2020న గ్రామాన్ని సందర్శించిన అప్పటి రెవిన్యూ అధికారి

 ‘కొత్తవీధి’ ఒక చిన్న కుగ్రామం. రేపోమాపో ముఖ్య మంత్రి కాపురం పెట్టబోతున్న విశాఖ మహానగరానికి 65 నుండి 70 కిలో మీటర్ల దూరంలో వుంది ఈ గ్రామం. ఈ గ్రామానికి చేరుకోవడానికి,  రోడ్డు మార్గం ‘గుంటి’ అనే ఆవాస గ్రామం వరకు వుంది. అక్కడ నుండి కొత్తవీధి వెళ్ళడానికి 2 కిలో మీటర్లు నడవాలి. లేదా ద్విచక్ర వాహనాలపై జాగ్రత్తగా వెళ్తే ఆ గ్రామం చేరుకోవచ్చు.

Also read: ముప్పయ్ సెంట్లు కోసం మూడేళ్ళుగా …

10 కోందు ఆదివాసీ కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నాయి. ఈ గ్రామానికి ఉత్తరం, తూర్పు, దక్షిణం మూడు వైపులా కొండలు  బారు తీరి వుంటాయి. ఆ కొండలు సతత హరిత అడవులతో నిండి వున్నాయి. ఈ ఆవాస గ్రామం అనకాపల్లి జిల్లా, చీడికాడ మండలం, కోనాం రెవిన్యూ / పంచాయితీలో వుంది. నేను గత 20 ఏళ్లుగా ఈ పంచాయితీ ఆవాస గ్రామాలలో తిరుగాడుతున్నాను. కాని 2021 వరకు అక్కడ ఒక ఆవాస గ్రామం వుందనీ, అందులో కోందు ఆదివాసీలు జీవిస్తున్నారనీ నాకు తెలియరాలేదంటే ఇక మీరు అంచనా వేసుకోవచ్చు.  వారు ఎంత ప్రశాంతoగా తమ మానాన తాము బ్రతుకుతున్నారో మీరు ఉహించవచ్చును.

గ్రామ SFA – 5వ తబ్సిీలు లిస్టు చూడుము

ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో (గత ఏడాది కొత్త జిల్లాల ఏర్పాటుతో అది రెండయ్యిoది. విశాఖపట్నం జిల్లా – అనకాపల్లి జిల్లా) మొదట మూడు రెవిన్యూ డివిజన్ లు, తదుపరి నాలుగు రెవిన్యూ డివిజన్ లు ఉండేవి. అందులో ఒకటి పాడేరు రెవిన్యూ డివిజన్. ఈ డివిజన్ లోని  11 మండలాలు తూర్పు కనుమలపై వున్నాయి.  ఇదంతా ఆదివాసీ ప్రాంతంగా,  అంటే రాజ్యంగoలోని 5వ షెడ్యుల్ కింద నోటిపై చేసిన ప్రాంతంగా వుంది. పాడేరు డివిజన్ కేంద్రంలో సబ్ కలెక్టర్ ఆఫీస్, ప్రోజెక్ట్ ఆఫీసర్ (PO), ITDA ( Integrated Tribal Development Agency-  సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ) వున్నాయి. పాడేరు రెవిన్యూ డివిజన్ కు సరిహాద్దుగా ఓడిస్సా, చత్తీస్ గఢ్ రాష్ట్రల ఆదివాసీ ప్రాంతాలు వుంటాయి. ఈ హద్దులన్ని మనం గీసుకున్నవి. ఆదివాసీల వరకూ అది  తూర్పు కనుమల దండకారణ్యం ప్రాంతం.

“కొత్తవీధి” అనే గ్రామం కోనాం రెవిన్యూ, చీడికాడ మండలంలో వుందని మీకు చెప్పాను కదా! ఆ గ్రామంలో కోoదు తెగకు చెందిన ఆదివాసీలు జీవిస్తున్నారని,  అవి 10 కుటుంబాలని కూడా అని తెలియజేశాను. ఇంతకీ ఎవరి కోoదు ఆదివాసీలు ?

ఎవరి కోందులు?  

వారి మూలాలు  పొరుగు రాష్ట్రమైన  ఓడిస్సా కు చెందిన ‘కోరాపుట్’ లో ఉన్నాయి. పర్లాకిమిడి (PURLAKIMEDY) రాజుల పాలనలో వారు స్వతంత్రంగా జీవించారు. బ్రిటిష్ వలసవాదులు ఆ  రాజులను “జమిందార్లు’గా మార్చి ఆదివాసీ ప్రాంతాలలోకి ప్రవేశిస్తూ,  ఆదివాసీల స్వంతoత్రతను అదుపు చేయడానికి ప్రయత్నం చేసిన ప్రతిచోట వారు ఆయుధాలు అందుకున్నారు.  నిజానికి అదొక పెద్ద కధ.  బ్రిటిష్ వారు కోందు తెగ నాయకులు ( చీఫ్స్) 40 మందిని బహిరంగంగా ఉరి తీశారు (Goomsoor revolt 1832-1836). కాని వారిని గ్రామాల నుండి ఖాలీ చేయించలేకపోయారు.  అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతొ, 1950 తరువాత పాలకులు వారిని వారి గ్రామాల నుండి నిర్వాసితులను చేసి తరిమేశారు. 2013 కొత్త భూసేకరణ చట్టం వచ్చేంతవరుకూ, మీకు అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు కావాలా? “అయితే నిర్వాశితులకు మీరు ఇచ్చే పునరావాసం గూర్చి చెప్పండి” అని ప్రపంచ బ్యాంకు (World Bank)  అడిగేంత వరకూ ‘అసలు పునరావాసం లాంటిది  ఒకటి ఉంటుందని, ఉండాలని’ మన పాలకులకు తెలియరాలేదు (thanks to Medha Patkar and Narmada Bachavo Andolan).

The Hindu’s Spotlight

పాడేరు రెవిన్యూ డివిజన్ లోని ముంచిoగ్ పుట్, అరుకు, అనoతగిరి మండలాలు ఓడిస్సా రాష్ట్రం కోరాపుట్ జిల్లాను  ఆనుకోని వుంటాయి. మొదటి తరం కోoదు ఆదివాసీ నిర్వాసితులు గొడ్డలి, అలుగులు(విల్లంబులు), అంబలి పట్టుకొని ముందు చెప్పిన సరిహద్దు మండలాలకు వలస వచ్చారు. కొండపై వున్న అడవులను కొట్టి గ్రామాలు కట్టుకున్నారు. జనం పెరుగుతారు గాని భూమి పెరగదుకదా! అందులో కొందరు మళ్ళీ గొడ్డలి, అలుగులు, అంబలి పట్టుకొని కొత్త ప్రాంతాలకు వెళ్తారు. ఇలా తరం తరువాత తరం (Generation after Generation) వెళ్తూ వుంటారు. ఎక్కడ నీటి ఆదరువు, నేల ఆదరవు దొరికితే అక్కడ ఒక కొత్త గ్రామం వెలుస్తుంది. చాలా సoదర్భాలలో ‘కొత్తవీధి’ లానే ఆ గ్రామాలు రికార్డులకు ఎక్కవు. కొలంబస్ అమెరికాను కనిపెట్టినట్లుగా నేను అలాంటి ఓ 20 గ్రామాలను కనిపెట్టాను (కొలంబస్ కనిపెట్టడం ఏమిటి వాడి బొంద .. అవి ఎప్పటి నుండో అక్కడ వున్నాయిని అంటే , ఆ మాట నిజమే సుమా!) అయితే వాటి కధ మరోసారి చెప్పుకుందాం.

Also read: నాన్ షెడ్యూల్ ఏరియా ఆదివాసీలకు రక్షణ కల్పించాలి

కొత్తవీధిలో వున్న ఈ కోoదు ఆదివాసీలు ఉమ్మడి విశాఖ జిల్లా,  పాడేరు డివిజన్ లోని అరుకు, అనంతగిరి మండలాల నుండి గంగరాజు (G) మాడుగుల మండలoకు వలస వచ్చినవారు.  సీజనల్ లేబర్ పనుల కోసం అప్పుడప్పుడు కోనాంకు  వచ్చేవారు. కొందు ఆదివాసీ స్త్రీ, పురుషులు శ్రమ జీవులు. కనుక వారికి  పనులు ఇవ్వడానికి రైతులు చాల ఆశక్తి చూపుతారు. అలాంటి సమయంలోనే  వారు ప్రస్తుతం వున్న ప్రాంతాన్ని చూసారు. చుట్టు కొండలు. ఆ కొండలను ఆనుకోని  సాగుకు పనికి వచ్చే నేల. కొండల నుండి దిగువకు పారుతున్న నీటి వాగులను  చూశారు. అప్పటికి అదంతా దట్టమైన అడివితో నిండి వుంది. కోనాం గ్రామ పెద్దలను అడిగితే “అదంతా బంజరని సాగు చేసుకొండని”  చెప్పారు. ఒక కోoదు ఆదివాసీకి అంతకంటే ఏం కావాలి? అక్కడ ఒక గ్రామం వెలసింది. ఒక జీవితం పరుగులు పెట్టింది. 25 ఏళ్ల తరువాత, ముందు వచ్చిన తరం వారి బిడ్డలకు పెళ్లిళ్ళు అయినాయి. కొడుకులు, కోడళ్ళు, ఇల్లరికపు అల్లులు, వారి పిల్లలతో గ్రామం పెరిగింది. చావులు, పుట్టుకలు సాగుతున్నాయి. తమకు వున్నదానిలోనే  బిలాయి పెంకులు, హజ్ బెస్టాస్ రేకులతో ఇంటికి కప్పులు వేసుకున్నారు. ప్రంపంచంలోనే అత్యంత శక్తివంతమైన సర్కార్ వారికీ తాగడానికి నీళ్ళు ఇవ్వలేకపోయింది.  కాని “సత్యసాయి సేవా సమితి” ఒక మంచినీటి బోరు, వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసింది. కొత్తవీధి ఆదివాసీలకు ఎవరి మీద ఫిర్యాదులు లేవు.

పరదాల చాటున దాక్కున్న మరో ప్రపంచం

మొదటి సారి,  2021 మధ్యలో, వారి గ్రామానికి  బయటివారు రావడం గమనించారు. తాము పెంచిన జీడి మామిడి తోటలలో సర్వేయర్ తన సిబ్బందితో వచ్చి రాళ్లు వేయిస్తున్నాడు. ‘కొత్తవీధి’ ఆదివాసీలు పోరుగున వున్న ‘గుంటి’ గ్రామానికి చెందిన కొండ దొర ఆదివాసీలకు నేస్తాలు, పొరుగు రైతులు. కొండ దొరల ద్వారా నాకు ‘కొత్తవీధి’ అనే ఆవాస గ్రామం గూర్చి మొదటి సారి అప్పుడే తెలిసింది. నేను వారిని వెతుక్కుoటు పోయాను. గుంటి గ్రామం ఆదివాసీ యువకులు కోట కొండలరావు, జన్ని లక్ష్మణరావుల సహయంతో మొదటి సారి అక్కడికి వెళ్ళాను.

అక్కడ ఎలా వుంది? పరదాల చాటున దాక్కున మరో ప్రపంచంలా వుంది. మూడు వైపుల కనువిందు చేసే  కొండలు,  వాటి నిండా అడవులు. ఆ కొండల మీద వున్న అడవి వాటి  పొత్తిళ్ళ మధ్య వున్న సమతల ధరణిని కూడా ఆవరించి ఉండేదట. తమ రిక్త హస్తాలతో అడవిని తొలగించి  కొత్తవీధి ఆదివాసీ రైతులు, రైతు మహిళలు భూమిని బైల్పరిచారు, సాగులోకి తీసుకు వచ్చారు. బిడ్డలను నడుముకు కట్టుకొని, తాము అంబలి తాగుతూ, అప్పుడప్పుడూ వారికి పాలిస్తూ,  మరోచేత్తో గొడ్డలి పట్టిన కోoదు మహిళా రైతులే నా కళ్ళలో కదలాడారు.

AP స్పేస్ అప్లికేషన్ సెంటర్ (APSAC)

కొంత పరిశీలన తరువాత నాకు అర్ధమైన   సoగతులు  ఈ విధంగా వున్నాయి. 1. కొత్తవీధి అనే గ్రామం రికార్డులో ఎక్కడ నమోదు కాలేదు.  2. వారి ఇళ్ళకు డోర్ నెoబర్లు లేవు. అంటే పంచాయితీ కార్యదర్శి వాటిని గ్రామ పంచాయితీ రికార్డులలో  నమోదు చేయలేదని అర్ధం. 3. సిoగిల్ ఫేస్ విద్యుత్తు లైన్ వుంది. కొన్ని ఇల్లకు కరెంట్ కనెక్షన్ వుంది 4. రేషన్ కార్డులు, ఓటరు ఐడి (ID) కార్డులు కొందరికి వున్నాయి. 5. ఆధార్ కార్డులు వున్నాయి 6. ఉపాధి హామీ పధకంలో జాబ్ కార్డులు ఇచ్చారు. కాని అవి పొరుగున వున్న  ‘గుంటి’ అనే ఆవాస గ్రామం పేరు మీద ఇచ్చారు. ఒక్కరోజు కూడా పని ఇవ్వలేదు. ఉపాధి హామీ పధకం వెబ్ సైట్ లో చుస్తే  వారి కార్డులు చచ్చిపోయినట్లుగా చూపిస్తుంది. AP స్పేస్ అప్లికేషన్ సెంటర్ (APSAC) వారు గ్రామ భూమి పటాలను (Maps) గూగుల్ ఎర్తు పై చూసే విధంగా ఒక ప్రోగ్రాo చేశారని ఒక మిత్రుడు  లింక్ పంపగా, దాని ఆధారoగా కోనాం గ్రామం, అందులో కొత్తవీధి  గ్రామం, సర్వే నెంబర్ 289లో  వుందని గుర్తించాం.

కొత్తవీధి గ్రామంలో అధికారులు

వెబ్ లేండ్

సర్వే నెంబర్ ను గుర్తించి తరువాత దాని ఆధారగం ఆన్ లైన్ లేండ్ రికార్డులో శోధించాం.  ఆదివాసీలు  సాగులో వున్నట్లుగాని,  అక్కడ ఒక ఆవాస గ్రామం వుందనిగాని  ఎక్కడా  రెవిన్యూ అధికారులు నమోదు చేయలేదని అర్ధం అయ్యింది.

వ్యవసాయ భూమిని సాగు చేస్తే సరిపోదు,  మనం సాగు చేస్తున్నట్లుగా రెవిన్యూ రికార్డులలో నమోదు కావాలి. అసలు అక్కడ ఒక గ్రామం వుందని గుర్తించని అధికారులు ఆదివాసీలు  సాగులో వున్నారని రికార్డులో రాస్తారా? గురువు కల్ల.

Also read: అల్లూరి సీతారామరాజు – ఇందిరమ్మ ఇచ్చిన భూమి

విన్నపాలు వినవలె వింతవింతలు’ – వినతిపత్రాలతో

2021 నుండి తాశీల్దార్, RDO (రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్), జిల్లా కలెక్టర్లకు కొత్తవీధి ఆదివాసీలు వినతిపత్రాలు ఇస్తూ వస్తున్నారు. తమ గ్రామం సర్వే నెంబర్ 289లో వుందని, తాము సాగులో వున్నామని, విచారణ చేసి తమ సాగు అనుభవాన్ని రికార్డులో నమోదు చేయమని వారు కోరుతున్నారు. అంటే, 2021 చివరినాటికి కొత్తవీధి ఆదివాసీలు ఏమి అడుగుతున్నది రెవిన్యూ శాఖకు,  ముఖ్యంగా మండల స్తాయి రెవిన్యూ అధికారులకు తెలుసు.

రికార్డు మార్చేశారు

13 జూన్ 2022న మేము కొత్తవీధి ఆదివాసీలతో కలసి  వెళ్ళి అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి  వివరాలు తెలియజేస్తున్న రోజునే అక్కడ చీడికాడ మండల రెవిన్యూ కార్యాలయంలో సర్వే నెంబర్ 289 లోని 37.08 ఎకరాల భూమిని కొందరు గిరిజనేతరుల పేరున రికార్డు  మార్చేశారు. అలా రికార్డు మారిన వెంటనే, భూమి ఖాళి చేయాలని,  సాగులో వున్న ఆదివాసీలను బెదిరించడం మొదలు పెట్టారు.

 వర్షాధారంపై పంట పండే భూమైతే  అందులో జొన్నలు, రాగులు పండించుకోవచ్చు. జీడి మామిడి ఇతర ఫల వృక్షాలను పెంచుకోవచ్చు. మనం అలాంటి భూమిని  ‘మెట్టు’ (కుష్కి) భూమి అని అంటాము.  తమ  భాషలో దానిని కొందు ఆదివాసీలు ‘బాడ’ అంటారు. గెడ్డ నీటిని వరకట్టి ‘వరి ధాన్యం’ పండిస్తే దానిని ‘పల్లం’ (తరి) భూమని మనం అంటాం.  వారు ‘సోబాం’ అంటారు. అదే కొండలో వున్న అడవిని కొట్టి అక్కడ పప్పు ధాన్యాలు పండిస్తే దానిని  ‘కొండపోడు’ అని మనం అంటే వారు “నేల” అంటారు. భూమిని,  దాని పంటను బట్టి గుర్తుపడ తారు. కోoదు ఆదివాసీలకు భూమిని గూర్చిన సంగతులు అంతవరకే తెలుసు. కాని రాజ్యం (State) భూమిని ప్రైవేటు పట్టా భూమి, ఇనాం భూమి, పోరంబోకు భూమి, తరం కట్టిన బంజరు భూమి, సీలింగ్ మిగులు భూమి ఇలా  ఛప్పన్నారు రకాలుగా గుర్తిస్తుంది. వాటి వాటి వర్గీకరణలను బట్టి చట్టాలు, విధి విధనాలు ఉంటాయని వారికి ఆ ఆదివాసీలకు తెలీదు. అంతేకాదు,  ఎన్ని దశాబ్దాలు, శతాబ్దాలు భూమిని సాగు చేసినా ఆ  సంగతిని రెవిన్యూ అధికారులు తమ రికార్డులలో నమోదు చేయాలని, అలా చేయించుకోవాలని, అలా నమోదుగాక పొతే వారు సాగులోవున్నా చట్టం ద్రుష్టిలో లేనట్లేనని వారికి తెలీదు. అసలు అలాంటిద సంగతులు వారికి ఊహకు అందని విషయాలు.

మా ప్రశ్నలు

ఇక వివాదం 2022 జూన్ తరువాత ముదిరింది. మా వాదన ఇలా వుంది. 1. భూమి ఎవరిదనే ప్రశ్న అలా ఒక ప్రక్కన వుంచండి, ఆ భూమిలో ‘కొత్తవీధి’ అనే ఆవాస గ్రామం ఉందా, లేదా? 2. కొత్తవీధి ఆదివాసీలు చేస్తున్న సాగు అనుభవం, వారు పెంచిన జీడి మామిడి, మామిడి, టేకు వనాలు భూమిపై ఉన్నాయా లేవా? 3. భూమి రికార్డు మార్చే సమయంలో సాగు అనుభవంలో వున్న వారికి నోటీసులు ఇచ్చారా?ఇవి మా ప్రశ్నలు.

2022 జూన్ తరువాత, VRO నుండి RDO వరకు ఈ గ్రామానికి అధికారులు వచ్చారు. తాశీల్దార్ రెండు నివేదికలు కలెక్టర్కు – RDO ద్వారా – పంపారు. ఇద్దరు RDOలు ఒకరి తరువాత ఒకరు గ్రామానికి వచ్చారు. ఇప్పటి వరకూ రెండు రిపోర్టులు పంపారు.  ఈ నివేదికల సారాంశం ఒకటే, 1. సర్వే నెంబర్ 289 యొక్క మొత్తం భూమి 41.43 ఎకరాలు. అది ప్రైవేటు  (వ్యక్తుల జిరాయితీ) పట్టా భూమి. ఈ సర్వే నెంబర్ రెండు భాగాలుగా (సబ్ – డివిజన్ లుగా) విడగొట్టబడింది. సర్వే నెంబర్ 289-1లో 37.08 ఎకరాలు, సర్వే నెంబర్ 289-2లో 4.35 ఎకరాలు.

కొత్తవీధి కొందు ఆదివాసీ గ్రామం

కష్ట జీవులకు మేలు జరగకూడదు

మొదటి సబ్ -డివిజన్ నెంబర్, అంటే  289-1లో ని 37.08 ఎకరాల నుండి భూ యజమానులు  సీలింగ్ మిగులు భూమిగా 7.22 ఎకరాల  భూమిని ప్రభుత్వానికి అప్పగించారని కనుక అందులో 29.86 ఎకరాలు  మాత్రమె ప్రైవేటు పట్టా భూమని వారి నివేదికల సారాంశo.

ఇందులో వారు చెప్పని లేదా నిర్థారించని  అంశాలు కొన్ని వున్నాయి. సర్వే నెంబర్ 289లో కొత్తవీధి అనే ఆవాస గ్రామం ఉందా లేదా? ఈ భూమిలో ఆ గ్రామ ఆదివాసీలు సాగులో వున్నారా లేదా? ఈ సంగతులు మాత్రం చెప్పరు. అలా చెపితే ఏమౌతుంది? ఆదివాసీలు స్థిర నివసాలతో సాగులో వున్నారని ఒప్పుకున్నట్లు అవుతుంది. అలా ఒప్పుకుంటే, వారు సాగులో వుండగా వారికి ఎలాంటి నోటీసు ఇవ్వకుండా రికార్డును మార్చేసామని చెప్పక చెప్పినట్లు అవుతుంది. అయితే, దాని వలన ఎవరికీ నష్టం? అలా రికార్డు మార్పించుకున్న గిరిజనేతరులకు నష్టం. ఎవరికీ లాభం?  అది ఆదివాసీలకు  మేలు చేస్తుంది. అలా జరగకూడదు. ఆదివాసీ కష్ట జీవులకు మేలు జరగకూడదు. అంటే గ్రామం అక్కడ వున్న విషయం, సాగులో ఆదివాసీలు వున్న సంగతి ‘కమిటి’ కాకూడదు.

Also read: రూ. 2,33,04559 అప్పుల సాలెగూడు నుండి బయటపడిన రోచ్చుపనుకు ఆదివాసీలు

భూమి ఎవరిదీ?

ఈ భూమి  ‘పట్టా’ భూమనీ, దానికి ప్రైవేటు పట్టాదారులు యజమానులనీ అధికారులకు ఎలా తెలిసింది? భూమి రికార్డులన్నిటికి పునాది, మాతృక గ్రామ “సెటిల్మెంట్ ఫైయిర్ అడంగల్ (SFA)”. అందులో వున్న ఎంట్రీల ద్వారా భూమి యొక్క వర్గికరణను గుర్తుపట్ట వచ్చును.

సమాచార హక్కు చట్టంలో సేక్షన్ 2 (J) అని వుంటుంది. దాని ప్రకారం మనం రికార్డులు, దస్త్రాలు (పైల్స్) తనిఖి చేయవచ్చును. అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి తాశీల్దార్, RDOలు పంపిన నివేదికల దస్త్రాన్ని నేను కలెక్టర్ వారి కార్యాలయంలో చూడదలిచాను. మొత్తానికి చూశాను,  చదివాను.

తన నివేదికకు అనుబంధంగా తాశీల్దార్ కొన్ని రికార్డుల నఖల్లు పెట్టారు. అందులో సర్వే నెంబర్ 289 (దాని రెండు సబ్ -డివిజన్ నెంబర్లకు) SFA (సెటిల్మెంట్ ఫైయిర్ అడంగల్)  నఖలు పెట్టారు. నా కళ్ళు ఆ ఎంట్రిలను ఆసక్తిగా, ఉద్వేగంతో వెతికాయి.  సరిగ్గా సర్వే నెంబర్ 289-1కి ఎదురుగా “5వ తబ్సీలు లిస్టు చూడుము” అని వుంది.

SFA అంటే ఏమిటి? థామస్ మన్రో

SFA (సెటిల్మెంట్ ఫైయిర్ అడంగల్) రికార్డు ఏమిటి? అందులో ఈ నెంబర్ కు ఎదురుగా “5వ తబ్సీలు లిస్టు చూడుము” అని ఎందుకుoది? అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి తాశీల్దార్ రాసిన రిపోర్టులో  ఈ నెంబర్ వద్ద  SFA లో “5వ తబ్సీలు లిస్టు చూడుము” అని రాసి వుందని ఎందుకు ప్రస్తావిoచలేదు?

బ్రిటిష్ వారు రెండు రకాలైన భూమి శిస్తు విధానాలను ప్రవేశ పెట్టారు. అందులో ఒకటి జమిందారీ విధానం. రెండవది, రైత్వారీ విధానం. స్థూలంగా చెప్పాలంటే  జమిందారీ విధానం మద్రాస్ ప్రెసిడేన్సీలో భాగమైన దక్షిన, ఉత్తర కోస్తాoధ్రాలలో (1802) అమలు కాగా, రైత్వారీ విధానం రాయలసీమ ప్రాంతంలో అమలయ్యింది. రైత్వారీ విధానంకు కారకుడు ధామస్ మన్రో (Sir Thomas Munro,1761-1827). మొదటిదానిలో, రైతుల నుండి భూమి శిస్తు వసూలు చేసుకోనే అధికారం, హక్కు జమిందారుది. ఒప్పందం (సనద్) ప్రకారం ఆయన బ్రిటిష్ వారికీ పన్ను చెల్లిస్తాడు. రైత్వారీ విధానంలో రైతులు నేరుగా ప్రభుత్వానికి శిస్తు చెల్లిస్తాడు.

1948 జమిందారీ రద్దు చట్టం ద్వారా జమిందారీ వ్యవస్థ రద్దయ్యింది. జమిందారీ గ్రామాలన్నింటిలో సర్వే చేసి తయారు చేసిన రికార్డే ఈ ‘సెటిల్మెంట్ ఫైర్ అడంగల్’ (SFA). 1960-70 మధ్య ఈ రికార్డు తయారయ్యింది. ఇది చేతి రాత రికార్డు.   కోనాం రెవిన్యూ  గ్రామం వడ్డది (V) మాడుగుల ‘జమిందారీ’కి చెందిన  గ్రామం. కలెక్టర్ కు తాను పంపిన నివేదికకు అనుబంధంగా, ఆ గ్రామ సెటిల్మెంట్ ఫైర్ అడంగల్ (SFA) నుండి సర్వే నెంబర్ 289కి గాను నఖలును తాశీల్దార్ జతపర్చారు. అందులో సర్వే నెంబర్ 289-1 ఎదురుగా “5వ తబ్సీలు లిస్టు చూడుము” అని వుంది. అయితే ఆ ‘5వ తబ్సీలు లిస్టు’లో  వున్న వివరాలు కోసం గౌరవ తాశీల్దార్  నివేదికలో కంచు కాగడ పెట్టి వెతికినా నాకు కనిపించ లేదు.

చిదంబర రహస్యం

ఇప్పుడు మనకు ఆ ‘5వ తబ్సీలు లిస్టు’ అనే చిదంబర రహస్యం తెలియాలి. పూర్తి రికార్డు తాశీల్దార్ వారి కార్యాలయంలో వుంటుంది.  SFA (సెటిల్మెంట్ ఫైయిర్ అడంగల్)ని కార్యాలయంలో పరిశీలన చేయడానికి అనుమతి కోరుతూ మళ్ళీ RTI సేక్షన్ 2 (J) ద్వారా తాశీల్దార్ కు ధరఖస్తు పెట్టాం.

SFA వంటి కీలకమైన రికార్డును సాధారణ ప్రజలకు అందుబాటులో వుండవు.  ఒక వేళ దానిని చూసినా అర్ధం కాదు. ఆ రికార్డును చూసి అందులో వున్న ఎంట్రిలను అర్ధం చేసుకొని, విషయం రాబట్టడానికి శిక్షణ కావాలి. అలాంటి శిక్షణ ఏదీ రెవిన్యూ శాఖకు బయట లభించదు. సాధారణ ప్రజలు ఎవరైనా ఈ రికార్డు అడిగితే “తమ కార్యాలయంలో లేదనో” లేదా “కలెక్టర్ ఆఫీసుకు పంపామనో”  చెపుతూ వుంటారు. కాని  భూ బ్రోకర్లకు రికార్డులన్నీ  “సాఫ్ట్’ కాపీల రూపoలో అందుబాటులో వుంటాయి.

తబ్సీలు లిస్టుకథ  

ఇంతకీ ఈ ‘5వ తబ్సీలు లిస్టు’ అంటే ఏమిటి?  SFA (సెటిల్మెంట్ ఫైయిర్ అడంగల్) అంటే చేతితో రాసిన భూమి రికార్డని ముందు చెప్పుకున్నాం. సులువుగా అర్ధం కావడానికి ఈ “తబ్సీలు లిస్టు” కధను   ఇలా చెపుతాను. 1. అప్పారావు, 2. సుబ్బారావు, 3.వెంకటరావు, 4.ఈశ్వరరావు, 5. రామారావు అనే 5గురు ఆసాములకు కలిపి, ఉమ్మడిగా,  ఒక గ్రామంలో సర్వే నెంబర్ 1, 10, 13,14, 20 ఇలా పలు చోట్ల భూములు వున్నాయని అనుకుందాం. అప్పుడు ఆ రికార్డును మొదటి సారి చేతితో రాస్తున్న అధికారి ఏమి చేయాలి? ఆ సర్వే నెంబర్ వచ్చినప్పుడల్లా ఆ 5గురు ఆసాముల పేర్లు వరసగా రాస్తూ వుండాలి. 5గురుకు కలిపి భూమి వుంది అంటే అది జాయింట్ పట్టా భూమి అని, ఆ భూమిపై అందరికీ సమాన హక్కు వుందని అర్ధం. 1950-70 మద్య చాల మట్టుకు ఆస్తులు జాయింట్ పట్టాలుగా వున్నాయి. ఒక్కోసారి అలాంటి జాయింట్ పట్టాలలో ఎక్కువ  మంది పేర్లు ఉండేవి. కనుక ఇలాంటి జాయింట్ పట్టాదారుల  వివరాలను రికార్డులో  రాయవలసి వచ్చినప్పుడు, వాటికి నెంబర్లు ఇచ్చుకొని,  మొదటి సారి వచ్చినప్పుడు ఆ పేజి దిగువున వివరణ ఇచ్చే వారు. లేదా రికార్డు చివరిలో వాటి  జాబితా ఇచ్చే వారు. ఉదారణకు ఒక గ్రామంలో ఇలాంటి జాయింట్ పట్టాలు 20 వరకు వున్నాయని అనుకుందా, అందులో ముందు చెప్పిన 5గురు ఆ 20 జాయింట్ పట్టాల  జాబితాలో ఒకలో నంబరు అనుకుందాం. అప్పుడు SFA చివరిలో ఇచ్చిన జాబితాలో 1వది  అవుతుంది. అలా ఇవ్వబడిన జాబితానే ‘తబ్సీల్ లిస్ట్’. ‘1వ తబ్సీల్ లిస్ట్ చూడుము’  అంటే, ఆ భూమికి పట్టదార్లు 1వ తాబ్సిలు లిస్టులో వున్న  ఈ 5 గురు అని అర్ధం. కనుక SFAని రాసేటప్పుడు, సర్వే నెంబర్ 1, 10, 13,14, 20 వచ్చినప్పుడల్లా ఇక ఈ 5గురు పేర్లు రాయనవసరం లేదు. అక్కడ ‘1వ తబ్సీల్ లిస్ట్ చూడుము’ అని రాస్తే చాలు. తబ్సీలు అనే ఉర్దూ మాటకు తెలుగు అర్థం వివరం అని.

ఇప్పుడు మనం కోనాం గ్రామం సర్వే నెంబర్ 289-1 వద్దకు వద్దాం. “5వ తబ్సీల్ లిస్ట్ చూడుము” అంటే అర్ధం ఏమిటి? అది ఒక జాయింట్ పట్టా భూమని తెలియజేస్తున్నది. మరి ఆ జాయింట్ పట్టాదార్లు ఎవరు? ఎంతమంది? అన్నది ప్రశ్న.

Also read: నాలుగు క్వార్టర్స్ బ్రాంది  బాటిల్స్ – (మైనస్)  ‘అత్యాచారం’ కేసులు = ??!!

యధావిధిగా SFA లేదని మాతో అన్నారు. జిల్లా కలెక్టర్ కు పంపిన నివేదికకు అనుబంధంగా ఇచ్చిన పత్రాలలో సర్వే నెంబర్ 289కి చెందిన SFA నఖలు జత చేశారని, కార్యాలయంలో లేకపోతె ఎలా జత చేశారని  సూటిగా ప్రశ్నిoచాo. దాంతో సర్దుకొని SFAని  చేతిలో పెట్టారు. అది ఒరిజనల్ కాదు గాని  జిరాక్స్. దానికి ఆఖరి పేజీలు లేవు. అంటే మనకు కావలసిన తబ్సీల్ల లిస్ట్ లేదు. కనుక 5వ తబ్సీల్ లిస్ట్ లో ఎవరి పేర్లు వున్నది, ఎంత మంది పేర్లు వున్నది మనకు తెలీదు. ఇదే విషయం అధికారులను అడిగాము. ఇందులో మూడు ప్రశ్నలు వున్నాయి. 1. ఇది జాయింట్ పట్టా భూమి.  కాని ఆ జాయింట్ పట్టాదార్లు ఎవరు? 2. ఆ జాయింట్ పట్టాదార్ల మధ్య సరిహద్దులతో భూమి విభజన జరిగిందా? 3. ఆ జాయింట్ పట్టాదారులలో ఎవరు, ఎంత భూమిని  ప్రభుత్వానికి సీలింగ్ మిగులు భూమిగా ‘సరండర్’ చేశారు? వీటికి జవాబులు  లేవు. అసలు ‘5వ తబ్సీల్ లిస్టు’ లేదు. కాని ఈ విషయాన్ని అధికారులు ఎక్కడా తమ నివేదికలలో ఇంతవరకూ ప్రస్తావించ లేదు. అదే విషయాన్ని సూటిగా అడిగాం. ‘5వ తబ్సీల్ లిస్టు’లో ఎవరి పేర్లు వున్నాయన్నది చాల కీలకమైన ప్రశ్న. అది తేలకపొతే భూమికి హక్కుదారు ఎవరో తెలీదు.  దిగువ స్థాయి అధికారులు జిల్లా కలెక్టర్ కు రాసిన నివేదికలలో ఈ కీలకమైన అంశాన్ని ప్రస్తావించ లేదు. ఎందుకని? కావాలనే. ఉద్దేశపూర్వకంగానే.

నిజం చెప్పరు అబద్దం ఆడారు, అశ్వత్ధామ అతః  

‘కొత్తవీధి’ గ్రామాన్ని BBC తెలుగు విభాగం సందర్శించి ఒక డాక్యుమెంటరిని విడుదల చేసింది. మానవ హక్కుల వేదిక (HRF) ప్రతినిధులు ఆ గ్రామాన్ని సందర్శించారు. తమ పరిశీలనకొచ్చిన వాస్తవాలను జిల్లా కలెక్టర్ కు ఒక నివేదిక రూపంలో అందజేశారు. ప్రఖ్యాత ఆంగ్ల దినపత్రిక ‘ది హిందు’  ప్రతినిదులు సందర్శించారు. ‘స్పాట్ లైట్’ శీర్షికన ఒక పూర్తీ పేజి వార్త కధనం రాసారు. ‘లీడర్’ అనే ప్రాంతీయ దిన పత్రిక ప్రధాన సంపాదకులు కొత్తవీధికి వచ్చి చూసి వార్తా కధనం రాసారు. CPI జిల్లా కార్యదర్శి తన బృందంతో పర్యటిoచారు. అక్కడ గ్రామం వుందని, ఆదివాసీల సాగు వుందని ప్రపంచానికి చెప్పారు. బీహార్ కు చెందిన ఆరుగురు (6) CPI ML లిబరేషన్ పార్టి MLA లు ముఖ్యమంత్రికి లేఖ రాసారు, న్యాయం చేయమని.             

ఇక నిజo చెప్పని వారు ఎవరoటే రెవిన్యూ అధికారులు. వారు కూడా ఆ గ్రామానికి  వెళ్ళారు. కొత్తవీధి ఆవాస గ్రామం సర్వే నెంబర్ 289లో వుందని గుర్తించారు. ఆదివాసీలు  సాగు అనుభవంలో వున్న విషయం కూడా వారికి తెలుసు. కాని ఆ మాట తమ నివేదికలలో చెప్పరు. తమ వద్ద వున్న రికార్డులో ‘5వ తబ్సీలు లిస్టు’ భోగట్టా లేదని చెప్పనట్లే ఇది కూడా వారు చెప్పరు.   అలా నిజం చెపితే గిరిజనేతర భూవ్యాపారులు నష్టపోతారు. కష్ట జీవులైన ఆదివాసీలు లాభ పడతారు. చట్టం, న్యాయం, ధర్మం ఎం చెప్పినా సరే  అలా జరగకూడదు.

Also read: ఆదిమ తెగల ఆదివాసీల జీడి తోటలను నరికివేసే ప్రయత్నం:అడ్డుకున్న గిరిజన మహిళలు

PS అజయ్ కుమార్

అజయ్ కుమార్ పీ ఎస్
అజయ్ కుమార్ పీ ఎస్
పీఎస్ అజయ్ కుమార్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో సోషల్ వర్కులో మాస్టర్స్ డిగ్రి (MSW) చేశారు. గత 30 ఏళ్లుగా ఆదివాసీల భూమి సమస్య, నిర్వాసిత, గ్రామీణ కార్మికుల హక్కుల కోసం పని చేస్తున్నారు. ‘ప్రభుత్వ భూమి పేదలదే’, ‘భూమి సమస్య – వ్యాసాలు 1, 2’, ‘కళ్యాణలోవ కధలు’ ప్రచురితమైన పుస్తకాలు. భూమి సమస్య వ్యాసాలు – 1కి, DNF Rural Journalist award foundation –Hyderabad వారి Rural journalist award for year 2008 లభించింది. ప్రస్తుతం అఖల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles