Wednesday, November 6, 2024

మూడు నిశ్చల చిత్రాలు-అనిశ్చిత జీవితాలు!

నేను మీకు మూడు నిశ్చల చిత్రాలు (అంటే still photos అన్నమాట)  చూపించదలిచాను. వాటి వెనుక వున్న కథలను కూడా చెప్పదలిచాను. సాధారణంగా కథలలో కొంత కల్పితo వుoటుంది ఇందులో అలాంటిదేమీ లేదు. శుద్ధ జీవితం.

మొదటి చిత్రం

చింత వెంగళరావు, అతని ఆదివాసీ నేస్తాలు

చింతా వెంగళరావు, కొండ కమ్మర ఆదివాసి. ఆయన నివాసం కొంతలం గ్రామంలోని  కొండకమ్మరపేట. అది అనకాపల్లి జిల్లా, రోలుగుంట మండలంలో వుoది. ఆయన ఒక చిన్న రైతు. భవన నిర్మాణ కార్మికుడు కూడా. ఇటుక బట్టి కార్మికునిగా, వ్యవసాయ కూలీగా, చిన్న రైతుగా ఇలా దశావతారాలు ఎత్తి కుటుంబాన్ని లాక్కోస్తున్నవాడు  వెంగళరావు. అయితే, రోలుగుంట మండలానికి  పొరుగు మండలమైన రావికమతం మండల కేంద్రానికి,  అక్కడ వున్న విద్యుత్ శాఖ కార్యాలయానికి గత వారం  రోజులుగా వెంగళరావు తిరుగుతున్నాడు. ‘తిరగడం’ అంటే అర్థం ఏమిటంటే, రోజుకి కనీసం రెండు లీటర్లు పెట్రోల్ ఖర్చు అవ్వడం (మోదీ మహానభావుని దయవలన పెట్రోల ఖర్చు రెండు వందలు పై మాటే). ఆరోజు కూలి పనికి వెళ్తే వచ్చే సంపాదనను నష్టపోవడం. గొడ్డు గోదా, పొలము పుట్ర చూసుకోలేకపోవడం. ఇల్లాలకి ఇంటిలో రవంత సాయం చేయలేకపోవడం. ఆకలేస్తే టీ తాగి దానినే పంచభక్ష పరమాన్నంగా  సరిపెట్టు కోవడం. ఇంతకీ అతను గత వారం  రోజులుగా రావికమతం మండలం విద్యుత్ శాఖకు సబ్ స్టేషన్ కు  ఎందుకు వస్తున్నాడoటే, ఇంటికి విద్యుత్ కనెక్షన్ కోసమో, లేదా  వ్యవసాయ పంపు బోరుబావికి కనెక్షన్  కోసమో కాదు. ఒక కాగితం ఇవ్వడం కోసం. అది తయారుచేసింది నేనే. అక్కడ వున్న సిబ్బంది కాగితం తీసుకుంటామని అంటున్నారు కానీ అది తీసుకున్నట్టుగా రసీదు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. గత వారం రోజులుగా ఆ కార్యాలయపు ముఖ్య అధికారిని కలవడం కోసం విసుగు చెందని విక్రమార్కుడిలా రోలుగుంట మండలం నుండి  రావికమతం మండలానికి వస్తూనే వున్నాడు చింత వెంగళరావు. తాను పడుతున్న శ్రమకు, తాను నష్టపోతున్న కష్టానికి ఒకరకంగా కారకుడిని నేనే. నిజానికి ఆ దరఖాస్తు కాగితాన్ని  తన సొంత గ్రామం నుండి రిజిస్టర్ పోస్టు (RP) ద్వారా పంపొచ్చు. అందుకయ్యే  ఖర్చు కేవలం 25 రూపాయలు. కానీ ఆ పత్రాన్ని  తీసుకొని కార్యాలయానికి వెళ్లి తీరాలని, దానిని అధికారులకు ఇచ్చి రసీదు తీసుకొని తీరాలని నేను పట్టుబట్టిన మీదట తాను గత వారం రోజులుగా ఆ  మండల కేంద్రానికి వస్తూపోతున్నాడు.

అది ట్రాన్స్ కో వారి విద్యుత్ కేంద్రం. దానికి అధిపతి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AE). ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయానికి చింతా వెంగళరావు పట్టుకుని వచ్చింది సమాచార హక్కు చట్టం (RTI) సహాయంతో  తయారుచేసిన సమాచారం కోరుతున్న దరఖాస్తు.

Also read: ముప్పయ్ సెంట్లు కోసం మూడేళ్ళుగా …

వెంగళరావుకు ఆయన తండ్రి నాలుగు ఎకరాల భూమిని తోటలతో తయారుచేసి ఇచ్చిపోయాడు. ఆ తోటల తయారిలో లక్ష్మయ్య పరివారపు  శ్రమ, జీవితాలు కలబోసి వున్నాయి. కాని  భూమి రికార్డులో చింత వెంగళరావు పేరు లేదా  అతని తండ్రి పేరుగాని  పట్టాదారుగా, పోనీ కనీసం  అనుభవదారు/సాగుదారుగా  కూడా లేదు. ఈమధ్యనే  మండల రెవెన్యూ కార్యాలయం వారు రికార్డులలో మార్పు చేశారు. మార్పు జరిగినవెంటనే ఆ ప్రాంతంలోని భూ మాఫియా దానిని కొనేసి వెంగళరావు కుటుంబాన్ని బెదిరించడం మొదలు పెట్టింది. ఈ మార్పు చేసే సమయంలో పట్టాదార్ పాసు పుస్తకాల చట్టం (AP Rights in Land and Pattadar Pass Books Act – 1971- ROR చట్టం) అనుసరించి సాగులో ఉన్న చింత వెంగళరావుకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదు. సమాచార హక్కు చట్టం ద్వారా (సేక్షన్ 2 J) మండల రెవెన్యూ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తే ఆ మార్పులు చేసే సమయంలో తప్పనిసరిగా చేయవలసిన క్షేత్ర పరిశీలనా,  విచారణ చేయకుండా దిగువ  స్థాయి రెవిన్యూ అధికారులు గిరిజనేతరులకు అనుకూలంగా నివేదికలు ఇచ్చారని స్పష్టం అయ్యింది. అంటే, సరైన విచారణ జరపకుండానే గిరిజనేతరుల ధరఖాస్తులను  ‘ప్రాసెస్’ చేసి,  వారి పేరును పట్టాదారులుగాను,  భూమి సాగుదారులుగానూ నమోదు చేసేశారని అర్థం. ROR చట్ట ప్రకారం అది తప్పు.

సరే! ROR చట్టo ప్రకారం తాశీల్దార్ తప్పు చేశాడని భావిస్తే,  అదే చట్టంలోని అప్పీల్ ప్రొవిజన్ కింద ఆయన కంటే పెద్ద అధికారి అయిన రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO) వద్ద అప్పీల్ దాఖలు చేయవచ్చు.

ఇటువంటి అప్పిల్స్ దాఖలు చేయాలoటే  న్యాయవాదిని పేట్టుకొని ఆయనకి ఇవ్వవలసిన ఫీజులు ఇచ్చుకొని RDO ముందు కేసు దాఖలు చేసుకోవాలి. మరో పద్ధతి వుంది.  బాధితుడే స్వయంగా అప్పీల్ దాఖలు చేసుకోవచ్చు. టైపింగ్ ఖర్చులు తీసేస్తే కోర్టు వారికి చెల్లించవలసింది కేవలం ఐదు (5) రూపాయలు. ఐదు (5) రూపాయలు స్టాంపు అతికిస్తే  సరిపోతుంది. చింతా వెంగళరావుతో “ఇన్ పర్సన్” (in person-తానే స్వయంగా)  అప్పీలును RDO వద్ద  దాఖలు చేయించాను. ఎదుటి పక్షపు గిరిజనేతరులు  విశాఖపట్నం నుండి న్యాయవాదిని ఏర్పాటు చేసుకున్నారు. సదరు న్యాయవాది వాయిదా వాయిదాకి కారులో వస్తారు.  వెంగళరావు అతని పరివారం షేరింగ్ ఆటోలో RDO కోర్టుకు పోతారు.  అయితే  వెంగళరావు తరుపున వేసిన ‘తెలుగు’  పిటిషన్ కు ప్రతివాదుల న్యాయవాది ‘ఇంగ్లీషు’లో జవాబు (కౌంటర్) వేశారు. సదరు కౌంటర్ లో భూమి   తమదేనని, తామే యజమానులమని,  తామే సాగులో వున్నామని కోర్టువారిని నమ్మించడానికి గట్టి ప్రయత్నం చేశారు. అలాంటి ప్రయత్నంలో భాగంగా, ఆ భూమిలో తాము వేయించిన రెండు వ్యవసాయక సాగునీటి బోర్వెల్స్ ఉన్నాయని రాశారు.

నిజంగా ఆ బోర్వెల్స్ ఉన్నాయా!? అవి లేవని, అయినా ఆ మాటను ఈ  కొండకమ్మర ఆదివాసి నిరూపించ లేడని వారి గట్టి నమ్మకం. చింత వెంగళరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయానికి పట్టుకొచ్చిన RTI దరఖాస్తు ఏమిటంటే,  “ఆ సర్వే నెంబర్ భూమిలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయా? ఉంటే వాటి వివరాలు ఇవ్వండి” అన్నది దరఖాస్తు సారాంశం.

 దరఖాస్తును  స్వీకరించి రసీదు ఇస్తేనే చింతా వెంగళరావు దాన్ని దాఖలు చేసినట్లు లెక్క. తమ అధికారి లేడు గనుక తాము దరఖాస్తు తీసుకుంటాం కానీ రసీదు ఇవ్వమoటారు ఆ కార్యాలయపు ఉద్యోగులు.

RTI చట్టం కింద మనం దరఖాస్తు చేస్తే 30 రోజులలోగా సమాచారం ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే, పై అధికారికి అప్పీల్ చేసుకోవచ్చు. అప్పిల్ లో  పౌర సమాచార అధికారి(Public Information Officer-PIO)కి మనం దరఖాస్తు పెట్టామని, 30 రోజులు గడిచినా  సమాచారం ఇవ్వలేదని నిరూపించుకోవలసిన బాధ్యత అప్పీల్ చేసిన వారిపై వుoటుంది. అదీ అసలు విషయం. దరఖాస్తు ఇచ్చిన తర్వాత రసీదు తీసుకోకపోతే 30 రోజులు గడిచిన తర్వాత అప్పిల్  చేయడానికి మన దగ్గర సాక్ష్యం వుండదు. అందుకే రసీదు ముఖ్యం. రసీదు అంటే మరేమీ లేదు, దరఖాస్తుకు  జిరాక్స్ తీసి  అసలు ప్రతి /ఒరిజినల్ కార్యాలయంలో ఇచ్చి జిరాక్స్ పైన కార్యాలయం సిబ్బంది తమకు అది ముట్టినట్టుగా రాసి సంతకం పెట్టి, తేదీ వేసి, కార్యాలయం ముద్ర వేసి  ఇవ్వాలి. చింతా వెంగళరావు జిరాక్స్ పట్టుకుని వెళ్ళాడు కానీ దానిపై సంతకం పెట్టడానికి, కార్యాలయం ముద్ర వేయడానికి నిరాకరిస్తున్నారు. అలా నిరాకరించడం వారి విధి నిర్వహణకు అన్యాయం చేయడమే. అంతేకాదు ఒక పౌరునిగా  వెంగళరావుకు  వున్న హక్కును, సమాచార హక్కు చట్టం ఇచ్చిన హక్కును  నిరాకరించడం కూడా.

రిజిస్టర్ పోస్ట్ చేయకుండా స్వయంగా వెళ్లి ఇవ్వాలని నేను ఇచ్చిన సలహా చింతా వెంగళరావు పని దినాలలో ఆరింటిని తినేసింది. నిజానికి రిజిస్టర్ పోస్ట్ చేస్తే 25 రూపాయలతో పోతుంది. కానీ విషయం అది కాదు.  వెంగళరావు దాన్ని తీసుకొని వెళ్ళాలి, అధికారులతో మాట్లాడడానికి ధైర్యం చేయాలి, జిరాక్స్ మీద సంతకం పెట్టి ఇవ్వమని అడగాలి, దానిని సాధించాలి. సామాజిక హోదా,  స్థితిగతులతో సంబంధం లేకుండా, పౌరునిగా అతని అభ్యర్థనను మన్నించడం తమ బాధ్యత అని అధికారికి తెలియాలి. పైకి చూసేందుకు చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది. కానీ అది ఇరువురినీ ప్రజాస్వామ్య ప్రక్రియకు  తయారు చేస్తుంది. అందుకే నేను సులువైన, తేలికైనా, రిజిస్టర్ పోస్టు మార్గాన్ని నిరాకరించాను.

Also read: నాన్ షెడ్యూల్ ఏరియా ఆదివాసీలకు రక్షణ కల్పించాలి

పాపం! చింతా వెంగళరావు నా మాటపై వారం రోజులుగా ఆ కాగితం పట్టుకొని తన గ్రామానికి రావికమతం మండల కేంద్రానికి తిరుగుతూ వచ్చాడు. అంటే పట్టుదలతో గట్టి ప్రయత్నం చేశాడు. ఒక్కొక్క రోజు గడుస్తుండగా నాకు అర్థమైనది ఏమిటంటే, ఈ పోరాటంలో ఆయన గెలవాలి అంటే నేను సలహా ఇచ్చి వూరుకుంటే సరిపోదు.  ప్రత్యక్షంగా రంగంలోకి దిగక తప్పదు. చింతా వెంగళరావుని సబ్ స్టేషన్ వద్ద వుండమని నేను అక్కడికి చేరుకున్నాను. అక్కడ సీనియర్ అసిస్టెంట్ తో మాట్లాడి దరఖాస్తు తీసుకొని జిరాక్స్ పై ముట్టినట్టుగా రాసి ఇవ్వాలని కోరారు. ఆ అధికారి “డోంట్ కేర్” అన్నట్లుగా నాకు జవాబు చెప్పాడు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AE) తో నేరుగా ఫోన్లో మాట్లాడాను. దరఖాస్తులను  స్వీకరించకుండా తిరస్కరించే అధికారం లేదని చెప్పాను. కార్యాలయానికి వచ్చే పత్రాలను స్వీకరించడం, స్వీకరించిన వాటిని రిజిస్టర్లో నమోదు చేయడం, కార్యాలయం నుంచి బయటికి వెళ్లే పత్రాలను  మరొక రిజిస్టర్ లో నమోదు చేయడం అనే ప్రక్రియ సర్వసాధారణంగా ప్రతి కార్యాలయంలో ఉంటుంది. ఈ పనులు చేయడానికి కార్యాలయ సిబ్బందిలో ఒకరికి బాద్యత ఇస్తారు.  ఆ విషయం కూడా ఆయనకి గుర్తు చేసాను. రిజిస్టర్  పోస్టులో వస్తే తీసుకున్నప్పుడు స్వయంగా వచ్చి ఇస్తే  ఎందుకు తీసుకోరు?  అని ప్రశ్నించాం. ఇదంతా ఫోన్ లోనే. మొత్తానికి ఆయన దరఖాస్తు తీసుకోవడానికి అంగీకరించి ఆ ఫోనును తన సిబ్బందికి ఇవ్వమని చెప్పారు. నా ఫోను సిబ్బందికి ఇవ్వబోతే వాళ్లు తీసుకొని మాట్లాడడానికి నిరాకరించారు(వారి ఇగో దెబ్బతింది). దాంతో ఆ విషయాన్ని ఆ అధికారికి తెలియజేసి రసీదు ఇచ్చేంతవరకూ కార్యాలయంలోంచి బయటికి వెల్లబోమని చెప్పటం జరిగింది. ఆయన తన  సిబ్బందితో  మాట్లాడుకున్నారు. వెంగళరావు దగ్గర దరఖాస్తు తీసుకొని, జిరాక్స్ పై సంతకం పెట్టి, కార్యాలయం ముద్ర వేసి ఇచ్చారు. సమాచారం వచ్చినా రాకపోయినా ముందు రసీదు వచ్చినందుకు ఒక వారం రోజులుగా పడిన శ్రమను మరిచిపోయి ఆనందించాడు వెంగళరావు. ఏ అధికారైతే  రసీదు ఇవ్వడానికి గత వారం రోజులుగా నిరాకరిస్తూ వచ్చాడో  అదే అధికారి ఆ పని చేయడంతో పౌరుడు వ్యవస్థ మీద విజయం సాధించాడు. నిజానికి ఆ వ్యవస్థ నడుస్తున్నది ఈ పౌరుడు కడుతున్న పన్నులతోనే  కదా. ప్రజాస్వామ్యం అంటే ప్రజల స్వామ్యం. అంతేగాని ఐదేళ్లకొకసారి ప్రజలు ఓట్లు మాత్రమే వేసే స్వాహా స్వామ్యం కాకూడదు కదా. ఇది ఈ నిశ్చల చిత్రంలోని కథ. ఈ కథ ఇంకా ముగింపుకు రాలేదు. ఎందుకoటే ఇప్పటివరకూ అధికారికంగా వెంగళరావుకి సమాచారం అందలేదు. అందకపోయినా పై అధికారి వద్ద అప్పీలు దాఖలు చేయడానికి ‘రసీదు’ అనే  సామాగ్రి అయితే సిద్ధంగా ఉంది.

రెండవ చిత్రం

కళ్యాణ లోవ కొందు (PVTG) ఆదివాసీ రైతులు

మీకు ఈ రెండవ నిశ్చల చిత్రంలో కనిపిస్తుంది ఇద్దరు ఆదివాసి యువకులు. వారిదొక చిత్రమైన కేసు. “గురువుగారు! మాకు పోడు పట్టాలు వచ్చేయి గాని, పాస్ పుస్తకాలు రాలేదు” అన్నారు వారు. ఇందులో చిన్న తిరకాసు వుంది. పోడు పట్టా అంటే అటవీ భూములు సాగు చేస్తున్న ఆదివాసీలకు ఇచ్చే పట్టా. అటవీ హక్కుల చట్టం అనుసరించి ఈ పట్టా ఇస్తారు. అయితే పట్టా ఒకటి, పట్టాదార్ పాస్ పుస్తకం అని మరొకటి   రెండు వుండవు.  పాసు పుస్తకమే పట్టా. నేను ఇదే విషయం వారిని అడిగాను. “పట్టాదార్ పాస్ పుస్తకం లేదని అంటున్నారు, మరి పట్టా ఉందా? ఏది ఆ పట్టా చూపించండి” అని అడిగా.  వాళ్లు బిక్క మొహం వేశారు. ఆ ఇద్దరి యువకులు కోందు తెగకు చెందిన ఆదివాసి రైతులు. “మా దగ్గర పట్టా కూడా లేదు” అన్నారు. “మరి! మీకు ఎలా తెలిసింది పట్టాలు వచ్చాయని” అని అడిగితే, వాళ్లు ఒక ఆశ్చర్యకరమైన జవాబు చెప్పారు. తమ గ్రామంలో ఏడుగురికి పట్టాలు వచ్చాయి కాని  ఎవరికీ పాస్ పుస్తకాలు లేవని  అంటారు. “ఆ పట్టాలు వచ్చేయని అని మీకు ఎలా తెలుసు” అని అడిగితే, “మాకు రైతు భరోసా డబ్బు బ్యాంక్ ఎకౌంట్లో పడుతుందని” అన్నారు. మన పాలన వ్యవస్థల పనితీరుకు ఇదొక ఉదాహరణ. వారి దగ్గర నుంచి ఆధార్ నెంబర్లు సేకరించి వాటి ద్వారా పరిశీలిస్తే వారి ఎకౌంట్లకు రైతు భరోసా పడుతున్న మాట నిజం అని  తేలింది.  ఈ భూమి తప్ప మరో మరో భూమి లేదు. వారు సాగు చేస్తున్న అటవీ భూమికి పట్టా హక్కులు కల్పించినట్టుగా ప్రభుత్వ కార్యాలయాల డేటాబేస్ లో వుంది. ఆ డేటా  ప్రకారం వారికి నగదు బదిలీ జరుగుతుంది. కానీ వారి చేతిలో ఎలాంటి పత్రాలు లేవు. అంటే వారికి పట్టా మంజూరు అయ్యింది.  కానీ ఆ పత్రాలు చేతికి ఇవ్వలేదని అర్థం. రేపు ఈ ‘భరోసా’ ఉండకపోవచ్చు, పాలకులు మారిపోవచ్చు కనుక తమకు పట్టా హాక్కు ఇచ్చారని చెప్పుకోవడానికి ఈ బ్యాంక్ పాస్ పుస్తకం పనికి రాదు.

ఇదే విషయాన్ని మండల రెవెన్యూ కార్యాలయంలోని తాశీల్దార్ వద్ద ప్రస్తావించి వారు వుoటున్న గ్రామ పంచాయితీలో మంజూరైన అటవీ హక్కుల చట్టం హక్కుదారుల జాబితా ఇవ్వమని అడిగాం. ఆయన, తన కార్యాలయంలో ఆ సబ్జెక్ట్ చూస్తున్న  దిగువ స్థాయి అధికారిని  పిలిచి లబ్దిదారుల  జాబితా ఇవ్వమని చెప్పారు. సదరు అధికారి అన్నిచోట్ల వెతికారు. చివరికి ఒక దగ్గర ఆ ఫైలు దొరికింది. సదరు ఫైల్ లోని కాగితాలను కొన్నింటిని అప్పటికే వినాయకుల వారి వాహనం ఆరగించింది. ఇది మా ముందే బయటపడడంతో ఆ  అధికారి వారు కాస్త తత్తర పడ్డారు. ఇదిగో జాబితా అంటూ కొన్ని కాగితాలు మా చేతిలో పెట్టాడు. వెంటనే మండల కేంద్రంకు  పంపించి జిరాక్స్ తీసుకొని  ఒరిజినల్సు మళ్లీ కార్యాలయంలో అందజేశాం. ఆ జాబితా దొరికిన సంతోషంలో వాళ్ళిద్దరూ ఇలా ఫోటో దిగారు. గ్రామానికి పట్టుకొని వెళ్లి జాబితాలో వాళ్ళ ఏడుగురు పేర్లు ఉన్నదీ లేనిదీ చూడమని చెప్పాము. వారు ఉత్సాహంగా వెళ్ళిపోయారు. రెండు రోజుల తర్వాత కబురు ఏమిటంటే, ఆ జాబితాలో కంచు కాగడా పెట్టి వెతికినా  ఈ ఏడుగురు రైతుల  వివరాలు లేవు. రైతు భరోసా నగదు మాత్రం ఎకౌంట్లో వచ్చి పడుతోంది. మరోసారి తాశీల్దార్ మహాశయుడిని  కలిసి ఈ పట్టాల సంగతి వాకబ్ చేయాలి.

మూడవ  చిత్రం

చటర్జీపురం చెంచుగదబ ఆదివాసీ రైతు మహిళలు, రైతులతో వ్యాసరచయిత

ఆదివాసి తెగలలో కొన్ని తెగలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “ఆదిమ తెగల”కు చెందిన ఆదివాసీలుగా గుర్తించింది. వీరిని ఇంగ్లీష్ లో PVTG – Particularly Vulnerable Tribal Group అంటున్నారు.  ఈ ఆదివాసీలకు లిపిలేని భాష ఉంటుంది. పేదలలో నిరుపేదలు అన్నట్టుగా ఆదివాసి తెగలలో అట్టడుగు పొరలలో ఉండేవారు ఈ ఆదిమ తెగల ఆదివాసీలు. వారు ప్రధానంగా వ్యవసాయం, కూలి పనిపై ఆధారపడి జీవిస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అలాంటి తెగలలో  ‘గదబ’ తెగ ఒకటి. ఇందులో మళ్లీ రెండు ఉపతెగలు ఉన్నాయి. ఒకరు “పరిం గదబలు”  మరొకరు “చెంచు గదబలు”. ఇరువురికీ  వారి స్వంత భాష ఉంది. చిత్రం ఏమిటంటే ఈ రెండు భాషలు వేరువేరు. కొన్ని పదాలు మాత్రం ఉమ్మడిగా ఉంటాయి. వీరి మధ్య కంచం పొత్తు , మంచంపొత్తు లేదు.  ఇందులో పరిం గదబలు,  రైతాంగానికి అవసరమైన రకరకాల వెదురు బుట్టలు అల్లడంలో నిపుణులు. వడ్డాది మాడుగుల దగ్గర జాలపల్లి పంచాయితీలో  గదబలు  నివాసం ఉన్న ఒక గ్రామం పేరు “బుట్ల జాలంపల్లి”. ఎందుకంటే వారు వెదురు బుట్టలను అల్లడంలో పేరుపొందారు.

ఈ మూడవ నిశ్చల చిత్రంలో ఉన్న వారందరూ చెంచు గదబ ఆదివాసి రైతులు, రైతు మహిళలు.

భూగోళం ఉపరితలంపై మనకు కనిపించే దానినే మనం  భూమి అంటాం. ఈ భూమిపై విత్తనం వేసి,  పంటను పండిస్తే దానిని ‘వ్యవసాయక భూమి’ అని అంటాం. పాపం! గదబలకు భూమిని గురించి అంతవరకే తెలుసు. కానీ సమాజ పరిణామ క్రమంలో రాజ్య వ్యవస్థలు ఏర్పడిన తర్వాత అదే భూమికి  రకరకాల పాలనాపరమైన వర్గీకరణలు వచ్చి చేరాయి. ఒక్కొక్క వర్గీకరణ పేరుతో గీతలు గీసిన భూఖండాలకు ఆయా రకాల  చట్టాలు, నియమాలు, కోర్టు తీర్పులు వర్తిస్తూ ఉంటాయి. ఇవి గాక ఈ గీతలు గీసిన భూముల సమాచారాన్ని నిక్షిప్తం చేసుకున్న భూమి రికార్డులు, భూమి కొలతల రికార్డులు,  ఆ భూములు గురించిన ‘రాజ్యం’ (State) ఇచ్చిన అర్దాల సంగతులను తెలియజేస్తూ ఉంటాయి. ఇదంతా ఒక పెద్ద మాయలా వుంటుంది. అవును!  భూమి  చుట్టూ బడా బాబులు ఏర్పాటు చేసిన ఒక మాయ. ఇవేవీ ఈ గదబ ఆదివాసీలకు తెలియదు. వారికి తెలిసింది చాలా సింపుల్. అక్కడ ఖాళీగా భూమి ఉంది, దానిలో విత్తనం వేసి పండిస్తే పంట వస్తుంది, ఆ పంటను కోసి నూర్చుకుంటే కడుపు నిండుతుంది. అంతవరకే వారికి తెలుసు.

అనకాపల్లి జిల్లా, రోలుగుంట మండలంలోని “చటర్జీపురం” అనే గ్రామంలో ఈ గదబ ఆదివాసీలు కొంత భూమిని సాగులోకి తీసుకువచ్చారు. ఈ  ఆదివాసీ గ్రామానికి “చటర్జీ” అనే బెంగాల్ పేరు ఎలా వచ్చిందనే అనుమానం మీకు రావట్లేదా? అయితే చదవండి. పూర్వపు విశాఖపట్నం జిల్లాలో మూడు రెవిన్యూ డివిజన్లు ఉండేవి. అవి ఒకటి విశాఖపట్నం రెవిన్యూ డివిజన్, రెండు నర్సీపట్నం రెవిన్యూ డివిజన్, మూడు పాడేరు రెవెన్యూ డివిజన్. ఇందులో విశాఖపట్నం రెవిన్యూ డివిజన్ లో ,  గ్రూప్ వన్ ఆఫీసర్లుగా ప్రమోటైన  రెవెన్యూ అధికారులే  రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO) హోదాలో నియుక్తులు అయ్యేవారు. ఇక నర్సీపట్నం, సబ్ కలెక్టర్ ఆఫీసుకు  ఎప్పుడు యువ IAS అధికారులను సబ్ కలెక్టర్లుగా నియమించేవారు. స్వాతంత్రం రాకముందు ICS ఆఫీసర్లు ఇక్కడ సబ్ కలెక్టర్లుగా పని చేశారు. పాడేరు డివిజన్ కూడా యువ IAS అధికారులనే సబ్ కలెక్టర్లుగా నియమించేవారు. నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఆఫీసులో ట్రైనీ కలెక్టర్లుగా, సబ్ కలెక్టర్లుగా పనిచేసిన వారిలో అనేకమంది పేరు ప్రఖ్యాతులు సాధించిన అధికారులు ఉన్నారు. ఉదాహరణకు లోక్ సత్తా  జయప్రకాష్ నారాయణ గారు. అలా నర్సీపట్నం, సబ్ కలెక్టర్ ఆఫీసులో యువ సబ్ కలెక్టర్ గా పని చేసిన వారిలో చటర్జీ ఒకరు. ఆయన ఈ గదబ  ఆదివాసీలకు ఆ రోజులలో శ్రద్ధ తీసుకొని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించారు. ఆదివాసీల కృతజ్ఞతా భావం ఎంతటిదంటే , తమను పట్టించుకున్న ఆ అధికారి పేరుని తమ గ్రామం పేరుగా మార్చుకున్నారు. అంతకు ముందు దాని పేరు “వీరపురాజు పేట”. అది ఇప్పుడు “చటర్జీ పురం”.

Also read: అల్లూరి సీతారామరాజు – ఇందిరమ్మ ఇచ్చిన భూమి

చటర్జీ పురం ఆదివాసీలు కొంత మెట్ట భూమిని సాగులోకి తీసుకొని వచ్చారు.  కొందరైతే అక్కడే ఇల్లు కట్టుకొని జీవిస్తూ వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు. ఈ భూమి తమదని,  అందులో వ్యవసాయం చేయవద్దని వారికి ఎవరూ చెప్పలేదు. కాలక్రమంలో, తొండలు కూడా గుడ్లు పెట్టని ఆ భూమిని తమ జీవితాలను ధారపోసి  సాగుభూమిగా తయారుచేశారు. దాంతో ఒక రాజుగారు ఈ భూమి నాది ఖాళీ చేయమనడం మొదలుపెట్టాడు. ఆదివాసీలు ప్రతిఘటించారు. ఇక లాభం లేదనుకొని ఈ భూమిని ఆయన విశాఖపట్టణంకు  చెందిన కొందరు వ్యక్తులకు అమ్మేశారు. సాగులో వున్నది “కొండ వాళ్లు”  గనుక వారిని బయటికి లాగేయడం సులువని ఈ పట్టణవాసులు భావించారు. వివాదంలో ఉన్న భూమి గనుక చౌకగా వస్తుందని  కొనేశారు. తమ ఆర్థిక, రాజకీయ పలుకబడి ఉపయోగించి భూమికి పట్టాదారులుగాను, తాము ఉంటున్నది విశాఖపట్నం అయినా తామే సాగు చేస్తున్నట్టుగాను తమ పేర్లు నమోదు చేయించుకోగలిగారు ఈ ‘టౌనోళ్లు’.

సరిగ్గా ఈ సమయంలోనే  ఆ సమస్య మా దృష్టికి వచ్చింది. రికార్డులను పరిశీలిస్తే ఆ భూమి ప్రైవేటు వ్యక్తుల, ప్రైవేటు భూమిగా అంటే జిరాయితీ పట్టా భూమిగా రికార్డులో నమోదయివుంది. ఇక సాగుదారులుగా లేదా అనుభవదారులుగా విశాఖపట్నంకు  చెందిన వారి పేర్లు నమోదై ఉన్నాయి. ఒకవేళ ఆదివాసీలకు భూమిపై పట్టా హక్కు లేకపోయినా అనుభవహక్కు ఉన్న విషయం నిజం. వారు భూమి మీద నిలబడి  సాగు చేస్తున్నది నిజం. అక్కడే ఇల్లు కట్టుకొని ఉంటున్నది నిజం. కానీ ఈ సాగు అనుభవపు నిజం భూమి రికార్డులో లేదు. ఆదివాసీలు పట్టాదార్లు గాకపోయినా సాగుదారులుగా వారికి అనుభవ హక్కు ఉంది. ఆ అనుభవ హక్కు రికార్డు అయినప్పుడు మాత్రమే కోర్టులు దానిని గుర్తిస్తాయి. అంటే, రేపు సోకాల్డ్ ( so called) పట్టాదారులు ఈ నోరులేని ఆదివాసీలపై  నర్సీపట్నం కోర్టులో ఇంజక్షన్ దావా  వేస్తే,  మేమే సాగులో ఉన్నామని చెప్పడానికి ఆదివాసీల దగ్గర ఎలాంటి రికార్డు సాక్ష్యం ఉండదు. కానీ నిజంగా సాగు చేయకపోయినా విశాఖపట్నం వారే సాగు చేస్తున్నట్టుగా నిరూపించుకోవడానికి కావలసిన భూమి రికార్డు సిద్ధంగా ఉంది. అంటే ఏమిటి?  ఆ రికార్డులను నమోదు చేసే అధికారులకు లంచాలిచ్చి ఈ విశాఖపట్టణం వారు తమ పేర్లను అటు పట్టాదార్లు గాను  ఇటు సాగుదార్లుగా  కూడా నమోదు చేయించుకోగలిగేరని అర్థం.

ఇదే విషయమై  మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి,  అనేక ఆందోళన కార్యక్రమాలను చేపట్టి, విచారణ జరిగేలాగా ఒత్తిడి చేసి ఈ ఆదివాసీ సాగుదారుల పేర్లను సాగుబడి రిజిస్టర్లో అనుభవదారుల కాలంలో నమోదు చేయించగలిగాం.

అలా నమోదైన సాగుబడి రికార్డుకు సర్టిఫైడ్ కాపీలు తీసుకొని వాటిని, లామినేషన్ చేయించి భద్రంగా ఉంచుకోమని ఈ ఆదివాసీల చేతిలో పెట్టాం. దాంతో వారి యొక్క “పొజిషన్” (స్వాధీన అనుభవం)  నిర్ధారించే పత్రాలు మొట్టమొదటిసారిగా వారికి అందాయని సంతోషించాము. కానీ మా సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు.

ఇదే నర్సీపట్నం డివిజన్లో ఒకానొక మండలంలో తాశీల్దారుగా పనిచేసిన వ్యక్తి చటర్జీపురం ఆదివాసీలు ఉన్న మండలానికి తాశీల్దారుగా వస్తున్న విషయం పత్రికలలో తెలుసుకొని మేము  కీడు శంకించాo. ఎందుకంటే,  అక్కడ ఇదే అధికారి ఇలాంటి గదబ ఆదివాసీల భూమి విషయంలో అమెరికాకి చెందిన ఒక NRIకి  కొమ్ముకాయడం,  పై అధికారులకు తప్పుడు రిపోర్టులు పంపడం  గమనించి ఉన్నాము.

అందుకే సదరు అధికారి తాశీల్దారుగా  బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆలస్యం చేయకుండా చటర్జిపురం ఆదివాసీలతో ఒక వినతిపత్రం ఇప్పించాము. అందులో, ఆ భూములలో తాము సాగులో ఉన్న విషయం, తమ పేర్లు రికార్డులో సాగుదారులుగా నమోదైన విషయం తెలియజేస్తూ భవిష్యత్తులో రికార్డులలో మార్పు చేసే సమయంలో తమకు నోటీసు ఇవ్వకుండా, సమాచారం ఇవ్వకుండా, తమ  వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వకుండా మార్పులు చేయరాదని, అట్టి మార్పులు చేస్తే సదరు మార్పులతో తమకు సంబంధం లేదని,  అవి చట్టపరంగా చేల్లవని… ఇలా ముందరకాళ్ళకు బంధం వేస్తూ ఒక వినతిపత్రం ఇప్పించి,  అది ఇచ్చినట్టుగా ఎండార్స్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. హమ్మయ్య! చటర్జీపురం  ఆదివాసీలకు ప్రమాదం రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామని  అనుకున్నాం. కానీ మా అంచనా తప్పు.

గత ఏడాది నవంబర్లో ఆ తాశీల్దార్ కంప్యుటర్ లో వున్న ఆన్ లైన్  భూమి రికార్డు మార్చేశాడు. ఆదివాసీల పేర్లను మొత్తంగా  తీసేసి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక రెడ్డి గారిని పట్టాదారుగా,  అనుభవధారుగా  చూపిస్తూ రికార్డు మార్చేశాడు. రికార్డు మార్చే సమయంలో అందరికీ నోటీసులు ఇవ్వాలని, తమ వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వాలని పట్టాదార్ పాస్ పుస్తకాల (ROR) చట్టం చాలా స్పష్టంగా చెబుతుంది. నిజానికి మేము ముందు ఇచ్చిన వినతిపత్రంలో ఇదే  విషయాన్ని చేశాం కూడా. తాశీల్దారు తనకు తెలియదని పొరపాటు జరిగిందని చెప్పడానికి ఇప్పుడు అవకాశం లేదు.  ఇది పూర్తిగా నూటికి నూరు శాతం కావాలని చేసినది. అవినీతి చర్య.

ఆదివాసీలు ముందస్తుగా వినతిపత్రం ఇచ్చినా, రికార్డు మార్చేయడానికి   తాశీల్దార్ కి అంతటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది ప్రస్తుతం పూర్తిగా  దిగజారిన వ్యవస్థల నుండి వచ్చింది. కొంత పరిశోధన చేసిన మీదట నాకు తెలిసిన విషయాలు ఏమిటంటే, ఆ  తాశీల్దార్ గారు నిజానికి అవినీతికి పాల్పడవలసిన ఆర్దిక స్థితిలో లేరు. వారి ఇద్దరి కుమారులు అమెరికా చేరుకొని అక్కడ డాలర్లు సంపాదిస్తున్నారు. అయ్యగారు ఎక్కడ పనిచేసినా  చేతిలో రూపాయి పెడితే తప్ప ఆకుపచ్చ  సంతకం పడదు. అదే సమయంలో కార్యాలయంలోని ఇతర సిబ్బందికి అందులో ఒక్క అర్ధణా (మూడు నయాపైసలు)  కూడా ఇచ్చే ఉదార స్వభావం లేదు. పానకాల స్వామి నోట్లో పానకం పోస్తే ఒక పావలా వాట వెనక్కి తిరిగి వస్తుందట,  ఇక్కడ ఒక్క చుక్క కూడా బయటికి రాదు. ఒక్కొక్క అవినీతి అధికారి తన సంపాదనను మదుపు  పెట్టడానికి ఒక్కొక్క పద్ధతిని  అనుసరిస్తారు. అయ్య గారికి ఇల్లు అంటే మోజు.  అందుచేత ఇల్లు, ప్లాట్లపై పెట్టుబడి పెడతారన్నది అభిజ్ఞ వర్గాల భోగొట్ట. ఇలాంటి  అవినీతి చరిత్ర కలిగిన అధికారులే నేటి మన ప్రజా ప్రతినిధులకు కావాలి. 

రికార్డు మార్చేసిన రెండు నెలలకు గాని ఆ విషయం మాకు తెలియలేదు. రాష్ట్ర ప్రభుత్వం నడిపే  “ మీ ఇంటి మీ భూమి” అనే వెబ్ పోర్టల్ లో చూసుకుంటే గాని మీ భూమి వున్నది పోయింది తెలియదు. ప్రతిరోజు ఎక్కడ చూడగలం. అందునా చటర్జీపురం ఆదివాసీలకు అది ఎలా సాధ్యం!?. అందుకే విషయం తెలియడానికి ఆలస్యం అయ్యింది.

ఈ అన్యాయంపై ఫిర్యాదులు చేశాం, ధర్నాలు చేశాం, పత్రికా ప్రకటనలు ఇచ్చాం కానీ ఏ ఉన్నతాధికారి విచారణ జరపడానికి ఎలాంటి ఆసక్తిని చూపించలేదు. ఇప్పుడు సర్కారు వారి భూమి రికార్డుల ప్రకారం చటర్జీపురం ఆదివాసీలు ఆ భూమిలో  సాగులో లేనట్టు లెక్క. ఎన్నో ప్రయత్నాలతో సాధించిన రికార్డు ఎంట్రీని ఒక్క ‘మౌస్ క్లిక్’ తో గిరిజనేతర  వర్గాలు తీయించవెయగలివాయి. భారత ప్రభుత్వానికి కార్యదర్శిగాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో,  ఎస్ ఆర్ శంకరన్ గారి నేతృత్వంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ గా పనిచేసిన సీనియర్ విశ్రాంతి IAS అధికారి శ్రీ EAS శర్మగారు ఈ చటర్జీపురం ఆదివాసీల విషయమై నేరుగా ముఖ్యమంత్రికి  లేఖ రాశారు. దానిపై  1. ముఖ్యమంత్రి కార్యాలయం గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి  లేఖ రాసింది,  2. ఆ గిరిజన సంక్షేమ కార్యాలయపు ముఖ్య కార్యదర్శి దగ్గర పనిచేసే సహాయ కార్యదర్శి గారు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గారికి లేఖ రాశారు,  3. సదరు డైరెక్టర్ గారు ఈ విషయమై విచారణ జరపమని అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి లేఖ రాశారు, 4.  సదరు అనకాపల్లి జిల్లా కలెక్టర్ వారు ఈ విషయమై విచారణ జరిపి నివేదిక ఇవ్వమని నర్సీపట్నం ప్రస్తుత RDO గారిని ఆదేశించారు. 5. సదర నర్సీపట్నం RDO  గారు ఈ విషయమై విచారణ జరిపి ఖద్దున నివేదిక ఇవ్వమని ఆ తప్పుడు పని చేసిన తాశీల్దారు గారిని ‘ఘట్టిగా’ ఆదేశిస్తూ లేఖ రాశారు. 6. సదురు తాశీల్దార్ గారు ఈ విషయమై  నివేదిక ఇవ్వమని గ్రామ పరిపాలన అధికారి (VRO) గారికి ‘జరూరు’గా ఆదేశాలు ఇచ్చారు. ఇది కథ.

ఇంతలో ,  రాష్ట్ర ప్రభుత్వం అధికారుల బదిలీలను  చేపట్టింది. అందులో భాగంగా మహాఘనత వహించిన ఈ తాశీల్దారు గారు, గౌరవ శాసనసభ్యుల ఆశీస్సులతో మరో మండలానికి బదిలీ అయ్యారు. ఈ మండలానికి కొత్త తశీల్దారు వారు నియామకం అయ్యారు. కుర్చీ అదే కానీ అందులో కూర్చునే మనుషులు మారారు. ఈ కొత్త వారు ఎలాంటి వారో  మనకు తెలియదు. ‘ఎందుకైనా మంచిది ఒక ప్రయత్నం చేద్దాం’ అనే ఉద్దేశంతో చటర్జీపురం ఆదివాసీలు మరో వినతిపత్రం రాసుకొని తమ గ్రామం నుండి మండల కేంద్రానికి చేరుకున్నారు. బదిలీపై వస్తున్న కొత్త తాశీల్దారు వారు ఇంకా చార్జి తీసుకుని వారి సీటులో కుదురుకోలేదని చావుకబురు చల్లగా తెలిసింది.

సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చిన ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ గాని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO) గాని  విచారణ జరుపుతారా??

కొత్త తాశీల్దారు గారు పాత తాశీల్దార్ చేసిన తప్పులను సరి చేస్తారా?

దశాబ్దాలు తరబడి  సాగు చేస్తున్న చటర్జీపురం గదబ ఆదివాసీల పేర్లు తిరిగి రికార్డులో సాగుదారులుగా నమోదు అవుతాయి?

రెవిన్యూ బేతాళుడు అడిగే ఈ ప్రశ్నలకు కొమ్ములు తిరిగిన విక్రమాదిత్యుడు కూడా జవాబు చెప్పలేడు!

మనదేశంలో ప్రజలు ఉన్నారు… స్వామ్యవుంది… కానీ ప్రజాస్వామ్యం లేదని నేనంటే మీరేమంటారు!?

కొసమెరుపు: ఒక యువ IASగా   నర్సీపట్నం,  సబ్ కలెక్టర్ ఆఫీసులో పనిచేసిన ఈ ‘చటర్జీ’ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఆయన ఆచూకీ లభిస్తే తన పేరు పెట్టుకున్న ఈ ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలను ఏకరువు  పెట్టి వారిద్వారా కలెక్టర్ కు  లేదా చీఫ్ సెక్రటరీ గానీ ఒక లేఖ రాయించాలని ఆశపడ్డాను. హైదరాబాదులోని  మిత్రుల సహకారంతో మొత్తానికి ఆయన్ని వెతికి పట్టుకున్నాను. ఆయన పదవీ విరమణ చేసి ప్రస్తుతం ఏదో పర్యావరణ అంశాలపై నిష్ణాతునిగా సేవలందిస్తున్నారని  భోగట్టా వచ్చింది.  ఆయన పేరు పెట్టుకున్న ఈ ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి సహాయం కోరాము. వారి దగ్గర్నుంచి ఈమెయిల్లో ( e mail) జవాబు వచ్చింది. ఆ జవాబు సారాంశం ఇది “God bless you.”

Also read: రెండు నెలల రేషన్ అందింది, ఆహార భద్రతా చట్టం గూర్చి తెలిసింది

P.S. అజయ్ కుమార్

అజయ్ కుమార్ పీ ఎస్
అజయ్ కుమార్ పీ ఎస్
పీఎస్ అజయ్ కుమార్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో సోషల్ వర్కులో మాస్టర్స్ డిగ్రి (MSW) చేశారు. గత 30 ఏళ్లుగా ఆదివాసీల భూమి సమస్య, నిర్వాసిత, గ్రామీణ కార్మికుల హక్కుల కోసం పని చేస్తున్నారు. ‘ప్రభుత్వ భూమి పేదలదే’, ‘భూమి సమస్య – వ్యాసాలు 1, 2’, ‘కళ్యాణలోవ కధలు’ ప్రచురితమైన పుస్తకాలు. భూమి సమస్య వ్యాసాలు – 1కి, DNF Rural Journalist award foundation –Hyderabad వారి Rural journalist award for year 2008 లభించింది. ప్రస్తుతం అఖల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles