Monday, April 29, 2024

కటు దుఖం… పటు నిరాశ

పొటో రైటప్: భూమిశిస్తూ కమిషనర్ కార్యాలయం, విజయవాడ. కొత్త వీధి కొందు ఆదివాసి రైతు యువకుడు గెమ్మెల చంటితో వ్యాస రచయిత పీఎస్ అజయ్ కుమార్,2023 ఆగస్ట్ 28.

అధికారికి సమస్యలు చెప్పుకుంటే తీరుతాయో లేదో తెలియదు. కానీ ఆ అధికారికి చెప్పుకోవడమే ఒక పెద్ద సమస్యగా ఉంటుంది మన దేశంలో. అది తాసిల్దార్ కచేరి కావచ్చు, జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం కావచ్చు, విజయవాడలోని భూమి శిస్తు కమిషనర్ కార్యాలయం కావచ్చు..  అధికారులు కలిసి తమ గోడు చెప్పుకోవడం ఎక్కడైనా పేదవారికి సమస్య పరిష్కారంలో కేవలం మొదటి అడుగు మాత్రమే.

అనకాపల్లి జిల్లా, చీడికాడ మండలం, కోనo శివారు ‘కొత్త వీధి’ అనే ఆవాస గ్రామంలో ఆదిమ తెగల ఆదివాసీలు(PVTG)గా గుర్తించబడిన కొoదు ఆదివాసీలు జీవిస్తున్నారు.

Also read: మూడు నిశ్చల చిత్రాలు-అనిశ్చిత జీవితాలు!

కొత్తవీధి అనే పేరుతో వారు కట్టుకున్న గ్రామం ఉంది. దానికి విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి. ఆధార్ కార్డులు ఉన్నాయి. బ్యాంకు పాస్ పుస్తకాలు ఉన్నాయి. స్వయం సహాయక మహిళా గ్రూప్ ఉంది. దానికి ప్రభుత్వం ఇచ్చిన లక్ష రూపాయల అప్పు ఉంది. హుద్  హూద్ తుఫాన్ లో ఇల్లు పడిపోతే ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం ఉంది. గత ప్రభుత్వంలో మంజూరైన నాలుగు ఇల్లు పునాదులు ఉన్నాయి. సత్యసాయి సేవా సమితి వారు ఆదివాసీల కోసం ఏర్పాటుచేసిన మినీ మంచినీటి సదుపాయం ఉంది. గత 30 సంవత్సరాలుగా ఆదివాసీలు తమ గ్రామం చుట్టూ పెంచిన జీడి మామిడి తోటలున్నాయి. టేకు వనాలు ఉన్నాయి. సీజన్లో మంచి కళ్ళు ఇచ్చే జీలుగు చెట్లు ఉన్నాయి. అతిధులు వస్తే ఇవ్వడానికి నాణ్యమైన కొబ్బరి  చెట్లు ఉన్నాయి. అన్నిటికీ మించి అక్కడ మనుషులు ఉన్నారు. వారికి జీవితాలున్నాయి. వారు ఆదివాసీలే కాదు, ఈ దేశ మూలవాసులు.

కానీ కోనాం రెవిన్యు సర్వేనెంబర్ 289లో కొందు ఆదివాసీల గ్రామం ఉన్నట్టుగాని, అదే సర్వే నెoబర్లో వారి సాగు అనుభవం ఉన్నట్లుగానే నిర్ధారించి చెప్పడానికి గ్రామ పరిపాలన అధికారి (VRO) నుండి రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO) వరకూ సిద్ధంగా లేరు.

గత ఏడాది సరిగ్గా ఇదే ఆగస్టు నెలలో విజయవాడ వచ్చి భూమిశిస్తూ కమిషనర్ గారిని కలిసి న్యాయం చేయమని కోరాము. ఆయన వెంటనే స్పందించి 5 అంశాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వమని ఆదేశించారు. ఈ ఆదేశాలు 2022 ఆగస్టు 23న ఇవ్వబడ్డాయి. భూమి శిస్తు కమిషనర్ అంటే రెవెన్యూ శాఖలో అత్యున్నత అధికారి. హైకోర్టు జడ్జితో సమానం. నిన్న అనగా 2023 ఆగస్టు 28వ తేదీన వారి కార్యాలయానికి వచ్చాం. కానీ పనులు ఒత్తిడి వలన వారు కార్యాలయానికి రానందున కలవలేకపోయాం. ఈరోజు ఆగస్టు 29న మళ్లీ ఆయన దర్శనం కోసం కార్యాలయానికి వచ్చాం. ఈరోజు కూడా రారని తెలుసుకొని ఆయనకు ఇవ్వడానికి సిద్ధం చేసిన వినతి పత్రాన్ని కార్యాలయంలో అందజేసి నిరాశతో తిరుగు మొహం పట్టాం. నాతోపాటు కొత్తవీధి ఆదివాసి రైతు యువకుడు కూడా ఉన్నారు. భూమిశిస్తు కమిషనర్ని కలిసి సంవత్సరం కిందట వారిచ్చిన ఆదేశాలు కించిత్ కూడా అమలు కాలేదని తెలియజేయడానికి ఎంతో ఆశతో తన గ్రామం నుంచి విజయవాడకి ప్రయాణమై వచ్చాడు. ఎక్కడో మారుమూల ఆదివాసి గ్రామం నుండి విజయవాడ వరకు వచ్చి రెండు రోజులు పాటు ఉండడం అంటే కొత్తవీధి కొందు ఆదివాసీలకు ఎంత కష్టమో, అది వారికి ఎంత నష్టమో అర్థం చేసుకునే వారికి మాత్రమే తెలుస్తుంది. అలా అర్థం చేసుకోగలిగే మనుషులు మన వ్యవస్థలో ఉన్నారంటారా?!

Also read: ముప్పయ్ సెంట్లు కోసం మూడేళ్ళుగా …

30 ఎకరాల సాగు భూమి నుండి 16 కుటుంబాల ఆదివాసీలను బయటికి నెట్టేయడానికి భూమాఫియా అన్ని కోణాలలో పావులు కదుపుతోంది. అది పద్మవ్యూహాలను రచిస్తోంది. పద్మవ్యూహంలో చిక్కుకుపోయిన అభిమన్యుడికి ఎలాంటి సహాయo అందకుండా కట్టడి చేసినట్టుగా సైంధవుడి పాత్రను క్షేత్రస్థాయిలో ఉన్న రెవెన్యూ అధికారులు నిర్వహిస్తున్నారు.

గెలుపు కోసం, భూమి చేజారకుండా ఉండడం కోసం, ఆఖరి క్షణం వరకు పోరాడుతూ ఉండడమే మన కర్తవ్యం. బీహార్ శాసనసభకు చెందిన CPI ML లిబరేషన్ పార్టీ ఆరుగురు శాసనసభ్యులు, అందులో ఒకరు బీహార్ శాసన సభ లిబరేషన్ పార్టీ ఫ్లోర్ లీడర్ కాగా మరొకరు డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ నిరుపేద ఆదివాసీలకు సహాయం చేయమని గత ఏడాదిలో లేఖ రాశారు. ముఖ్యమంత్రి కార్యాలయం మర్యాదపూర్వకంగానైనా వారికి ఎటువంటి జవాబు ఇవ్వలేదు. BBC తెలుగు విభాగం ఈ గ్రామాన్ని సందర్శించి అక్కడ ఒక గ్రామం ఉందని, గ్రామం చుట్టూ ఆదివాసీల సాగు అనుభవం ఉందని విజువల్స్ తో ఒక డాక్యుమెంటరీ చేసి ప్రపంచం ముందు పెట్టింది. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన, అందరూ గౌరవించే ది హిందూ దినపత్రిక ప్రత్యేక ప్రతినిధి ఆ గ్రామాన్ని సందర్శించి ‘స్పాట్ లైట్’ శీర్షికన ఒక పూర్తి పేజీ వార్తను ప్రచురించారు. ‘లీడర్’ అనే ప్రముఖ ప్రాంతీయ దినపత్రిక సంపాదకులు  సతీసమేతంగా ఈ గ్రామాన్ని సందర్శించి వాస్తవాలను నమోదు చేయడంతో పాటు ఆదివాసీలకు దుప్పట్లు అందజేశారు. మానవ హక్కుల వేదిక (HRF) ప్రతినిధులు V.S కృష్ణ గారు, P. రఘు గారు ఆ గ్రామాన్ని సందర్శించి తాము చూసిన వాస్తవాలను జిల్లా కలెక్టర్కు నివేదిక రూపంలో ఇచ్చారు. భారత కమిషన్ పార్టీ(CPI ) అనకాపల్లి జిల్లా కార్యదర్శి బాలినేని వెంకటరమణ తన బృందంతో పర్యటించి అక్కడి వాస్తవాలను బయట ప్రపంచానికి తెలియజేశారు. ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్పినా అక్కడ ఆదివాసి గ్రామం ఉందన్న విషయాన్ని అధికారికంగా నిర్ధారించడానికి స్థానిక రెవిన్యూ అధికారులు సిద్ధంగా లేరు. ఆ విషయాన్ని అంగీకరిస్తే అక్కడ ఆదివాసీలు జీవిస్తున్నారని, వారు సాగు అనుభవంలో ఉన్నారని అంగీకరించినట్టు అవుతుంది. అలా చేస్తే భూమాఫియాకు ఇబ్బంది కలుగుతుంది. అందుకే వారు కొత్తవీధి గ్రామానికి వస్తారు,  ఆదివాసీలు ఇచ్చే ఆతిధ్యాన్ని స్వీకరిస్తారు. కానీ తమ నివేదికలలో మాత్రం ఆ వాస్తవాలను దాచిపెడతారు.

“ఇందాక నేస్తం అందాక వస్తాం.

అందరం కలిసి ముందుకే పోదాం!” సుబ్బారావు పాణిగ్రాహి. Whatever may come, కొత్తవీది ఆదివాసీలకు అండగా వుందాం.

Also read: నాన్ షెడ్యూల్ ఏరియా ఆదివాసీలకు రక్షణ కల్పించాలి

అజయ్ కుమార్ పీ ఎస్
అజయ్ కుమార్ పీ ఎస్
పీఎస్ అజయ్ కుమార్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో సోషల్ వర్కులో మాస్టర్స్ డిగ్రి (MSW) చేశారు. గత 30 ఏళ్లుగా ఆదివాసీల భూమి సమస్య, నిర్వాసిత, గ్రామీణ కార్మికుల హక్కుల కోసం పని చేస్తున్నారు. ‘ప్రభుత్వ భూమి పేదలదే’, ‘భూమి సమస్య – వ్యాసాలు 1, 2’, ‘కళ్యాణలోవ కధలు’ ప్రచురితమైన పుస్తకాలు. భూమి సమస్య వ్యాసాలు – 1కి, DNF Rural Journalist award foundation –Hyderabad వారి Rural journalist award for year 2008 లభించింది. ప్రస్తుతం అఖల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles