Monday, June 24, 2024

గోదావరి – కావేరి అనుసంధానం అయ్యేనా?

  • నదుల అనుసంధానం జరగాలి
  • దేశం సస్యశ్యామలం కావాలి

త్వరలో  ‘నీరా’ (జాతీయ నదుల అనుసంధాన సంస్థ) ఏర్పాటు కానుంది. నదుల అనుసంధానాన్ని  కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మహానది, గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి నదులను ఆ జాబితాలో చేర్చింది. ఈ దిశగా అడుగులు వేయడం ఆరంభించింది. అందులో భాగంగా గత ఫిబ్రవరిలో దిల్లీలోని శ్రమశక్తి భవన్ లో కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. తాజాగా సోమవారం నాడు హైదరాబాద్ లోనూ జరిగింది. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్ డబ్లూ డి ఏ) డైరెక్టర్ జనరల్ భూపాల్ సింగ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొదటగా ప్రకటించినప్పుడు పై ఐదు నదులను ప్రస్తావించింది. కానీ ఆ సమావేశంలో గోదావరి – కావేరి నదుల అనుసంధానం మాత్రమే చర్చలోకి వచ్చింది. దానిని ప్రాధమిక సమావేశంగానే అప్పుడు అందరూ చూశారు. ఇప్పుడు కూడా దాదాపు దాని చుట్టూనే చర్చ జరిగింది. సంబంధిత రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోవడమే ప్రధానంగా గత సమావేశం ముగిసింది. నదుల అనుసంధానం పట్ల అన్ని రాష్ట్రాలు అప్పుడు ఇప్పుడు సుముఖంగానే ఉన్నాయి. ఎవరి రాజకీయ ఆలోచనలు, అవసరాలు వారికి ఎలాగూ ఉంటాయి. కేంద్రం – రాష్ట్రాల మధ్య నిధుల కేటాయింపు, అనుసంధానానికి అవసరమైన భూసేకరణ, ఏ ప్రాజెక్టు నుంచి ఏ ప్రాజెక్టుకు అనుసంధానం చేయవచ్చు, ఇంకేమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? అనే వాటిపై చర్చలు జరుగుతునే ఉన్నాయి. భవిష్యత్తులో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.

Also read: విశాఖ వైశిష్ట్యం

ఐకమత్యం, సమతుల్యత అత్యవసరం

రాష్ట్రాల మధ్య ఐకమత్యం కుదర్చడం, కేంద్ర- రాష్ట్రాల మధ్య సమతుల్యతను సాధించడం ఎదురుగా వున్న పెద్ద సవాళ్లు. ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన అంశాలు ఒక కొలిక్కి రాలేదు. ‘నీరు -నిధులు -నియామకాలు’ పూర్తి స్థాయిలో పరిష్కారానికి నోచుకోలేదు. గోదావరిలో నీటి లభ్యత ఎంత మేరకు ఉంటుంది, ట్రిబ్యునల్స్ కేటాయించిన నీరు కాకుండా అదనపు జలాలు ఎంత మేరకు ఉంటాయి, వాటిని ఏ మేరకు ఉపయోగించుకోవచ్చనే వాటిపై కేంద్ర ప్రభుత్వ వైఖరిలో స్పష్టత రావాల్సివుంది. గోదావరి మిగులు జలాలను తరలించడం పట్ల తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టును ప్రాతిపదికగా తీసుకొని అక్కడ నుంచే గోదావరి- కావేరి అనుసంధానం ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ అధికారులు గతంలోనే తెలిపారు. గోదావరి మిగుల జలాలను తరలించడం విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే స్పష్టం చేసింది. తమకు నేరుగా జరిగే లబ్ధి ఎంతవరకూ ఉంటుంది? నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది? అనే వాటిపై కర్ణాటక స్పష్టతను కోరుకుంటోంది. ఐదు రాష్ట్రాలు వెల్లడించిన అభిప్రాయాలను క్రోడీకరించి, తదుపరి చేపట్టే సమావేశంలో గోదావరి -కావేరి అనుసంధానంపై డిపిఆర్ లో మార్పులు, కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.

Also read: సమరస సేనాని సంజీవయ్య

పాత వివాదాలు సమసిపోవాలి, కొత్తవి తలెత్తకూడదు

నదుల అనుసంధానం అనేది గొప్ప ప్రాజెక్టు. పాత వివాదాలకు ముగింపు పలుకుతూ, కొత్త వివాదాలను సృష్టించుకోకుండా, రాజకీయాలకు అతీతంగా, సర్వప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి ముందుకు వెళితే  దేశ సౌభాగ్యం మరింత పెరుగుతుంది. దక్షిణాదిలో గోదావరి, కావేరి చాలా ముఖ్యమైన నదులు. అనుసంధానం అంతే కీలకమైంది. నీటి లభ్యత మొదలు వినియోగం వరకూ రాష్ట్రాలకు సందేహాలు, అభ్యంతరాలు ఉండనే ఉన్నాయి. గతంలో ఎన్నో వివాదాలు, యుద్ధాలు చెలరేగాయి.  జాతీయ ప్రాజెక్టులు చేపట్టడానికి సంబంధించిన విషయంలో కేంద్రం  కొత్త మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. దాని ప్రకారం నిర్మాణ వ్యయంలో కేవలం 60శాతం మాత్రమే కేంద్రం  ఇవ్వనుంది. 40 శాతం రాష్ట్రాలు భరించాల్సి వస్తోంది. గతంలో ఈ నిష్పత్తి 90%-10% గా ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో అనుసంధానం ప్రాజెక్టులు ముందుకు వెళ్ళాలంటే ఎన్ని దశాబ్దాలు పడుతుందో అనే సందేహాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాలకు, అందునా ఆంధ్రప్రదేశ్ కు ఉన్న ఆర్ధిక పరిపుష్టి చాలా తక్కువ. కేంద్రం పెద్ద స్థాయిలో సహకరిస్తే తప్ప ఏ నీటి ప్రాజెక్టు ముందుకు వెళ్ళలేదు. ఇటువంటి అనేక ఇబ్బందులకు, సమస్యలకు ముందుగా పరిష్కారం లభించాలి. సోమవారం నాడు జరిగిన సమావేశంలో డిపీఆర్ పై అన్ని రాష్ట్రాలు తమ అభిప్రాయాలను తెలిపినట్లు తెలుస్తోంది. గోదావరి -కావేరి అనుసంధానానికి తెలుగు రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలిపినట్లు టాస్క్ ఫోర్స్ చైర్మన్ వెదిరె శ్రీరామ్ మాటలు బట్టి తెలుస్తోంది. ఆరు నెలల వ్యవధిలోనే గోదావరి – కావేరి అనుసంధానంపై రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించగలమనే విశ్వాసంలో ఎన్ డబ్ల్యూ డి ఏ డైరెక్టర్ జనరల్ భూపాల్ సింగ్ ఉన్నారు. కేంద్రం- రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సాగితేనే ఏ ప్రాజెక్టైనా ముందుకు సాగుతుంది. నదుల అనుసంధానం అనే గొప్ప సంకల్పం సత్వరమే ఆచారణాత్మకం కావాలని, దేశం సస్యశ్యామలం కావాలని అభిలషిద్దాం.

Also read: భూప్రకంపనలు, ప్రజల భయాందోళనలు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles