Monday, June 24, 2024

తిరుప్పావై అంతా గురుపరంపర ధ్యానమే

  • గోదా గోవింద గీతం 15

నేపథ్యం

ఈపాశురంతో పదిమంది భాగవతోత్తములను (ఆళ్వార్) లను, పదిమంది గోపికలను మేలుకొలుపే కార్యక్రమం పూర్తయింది.  తిరుమంగయాళ్వార్ ను నిద్రలేపి శ్రీమతే శఠగోపాయనమః అనే మంత్రం ఈ పాశురంలో పలుకుతుంది. తిరుప్పావై అనే పేరు రావడానికి ఈ పాశురమే కారణమంటారు, ఎందుకంటే తిరుప్పావై అనే పదానికి సౌందర్యవతి అయిన స్త్రీ అనే అర్థం కూడా ఇళంకిళియే అనే పదం సూచిస్తున్నది.

ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్

ప్రతిపదార్థాలు

ఎల్లే! ఇళంకిళియే! =ఓ చిన్నారి చిలుకా, ఇన్నం =అందరూ వచ్చి నిలిచి ఉన్నప్పడికీ ఇంకా, ఉఱంగుదియో = నిద్రపోతున్నావా, నంగైమీర్! = పూర్ణురాలా, శిల్ ఎన్ఱ్ =జిల్లుమని అరైయేన్మిన్ = పిలువకండి, పోదరుగిన్ఱేన్ ఇప్పుడే బయలుదేరి వస్తాను, వల్లై = మాట నేర్పరిదానా, ఉన్ కట్టురైగళ్ = నీనేర్పయిన మాటలను, ఉన్ వాయ్= నీ నోటిని పండే అఱిదుమ్= చాలాకాలంనుంచి మేం ఎరుగుదుము, వల్లీర్గళ్ = వాక్చాతుర్యంగల వారు, నీంగళే = మీరే, నానే తాన్ ఆయిడుగ= పోనీ నేనే మాటనేర్పరిననుకోండి, నీ= నీవు, ఒల్లై పోదాయ్ = త్వరగా లేచిరావమ్మా, ఉనక్కు =నీకు, ఎన్న వేఱుడైయాయ్ =వేరే ఏం ప్రయోజనం ఉంది చెప్పు, ఎల్లారుం =ఎల్లరును, అందరును, పోందారో = వచ్చియున్నారా, పోందార్ = వచ్చియున్నారు, పోంద్-ఎణ్ణిక్కోళ్ = కావాలంటే వచ్చి లెక్కించుకో, వల్లానై = (కువలయాపీడమనే) మదించిన ఏనుగును కొన్ఱానై = చంపినవాడునూ, మాట్రారై = శత్రువుల, మాట్రు = బలాన్ని, అఱైక్క వల్లానై =నిర్మూలించే శక్తి సామర్థ్యాలు కలిగిన వాడునూ, మాయనై = ఆశ్చర్యచేష్టితములు చేసిన వాడునూ అయిన శ్రీ కృష్ణుడిని, ప్పాడ = గానం చేయడానికి -ఏలోర్ ఎమ్బావాయ్ =లేచి రావమ్మా.

బొమ్మకంటి శ్రీనివాసాచార్యుల వారి తెనుగు సేత సిరినోము

‘‘ఏల చిన్నరి చిల్క: ఇందరమిటు పిల్వ

            మానవీవు నిదుర?’, ‘‘మాన్యులరా’’:

ఇంత అరచి పిలువ నేల? వచ్చుచునుంటి:’’

            ‘‘మేటిజాణవు సూటిపోటి మాట

లివ్వి క్రొత్తలే నీకు?’’ ‘‘ఎవ్వరు జాణలు? మీర

            లో నేనో? పోనిండు నేనేలెండు:’’

‘‘సరిసరి తెమలవె సఖి నీ ఘనత ఏమి:’’

            ‘‘భామలెల్లరు చెలీ: వచ్చినారో?’’

‘‘వచ్చినారిదిగొ కావలె నన్న ఎంచుకో:

            కువలయాపీడము కూల్చినతని

కంసారి దర్పిత గర్వభంజనుని మా

            యావిని సేవింత మతిన: రావే:’’

భావార్థాలు

బయటవేచి ఉన్న గోపికలకు లోన ఉన్నటువంటిగోపికలకు మధ్య మరో సంభాషణతో కొనసాగుతుందీ పాశురం. మాయనై లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడిని కీర్తించడానికి కదలి రమ్మని బయట ఉన్న గోపబాలికలు పిలుస్తున్నారు.
సహనం తోసాధన చేస్తే నే ఏదైనా సాధ్యం. భాగవత సహవాసం వల్ల సహనం వస్తుంది. ఆచార్యకటాక్షం లభిస్తుంది. ఆచార్యుని దయ కలగడానికి ముందు ఏం చేయాలో వివరించే పాశురం ఇది. లోపల ఉన్న గోపికను వాకిలి బయటనుంచి పిలుస్తున్నారు అక్కడ చేరిన గోపికలు. నిన్న తమతో చేరిన గోపబాలికతో కలిసి పంకజనేత్రుని పుండరీకాక్షుని వర్ణిస్తూ ఉంటే విన్న లోని గోపిక తాను బయటకు వస్తే ఈ శ్రీకృష్ణ గానామృతాన్ని ఆపుతారేమోనని లోపలనుంచే తానూ గొంతు కలుపుతుందట. అది విని, మేలుకొని ఉన్నా బయటకు రాలేదని వీరు కోపిస్తారు.

ఎల్లే అనేమాట సంబోధన. హణ్డే హఞ్జే హలా ఆహ్వానం నీచాం చేటిమ్ సఖీమ్ ప్రతి అని పై అధికారిణి తనకన్న కింది వారిని చెలికత్తెను పిలవడానికి వాడే సంబోధనలని శాస్త్రాలు చెబుతున్నాయి. సమానమైన వారిని హలా అని పిలుస్తారు. తమిళంలో ఎల్లే, సంస్కృతంలో హలా, ఆంగ్లంలో హలో ఒక్కటే. జగదేకవీరుడి కథలో ఏమి హాయిలే హలా అని పాట లోనూ, మాటల్లోనూ హలా అనే సంబోధనను అనేక సందర్బాలలో వాడతారు. అది చాలా కొత్తగా ఉందనుకున్నారు. కాని అది పరమ పాతది. 1876లో గ్రాహం బెల్ తను కనుగొన్న టెలిఫోన్ ను పరీక్షించడానికి తన భార్యను పలకరించుకుంటూ హలో హలో అని పిలిచాడట. మొత్తం ప్రపంచం అంతా బెల్ భార్యనే ఇప్పటికీ పలకరిస్తున్నామని నా మిత్రుడు చించాపట్టణం గోమఠం జగన్మోహనాచార్య తన తిరుప్పావై రచనలో చమత్కరించారు.

Also Read : శంఖం ప్రణవం, చక్రం సుదర్శనం, దారి విష్ణువు

వినడం అనేది జ్ఞాన సముపార్జనకు మొదటి మెట్టు. శ్రీభాష్యంలో వాక్యార్థ జ్ఞాన ఉపయోగీని చ శ్రవణ మనన నిదిధ్యాసనాని అని చెప్పారు. అభ్యాసంలో వినడం ముఖ్యమైంది. ఆచార్యులు ఏ విధంగా ఉచ్ఛారణ చేస్తే అదేవిదంగా అనుచ్ఛారణ చేయాలి. అదే అధ్యయనం. ఒకరు పలికినట్టే పలికే చిలకను ప్రస్తావించడం ద్వారా గోద ఈ ఆచార్యత్వాన్ని అధ్యయనాన్ని మనకు తెలియజేస్తున్నారు. లోపలున్న గోపిక బయటివారు పంకజనేత్రుడిని కీర్తించడం విని తానూ కూనిరాగాలు తీసిందట. చిలుక పలుకుల వలె ఆ పాట తీయగా ఉందనడానికి ఇళంకిళియే తీయనిమాటల లేతచిలుకా అనే మాట వాడారు.

బయటగోపికలు: “ఎల్లే!” ఏమే, “ఇళంకిళియే!” తీయనిమాటల లేత చిలకా! “ఇన్నంఉఱంగుదియో” అందరూ వచ్చిన తరువాత కూడా ఇంకా నిద్ర పోతూనే ఉన్నావా? (చిలకవంటి గొంతుగల ఆ గోపిక తమ వెంట ఉంటే శ్రీ కృష్ణుడు సులభంగా లభిస్తాడని వీరి ఆశ, కనుక పరోక్షంగా పొగుడుతున్నారు)
లోపలి గోప బాలిక: చెవులు జిల్లుమనేట్టు పిలవవద్దు. మీ అందరినీ ఎడబాసి బాధతో నేనుంటే మీరు నన్ను పొగడటం సరికాదు (శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నారేమో అని అనుమానించి) “శిల్ ఎన్ఱు అరైయేన్మిన్” ఏమిటీ అల్లరి శ్రీకృష్ణుడు నా దగ్గరేమీ లేడు “నంగైమీర్!” పరిపూర్ణులు మీరే. “పోదరుగిన్ఱేన్” నేనే వస్తున్నాను లెండి.
బయటిగోపిక:“వల్లై”మహాసమర్దురాలివే, మంచి నేర్పరివే, “ఉన్ కట్టురైగళ్” “పండేయున్ వాయఱిదుమ్” కటువైన మాటలు, నేర్పు మాకు ఎప్పటినుంచో తెలుసులే.
లోపల గోప బాలిక: “వల్లీర్గళ్ నీంగళే” నేనేం కాదు మీరే సమర్థులు, నన్నా సమర్థురాలని అంటున్నారు, అసలే నేను శ్రీకృష్ణుడి ఎడబాటువల్ల బాధలో ఉన్నాను, మీరేమో అంతా కల్సి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారు, “నానే తాన్ ఆయిడుగ” రాకపోవడం నాదే తప్పు. పోనీ నేనే కఠినరాలిననుకోండి.

బయటి వారు: “ఒల్లై నీ పోదాయ్” సరే అలా అయితే రా మరి, “ఉనక్కెన్న వేఱుడైయై” నీకే ప్రత్యేకత ఉంది?
లోపల గోపబాలిక: “ఎల్లారుం పోందారో” అంతా వచ్చారా
బయటి గోపబాలిక: “పోందార్” అందరూ వచ్చారు, కావాలంటే నీవు బయటికి వచ్చి లెక్కించుకో నీ దర్శనం మాకు కావాలి.

లోపల గోప బాలిక: “పోంద్-ఎణ్ణిక్కోళ్” ఏం చేద్దాం అందరం
బయటివారు: “వల్లానై కొన్ఱానై ” బలీయమైన ఏనుగు -కువలయాపీడం “మాత్తారై మాత్తరిక్కవల్లానై” దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంహరించిన స్వామి, శత్రువులలోని శత్రుత్వాన్ని తొలగించగల్గినవాడు “మాయనై” చిత్ర విచిత్ర మైన మాయలు చేసే మాయావిని, “ప్పాడ” పాడుదాం.

విశేషార్థాలు

నిన్న పంకజనాభుని కీర్తిస్తూ పాడిన స్తోత్రాలను విని పరవశించిపోయి లోనున్న గోపిక కూడా మధురంగా పాడడం మొదలు పెట్టింది. ఏమాశ్చర్యం నిన్ను లేపడానికి మేం వస్తే మమ్మల్ని మైమరిపించే విధంగా ఉంది నీ కంఠ మాధుర్యం. ఈ చిలుకపలుకులున్నా నీవు చిన్నారి చిలుకవు. శ్రీ కృష్ణుని సాంగత్యంలేని శరీరం నోరు తెల్లబడి ఉంటాయి. కాని నీవు లేత చిలుక పచ్చని మేని రంగుతో ఎర్రని నోటితో ఉన్నావు. అంటే నీవద్ద శ్రీ కృష్ణుడున్నట్టే కదా. మేమంతా వచ్చిన తరువాత కూడా నిద్రిస్తున్నావా? శ్రీకృష్ణుడి విరహంతో బాధ పడుతున్న మాకు నీ స్నేహం లేకపోవడం కూడా తోడైంది. మామాటలు విని కూడా నీకు నిద్ర ఎలా వస్తున్నదమ్మా?

goda govinda geetham tiruppavai 15

భగవంతుడి గుణానుభవంలో ఉన్న లోపలి గోపికకు చిన్నారి చిలుకా అన్న పిలుపు జిల్లుమనిపించింది. భగవద్గుణకీర్తనానందంలో తూగుతున్నవారికి భగవంతుని రాకకూడా ఆటంకం వలె ఉంటుందట. కనుక చిరాకు కలిగించేలా పిలవకండి అంటున్నదామె. నీ చతురత మాకు తెలుసు తప్పును ఒప్పుగాను ఒప్పును తప్పుగానూ చెప్పగల నేర్పరివి. ఈ విధంగా వాద ప్రతివాదాలు కొనసాగాయి. తనది తప్పని ఎవరైనా అంటే వెంటనే ఒప్పుకుని ఎదురు చెప్పకపోవడం ఒక వైష్ణవ లక్షణం. ఇది అహంకార రాహిత్యం. దాన్నే దాసోహం అని భావిస్తారు.

కూరత్తాళ్వార్ భక్తి

ఈ సందర్భంలో ఒక సంఘటనను తిరుప్పావై రచయిత దేవనాథన్ గారు ఉదహరించారు. క్రిమికంఠ చోళుని వైష్ణవ ద్వేషం వల్ల రామానుజుడు దేశం విడిచిపోవలసి వచ్చింది. రామానుజునితో సంబంధం ఉన్న వారెవరూ శ్ర్రీరంగప్రవేశం చేయరాదని నిషేధం విధించారు. ఓరోజు కూరత్తాళ్వార్ శ్రీరంగని సేవకు ఆలయానికి వెళ్లారు. కావలి వారు రాజాజ్ఞను వివరించి, అయినా నీవు ఎవరికీ విరోధివికావు కనుక లోపలి వెళ్లవచ్చు అన్నారు. శ్రీమద్రామానుజుని సంబంధం తెంచుకుని నేను లోనికి వెళ్లను అని వెనుదిరిగిపోయారా స్వామి, ఎంత త్యాగశీలి. భాగవత వ్యతిరేకమయిన భగవద్విషయం అనుష్ఠాన యోగ్యం కాదని కూరత్తాళ్వార్ చాటారు. ఇది ఎల్లలులేని భక్తి.

Also Read : విష్ణు సేవలో కులభేదం లేదు

నైచ్యానుసంధానం, తప్పు నాదే అనడం శ్రీ వైష్ణవులు అనుసరించవలసిన వినయలక్షణం. ఎవరైనా కనబడగానే సర్వాపరాధిని అన్నితప్పులు నేనే చేశాను అని అంటూ సంభాషణ మొదలు పెట్టడం, దాసుడి మనవి అనడం, ఎదుటి వారు కోపిస్తే అయ్యా నాదే తప్పు క్షమించండి అని ఒప్పుకోవడం వైష్ణవ లక్షణాలని నిర్దేశించారు. రాముడు అడవికి పోవడానికి నేనే కారణం అది నా పాపఫలితమే అంటాడు భరతుడు. తను లంకలో బాధలు పడడానికి ఎవరి తప్పూ కారణం కాదు. ఇదంతా నా దోషమే అని సీత హనుమతో అంటుంది. మమైవ దుష్కృతమ్ కించిత్ మహదస్తి న సంశయః అన్నారామె. ఇందులోకించిత్ అంటే చిన్న దోషం, మహత్ అంటే పెద్దదోషం. తనను వనవాసం తీసుకువెళ్లడానికి రాముడు అంగీకరించకపోతే, మా నాన్నగారు నన్నుఒక మగవాడకిచ్చి పెళ్లిచేసాననుకున్నారు అని వ్యంగ్యంగా దూషించారు సీత. భగవంతుని దూషించడం చిన్నపాపం. మాయలేడి  హాసీతా హాలక్ష్మణా అని అరిస్తే, అది మాయ అని ఎంత చెప్పినా వినకుండా లక్ష్మణుడిపైన నానా నిందలు వేయడం భాగవత దూషణ, ఇది మహాపాపం అని సీత వివరిస్తారు.

అయిదో పాశురం తో గోదాదేవి మాయనై అని శ్రీకృష్ణలీలలను వివరిస్తూ వచ్చారు. పది పాశురాల్లో ఆశ్చర్యకరమైన ఘట్టాలను ప్రస్తావిస్తారు. ఈరోజుతో పదో గోపబాలికను లేపుతూ మనకు ఒక పది రకాల జ్ఞానులని, వారి జ్ఞాన దశలను ఆండాళ్ పరిచయం చేసిందని వివరించారు జీయర్ స్వామి. యోగ్యులు, జ్ఞానులూ అయిన యోగులతో కలిసి ఉంటూ వారు చూపిన దారిలో నడుస్తేనే శ్రేయస్సు. అటువంటి భాగవతుల సాహచర్యం కోసం మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి. భక్తులను దూరం చేసుకోకూడదు. తిరుప్పావై మనకు అదే నిరూపణ చేస్తుంది. పదిమంది గోపికలను లేపే ఈ పది పాటలే అసలు తిరుప్పావై అంటూ, ఇంక ఈ నమ్మకం గట్టి పడటానికి మిగతా పాటలని రచించారని జీయర్ స్వామి వివరించారు.

ఆచార్యుడే చిలక

ఈ పాశురం భాగవతుల పారతంత్ర్యం గురించి వివరించింది. ఎల్లే ఇలంగిళియే చిన్నారి చిలుకా అంటే భాగవతుల దర్శనం వారి మాటలు వినడం పరమలక్ష్యం అని. చిలుక అంటే భగవంతుని సారూప్యమును పొందిన ఆచార్యుడికి ప్రతీక. చిలక పలుకులంటే భగవద్విషయంలో రుచి కలిగినవారి మాటలని అర్థం. భాగవతులందరితో కలిసి ఉండాలి, ఇన్నమ్ ఉరంగుదియో ఇంకా నిద్రపోతున్నావా అంటే భాగవతుల సహవాసం లభించినప్పడికీ వాళ్లతో చేరకపోవడం దోషమని. నీ ప్రత్యేకతేమిటి? అంటే పూర్వాచార్యులు నడిపిన దారిలో నడవాలని, ప్రత్యేకంగా వ్యవహరించరాదని భావం.


శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ గుణ కీర్తనం చేసేప్పుడు భగవంతుడు వచ్చినా ఓర్చుకోవడం కష్టం. నంగైమీర్ పోదరు గిన్ఱేన్ భగవద్విషయంలో ఆహ్వానిస్తున్నవారిని భక్తిపురస్సరంగా ఆహ్వానించాలి. నానేదాన్ ఆయిడుగ = నేనే వాక్చాతుర్యంగా ఉండనీ భక్తులను వదులకుని శ్రీ మహావిష్ణువును ఆశ్రయించడం తగదు కనుక నిందనైనా ఒప్పుకుని వారిని కలవడం ప్రధానం. ఆచార్యవాక్యము, భాగవతులతో కలిసి ఉండడం అనే రెండే ఆచార్య ప్రాప్తికి కారణాలు. ఎల్లారుం పోందారో అందరూ వచ్చారా అంటే తారతమ్యాలు లేకుండా అందరూ వైష్ణవులే అని భావించాలి. పోన్దెణ్డిక్కొళ్ లెక్కపెట్టుకో అంటే ఏ ఒక్క భక్తుడు రాకపోయినా భగవదనుభవానికి కొరతే. మాయనై పాడు మాయావిని కీర్తించు, కువలయాపీడము = లోకాన్ని పీడించే అహంకారము, చాణూర ముష్టికులు= కామక్రోధాలు, వాటిని నిర్మూలించిన మాయాచేష్టితుడైన శ్రీకృష్ణుడిని తిరునామాలను కీర్తించడమే భోజనం.

మనసు పలుకులు పలికే లేత చిలక

మనము పలికిన పలుకులనే మళ్లీ పలికేది చిలుక. ఈ పాశురములో తిరుమంగైయాళ్వార్ ను మేలుకొలుపుతున్నారు. నమ్మాళ్వారుల శ్రీ సూక్తులనే వీరు అనుసరించి, అనుకరించి సాధించినారు. వీరే చిలుక. ఇక్కడ గురుపరంపరా వాక్యము ‘‘శ్రీమతే శఠగోపాయనమః’’. వీరు ఆళ్వారులందరిలో చిన్నవారు. తిరువాయ్ మొళి నాకు సంతచెప్పి నాచే పలికించారని వీరు చెప్పుకున్నారు. కనుక వీరే చిలుక, ఇళంకిళియే లేత చిలుక. చిలుక పలుకుల వలె వీరి సూక్తులు అతి మధురములు. 16 సంవత్సరాలు నిద్రించి ఉన్నారు, కనుక ఇంకా నిద్ర సరిపోలేదా ‘‘ఇన్న మురంగిదియో’’ అన్న వాక్యం సరిపోతుంది. వీరు పరిపూర్ణులు కనుక నంగైమీర్ అనే సంబోధన కూడా సరిపోతుంది. మంగపురమున ఉన్నారు కనుక  ఈ ఆళ్వారు తిరు మంగై ఆళ్వార్ అయినారు. ఈయనను చతుష్కవి అంటారు. చిత్ర, ఆశు, మధుర, విస్తారములు అనే నాలుగు రకాల కవితలను చతుష్కవితలు అంటారు. ఈయననే శత్రువునకు కాలుడి వంటివాడు అని వర్ణిస్తూ పరకాలుడు అని పిలుస్తారు.

తిరుమంగై ఆళ్వార్ కథ విచిత్రంగా ఉంటుంది. వీరు కలియుగం 398 నళ సంవత్సరం వృశ్చిక కార్తీక శుద్ధ పూర్ణిమ కృత్తిక నక్షత్రమున జన్మించారు. 108 సంవత్సరాలు జీవించిన ఆళ్వార్ ఈయన. చోళపురంలో అవినాడులో ఉడయార్ అనే శివభక్తుడి సంతానం. నీలుడి కొడుకు. విష్ణువు విల్లు శార్ జ్ఞము అంశతో పుట్టిన తిరుమంగై విలువిద్యలో వీరుడు. చోళ రాజు దగ్గర తండ్రి వలె తానుకూడా సైన్యాధికారిగాపనిచేస్తాడు. ఇతని సాహస శౌర్యాలకు మెచ్చి చోళరాజు ఇతను పెద్దవాడై అలినాడు అనే ప్రాంతానికి పాలనాధికారిగా నియమించాడు. ఈ ప్రాంతానికి రాజధాని వంటి నగరం తిరుమంగై. ఈ నగరి పేరే ఆయన పేరుగా స్థిరపడిపోయింది. తిరుమంగై మన్నన్ అని మొదట్లో పిలిచేవారు. వైష్ణవ ఆళ్వారుగా మారిన తరువాత కూడ తిరుమంగై అనే పిలిచేవారు. పరులకు కాలుడివంటి వీరుడు కనుక పరకాల అని కూడా ఆయనకు పేరు.

అలినాడు సమీపంలో శ్వేతహ్రదమనే సరస్సుకు ఒకనాడు కొందరు దివ్యకన్యలు వచ్చి జలకాలాడి వెళ్లిపోయారట. వారిలో ఒకరు మాత్రం అక్కడే మిగిలిపోయి తిరిగి వెళ్లలేకపోయారట. ఆమెను ఒక వైష్ణవ వైద్యుడు ఇంటికి తీసుకుని వచ్చి తన కూతురుగా పెంచుకున్నాడు. కుముదవల్లి అని పేరు పెట్టుకున్నాడు. పరకాల ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కాని ఆమె కొన్ని షరతులు విధించారు. అతను వైష్ణవుడుగా మారాలి. కనీసం ఏడాది పాటు రోజూ వేయి ఎనిమిది మంది భాగవతోత్తములకు తదీయారాధన (భోజనం పెట్టాలి) చేయాలి.  అందుకు అంగీకరించి పంచసంస్కారాలను స్వీకరించి ఆమెను వివాహం చేసుకుని క్రమం తప్పకుండా రోజూ వేయిమందికి భోజనం చేయిస్తూ ఉండేవాడట.  తన సంపద అంతా దాంతో హరించుకుపోయి చివరకు తన అధీనంలో ఉన్న ప్రభుత్వధనాన్ని కూడా వాడుకోకతప్పలేదు. రాజుకు ద్యవ్యం చెల్లించడం లేదు. రాజు నీలుడిని నిర్బంధించి డబ్బు వసూలుచేయడానిని సైన్యాధికారిని సైన్యంతో పంపిస్తాడు. పరకాలుడు విష్ణువు శార్ జ్ఞము (విల్లు) అంశతోపుట్టిన వాడు కనుక మహావీరుడు. వారందరినీ బాణాలతో జయిస్తాడు. రాజుగారే యుద్ధానికి వస్తే తానూ సిద్ధమవుతాడు. కాని తనకు ఉద్యోగం ఇచ్చి అధికారం ఇచ్చిన రాజును చంపడం న్యాయం కాదని భావించాడు. భాగవతోత్తములు కూడా రాజు ద్రవ్యాన్ని చెల్లించడమే న్యాయమని సూచించారు. రాజుగారు దాదాపు ఓడిపోయే దశలో పరకాలుడు వెనుకంజవేసి బంధీ కావడానికి అంగీకరిస్తాడు.  జైలులోంచి కంచి వరదరాజస్వామిని ప్రార్థిస్తాడు.  రాజుకు చెల్లించే ధనం ఇప్పించాలని కోరుకుంటాడు. వరదుడు కలలో కనిపించికాంచీ నగరంలో ఒక నిధి దొరుకుతుందని తీసుకోమని సూచిస్తాడు. కంచిలో ఆ విధంగా దొరికిని ఆ నిధిని తెచ్చిరాజుకుచెల్లిస్తాడు. రాజు తీసుకోడు. భాగవతాపచారం అని భావించి మీరే తీసుకోండి భాగవత సేవకు వినియోగించండి అని తిరిగి ఇచ్చేస్తాడు. అది మళ్లీ భాగవతుల తదీయారాధన కొనసాగుతుంది. కాని కొన్నాళ్లకు అదీ తరిగిపోతుంది. భార్య విధించిన షరతు ఏడాదిపాటే అయినా ఈ మంచి పని కొనసాగించాలనే అనుకుంటాడు పరకాలుడు. అతి త్వరగా పెద్ద ఎత్తున ధనం సంపాదించడం సాధ్యం కాదు కనుక దొంగతనాలుచేయడమే సరైన మార్గమని నిర్ణయించుకుంటాడు. మొత్తానికి పాలకుడి వృత్తినుంచి దొంగతనాలకు మళ్లుతాడు ఈ వైష్ణవుడు. ఇటలీలో రాబిన్ హుడ్ వలె సంపన్నులను దోచి పేదలకు పెట్టినట్టు, తదీయారాధనకు ఆలయ నిర్మాణాలకు సొమ్ము ఖర్చుచేస్తూ ఉండేవాడు. శ్రీ వైష్ణవుల ఇళ్లు తప్ప, మిగిలిన సంపన్నుల ఇళ్లలో చౌర్యం కొనసాగిస్తూ ఉంటాడు. నమ్మిన నలుగురు అనుచరులు సాయంచేస్తుంటారు. తాళాలుతెరవడంలో వీరు నిపుణులు. ఇళ్ల దోపిడీ తోపాలు  అడవుల్లో దారి కాచి బాటసారులను దోచుకోవడానికి వీరు రోజూ వెళుతుంటారు. తిరుమంగై యాత్రలుచేస్తూ కావేరీ తీరాన రంగనాథుని దేవాలయం శిథిలమై ఉండడం గమనించి బాధపడతాడు. తరువాత చేసే దొంగతనాల్లో వచ్చిన డబ్బుతో ఆలయ పునర్నిర్మాణం చేయాలని, ప్రాకారాలు నిర్మించాలని సంకల్పిస్తాడు. ఆవిధంగానే దొంగతనాలతో సాధించిన ఆలయాన్ని వైభవంగా నిర్మిస్తాడు. ఈ రోజు కనిపించే ప్రాకారాలు గోపురాలు (ఇటీవల నిర్మించిన పెద్ద గాలిగోపురం తప్ప) ఆయనే నిర్మించారని అంటారు. పరకాలుడి భక్తికి ఇది పరాకాష్ట. వైష్ణవంకోసం ఆలయంకోసం భాగవతుల ఆరాధన కోసం దొంగతనాలు చేయడం ఏమాత్రం తప్పుకాదని ఆయన గట్టిగా నమ్మినవాడు.

ఒక రోజు వంటినిండా నగలు ధరించి కొత్త వధూవరులు అడవి దారిలో రావడం చూసి, చాలా సంతోషిస్తాడు. మొత్తం ఆభరణాలన్నీ ఇచ్చేయమని భయపెడితే వారు ఇచ్చేస్తారు. కాలి వేలికిఉన్న చిన్న బంగారు వస్తువు మాత్రం ఎంతకూ రావడం లేదు. వరుడు దాన్ని వదిలేయవచ్చు కదా అంటాడు. తదీయారాధనలో ఒక పూట పత్రములు కొనడానికి సరిపోతుంది. ఎందుకు వదలాలి? అని ఆయన కాలి ఆభరణాన్ని నోటిపళ్లతో తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ వచ్చిన వారు లక్ష్మీనారాయణులు. దైవస్పర్శతో పరకాలుడిలో భక్తి పొంగుతుంది. తిరువడి అంటే పాదాలను చుంబించడం అంటే శరణాగతి అని పరమాత్ముడు పరిగణించి అతనిని కరుణిస్తాడు. పరకాలుడు స్వామిని స్తుతిస్తాడు. నీవు కలివైరివి అని విష్ణువు కొత్తపేరు ప్రసాదిస్తాడు. అంటే కలి దుష్ట లక్షణాలకు ఆయన శత్రువు అని అర్థం. ఆ తరువాత తానే ఆయనకు తిరుమంత్రాన్ని ఉపదేశిస్తారు.శ్రీరంగానికి రమ్మని తీసుకువెళ్తారు. ఇది ఆయన జీవితంలో ఒక అపూర్వమైన మలుపు. శైవం నుంచి భార్యకోసం వైష్ణవంలోకి మళ్లి, పాలకుడినుంచి, అన్నదానాలకోసం దొంగగామారి, హరి ఉపదేశంతో భక్తుడుగా మారతాడు. అప్పడినుంచి ఆయనకు అపరిమితమైన జ్ఞాన సంపద సమకూరింది. అపరిమిత మైన భక్తి వల్ల ఆయన తిరుమంగై ఆళ్వార్ అయినారు. అద్భుతమైన కవి గా వెలిగారు. మొత్తం ఆరు దివ్యప్రబంధాలు రచించారు. నాలాయిరంలో 1361 పాశురాలను సమకూర్చి, అందరు ఆళ్వారుల కన్న ఎక్కువ పాశురాలు రచించిన కవిగా చరిత్రలో నిలిచారు. ఈ ఆరింటిని వేద, వేదాంగాలుగా భావిస్తారు. తమిళ వేదంగా సన్మానిస్తారు. వారి రచనల్లో విశేషమైంది పెరియ తిరుమొళి (1084 పాశురాల తో కూడినది). తిరునెడుంతండకం (30 పాశురాలు), తిరుకురుతండకం (20) తిరువెలక్కుటరుక్కై (47 పాదాల సుదీర్ఘ కవిత), సిరియ తిరుమదల్ (155 పాదాలు), పెరియ తిరుమదల్ (297 పాదాలు) ఆయన ఇతర రచనలు.

ఎందరో పండితులను వాద ప్రతివాదాలలో ఓడించారు. ఒక వాదనలోఓడిపోయిన జ్ఞాన సంబంధర్ వీరికి తనచేతిలోని వేల్ అనే ఆయుధాన్ని సమర్పించారని ప్రతీతి. శ్రీరంగని ఆజ్ఞ మేరకు శ్రీరంగంలోనే చాలాకాలం నివసించి, 105 ఏట పరమపదించారు.

గురుపరంపరకు వందనం ఈ పాశురాలు

16 వ పాశురం నాయగనాయ్ లో కోయిల్ కాప్పానే మాట (కోవెల కాపాడే) విష్వక్సేనుడికి సరిపోతుంది. కనుక శ్రీమతే విష్వక్సేనాయనమః అని, 18వ పాశురంలో అమ్మవారి వైభవం చెప్పారు కనుక శ్రియై నమః అనీ, ముప్పత్తు మూవర్ పాశురంలో స్వామి వైభవం వివరించారు కనుక శ్రీధరాయనమః అనీ చెప్పుకోవాలి. ఆ విధంగా తిరుప్పావై ద్వారా గురుపరంపరానుసంధానం పూర్తవుతున్నదని శ్రీ కందాడై రామానుజాచార్య అంతరార్ధాన్ని అద్భుతంగా వివరించారు.

వేదాలను తెలుగులో వివరించిన వేదవిదుడు దాశరథి రంగాచార్య తన మానస తిరుప్పావై లో ఈ విధంగాచెప్పారు. తిరుప్పావైలో తొలి అయిదు పాశురాలు ప్రస్తావన వంటివి, ఆరునుంచి 15 వరకు గోపికలను ఆళ్వారులను జాగృతం చేసేవి. తొలి అయిదు పద్యాలు మాణిక్యాలు, తిరుప్పావై మహాకావ్యానికి అవి పంచ ప్రాణాలు. మొదటి పాశురంలో వెన్నెల అందచందాలు, కారు మేఘము వంటి శ్రీ కృష్ణుని కరుణా దృష్టి మనసును మురిపిస్తాయి. రెండో పాశురంలో వ్రత నియమాలుంటాయి, శెయ్యాదన శెయ్యోం అంటే చేయకూడనివి చేయబోమని వాగ్దానం చేయిస్తాయి. మూడోది ఆశీర్వచనం, వేదసూక్తమంత అందంగా ఉంటుంది. నాలుగోది వర్ష సూక్తం. వేదంనుంచి దిగివచ్చినట్టుంటుంది. అయిదో పాశురంలో స్వామిని ఆశ్రయించే విధానాన్ని వివరిస్తుంది తల్లి. ఇక ఆరునుంచి 15 దాకా జాగృతి పాశురాలు.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles