Sunday, September 15, 2024

ఉద్యోగ రంగంలో అన్యాయాలపై సుదీర్ఘ పోరాటాలు

తెలంగాణ ప్రాంతీయులకు ఉద్యోగ రంగంలో దశాబ్దాలుగా జరిగిన అన్యాయాన్ని సవరించి చక్క దిద్దేందుకు నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 610 జీఓ జారీ చేసిన రోజు డిసెంబర్ 30. తెలంగాణ స్థానికులకు జరిగిన అన్యాయం ఏమిటి? అది ఎలా జరిగింది? సవరింపులు, చక్కదిద్దడాలు జరిగాయా? ముల్కి నిబంధనలు, ఆరు సూత్రాల పథకం, పెద్దమనుషుల ఒప్పందం, రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 ఉత్తర్వులు, గిర్గ్లానీ నివేదికలు, తెలంగాణ వాసులకు జరిగిన అన్యాయాన్ని నిలువరించ లేక పోయాయి. ఇందుకు సంబంధించి 610 ఉత్తర్వుల జారీ పూర్వాపరాల గురించి తెలిపే ప్రయత్నం ఇది.

ముల్కీ నిబంధనల పూర్వాపరాలు

ఆంగ్ల భాష రాదన్న సాకుతో,  నిజాం పాలనలో ఉత్తరాది వారికే ఉద్యోగాలు అధికంగా దక్కగా, చాలాకాలం అనంతరం ఉవ్వెత్తున లేచిన ఉద్యమ ఫలితంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1919లో ప్రవేశ పెట్టిన ముల్కీ నిబంధనల ప్రకారం తెలంగాణలోని ఉద్యోగాలన్నీ స్థానికులకే చెందాల్సి ఉండెను. దీని ప్రకారం 15 సంవత్సరాల కనీస నివాస యోగ్యతగా స్థానికత్వ నిర్ధారణ జరగాల్సి ఉండెడిది. అంతేకాక ఉద్యోగ విమణ తర్వాత కూడా తెలంగాణలోనే ఉండాలనే షర్తులు విధించ బడినాయి. తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగం పొందటానికి నివాస నిబంధన 12 సంవతరాలు ఉండాలని సవరించి, నిర్ణయించ బడింది. 1973 సెప్టెంబర్ 23న జారీ అయిన ఆరు సూత్రాల పథకంలో భాగంగా 1975 అక్టోబర్ 18న రాష్ట్రపతి ఉత్త ర్వులు 674 (ప్రెసిడెన్షియల్ ఆర్డర్) జారీ అయి రాష్ట్రాన్ని 1,2,3 కోస్తాంధ్ర, 4 రాయలసీమ మరియు 5,6 తెలంగాణ జోన్లుగా విభజించారు.

ఇది చదవండి:తెలంగాణలో ఉద్యోగ నియామకాలు సక్రమంగా సాగేనా?

కొన్ని మినహాయింపులు

ఈ ఉత్తర్వులోని పేరా 14 ప్రకారం కొన్నింటిని స్థానిక రిజర్వేషన్ల పరిధి నుండి తప్పించడం జరిగింది. హైదరాబాద్ లోని మినహాయించిన ఆఫీసులకు కాకుండా మిగిలిన అన్ని ప్రభుత్వ ఆఫీసులలో లోకల్ రిజర్వేషన్ పాటించాల్సిందని పేరా 20 సూచించింది. అలాగే పేరా 9 ప్రకారం 10వ తరగతి నుండి కింది స్థాయి 4వ తరగతి వరకు చదివిన విద్యా సంస్థ జిల్లా పరిధిగా, ఆ జిల్లాలో సంవత్సరాలు చదువును స్థానికంగా వివరించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లాస్థాయి కేడర్లలో 80%, జోనల్  స్థాయిలో 60% స్థానికులకు ఉద్యోగాలు రిజర్వు చేయ బడినాయి. రిజర్వు చేయబడినవి పోగా మిగిలినవి ఓపెన్ కాంపిటీషన్ ద్వారా భర్తీ చేయాలి. వాటిని స్థానికేతరులకు రిజర్వు చేయరాదని ఉత్తర్వులు స్పష్టంగా పేర్కొన్నాయి.

నివాస యోగ్యతార్హత తగ్గింపు

1919 నుండి అమలులోనున్న నివాస యోగ్యతను 15 నుండి12 కు (1958లో) అనంతరం 1975లో నాలుగు సంవత్సరాలకు తగ్గించగా, వివక్షత కొనసాగింది. రాష్ట్రపతి ఉత్తర్వులలో పేర్కొన్న విధంగా జోనల్ వారీ విధానాన్ని సైతం తుంగలో తొక్కి, స్వార్ధమే పరమార్ధంగా పాలన కొనసాగించడం జరిగింది. నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నియమించిన జయభారత్ రెడ్డి, కమలనాథన్, ఉమాపతి తో కూడిన సీనియర్ ఐఎఎస్ అధికారుల త్రిసభ్య కమిటీ, 1975 నుండి 1984 మధ్య కాలంలో జరిగిన ఉద్యోగ నియామకాలను పరిశీలించి సమర్పించిన 36 పేజీల 1981 జూన్ నాటి నివేదికలో, జోన్ల రిజర్వేషన్లకు విరుద్దంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన 1,2,3లకు చెందిన వారు తెలంగాణకు చెందిన 5,6 జోన్లలో 58,986 మంది నిబంధనలకు విరుద్ధంగా నియ మింప బడినట్లు పేర్కొనడం జరిగింది.

ఇది చదవండి:‘టీఎస్ పీఎస్సీని దేశంలో అగ్రస్థానంలో నిలిపాం’

ఎన్టీఆర్ దిద్దుబాటు నిర్ణయం

ఈ నివేదికను పరిశీలించిన నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1985 డిసెంబర్ 30న 610 జీవోను జారీ చేశారు. గత పాలకులు చేసిన తప్పులను దిద్దుకునే క్రమంలో 1986 మార్చి 30కల్లా 610 జీవోను అమలు పరిచి, తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఉద్యోగులందరినీ ఎవరి జోన్లకు వారిని పంపుతామని ఎన్టీఆర్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఎన్టీఆర్ ను గద్దె దింపి, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు,  రిటైర్డ్ ఐఎఎస్ అధికారి గిర్గ్లానీ ఏకసభ్య కమిషన్ ను పునః పరిశీలనకై నియమించగా, నివేదిక సమర్పించిన గిర్గ్లానీ స్థానికేతరులను నిర్ధారించగల సంపూర్ణ సమాచారం పొందకుండానే, సమర్పిత నివేదికలో రాష్ట్రపతి ఉత్తర్వులను 128 పద్దతులలో ఉల్లంఘించడం జరిగిందని వివరించి, వాటిని 18 రకాలుగా వర్గీకరించి, పరిష్కార మార్గాలను సూచించడం జరిగింది. ఉద్యోగ నియామకాలన్నీ జోనల్ నిబంధనలను అనుసరించి జర గాల్సి ఉండగా, జోనల్ ఆఫీసులను రాష్ట్రస్థాయి కార్యాలయాలుగా మార్చి ఇష్టారాజ్యంగా బదిలీలు చేయడం జరిగిందని, ఈ బదిలీలు తప్పని కమిషన్ అభిప్రాయ పడ్డది. గిర్గ్లానీ నివేదిక ప్రకారం సగం మంది స్థానికేతరులు ఉన్నారని స్పష్టం అయింది.

ఇదిలా ఉండగా తెలంగాణ స్వరాష్ట్ర ప్రభుత్వ పాలనలో సదరు అన్యాయానికి ఇకనైనా అడ్డుకట్ట వేసేందుకు చర్యకు తీసుకోవాలని నిర్ణయించారు. కొన్ని శాఖల సమాచారం పొంది, కొందరిని పంపించి వేశారు. ఇక ప్రస్తుతం చేపట్టాల్సిన చర్యల గురించి,  ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసి నేతలు కారెం రవీందర్ రెడ్డి అధ్యక్షతన సమావేశమై, పలు అంశాలను ప్రతిపాదించారు.

స్థానికత అర్హతలో మార్పు

 నాటి ఉప ముఖ్యమంత్రి కడియం కమిటీ సూచించిన విధంగా స్థానికతను,  1నుండి 7వ తరగతి వరకు పరిగణలోనికి తీసుకోకుండా, రాష్ట్రంలో 4 నుండి 12వ తరగతి వరకు వరుసగా 7ఏళ్ళ పాటు చదివిన వారినే స్థానికులుగా గుర్తించాలని నిర్ణయించారు. విద్యార్థులు స్థానికేతరంగా చదివితే, వారి తల్లిదండ్రుల స్థానికతనే పరిగణించాలని పేర్కొ న్నారు. జిల్లా, జోనల్, రాష్ట్ర కేడర్లకు 80:20 నిష్పత్తిని స్థానిక, స్థానికేతరులకు వర్తింప చేయాలని, కొత్త నియామకాలలో 70శాతం పదోన్నతుల ద్వారా, 80శాతం నేరుగా చేపట్టాలని నిర్ణయించారు. తెలంగాణలోని జిల్లా, జోనల్, రాష్ట్ర కేడర్ల 3లక్షల పోస్టుల వివరాలను పేర్కొంటూ, జూనియర్ అసిస్టెంట్, క్రింది స్థాయి జిల్లా స్థాయికి, ఎస్టీటీ, స్కూల్ అసి స్టెంట్లు జిల్లా స్థాయిలో, గజిటెడ్ హెచ్ఎంలు ఎంజీలు జోనల్ లో, ఉప విద్యాధికారులు బహుళ జోన్లో, అపైన రాష్ట్ర స్థాయిలో ఉండాలని సూచించారు. సదరు తీర్మానాల అంశాలను నాటి సిఎస్ జోషికి సమర్పించారు.

ఇది చదవండి: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ శుభవార్త

స్థానికతపై సముచిత నిర్ణయం తీసుకోవాలి

సిఎం కేసిఆర్ నిర్ణయానుసారం 31 జిల్లాలను 7జోన్లు, 2మల్టీజోన్లను ఖరారు చేసి, రాష్ట్రపతి ఆమోదం పొందే కృషి జరగగా, అనంతరం రెండు జిల్లాలను అదనంగా పెంచిన క్రమంలో, మళ్లీ జోన్ల మార్పుతో రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంది. అయితే పాత 10 జిల్లాల ప్రాతిపదికనే పోస్టుల భర్తీ పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. చోటు చేసుకున్న అసమానతలను సమూలంగా రూపు మాపుతూ, ఉద్యోగ, పదోన్నతుల విషయంలో సమ న్యాయం పాటించేందుకు కేసిఆర్ నేతృత్వం లోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో స్థానికత అంశం కీలకం కానున్నది. ఈ క్రమంలో, కోరి కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో గత పొరపాట్లు పునరావృతం కాకుండా, స్థానికత గురించి, తగు జాగ్రత్తలు తీసుకుని, స్ధానిక అంశానికి న్యాయం చేకూర్చాల్సిన అవసరం అనివార్యంగా ఉంది.

(డిసెంబర్ 30…610 జీఓ జారీ అయిన రోజు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles