Friday, September 20, 2024

గాంధీని నమస్కారంతో సరిపెడతారా?

  • గాంధీ జయంతి వచ్చింది, పోయింది
  • ఫొటోలకు దండలు వేయడమే, ఉపన్యాసాలు లేవు, ఉద్బోధలు లేవు

గాంధీ జయంతి వచ్చింది. వెళ్ళిపోయింది. అన్ని పార్టీల నాయకులూ తమ తమ కార్యాలయాలలో గాంధీజీ, లాల్ బహద్దూర్ శాస్త్రీజీ ఫొటోలకు దండలు వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీ వరకూ గాంధీకీ, శాస్త్రికీ అంజలి ఘటించారు. అంతవరకే పరిమితం చేశారు. ఎక్కడా సెమినార్ కానీ, బహిరంగ సభకానీ, ఉపన్యాసాలు కానీ జరిగిన జాడ లేదు. గాంధీ జీవితాన్ని కొత్త తరాలకు పరిచయం చేసే కార్యక్రమం లేదు. గాంధీ బోధనలకు గుర్తు చేసే ప్రయత్నం లేదు. గాంధీ పుట్టిన రోజునే లాల్ బహద్దూర్ శాస్త్రి అనే మాజీ ప్రధాని కూడా జన్మించాడు. ఆయన ఇచ్చిన ‘జై జవాన్, జై కిసాన్’ నినాదం నినాదప్రాయంగానే మిగిలిపోయింది. దేశంలో జవాన్లూ, కిసాన్లూ అసంతృప్తితో రగిలిపోతున్నారు.

గాంధీ, అంబేడ్కర్ ఇద్దరూ ఈ దేశానికి ముఖ్యులనీ, ఇద్దరి సందేశాలూ స్వీకరించి జాతి ముందుకు నడవాలని సఫాయి కార్మికుల ఉద్యమ నాయకుడు బెజవాడ్ విల్సన్ ‘ది హిందూ’ ఆదివారం (అక్టోబర్ 2) అనుబంధంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. గాంధీతో పోల్చితే ఈ రోజున అంబేడ్కర్ కు ప్రాసంగికత ఎక్కువ ఉన్నది. అంబేడ్కర్ జయంతి, వర్థంతులను ఘనంగా, మనస్పూర్తిగా నిర్వహించే సంఘాలు దేశవ్యాప్తంగా అనేకం ఉన్నాయి. మంచిదే. అంబేడ్కర్ ను స్మరించుకోవలసిందే. ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్ని ఆరాధించవలసిందే. దాని స్ఫూర్తిని ఆచరించవలసిందే.

Also read: మహాత్మాగాంధీ ప్రస్థానం 

గాంధీ చెప్పిన సత్యం, అహింస, సర్వమత సమానత్వం అనే విలువలను సైతం గుర్తు పెట్టుకోవాలి. వాటిని నిత్యం స్మరించుకోవాలి. ముఖ్యంగా గాంధీ జయంతి, వర్థంతులు వచ్చినప్పుడు ఆయన జీవితాన్నీ, ఆయన పాటించిన విలువలనూ స్మరించుకోవాలి. రాముడూ, రహీమూ  ఒక్కరే అనీ, అన్ని మతాలు ఉపదేశిస్తున్నది సహజీవనమేననీ, శాంతి సౌభ్రాతృత్వమేననీ, అదే ఈ దేశానికి శరణ్యమనీ ఆయన చేసిన బోధనలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి. మతం పేరుతో సమాజాన్ని చీల్చే ప్రయత్నం జరుగుతున్న నేటి కాలంలో గాంధీబోధనల ప్రాసంగికత చాలా ఉన్నదని గుర్తించాలి. హిందూ, ముస్లిం ఐక్యతకోసం తన ప్రాణాలు తృణప్రాయంగా ఎంచి త్యాగం చేసిన గాంధీని మరచిపోతే ఈ జాతికి నిష్కృతి ఉండదు. గాంధీ నాయకత్వంలో సాధించిన స్వాతంత్ర్య ఫలాలను ఆరగిస్తూ, రాజకీయాలలో రాణిస్తూ, పదవులు అనుభవిస్తూ గాంధీనే విస్మరించే నాయకులు ఈ దేశాన్ని ఏం ఉద్ధరిస్తారు?

దేశంలో ధనికులకూ, పేదలకూ మధ్య వ్యత్యాసం పెరిగి అగాధంగా మారుతోంది. కులమత ద్వేషాలు పెచ్చరిల్లుతున్నాయి. మహిళలపైన అత్యాచారాలు పెరుగుతున్నాయి. దళితులపైన దాడులూ, అత్యాచారాలు లెక్కలేకుండా జరుగుతూనే ఉన్నాయి. గిరిజనుల స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను హరిస్తున్నాము. ఖనిజాల తవ్వకానికి బడా పారిశ్రామికవేత్తలకు అటవీ భూములను దఖలు పరిచేందుకు ఆదివాసీలను అడవులనుంచి తరిమివేయడం నిత్యకృత్యంగా మారింది. ఒన్ ఆఫ్ సెవెంటీ చట్టం నామమాత్రంగా, నిస్సహాయ సాక్షిగా మిగిలిపోయింది. ప్రభుత్వాలు చేసే చట్టాలను ప్రభుత్వాలే ఉల్లంఘిస్తున్నాయి. కులం, ధనం సమాజాన్ని శాసిస్తున్న రోజులు ఇవి. ముస్లింల పరాయీకరణ ఒక పద్ధతి ప్రకారం జరుగుతోంది. ‘ఈశ్వర్, అల్లా తేరో నామ్’ అంటూ ఆలపించి, గాడ్సే పేల్చిన తూటాలు గుండెల్లో దిగుతుండగా ‘హేరామ్’ అంటూ అంతిమ శ్వాస విడిచిన గాంధీని తిరిగి ప్రతిష్ఠించుకోవలసిన సమయం ఇది. అది చేయకపోగా గాడ్సేకి గుడి కట్టాలనే తరం బయలు దేరింది. అటు గాంధీనీ, ఇటు అంబేడ్కర్ నీ స్మరించుకుంటూ, వారు చూపిన అడుగుజాడలలో నడుస్తూ జాతి పురోగమించాలి.

ఎన్నికల రంధిలో పడి అన్ని పార్టీలు గాంధీకి నామమాత్రంగా నమస్కారం ఒకటి పారేసి తమ కుట్రలూ, కుహకాలలో మునిగి తేలుతున్నాయి. డబ్బులు పెట్టి ఓట్లు కొనుగోలు చేసే ప్రక్రియపట్ల విశ్వాసం పెంచుకున్నాయి. కులంపేరుతో, మతం పేరుతో ఎన్నికలలో గెలుపొందడమే పరమావధిగా రాజకీయాలు మారాయి. సేవాతత్పరత అడుగంటుతోంది. సమసమాజనిర్మాణం నినాదంగా కూడా వినిపించడం లేదు. ఎవరికి అందింది వారు దోచుకోవడమే, సంపన్నుల అడుగులకు మగుడులు ఒత్తడమే పాలకులు అనుసరిస్తున్న నీతి.  రాజకీయాలు భ్రష్టుపట్టాయి. ఈ దేశాన్ని ఇప్పటికీ రక్షించగలిగిన మహానుభావులు ఇద్దరే ఇద్దరు. ఒకరు గాంధీ, మరొకరు అంబేడ్కర్. ఒకరు నైతికశక్తి, మరొకరు సామాజిక, రాజ్యాంగశక్తి. ఇద్దరినీ గుండెలలో నింపుకొని దేశ ప్రజలు పురోగతి సాధించాలి.  దేశాన్ని విభజించి పాలించాలనే కుట్రలను ఓడించేందుకు జాతి యావత్తూ సమరశంఖం పూరించాల్సిన సమయం ఇది.

Also read: గాంధీమార్గమే శరణ్యం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles