Saturday, April 27, 2024

అహింసాజ్యోతి

కణకణ చెంప దెబ్బకు సఖా! తన రెండవ చెంపనిచ్చుటే

రణము! విదేశ వస్తువులు రాష్ట్రమునుండి బహిష్కరించుటే

రణము!  సముద్ర సైకతములన్ జనసైనికు లుప్పు తీయుటే

రణము! కసాయి చట్టములు ప్రాణము లొడ్డుచు ధిక్కరించుటే

రణము!

*

స్వతంత్ర వీరులు స్వరాజ్య పథమ్మున జైళ్ళకేగుటే

రణము! తుపాకీ గొట్టముల రక్కసి సేనకు గుండెలిచ్చుటే

రణము! ప్రసన్నమైత్రిని పరాజిత జాతిని సాగనంపుటే

రణము! రామనామమున రక్తము చిందుచు రాలిపోవుటే

ఘనము!

*

గ్రహింపు మియ్యవియె

గాంధిపథమ్మున

కర్మసూత్రముల్!”

*

కలు సేవింపకు, దేహనాశనము! భూగర్భంబు నిర్జించి రూ

కల నార్జింపకు, సృష్టి నాశనమగున్! కాంతామణుల్ లోక మా

తలు, వేధింపకు మాత్మనాశము! నిశీధంబయ్యు నిర్భీతితో,

లలనల్ వీధిని సంచరించిననె స్వారాజ్యంబు నా జాతికిన్!”

*

మొలపై గోచియె తప్ప లేదు కద బాపూ! నీకు, కుట్టింతు దు

స్తులు గైకొమ్మని” బాలుడొక్కడ

మహాత్మాగాంధీ జీవితాన్ని మలుపు త్రిప్పిన కొన్ని  సంఘటనలున్నవి.

దక్షిణ ఆఫ్రికా నుండి స్వదేశానికి తిరిగివచ్చిన తొలిరోజుల్లో ఒకసారి గాంధీజీ దక్షిణభారతదేశాన్ని రైలు మార్గంలో పర్యటిస్తున్నాడు. రైలొకచోట కృష్ణానది వంతెనపై నిరవధికంగా ఆగింది. ఆయన తన బట్టలను ఉతుక్కోవడానికై  నది గట్టుకు విచ్చేసినాడు. అక్కడ ఆయనకొక పేదరాలు కనపడింది. ఆమె నదిలో స్నానంచేసి కట్టుకున్న తడిచీరను గట్టుపై ఆరవేసింది. వేరే చీరలేక వివస్త్రయై ఒక చెట్టు చాటున శరీరాన్ని దాచుకొంటూ, చీర ఆరడం కోసం ప్రతీక్షిస్తున్నది. ఈ దృశ్యం చూసి గాంధీజీ మనస్సు చలించి పోయింది. దేశంలో ప్రతి ఒక్క పౌరునికీ కట్టుబట్టలుండే సమయం వచ్చేదాకా మొలకు గోచిగుడ్డ తప్ప తానెటువంటి వస్త్రాలనూ ధరించనని ప్రతిజ్ఞ తీసుకున్నాడు. కట్టుకున్న బట్టలన్నీ విప్పేసి కేవలం గోచిగుడ్డతో రైలుబండిని ఎక్కినాడు.

గాంధీజీ ఆలోచనలను, జీవితాన్ని ప్రభావితం చేసిన పుస్తకాల్లో జాన్ రస్కిన్ రచించిన “అన్ టు దట్ లాస్ట్” ఒకటి. జీవితంలో మానవత్వం, భూతదయ, నిరాడంబరత్వం ఎంత ఉత్కృష్టమైనవో ఆ పుస్తకం తెలుపుతుంది. ఆయనను ప్రబావితం చేసిన మరొక పుస్తకం టాల్ స్టాయ్ రచించిన “ది కింగ్ డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ దీ” అనే మకుటం కలది. భగవంతుడు మనిషి హృదయం లోనే ఉన్నాడనీ,  తన సాటి మానవుల పట్ల సానుభూతి, నైతికవర్తన ద్వారా మాత్రమే మనిషి పరమాత్ముణ్ణి చేరుకుంటాడనీ ఆ పుస్తకం సారాంశం. చర్చిలకు, దేవళాలకు, మసీదులకు పోయి ప్రార్థన చేయడంచే ఒరిగేదేమీ లేదని, మానవసేవయే మాధవసేవ అనీ ఆ పుస్తకం బోధిస్తుంది.

Also read: బాల జ్ఞాని

బాపూను ప్రభావితం చేసిన మరొక రచయిత హెన్రీ డేవిడ్ ధోరూ. ఆయన రచనల నుండే గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాల మౌలిక సూత్రాలను నేర్చుకున్నాడు. అసహాయులైన ప్రజలు కసాయి పాలకులపై సాయుధపోరాటం చేసి లాభంలేదనే సత్యాన్ని ఆయన అవగతం చేసుకున్నాడు. అహింస, సత్యమే, ఆయుధాలుగా ప్రజోద్యమాలు నడపాలని ఆయన తీర్మానించుకున్నాడు. అహింసామూర్తులైన గౌతమబుద్ధుణ్ణి, ఏసుక్రీస్తును, ఆయన ఆదర్శంగా తీసుకున్నాడు.

చిన్ననాట గాంధీజీ జీవితాన్ని ప్రభావితం చేసిన పురాణపురుషులు సత్యహరిశ్చంద్రుడు, శ్రీరామచంద్రుడు. ప్రాణం పోయినా సరే అబధ్ధం చెప్పకూడదని సత్యహరిశ్చంద్రుని గాథ ఆయనకు నేర్పింది. శ్రీరాముని పితృవాక్యపాలన, భ్రాతృప్రేమ, ఏకపత్నీవ్రతము,  ఆదర్శపాలన, ఆయన్ను ఆకర్షించినాయి. “ఒక పత్ని, ఒక బాణం, ఒక మాట” బాపూ ఆదర్శాల్లో ప్రధానమైనవి.

గాంధీజీ జీవితాన్ని మిక్కుటంగా ఆకర్షించినవి గీతాబోధనలు. గీతలో ప్రవచించిన నిష్కామకర్మ యోగసాధనకు గాంధీజీ  జీవితమే ప్రయోగశాల. “గీతాబోధనలు లేకపోతే  నేనెప్పుడో ఆత్మహత్య చేసుకొని ఉండేవాణ్ణి” అంటూ చెప్పుకున్నాడు బాపు.

గాంధీజీపై వందలాది పుస్తకాలు వెలువడినాయి. వాటిల్లో ప్రధానమైన ఒక గ్రంధం ఎరిక్ హెచ్ ఎరిక్ సన్ రచించిన గాంధీ జీవితగాథ. మనోధర్మవేత్త ఐన ఎరిక్ సన్ గాంధీ జీవితాన్ని అమితంగా ప్రభావితం చేసిన మహిళ ఆయన తల్లి పుత్లీబాయ్ అని ఆ పుస్తకంలో పేర్కొన్నాడు. గాంధీజీ చిన్నతనంలో ఆయన తల్లి ఏన్నో ఉపవాసదీక్షలు చేసేది. ఆ దీక్ష కొన్నిసార్లు రోజుల తరబడి కోనసాగేది. అచంచలమైన గాంధీ పట్టుదలకు ఆయన దృఢ సంకల్పానికి, ఆయన ఆమరణ నిరాహారదీక్షలకు, తల్లియే కారకురాలంటాడు ఎరెక్ సన్.

గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాలకు మొట్టమొదటి ప్రయోగశాల దక్షణ ఆఫ్రికా. ద్వితీయ ప్రయోగశాల భారతదేశం. అహింస, సత్యము, బాపూజీ దైవసమానంగా భావించేవాడు. “ఒకప్పుడు భగవంతుడే సత్యం అని భావించేవాణ్ణి.  ఇప్పుడు సత్యమే భగవంతుడని భావిస్తున్నాను” అన్నాడాయన.

Also read మా బడి పంతులమ్మ

గాంధిజీ తన గురువుగా భావించి, గౌరవించిన వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే. చిత్రమేమిటంటే డాక్టర్ అంబేద్కర్ కూడా గోఖలేనే గురుతుల్యునిగా భావించేవాడు. గోఖలే నైతిక దృక్పథం, ఆయన దేశభక్తి, రాజ్యాంగబద్ధమైన ఆయన పోరాట సూత్రాలు, మతాతీతమైన ఆయన లౌకికవాదం, ఆయన మానవతావాదం, అటు గాంధీజీని, ఇటు అంబేద్కర్ ను  సమానంగా ఆకట్టుకున్నాయి.

గాంధీ జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఒక సమావేశంలో ఆయన ప్రసంగిస్తున్నాడు. సంపన్న కుటుంబానికి చెందిన ఒక బాలుడు ఆ సభలో ఉన్నాడు. చాలీచాలని బట్టలతో గాంధీజీ వేదికపై ప్రసంగించడం చూసిన ఆ బాలునికి జాలి వేసింది. నేరుగా వేదికనెక్కి గాంధీజీతో అన్నాడు:”బాపూ! నీకు బట్టలు లేవా? నేను మంచివి కుట్టించి యిస్తాను.” జవాబుగా గాంధీజీ అన్నాడు: “బాబూ! మా ఇంట్లో నాతో బాటు సరియైన కట్టుబట్టలు లేని నా అన్నదమ్ములున్నారు. వారందరికీ బట్టలు కుట్టించి ఇస్తావా?”. బాలుడు సమాధానంగా “ఎంతమంది ఉన్నారో చెప్పు. అందరికీ ఇస్తాను” అన్నాడు. బాపూ అన్నాడు: “పసివాడా! ఈ దేశంలో ఉండే ముప్ఫై కోట్లమంది దీనప్రజలు నా అన్నదమ్ములే. వారందరికీ వస్త్రదానం చెయ్యి!”. ఆ అమాయక బాలుడు నిరత్తరుడైనాడు. ఈ సంఘటనను పై కవితలో పేర్కొన్నాను.

1969లో గాంధీజీ శతజయంతి ఉత్సవాలు దేశంలో వైభవోపేతంగా జరిగినాయి. ఆ సందర్బంలో ఆయన్ను గూర్చి దేశవిదేశాల రచయితలు రచించిన పలు వ్యాసాలు వెలువడినాయి. అప్పుడు నేను కళాశాలలో చదువుతున్నాను  నేనా రోజుల్లో చదివిన ఒక వ్యాసంలో రచయిత ఇట్లా  పేర్కొన్నాడు: “వేలాది ఏండ్ల క్రిందట లుంభిని వనంలో ఒక శిశువు జన్మించినాడు. వందల ఏండ్ల తర్వాత మరొక శిశువు జెరుసలేమ్ లో పురుడు పోసుకున్నాడు.  నేటికి వంద ఏండ్ల క్రింద పోరుబందర్ లో మరొక్కశిశువు కళ్ళు తెరచినాడు. కోట్లాదిమంది బాలబాలికలు, అనునిత్యము, ఏటేటా, జన్మిస్తూనే వున్నారు. మరి ఈ ముగ్గురు శిశువులను మనమెందుకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వీరినే ఎందుకు ఆరాధిస్తున్నాం? వీరినే ఎందుకోసం అవతార పురుషులుగా భావిస్తున్నాం? ఈ ముగ్గురు బిడ్డలూ అహింసామూర్తులే. వీరు ముగ్గురూ మానవత్వానికి ప్రతిరూపాలు. వీరు ముగ్గురూ దుఃఖిత మానవకోటికై తమ జీవితసుమాలను ధారపోసినవారే. వీరిలో మొదటివారు రాజభోగాలను త్యజించి, బోధివృక్షచ్ఛాయల్లో నిర్వాణం చెందిన గౌతమబుద్ధుడు. వీరిలో మరొకరు  మానవత్వాన్ని, క్షమను, అహింసను బోధించి, శిలువనెక్కిన ఏసుక్రీస్తు. చివరివారు అహింసామూర్తియైన మహాత్మాగాంధీ. ఆయన కూడా తాను నమ్మిన విశ్వాసాలకై ఆత్మబలిదానం చేసినవాడే. వేర్వేరు దేశాల్లో, వేర్వేరు కాలాల్లో పుట్టినా, వీరంతా ఏకగర్భులే.

ఈ విషయం సైతం పై ఖండికలోని చివరిపద్యంలో చోటు చేసుకున్నది.

Also read: ఆంధ్ర కేసరి

గాంధీజీ జీవితచరిత్రల్లో డిజీ టెండూల్కర్ రచించిన “మహాత్మా” అనే పలు సంపుటాల గ్రంధం కడు సమగ్రమైనది. 1951 లో ప్రచురితమైన ఆ గ్రంధం అనేక సంవత్సరాల శ్రమఫలితం. ఆ గ్రంధానికి ముందుమాట రచించిన వాడు జవహర్ లాల్ నెహ్రూ. కడుంగడు మనోహరమైన ఆ ముందుమాట చివరలో నెహ్రూ ఇట్లా అంటాడు: “”His (Gandhiji’s) eyes were often full of laughter and yet were full of infinite sadness.” ఈ పంక్తిని సైతం నా చిట్టచివరి పద్యంలో వాడుకున్నాను.

నెహ్రూజీ ముందుమాటలోని ఆ పేరా ఆసాంతం చదవండి:

“People will write the life of Gandhi and they will discuss and criticize him and his theories and activities. But to some of us he will remain something apart from theory – a radiant and beloved figure who ennobled and gave some significance to our petty lives, and whose passing away has left us with a feeling of emptiness and loneliness. Many pictures rise in my mind of this man, whose eyes were often full of laughter and yet were full of infinite sadness.  But the picture that is dominant and most significant is as I saw him marching, staff in hand, to Dandi, on the Salt March in 1930. Here was a pilgrim on his quest of truth, quiet, peaceful, determined and fearless, and who would continue that quest and pilgrimage, regardless of consequences.”

సహాయనిరాకరణోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో చౌరీచౌరాలో హింసాత్మక సంఘటనలు చెలరేగినవి. దీనితో అహింసా సిద్ధాంతాలకు కట్టుబడిన గాంధీ తన ఉద్యమాన్ని ఉపసంహరించుకున్నాడు. ఆ సందర్భంగా వాన్ గార్డ్ అనే పత్రికలో శాంతిదేవి అనే మారు పేరుతో రాయ్ వ్యాసం ప్రచురితమైంది. ఆ వ్యాసం ఇట్లా సాగింది:

“ఈయనది ఒంటినిండా బట్టలు లేని బక్కచిక్కిన దేహం. అందులో దృఢచిత్తంతో కూడిన ఆలోచనలదే పైచేయి. భయంకరమైన అగాధంలోకి త్రోసివేసినా చెక్కుచెదరని సంకల్పబలం అది. మరతుపాకులైనా సరే ఆ బక్క శరీరాన్ని తుత్తునియలు చేయగలవు గానీ, ఆ మనోబలాన్ని లొంగదీయజాలవు.  ఈ విధమైన దృఢసంకల్పం కలదన్న గుర్తింపుతో బ్రిటిష్ సామ్రాజ్యం సైతం ఆయనకు హాని తలపెట్టజాలదు. ఆరు సంవత్సరాల జైలుశిక్ష ఆయనకు సుఖప్రదంగా ఉండడానికి అన్ని సౌకర్యాలు కలిగిస్తారు. అంతకన్న వారు చేయగలిగింది లేదు. క్రియాశీల రాజకీయరంగం నుండి ఆయనను దూరంగా ఉంచడం కోసమే అదైనా చేస్తారు. తుఫాను సద్దు మణగగానే ఆయనను విడుదల చేస్తారు. ఎందుకంటే గాంధీ అనే ముని కోట్లాదిమంది భాతరీయులకు త్యాగిగా రూపొందుతాడని వారికి అప్పటికే అర్థమై ఉంటుంది. లేదా త్వరలోనే అర్థం చేసుకుంటారు. స్వేచ్ఛగా తిరుగుతున్నప్పటికంటే జైల్లో ఉన్నప్పుడే మహాత్ముడు మరింత శక్తిమంతుడుగా ఉంటాడు.”

Also read: (“స” నిషిద్ధాక్షరి)

“భారతీయ ఉద్యమంపై గాంధీప్రభావాన్ని గూర్చి నిష్పాక్షికమైన ఈ పరిశీలన ముగింపులో రాయకీయవేత్తగా, తత్త్వవేత్తగా, దెశభక్తునిగా, గాంధీకి హృదయపూర్వకంగా నివాళులు అర్పించక తప్పదు. కడగండ్లను అనుభవిస్తున్న తన దేశప్రజలపట్ల ప్రగాఢమైన ప్రేమ కారణంగా పొందిన ఉత్తేజమే గాంధీ రాజకీయ జీవితానికి పునాది అనేది మనందరి విశ్వాసం. ఎత్తుగడలకు సంబంధించి పెద్ద తప్పిదాలు చేసినా సహించేటంత ప్రేమ అది. దాస్యశృంఖలాలనుండి మాతృభూమిని విడుదల చెయ్యాలని, భారతమాత ముద్దుబిడ్డలకు సుఖప్రదమైన జీవితాన్ని కలగజేయాలనే ప్రగాఢవాంఛ ఆయన ప్రతి పలుకులోనూ వ్యక్తమౌతుంటుంది. ప్రభుత్వంపట్ల అయిష్టత రెచ్చకొడుతున్నాడంటూ తనపై మోపిన ఆరోపణలను అంగీకరిస్తూ, తాను నేరం చేశానని ఒప్పుకుంటూ, అందుకు గాను గరిష్టశిక్ష విధించాలని కోరుతూ, భారతప్రభుత్వంపై నిశితమైన విమర్శ చేస్తూ, కోర్టులో గాంధీ తన ప్రకటనను చదివిన దృశ్యానికి మించి చిరస్థాయిగా  నిలిచే సంఘటనలు చరిత్రలో అరుదుగా ఉంటాయి.”

“ఆయన రాజకీయ వైఫల్యాలను అందరూ మరిచిపోయిన తర్వాత కూడా చాలకాలం పాటు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ పేరు చరిత్ర పుటల్లో ఉత్తమ దేశభక్తుడు గానూ, మహాత్ముడు గానూ నిలిచి వుంటుంది.”

(భారత స్వాతంత్ర్య పోరాట చరిత్ర- ఇ ఎమ్ యస్ సంబూద్రిపాద్)

1922 నాటికే గాంధిజీపై ఈ ప్రశంస చేసింది గాంధేయ సిద్ధాంతాలను సదా విమర్శించే ఒక కమ్యూనిస్టు.

తరతరాలుగా సనాతనదేశంలో పీడింపబడిన దళితులపైనా, మహిళాలోకం పైనా బాపూజీకి అపారమైన సానుభూతి ఉండేది. అంటరానితనం ఈ జాతిని వందలాది ఏళ్లుగా పీడించిన జాడ్యంగా ఆయన భావించేవాడు. స్త్రిలను మాతృమూర్తులుగా భావించే దెశంలో మగువలపై అత్యాచారాలను అయన సహించేవాడు కాదు. “ఏ రోజు నా దెశపు మహిళలు అర్ధరాత్రి సైతం నిర్భీతితో వీధుల్లో కాలు మోపుతారో ఆరోజే నా జాతికి నిజమైన స్వాతంత్ర్యం” అన్నాడాయన. ఆయన స్వాతంత్ర్యోద్యమ కాలంలో చేపట్టిన కార్యక్రమాల్లో మహిళా చైతన్యం, హరిజనోద్ధరణ, గ్రామ స్వరాజ్యంలో విడదీయరాని అంశాలు. ఇంగ్లండు దేశంలో మహిళలకు చాలకాలం ఓటుహక్కు లేదు. నల్లరాతి వారికి అమెరికాలో సైతం ఇరవయ్యవ శతాబ్దం దాకా ఓటుహక్కు లేదు. బ్రిటీష్ పాలన చివరి రోజుల్లో ప్రసాదించిన పరిమిత ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు చదువుకున్న వారికి, ఎంతో కొంత ఆస్తి కలిగిన వారికే పరిమితం. స్వాతంత్ర్యం వస్తే ప్రతి ఒక్కరికి జాతి, లింగ, ఆర్థిక స్థాయి భేదాలు లేకుండా ఓటుహక్కు ఇవ్వాలని గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ సంస్థ స్వాతంత్ర్యం రాక పూర్వమే నిర్ఢయం తీసుకున్నది.

గాంధీజీ విప్లవవాది. అధికారం ఆశించినవాడు కాదు. రష్యన్ విప్లవనేత లెనిన్, చైనా విప్లవనేత మావో, వియత్నాం విప్లవనేత హోచిమిన్ అధికార పగ్గాలు చేపడితే, గాంధీజీ ప్రభుత్వానికి దూరంగా వున్నాడు. అవసరమైనప్పుడు, నెహ్రూ, పటేల్ నిర్మయాలను వ్యతిరేకిస్తూ నిరాహారదీక్ష చేపట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయనచే స్ఫూర్తి పొంది ప్రజోద్యమాలు నడిపినవారు ప్రపంచవ్యాప్తంగా వున్నారు – జూలియస్ నయేరిరే, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్-

ప్రపంచంలో అసహాయులైన ప్రజలు నేడు చేబట్టే ప్రజోద్యమాలకు గాంధీజీయే ప్రేరణ. మేరునగధీరుడైన గాంధీ యశస్సు ఆచంద్రతారార్కమైనది.

“Wherever he sat was a temple and wherever he walked was a hallowed ground” అన్నాడు నెహ్రూ గాంధీ గురించి.

ఆయన కూర్చున్న ప్రతి స్థలం దేవాలయం. ఆయన నడచిన ప్రతి చోటూ పుణ్యభూమి.

Also read: జాషువా గబ్బిలం

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles