Thursday, December 8, 2022

హిమయమసీమలు

  • నెలరోజుల్లోనే 78 మంది మృత్యువాత
  • కేదార్ నాథ్ యాత్రికులే 41 మంది

భూతలస్వర్గంగా పిలుచుకొనే హిమసీమలు యమలోకంగా మారుతున్నాయి. భక్తి, సౌందర్యపిపాస, ఆధ్యాత్మిక సాధన దిశగా పయనించే ఎందరికో ఈ ప్రాంతం పరమ ఆకర్షణాస్వరూపం. ముఖ్యంగా ‘చార్ థామ్’ యాత్ర చాలా ప్రసిద్ధం.ప్రతి ఏటా కొన్ని లక్షలమంది భక్తులు వెళ్లివస్తూ ఉంటారు. కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు ఈ యాత్ర నిలిచిపోయింది. మే 3 వ తేదీ నుంచి మళ్ళీ ఆ మహాప్రస్థానం ఆరంభమైంది. గట్టిగా నెలరోజులు కాకముందే 78మంది మృత్యువాతకు బలైపోయారు. వారిలో 41మంది కేదార్ నాథ్ యాత్రికులే కావడం మరో విషాదం. గతంలో సగటున సంవత్సరానికి 100 మంది వరకూ చనిపోయినట్లు సమాచారం. ఈ ఏడు పట్టుమని నెలరోజులలోపే 78మంది మరణించడం దారుణం. వీరిలో ఎక్కువమంది అనారోగ్య కారణాలతోనే వెళ్లిపోయారని స్థానిక వైద్యులు చెబుతున్నారు.’హైపోథెర్నియా’ వ్యాధితో మరణిస్తున్నట్లుగా తెలుస్తోంది. చలి వాతావరణం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్రబలుతుందని వైద్యులు అంటున్నారు.

Also read: ఎన్టీఆర్ కి భారత రత్న ఇప్పుడైనా…

కోవిడ్ వల్ల పెద్ద సంఖ్యలో మరణాలు

చార్ థామ్ యాత్రలో ఈసారి ఇంతపెద్ద సంఖ్యలో మరణాలు నమోదు కావడానికి పలు కారణాలi కనిపిస్తున్నాయి. అందులో ప్రధానమైంది కోవిడ్ ప్రభావం. కోవిడ్ సోకినవారిలో కొందరికి రోగనిరోధకశక్తి బాగా తగ్గిపోయింది.కోవిడ్ అనంతర దుష్ప్రభావాలతో ( సైడ్ ఎఫెక్ట్స్) ఇప్పటికీ చాలామంది బాధపడుతున్నారు. ఎత్తైన హిమాలయ ప్రాంతాల్లో తిరగడం వల్ల గుండె,శ్వాస సంబంధిత ఇబ్బందులు కూడా ఎదురవ్వడం మరో ముఖ్య కారణంగా వైద్య నిపుణులు చెబుతున్నారు.చార్ థామ్ కు వెళ్లే యాత్రికులకు ఆ వాతావరణం కొత్తది కావడం వల్ల దానికి శరీరం అనుకూలంగా సిద్ధమవ్వలేకపోవడం ఇంకో కారణంగా భావిస్తున్నారు.ఏర్పాట్లలోటు కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. యాత్రికులకు పలు జాగ్రత్తలను సూచించినప్పటికీ ఎక్కువమంది వాటిని పాటించకపోవడం మరో కారణంగా చూస్తున్నారు. ఆ వాతావరణానికి తగినట్లుగా దుస్తులు ధరించాలని చెబుతున్నా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తున్నారు. కొందరు యాత్రికులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.  సదుపాయాలను కల్పించడంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వ వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికుల సంఖ్యకు సంబంధించి గతంలో కొన్ని పరిమితులు ఉండేవి. చార్ థామ్ లోని నాలుగు దేవాలయాలకు సంబంధించి రోజుకు 400-1000 మందికి మించి సందర్శించకూడదనే ఆంక్షలు ఉండేవి.2021లో ఉత్తరాఖండ్ హైకోర్టు ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు తీర్పు చెప్పింది. దీనితో అక్కడ వ్యాపార వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరగడానికి ద్వారాలు తెరిచినట్లయింది. ఉత్తరాఖండ్ ను దేవభూమిగా చూస్తారు.పర్యాటకం ప్రధాన ఆదాయ మార్గం. అడుగడుగునా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తూ ఉంటుంది. ‘చార్ థామ్’ అంటే నాలుగు థామాలు అంటే నిలయాలు. దేశంలోని నలు దిక్కుల్లో ఆదిశంకరాచార్యులు నాలుగు దివ్య థామాలను స్థాపించారు. బద్రీనాథ్ -ద్వారక-పూరీ -రామేశ్వరం.ఇవే చార్ థామ్ లు.కానీ,కాలక్రమంలో ఉత్తరాఖండ్ లో ఉండే నాలుగు దేవాలయాలను కలిపి  ‘చార్ థామ్ ‘గా పిలుచుకుంటున్నారు. బధ్రీనాథ్ -కేదార్ నాథ్ -గంగోత్రి -యమునోత్రి అందులో ఉన్నాయి.వీటికి ‘ఛోటా చార్ థామ్’ గా పేరు. అందులో ‘ఛోటా’ ఎగిరిపోయింది.

Also read: ఇతర దేశాలతో పోల్చితే మనం చాలా నయం!

వేలమందికి జీవనాధారం

నేడు చార్ థామ్… అంటే ఈ నాలుగు దేవాలయాలే. లక్షలమంది యాత్రికులు పర్యటించే ఈ ప్రాంతాలపై కొన్ని వేలమంది జీవనం ఆధారపడి ఉంది. వారిలో ఎక్కువమంది చిరువ్యాపారులు, పేదలు.  కోవిడ్ కారణంగానూ, ఆంక్షల వల్ల రెండేళ్ల పాటు వ్యాపారం లేక,ఉద్యోగ ఉపాధులు లేక చార్ థామ్ వాసులు  నరకం అనుభవించారు. ఆంక్షలు ఎత్తివేయడం, మళ్ళీ యాత్రికుల రాకపోకలతో వారి కళ్ళల్లో వెలుగులు ప్రసరిస్తున్నాయి. ఈ మరణాలు ఆ ప్రాంతాలను చీకటిమయం చేస్తున్నాయి. పరమ పవిత్రమైన, చారిత్రాత్మకమైన ‘చార్ థామ్’లో మృత్యుఘంటల మోతలు ఆగిపోవాలి.పర్యాటకం ఊపందుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠమైన ఏర్పాట్లుచేయాలి. పర్యాటకులు జాగ్రత్తలను పాటించాలి,నిపుణుల సూచనలను ఆచరించాలి. ‘చార్ థామ్’ ను స్వర్గథామంగా తీర్చిదిద్దడంలో అందరూ కలిసి సాగాలి.హిమసీమల్లో చల్లని వార్తలు వినాలి.

Also read: ఉన్నత విద్య సార్వజనీనం

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles