Monday, April 29, 2024

దీపావళి వెలుగు జాడలు

అనగనగా ఒక పాత కథ ఇది, ఎప్పుడు తలచుకున్నా చిచ్చుబుడ్డి నుండి వెలుగు జ్ఞాపకాలు తుళ్లుతో రాలే కథ ఇది.

ఈ రాత్రికి టపాసులు కాల్చాలని , టపాసులు కొన్న రోజునుండి ఆ రాతిరి కోసం ఎదురు చూసే అమావాస్య పండగ ఇది. చిక్కని, నల్లని, తారు వంటి రాత్రి కొరకు నేలమీద బోలెడు చందమామ మొహాలు వేసుకుని పిల్లలంతా ఎదురు చూసే వేడుక పండగ ఇది. అంతకు ముందు రోజు వానపడి ఊరంతా చల్లగా, తడిగా ఉంది. కొంచెం మేఘాల కిటికీ తెరుచుకుని సూర్య భగమానులు కాస్త కిందికి చూస్తే చాలు ఆరు బయట నులక మంచం మీద ఎండపెట్టుకున్న టపాసు పచారి కరకరలాడుతాయి. ముసురు మనసు మీద కొంచెం వేడిగా ఊపిరి ఊదాడనుకో ఉష్ణమండల ప్రభువు  చాలు, సంతోషంగా సాయంకాలం పండగ వెలుగుతుంది. సూర్యుడు అచ్చం మా మహబూబ్ బాషా చిన్నాయన మాదిరి వాడు. చూడ్డానికి వేడిగా, గంబీరంగా ఉన్నట్టు ఉంటాడు. కానీ లోపల అంతా కొత్త కుండలో చల్ల నీరు వంటిది మనసు. మూడు వందల అరవై రోజుల్లో ఏ పండగ వచ్చినా అది పిల్లల పండగ అయిఉండాలని ఎప్పుడు మా చిన్నాయన కోరిక. ఆ పండగ రోజున పిల్లల కోసం, వారి ముద్దూ – ముచ్చట కోసమే మన దగ్గర డబ్బు ఉన్నది. కొనడానికి అంగళ్లు ఉన్నవి అని ఆయన అభిప్రాయం . మాది ఉమ్మడి కుటుంబం. మా చిన్నాయన మా పిల్లలు అందరి కోసం సంచులు సంచులుగా లేదా గంపలుగా టపాసులు తెచ్చేవాడు. చీకటి పడగానే మా ఇంటి చిన్నా పెద్దా అంతా కలిసి మొత్తం బాణసంచాని తెగ కాల్చేవాళ్ళు. ఇంటి ముందుకు వచ్చిన బీద పిల్లలందరికి మా జేజి తలా ఇన్ని పంచి పెట్టేది.మా చిన్న చిన్నాయన సలీం అయితే వంకాయ బాంబులు, లచ్మి బాంబులు జేబుల్లో నింపుకుని సిటీబస్ ఎక్కి తాగుతున్న సిగరెట్ తో వత్తితో బాంబు వత్తి ముట్టించి వట్టి చివర కాలేవరకు ఆగి ఆ స్ప్లిట్ సెకండ్లో బాంబు బయట పడేసేవాడు. ఆయన పూర్తిగా మగతనం టైప్. భయం గియం జాంతానై. మా అన్నకూడా మహా పరాక్రమంగానే పెద్ద పెద్ద బాంబులు కాల్చేవాడు. ఇంట్లో పిల్లల ఖాళీ పాలడబ్బాల కింద బాంబు పెట్టి వెలిగించడం గొప్ప సరదాగా ఉండేది. బాంబు ప్రేలుడుకు డబ్బా డమాలున ఎగిరి గాలిలో పిచ్చలు పిచ్చలై దాని బతుకు నిజంగా డబ్బా అయ్యేది. శబ్దాలకు నేను మహా భయరిని! చేతులు ఎప్పుడు చెవులకు కరిపించి పెట్టుకునేవాణ్ణి. నాకు ఇప్పటికీ బాంబులు ఆంటే ఎంతో భయం. ఒకసారి ఏమయిందనుకున్నారు నంద్యాలలో ఏదో పని ఉండి ఆలా వెళుతూ వెళుతూ రాజా టాకీస్ దగ్గర ఒక ఫ్రెండ్ తో ఒక నిముషం కోసం సైకీల్ ఆపి మాట్లాడుతున్నా , రెండు నిముషాలు గడిచి గడవకముందే పెద్ద శబ్దం. నా ఎదురుగా రోడ్డు మీద ఆంతా పొగలు, మంట ఆ పొగల వెనుక నుండి కంగారుగా మనుషులు , తెల్లని బట్టల నిండా ఎర్రని రక్తం, చేయి వేళ్ళు తెగి వేలాడుతూ … విషయం ఏమిటీ అంటే నాటు బాంబులు పెట్టుకుని ఒక జీపు బయలు దేరింది. ఏం పొరపాటు జరిగిందో ఏమో! జీపు లోపలే బాంబులు బద్దలై పోయి జీపు టాపు ఎగిరి పైన కరెంటు తీగలపై వాలింది. లోపలఉన్నవాళ్లలో ఎవరు మిగిలారో, ఎవరు కూలారో తెలీదు. నాకు తెలిసినదల్లా నేను ఈ నిముషం పాటు ఇక్కడ ఆగి ప్రెండ్ తో మాటాడుతూ ఉండకపోతే ఆ జీపు పక్కన ఉండాల్సినవాడిననే స్పృహ మాత్రమే. ఇలా బాంబులు పేలాయని కాదు, నిజంగా నాకు చిన్నప్పటి నుండి ఆ పెద్ద పెద్ద శబ్దాలు అంటే అసలు పడవు. పెన్సిల్, జడ, వెన్నముద్ద, పాం బిళ్ళలని అయితే అత్యుత్సాహంగా కాల్చేవాణ్ణి. భూచక్రం, విష్ణుచక్రం అంటే అంత మోజేమీ లేదు. ప్రమాదం అని చెప్పి, వేరే వాళ్ళ కొంపలు కాలిపోతాయని మా ఇంట్లో రాకెట్లు మాత్రం అసలు కొనేవారు కాదు. మనదంతా రివాల్వర్ బ్యాచ్. పండగ నాలుగు రోజులు హృదయమెక్కడున్నది హృదయమెక్కడున్నది అంటే అది దీపావళి పిస్తోలు రీలు చుట్టే తిరుగుతున్నాది అని పాడుకునే కాలం. అనగనగా ఆ రోజుల్లో ప్రతి రోజూ దొంగా పోలీస్ ఆట ఆడుకునే వాళ్ళం కదా. మామూలు రోజుల్లో చూపుడు వేలు మధ్య వేలు మీద బొటన వ్రేలు మీట నొక్కగానే డిష్యుం అని నోరు చప్పుడు పేలాల్సిన ఖర్మమేమీ? దీపావళి దినాల్లో చక్కగా ప్రతి పిల్ల పోలీసు దగ్గర ఒక పిస్టోలు ఉంటుంది. దొంగల దగ్గర ఉల్లిపాయ బాంబులు ఉంటాయి. పోలీసు పేల్చిన ప్రతి గుండు చప్పుడుకు సమాధానంగా ఒక ఉల్లిపాయ బాంబు తీసి పోలీసోడి కాళ్ల దగ్గర పేల్చి సమాధానం చెప్పేవాడు దొంగోడు.

Also read: జగమెరిగిన ఆర్ కె లక్మణ్

మా ఇంటికి పక్కన ఒక పెద్ద సందు ఉండేది. ఒకవైపు అంతా పెద్ద గొడవాటి గోడ. ఆ సందులో నడిచే ప్రతి సారీ చూపుడు వేలుకు పిస్తోలు రీలు కానీ, బొట్టు బాంబుబిళ్ళ కానీ అంటించుకుని వేలితో గోడను వేగంగా రాసేవాణ్ణి. గోడకి వేలికి మధ్య ఉన్న మందుగుండు పేలేది. భలే తమాషా ఆట అది. పండగ ముగిసే సమయానికి అంతా చూపుడు వేలు చివర మొదట బొబ్బ అయి పిదప పెద్ద పుండయ్యేది. అప్పట్లో దెబ్బలు, గాయాలు, రక్తాలు పెద్ద బాధపెట్టేవి కావు. ఎప్పుడయినా నా వంతు బాంబులు ఇక కాల్చక తప్పదూ అంటే వాటిని ఒక పెద్ద కాగితంలో పెట్టి ఆ కాగీతపు చివరను అగ్గిపుళ్లతో అంటించి దూరంగా పారిపోయి చెవులు మూసుకుని వేరే వాళ్ళ మొహంలో చప్పుడు తాలూకు ఎక్ప్రెషన్ వెదికేవాడ్ని. ఢాం!

ఒక దీపావళి రాత్రి గడిచాకా తెల్లవారు ఝామునే లేచి ఇంటి ముందు తుస్సు బోయిన బాంబులన్ని ఏరుకుని వాటిని లొత్తల కింద పిసికి ఆ కారిన మందును ఒక కాగితంలో నింపి కాగితం చివర మంట అంటించి తదుపరి ఏఁ జరుగుతుందో అని నా క్యూరియాసిటిని అంతా బుర్రలో నింపుకుని ఆ వాలిన తలను కాగితం పై వాల్చి చూస్తున్నానా? మందు రవ్వ చుర చుర లాడుతూ సరసర పాకింది. ముందు పొగ ఆ తరువాత పొట్టేలు తలకాయని నిప్పుల మీద కాలుతున్నపుడు వచ్చే కమ్మటి కమురు వాసన వచ్చింది. ఎంత బావుందో ఆ వాసన! ఆ తరువాత నా కళ్ళు బుగ్గలు చర చర మండాయి. కాలింది పొట్టేలుది కాదు, నా తలకాయ్. అని పిదప అర్థమయ్యింది. ముందు కనుబొమలు కాలిపోయాయ్ ఆ పై నుదుటిపై జుట్టు అంతా కాలిపోయి ఆ చివర్లు ఆఫ్రికన్ వాడికి మాదిరి రింగులుగా తయాయ్యాయి. కొద్ది రోజుల పాటూ బుగ్గలంతా ఎర్రగా మహామంట.

Also read: రామభక్త బైబుల్

 ఇదంతా ఏల ఆనంటే బాంబులు కాల్చడం అంటే భయం కొద్ది. మరి ఇలాంటి ఢమాల్ డప్పుడు బాల్యం చిన్ని కృష్ణుడికి మిస్ అయి పోయిందేనని నాకు ఎప్పుడు బెంగ గా ఉంటుంది. ఎప్పుడు దీపావళి వచ్చినా ఇది చిన్ని కృష్ణుడికి పాత్ర లేని పండగ అయిపోయిందే అని ఎంతో జాలి. అందుకే తననూ, దీపావళిని పాత్రలు చేసి నేను బోలెడు కార్టూన్లు వేసేవాణ్ణి. కృష్ణుడు అతని బ్యాచ్ అంతా కలిసి పక్కింటి బ్యూటీఫుల్ ఆంటీ నీళ్ళ కడవ చంకనెట్టుకుని ఏటికి వెడితే, ఈ క్రిష్ణ&కో అంతా ఆ ఇంట్లోకి దూరుతారు. ఒకడి వీపుపై మరోకడు నిచ్చెనలా వంగితే కృష్ణుడు వారి పైగా ఎక్కి పైన వెన్న దుత్తలో చేయి పెట్టి అందులోనుంచి బోలెడు బాణాసంచా తీసి ‘హెప్పీ దీపావళి’ అని గావుకేక పెడ్తాడు. ఇలా చెప్పకూడదు కానీ మీరు చూడదగ్గ కార్టూన్ ఆ నేను వేసినది. ఇంకో చోట , బుజ్జి కిట్టయ్య ఫ్లూటు వాయిస్తుంటే కింద పాము బిళ్ళలు తమకై తామే లేచి ఆటలాడుతుంటాయి. అనుకోవాలే కానే ఇలాంటి అందమైన కార్టూన్లు బోలెడు వేయవచ్చు. మరి నా చిన్నప్పుడు నా కోసం మా మేనత్తలు, మా పిన్ని గార్లు టపాకాయలు కాల్చినట్లు. కృష్ణుడు మాత్రం నా కన్నా ఏమాత్రం ధైర్యవంతుడు అయి ఉంటాడు? తను పెద్దయ్యాకా వాళ్ళ ఆవిడ ఆయన తరుపున బాణాలు వదిలినట్లు కృష్ణుడి వాళ్ళ అమ్మ కూడా చిన్నారి కిష్ణుడి కోసం విల్లు ఎక్కు బెట్టి స్టాండర్డ్ కంపెనీ వారి రాకెట్ వదిలి ఉండదా అని నా ఊహా, అందమైన ఇమాజినేషన్, చక్కని చిత్రకళ. ఈసారి మాత్రం మీ అందరి తరపున కన్నయ్యకు నా దీవాళి విషెస్ అండ్ లవ్స్.

Also read: మనిషి-పని

Anwar
Anwar
బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్ లో.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles