Friday, September 20, 2024

రామభక్త బైబుల్

“తెలుగు వాచకానికి ఒకటి, ఉపవాచకానికి ఒకటి. ఇంగ్లీష్ టెక్స్ట్ కు ఒకటి, నాన్ డిటైల్ కు ఒకటి. మొత్తం నాలుగు- రెండు వందల పేజీల గళ్ళ నోట్ పుస్తకాలు. లెక్కలకు రెండు నోట్ బుక్స్ తెల్ల కాగితాలది . సైన్స్ కు ఒకటి, సోషల్ కు ఒక  రూల్డ్ లాంగ్ నోట్ పుస్తకాలు, ఆ పెద్ద పుస్తకాలనే మధ్య కుట్టు దగ్గర ఒక కాగితం మడిచి పెట్టుకొండి ఈ వేపు జీవశాస్త్రము, ఆవేపు రసాయన-భౌతిక శాస్త్రాలు రాసుకుందురు గాని. సోషల్ స్టడీస్ లో కూడా ఈ పక్క చరిత్ర, ఆ పక్క రాజనీతి శాస్త్రము విభజించుకోండి . ఒక ఆరు పుస్తకాలు వంద పేజీలవి కొనుక్కోండి. అవి అసైన్మెంట్స్ కోసం. వీటితో పాటు ఒక కంపాస్ బాక్స్, రెండు పెన్నులు కూడా. ఒకటి బ్లూ ఇంక్, ఇంకోటి రెడ్ ఇంక్. రెడ్ ది ప్రశ్నలకు, బ్లూది ఆన్సర్ లకు, అర్థమైందా?”

నావంటి వాడెవడో అరుస్తాడు “సార్సార్ డ్రాయింగ్ బుక్ సార్?”

“డ్రాయింగ్ కు ఏమేం కావాలో శర్మ సార్ చెబుతాడులే”

శర్మ సార్ చెప్పకపోయినా ’ఒక డ్రాయింగ్ పుస్తకం, ఒక పెన్సిల్, ఒక లబ్బరు, ఒక బరమ, ఒక స్కెచ్ పెన్నుల పాకెట్ ’ వరుసగా  లిస్ట్ లోకి ఎక్కుతుంది. అదంతా పంతొమ్మిది వందల ఎనభై అయిదు రోజులు. బడిలో డ్రాయింగ్ కూడా నేర్పుతారని తెలిసి నిబిడాశ్చర్యాలతో నింగికి ఎగిసిన రోజులు, మా డ్రాయింగ్ సారుకు మాకు బొమ్మలు నేర్పడానికి ఆసక్తీ- సమయమూ లేవని తెలిసి ఏ మాత్రమూ నేలకు కూలని రోజులు కూడా.

Also read: మనిషి-పని

అన్ని సబ్జెక్ట్ ల నోట్ బుక్స్ బావుండేవి. కాగితం కళగా ఉండేది. మామూలు నోట్ పుస్తకం కన్నా ఒక అర్థ రూపాయ ఎక్కువ చదివించుకుంటే ఇంకా మంచి కాగితపు పుస్తకాలు వచ్చేవి. ఇక నంది నోట్ బుక్ మాట చెప్పనక్కరే లేదు. అవి అంత సులువుగా దొరకవు. మరి డ్రాయింగ్ పుస్తకాల సంగతో? పరమ దరిద్రమయిన కాగితాలు, పెన్సిల్ ఊపుకు పట్టు దొరకని నున్నని షీట్, రబ్బరు పెట్టి తుడుపుదామంటే కన్నం పడే పేపర్ పలుచదనం. దానికి తగ్గట్టుగానే ఉండేవి పెన్సిళ్ళూ, ఎరేజర్లూనూ. అవి మరీ ఘోరం, మహా అన్యాయం. దీనిని బట్టే తెలుసుకోవచ్చు డ్రాయింగ్ మీద సమాజానికి, వ్యాపారానికి ఎంత చిన్న చూపో! నాలానే మీరూనూ చిన్నప్పుడు జాంపండు కొరుకుడు చివర చిలక బొమ్మ ఒకటి, చిట్టి ఎలుక మరియూ వారి తాలూకు దుబ్బ ముద్దు గణపతి బొమ్మలు అలా గీసి పడేయాలని ఆశపడి ఉంటారు. కొంత మీ చేతరాకపోవడమూ, మరింత పేపరు పెనసలు చేసే మోసము వల్ల బొమ్మలు గీయాలనే ఆసక్తి చచ్చిపోతుంది. నా వంటి బొమ్మల పిచ్చి  మొండి మనుషులు ఏదీ ఏమైనా కానీ పో అనుకుని ఆ చచ్చు కాగితం మీద అలానే అచ్చయై పోతాను. ఆ   అలవాటు అలానే  అలవాటై పోయి ఈ రోజుకు నేను కాస్త మంచి నాణ్యత గలిగిన, ఖరీదయిన కాగితం మీద అసలు బొమ్మ వేయలేను. ఫోటో స్టాట్ కాగితం మీదే నా రిహార్సల్స్, ఫైనల్స్, అలాగే రంగులూనూ.

Also read: చివరి సంతకం

ఆ పంతొమ్మిది వందల ఎనభై అయిదుల నుండి రెండు రెండు వేల ఎనిమిది వరకు మంచి స్కెచ్ పుస్తకం అనేది చూడటం అప్పటి నా బ్రతుకులో సంభవించలేదు. రెండు వేల ఎనిమిది లో పనిమీద బొంబాయి పోయా.  మొదటిసారిగా ఖరీదయిన స్కెచ్ బుక్ అనేది  చూడటం క్రాఫోర్డ్ మార్కెట్ లో డెర్వంట్ అనే బ్రిటిష్ కంపెని వారి స్కెచ్ బుక్ నే , దానికి లెదర్ కవర్ ఉన్నది, మందమైన కాగితం కుట్టబడినది, A6 అనే అరచేయంత సైజ్ ది మురిపంగా  కొనుక్కున్నా. అటువంటివి ఇంకో రెండు పుస్తకాలు కొంటే అప్పట్లో మా ఇంటి అద్దె  ఒక నెలది కట్టవచ్చు అన్నంత ధరగా ఉంది. అయినా మనసు కోరింది కాబట్టి కొనుక్కున్నా. ఒక మంచి క్వాలిటీ స్కెచ్ బుక్ అనేది ఇంత ధర పెట్టి ఇలా కొనడాలు అవీ  మనవల్ల కాదులే అనుకుని హైద్రాబాదులో గౌలీగూడ చమన్ కు వెళ్ళి అక్కడ డబల్ డమ్మి సైజ్ హండ్రెడ్ జి ఎస్ ఎమ్ బాండ్ కాగితాలు కొనుక్కుని, ఖైరతాబాద్ రైల్ కట్ట అవతల ఎల్లోరా బుక్ బైండర్స్ అని ఉండేవారు,  వారి వద్ద ఇంతింత లావుగా రెండు బౌండ్ పుస్తకాలు చేయించా. నాకొకటి మా బాపు గారికొకటి. గురుభావం ఉండే నావంటి పిల్లల రోజులవి. బిడ్డల మీద ఉండే వాత్సల్యం మా పైన చూపేలాంటి బాపు గారివంటి  గొప్ప పెద్దలు మాకున్న రోజులవి. బొమ్మలకు సంబంధించి ఏది కొన్నా నాకోటి- బాపు గారికో, మోహన్ గారికో, చంద్ర గారికో ఇచ్చే కాలమది. బాపుగారు యూజువల్లీ  అందరికన్నా ఎక్కువ సమానం. నా కన్న గొప్ప ప్రేమికుడు చిత్రకారులు గంధం గారు. బాపు గారు వేసిన ప్రతి బొమ్మ కాగితం పై, ముంచిన ప్రతి రంగు ఇంకులో గంధం గారి పుష్కల ప్రేమ ఉండేది. విదేశాల నుండి వేలకు వేలు ఖర్చు పెట్టి ఆయన బాపు గారికొరకు ఎంత స్టేషనరీ తెప్పించేవారో!

Also read: అజిత్ భాయ్ సాబ్ అమర్ హై!

ఆ విధంగా ఎల్లోరా బైండర్స్ నుండి వచ్చిన ఒక బుక్కు నాకు,  మరో బుక్కు ఆయనకు అని పంచుకున్న ఆ పుస్తకాన్ని  ఆయన బైబిల్ అని పిలుచుకునే వారు. ఆ పుస్తకం నిండా చిత్రకళా రహస్యాలు దాగి ఉండేవి . తయారయిన బొమ్మ కాదు. ఒక బొమ్మ ఆలోచన వెనుక ఉన్న సాధన హోమ్ వర్క్ అంతా ఆయన ఆ పుస్తకంలో అభ్యాసం చేసుకునే వారు. మీరు మీ బ్యాంకు అకవుంట్ ధరఖాస్తులో మీ పొటిగరాపు అతికించడానికి గ్లూస్టిక్ మూత తీసి టేబుల్ మీద పెడతారు కదా. ఎటునుండి చూసినా అది మీకు జిగురు మూతే. బాపు గారు ఆ మూత  షేప్ నుండి మరేదో బొమ్మ ను లాగేవారు ఆ ఆలోచనను రాబోయే రోజుల్లో కాబొయే బొమ్మకు ఆలంబనగా వాడుకునే వారు. స్పోర్ట్స్ పేజీలో రెండు చేతులా బంతిని చెవి దగ్గర ఆనించుకుని పరిగెడుతున్న బౌలర్ ని ఆయన తన బైబుల్ పుస్తకంలో దూరాన వస్తున్న పోస్ట్ మాన్ ని చూసి బుగ్గలు కెంపు కాగా ఆనందాన్ని రెండు చేతులతో చెవులవరకు ముకుళితం చేసుకుని ఆత్రంగా పరిగెడుతు వస్తున్న పడుచుగా రూపు దిద్దించేవాడు. ఒకటా! వందా! వేలకొద్ది ఉదాహరణలు ఆ పుస్తకంలో చోటు చేసుకున్నాయి. అంతేనా? గుస్తావ్ క్లింట్ దగ్గరి నుండి, యూగాన్ షీల్ వరకు, పీటర్ ఆర్నో దగ్గరి నుండి బిల్ వాటర్ సన్ వరకు మహా చిత్రకారులు వేసిన బొమ్మలకి కొత్త భాష్యాలతో సరికొత్త నిఘంటువు వ్రాసారు. ఆయన తన సాధన ద్వారా. మీరెవరు చూడలేదు దానిని కాబట్టి దాని విలువ మీకు నేను ఎంత చెప్పినా అర్థం అవదు.  ప్రపంచానికికెల్లా ఒకటే అయిన ఆ ఒకే ఒక పవిత్ర గ్రంధంలో బొమ్మలే బొమ్మలు . అది నాదే అని నాకు గట్టిగా తెలుసు.  నేను మదరాసు వెళ్ళినపుడల్లా “బాపు గారు నా బైబుల్ ఏది” అని అడిగి దానిన్ తిరగేసేవాణ్ణి. “పుస్తకం పూర్తయ్యాకా మీకే ఇస్తానండీ, మీకు కాక ఎవరికి ఇస్తాను?” అనేవారు. ఆ ఇచ్చేవరకు కాస్త ఆగమని,  అంతవరకు ఇవి  ఉంచుకోమని ఆయన సంతకం చేసిన బోలెడు పుస్తకాలు, ఆయన వేసిన బొమ్మల ఒరిజినల్స్  ఇచ్చేవారు. మనుషుల్లో కూడా మంచివారు ఉంటారు అనుకునే వారికి, బాపు గారి భక్తులై ఉండికూడా ఆయణ్ణి ఎప్పుడు కలవడానికి నోచుకోనివారి అనేకానికి ఆయన ఒరిజనల్ బొమ్మలు, పుస్తకాలు ఇచ్చేసి, ఇవ్వడంలో ఉన్న సంతోషం పొందేవాడిని. “మంచి అన్నది పంచుమన్నా” అని నేను జీవితమ్లో   నేర్చుకున్న పాఠం ఒకటి ఒప్పచెప్పడానికి అలా చేసేవాడిని.

Also read: అనగనగా ఒక పుస్తకం-1

 అలా బాపుగారివి, నాకెంతగానో ఇష్టమైన మరో మహానుభావులు శ్రీ మేరియో గారు సంతకాలు చేసిన పుస్తకాలు అలా ఎంతమందికి ప్రేమగా  పంచుకున్నానో! అయితే ఇక్కడ మరోటి కూడా ఉంది. బాపూ తదీతరులు  నా వాళ్ళు, నా గురువులు, నా ప్రియతములు, నా రక్తంలో రక్తమై జీవితం నడిపిస్తున్నవారు. నేనెక్కడికి పోతాను? వారెక్కడికి పోతారు అనే ప్రబలమైన పిచ్చి ప్రేమ భావన కూడా.

ఎప్పటికీ అనుకోని, ఊహించని రోజులనేవి ఉంటాయని కాలం చెబుతుంది. బాపు గారు ఇక పలకరించని రోజు ఒకటి వచ్చేసింది. కొంత కాలం అంతా మూగగా గడిచింది. బాపుగారు అప్పుడప్పుడు కలలోకి వచ్చేవారు. ఆయన చేతిలో బైబుల్ ఉండేది. దాని నిండా థౌసండ్ ఆఫ్ బొమ్మల కమాండ్మెంట్స్. బాపుగారి అబ్బాయి వెంకట రమణ గారిని అడిగాను కదా (అవును బాపుగారి అబ్బాయి పేరు ప్రాణమిత్రుడయిన వెంకట రమణ పేరే. సృష్టిలో ’తీయనిది’ స్నేహమేనోయ్. అన్నారు కానీ వీరు తీశారు, దానిని అనుభవించారు, బ్రతుకుని స్నేహంతో పరిమళించారు.)  ఆయనా ఆ పుస్తకం కోసం  తెగ వెతికారు, దొరకలేదు.  ఎప్పుడు కనపడ్డా మీకే ఇస్తాను అన్నారు. అది కనపడలేదు.  లక్షన్నర పెట్టి కొన్న ముష్టి ఎలక్ట్రానికి డివైజ్ అయితే  ఎక్కడుంది జి ఎస్ ఎం అని అడిగి కనిపెట్టవచ్చు. కానీ అది కళ, రక్తం, జీవితం, సాధన, సంస్కృతి. జీవితకాలాలు కావాలి మళ్ళీ అటువంటిది  చేతచిక్కడానికి. అయితే ఆ పుస్తకం కావాలి, ప్రపంచం నలుమూలలా చిత్రకళా వెర్రి ఎక్కించుకున్న కోటికొకడే అయి ఉండిన బొమ్మల విధ్యార్థుల కోసం. కానీ ఎట్లా? శతాబ్దాలు రావాలి మళ్ళీ మరో బాపు రావడానికి,  కావడానికి. ఆ కళ అంది పుచ్చుకోవడానికి. పుచ్చుకున్నది మళ్ళీ ఒక పుస్తకంగా అందించడానికి.

Also read: త్రిపురకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

అయితే ఒక షార్ట్ కట్ తోవ ఉన్నది. నేను కాస్త పుణ్యాత్ముడిని రేపో, మర్నాడో, ఇంకో మూడేళ్ళకో అక్కడికి పయనమవ్వాలి కదా! పయనం అయితే గియితే స్వర్గానికే వెడాతా. బాపుగారు అక్కడే ఉంటారు. ఆయనతో కూచుని మరో బైబుల్ తయారు చేయిస్తాను. ఆయన పరమ పుణ్యాత్ముడు. ఆయనకు మళ్ళీ జన్మ అనేది ఉండదు. నా పుణ్యం ఖాతా ముగియగానే నరకమనే ఈ భూమిలోకి మళ్ళీ వస్తాను. అప్పుడు బుర్రనిండా ఉన్న రామభక్త బైబిల్ ని బొమ్మలు ప్రేమించే  పిల్లలకు పంచుతాను. బోలెడు పుణ్యం వస్తుంది. అది పుచ్చుకుని మళ్ళీ బాపుగారిని చేరుకుంటాను. పుణ్యం ఎంత మంచిది కదా!

(బాపుగారు పైన వేసిన బొమ్మలో ఆలోచనని సాధనలను గమనించండి. పరమ హింసాకరమైన ఫుట్ బోర్డ్ ప్రయాణంలోని చిన్న ప్రేమ కథని చూపించిన ఆయన ఆలోచనకి, రేఖా గీతకి దండం పెట్టుకోండి)

Also read: పేపర్ కూడా చదవబుద్ది కాలేదబ్బా!

Anwar
Anwar
బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్ లో.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles