Friday, July 19, 2024

మహాభారతం అవతారిక

భారత భారతీ శుభ గభస్తి చయంబుల జేసి, ఘోర సం

సార వికార సంతమస జాల విజృంభము బాచి, సూరి చే

తోరు చిరాబ్జ బోధన రతుండగు దివ్యు పరాశరాత్మజాం

భోరుహ మిత్రు గొల్చి ముని పూజితు, భూరి యశోవిశారదున్

-నన్నయ భట్టారకుడు

………..

అంభోరుహ మిత్రుడు సూర్యుడు. సూర్యునితో సమానుడు పరాశరాత్మజుడైన వ్యాసుడు. భూరి యశస్సుచే విరాజితుడైన వాడు ఆ మహాముని. భారతంలోని ఆయన వాక్కులు  శుభకరమైన దినకర మయూఖ కోటి వంటివి. సూరి చేతోరు బోధన రతుడాయన. అనగా విద్వాంసుల  హృదయ కమల దళాలకు వికాసం కలిగించే వాడు. ఆ మహాముని దైవసమానుడు. ముని పూజితుడాయన. “అట్టి వ్యాసుణ్ణి సేవించెదను గాక” అని ఆదికవి భక్తితో ప్రణమిల్లుతున్నాడు.

నన్నయ్య 'ఎరుక' - nannayya eruka - వ్యాసాలు | Telugu Velugu | Articles  Stories Competition Books Magazines Poetry | Ramoji foundation
నన్నయ్య భట్టారకుడు

అనర్గళమైన ఈ పద్యం మనోహర రూపకాలంకార శోభితం. వ్యాసునికి సూర్యునితో పోలిక. మహా భారతం లోని గంభీర వాక్పరంపరకు ఇనకిరణాలతో పోలిక. ఘోరసంసార వికారాలకు కారు చీకటితో పోలిక. విబుధ సముదయానికి కమలినీ సమూహంతో పోలిక.

నన్నయభట్టారకుని భారతావతారిక, తిక్కన సోమయాజి భారతావతారిక, దేనికది తమ తమ ప్రత్యేకతలను చాటుకుంటాయి.

బౌద్ధమత ప్రభావంతో క్షీణించిన గృహస్థాశ్రమ ధర్మాన్ని పునరుద్ధరించడం నన్నయ యుగపు చారిత్రక అవసరం. తదనుగుణంగా ఆదికవి భారతావతారిక మొట్ట మొదటే గల గీర్వాణ శ్లోకంలో “శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషయే” అని ఘోషిస్తూ గృహస్థాశ్రమ ప్రాధాన్యతను చాటుతుంది.

తిక్కన యుగం నాటికి  వీరశైవ గణాలుగా, వీరవైష్ణవాచార  గణాలుగా సమాజం చీలిపోయింది. ఈ పరిస్థితిలో హరిహరాద్వైతాన్ని దేశంలో నేలకొల్పవలసిన అవసరం ఏర్పడింది. ఇట్టి నేపథ్యంలోనే, విష్ణురూపాయ అని పిలిచినా, నమశ్శివాయ అని పిలిచినా, శ్రీ యని పిలిచినా, గౌరి అని పిలిచినా కరుణరస ప్లావిత చిత్తంతో  పల్లవించే హరిహరాద్వైత  పరతత్వానికే  కవిబ్రహ్మ తన అవతారికలో అంజలి ఘటిస్తాడు.

Also read: ఎవరి కోసం?

సమ్మిళితమైన చారిత్రక, కావ్య దృష్టి

నన్నయభట్టారకుని అవతారికలో చారిత్రక దృష్టి,  కావ్యదృష్టి సమ్మిళితమై కనిపిస్తాయి. ఆయన తన అవతారికలో రాజరాజ నరేంద్రుని పాలనా వైభవాన్ని, ఆనాటి రాచకొలువును, అప్పటి పండిత సదస్సులను వర్ణిస్తాడు. భారత సంహితను రచింపమని రాజరాజు చేసిన అభ్యర్థనను, నారాయణుని వలె తనకు భారత రచనలో తోడ్పడిన నారాయణ భట్టు పాత్రను అక్షరబద్ధం చేస్తాడు.

తిక్కన తన అవతారికలో రాచకొలువు జోలికి పోడు.  సందర్భానుసారంగా తన వంశక్రమాన్ని వివరిస్తూ  స్వప్నంలో తన తండ్రి ప్రత్యక్షమై హరిహరనాథుని కరుణా కటాక్ష వీక్షణ తిక్కనపై ఎంతగా ప్రసరించిందో  ఏకరువు పెట్టడాన్ని రసరమ్యంగా తెలుపుతాడు. అక్కడి నుండి చిరస్మరణీయంగా సాగే తిక్కన గారి ఆధ్యాత్మిక పార్వ్వృన్ని పఠితలు ఆమూలాగ్రంగా  దర్శిస్తారు

నన్నయ కాలంలో కృతినాథుని సాంప్రదాయం లేనట్లుగా గోచరిస్తుంది. తిక్కన భారతానికి హరిహరనాథుడే కృతినాథుడు.

నన్నయ ఆదికవి వాల్మీకిని, వేదవ్యాసుణ్ణీ స్మరిస్తే, తిక్కన వాల్మీకిని వదలి కేవలం వేదవ్యాసుణ్ణే స్మరిస్తాడు. దీనికొక కారణం నిర్వచనోత్తర రామాయణంలో అప్పటికే వాల్మీకిని స్మరించి వుండడం. రెండవది, తెలుగులో నన్నయ గారే ఆదికవి కావడం చేత వాల్మీకి మహర్షి స్థానాన్ని నన్నయ ఆక్రమించడం.

 ఇద్దరు మహాకవుల మధ్యా వైరుధ్యం

వేదవ్యాసుణ్ణి స్మరించే పద్ధతిలోనూ ఇరువురు మహాకవుల మధ్యా వైవిధ్యం గోచరిస్తుంది.  కృష్ఢ ద్వైపాయనుణ్ణి “భారత భారతీ శుభ గభస్తి చయంతో” ప్రకాశించే ప్రభాకరునిగా, “ఘోర సంసార వికారమనే” తిమిరాంధకారాన్ని పటాపంచలు చేసే ప్రభాత దీపకళికగా, జ్ఞానపిపాసకుల హృదయ కమలాలకు వికాసం కలిగించే అరుణ కిరణ స్పర్శగా నన్నయ భావిస్తాడు.

తెలంగాణ సాహిత్యం
తిక్కన సోమయాజి

దీనికి భిన్నంగా తిక్కన తన భారతావతారికలో పరాశరాత్మజుణ్ణి వర్ణించే విధానాన్ని క్రింది పద్యంలో చూడండి:

“విద్వత్ సంస్తవనీయ భవ్య కవితావేశుండు, విజ్ఞాన సం

పద్విఖ్యాతుడు, సంయమిప్రకర సంభావ్యాను భావుండు, కృ

ష్ణద్వైపాయను డర్థి లోక హిత నిష్ఠం పూని కావించె ధ

ర్మాద్వైత స్థితి భారతాఖ్యమగు లేఖ్యంబైన ఆమ్నాయమున్”

నన్నయభట్టారకుని వ్యాసస్తుతి భావనాత్మకమైనది. తిక్కన వ్యాసస్తుతి ఆలోచనాత్మకమైనది.

తన అవతారిక నన్నయ అవతారికకు శుష్కప్రాయమైన నకలు కాకూడదనే నియమం తిక్కన మనస్సులో వున్నట్లుగా మనకు స్ఫురింపక మానదు.  చర్విత చర్వణమైన అవతారిక నవీనత్వం కోల్పోతుంది. నవీనతతో బాటు విచక్షణ,  సంయమనం, ప్రతి మహాకవిలో తొంగి చూసే లక్షణాలు.

గీర్వాణ సాంప్రదాయం నుండి విడివడి నన్నయభట్టారకుడు సరిక్రొత్త రీతిలో తన అవతారికను రచించుకున్నట్లే, వాగనుశాసనుని సాంప్రదాయం నుంచి బయటబడి తిక్కన సోమయాజి తన భారతావతారికకు నూతనాలంకృతులు సంతరించడంలో ఆశ్చర్యం లేదు.

నేటి పద్యంలో పంకేరుహాల వంటి జ్ఞానపిపాసకుల హృదయాలు వ్యాస మహాముని “భారత భారతీ” శుభ గభస్తి చయం యొక్క పావన స్పర్శ కోసం ఎంతగా పరితాపం చెందుతున్నాయో ఆదికవి వర్ఢిస్తున్నాడు.

రుక్మిణీ కళ్యాణఘట్టం

రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో, గుణగణ సంపన్నయైన సాధారణ కన్య మహాపురుషుడైన శ్రీకృష్ఢునికై తపిస్తుంది. అదే సమయంలోనే ఆ యువతి పాణిగ్రహణం కోసం పురుషోత్తముడైన శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఎంతో తాపత్రయం చెందుతాడు.

చీకటిలో చిక్కువడి సూర్యుని రాకకై పంకేరుహ సముదయం ఎదురుతెన్నులు కాచినట్లే, కోమల పద్మబాలల కోసం   అనునిత్యం విభాకరుడు వేయి కన్నులతో వేచి చూస్తాడు.

శ్రీకృష్ణుడు పురుషుడు. రుక్మిణి ప్రకృతి. సూర్యుడు పురుషుడు. కమలిని ప్రకృతి.

తొమ్మిది దశాబ్దాల క్రిందట కన్నుమూసిన కవి పెనుమర్తి వెంకటరత్నం. ఆ కవి జీవితకాలం కేవలం ఇరవై మూడు సంవత్సరాలు (1907-1930).  భావితరాలకా కవి వారసత్వంగా ఇచ్చిన కవితాఖండికలు బహు తక్కువ. కాకపోతే ఆ  కవితలన్నింటిలోనూ గల మెత్తదనం, మార్దవం, భావుకతా, పఠితలను అబ్బురపరుస్తాయి.

ప్రేమభిక్షాటన

“ప్రేమ భిక్షాటన” అనే కవితలో పెనుమర్తి వెంకటరత్నం, సూర్యునికి, పద్మాలకు నడుమ గల అపూర్వ ప్రేమ బంధాన్ని వర్ణిస్తాడు.

అనుదినమూ దివాకరుడు కమలినీ ప్రేమభిక్షాటనకై తూర్పున ఉదయిస్తాడు. ఆ సమయాన దినకరుని హృదయంలో వెలిగే “ప్రేమ చిహ్నిత సహస్ర భావ భానువులు” దశదిశలను ఆవరిస్తాయి. ఇదే సూర్యుణ్ణి కమల వనాలనుండి తిమిరాంధకారం వేరుపరుస్తుంది. తన అనంత మహాశక్తిని ధారపోసి ఆ  అంధకారాన్ని కర్మసాక్షి ఛేదిస్తాడు. తన ప్రియురాండ్ర సమాగమం కోసం ప్రేమ భిక్షాపాత్రతో దినకరుడు ప్రాగ్దిశలో పునః సాక్షాత్కరిస్తాడు.

మనోహరమైన ఈ భావనను వెలిబుచ్చే పెనుమర్తి కవితను క్రింద పఠించగలరు:

“కమలినీ ప్రేమ భిక్షాటనమున కపుడె

ప్రాకి వచ్చుచు నుండె దివాకరుండు

హృదయమున వెల్గు ప్రేమ చిహ్నిత సహస్ర

భావ భానువు లదుము ఆశావధులను”

యుగ యుగమ్ములుగా తమమ్మొదిగి యొదిగి

తిగ్మ రోచిస్సహస్ర మూర్తిని గమించు

వాని ఛేదింప దశదిశావళులు దాటి

తన అనంత మహాశక్తి ధార వోయు”

“కమలినీ ప్రేమ బంధము విదిర్పి

మరల మరల తమోంధ బంధుర పిశాచ

నృత్యములు, కాల జీమూత నిబిడ మృత్యు

హాసములు, ఘోర ఘోర లోకాంచలములు”

యుగ యుగమ్ములుగా తమమ్మొదిగి యొదిగి

తిగ్మరోచిస్సహస్ర మూర్తిని గమించు

వాని ఛేదింప దశదిశావళులు దాటి

తన అనంత మహాశక్తి ధారవోయు”

కమనీయ దృశ్యం

నలభై సంవత్సరాల క్రిందట రాత్రి పూట సికింద్రాబాదులో రైలుబండి నెక్కి కాకినాడ వెళుతున్నాను. అది డిసెంబర్ నెల. చీకటి క్రమక్రమంగా అస్తమించే వేళ రైలు దిశాంతాల వరకు వ్యాపించిన పచ్చని పొలాల మధ్య పోతున్నది. ఒకచోట రైలు ఆగిపోయింది. రైలు కట్ట ప్రక్కనే ఒక విశాలమైన సరోవరం. దాని నిండా తామర పూలు. తూరుపున వ్యాపిస్తున్న హిరణ్య భానువులు.  కమలవనంలో వికసిస్తున్న మనోహర రక్త వర్ణం. ఈ రెండు రంగులు సంయోగం చెంది నీటి ఉపరితలంపై ధగధ్ధగాయమానంగా ప్రతిఫలిస్తున్నాయి. ఆకాశంలో అస్తమిస్తున్న చివరి నక్షత్రం సైతం ఆ కమనీయ దృశ్యాన్ని కనులారా వీక్షించి ఆనందాతిరేకంతో అంతర్ధానం చెందింది.

పద్మబాలికల మేని కాంతి, సూర్యకాంతితో అద్వైతం చెంది క్రొంగొత్త వెలుగు ఆవిష్కరింపబడినట్లే, నన్నయ గారి పద్యాలలో రెండు విభిన్న శబ్దాలు సంగమమై మధుర మంజులమైన వినూత్ననాదం ఆవిష్కరింపబడుతుంది.నేటి నన్నయ భట్టారకుని పద్యం ఇందుకు మినహాయింపు కాదు.

Also read: మహాభారతం అవతారిక

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles