Friday, July 19, 2024

మహాభారతం అవతారిక

ఇమ్మహాభారతం బిమ్ముల బాయక
విహితావధానులై వినుచు నుండు
వారికి విపుల ధర్మారంభ సంసిద్ధి
యగు పరమార్థంబ అశ్రమమున
వేదముల్ నాలుగు నాది పురాణముల్
పదునెనిమిదియు తత్ర్పమిత ధర్మ
శాస్త్రంబులును మోక్ష శాస్త్ర తత్వంబులు
నెరిగిన ఫలమగు నెల్ల ప్రొద్దు

దానములును బహువిధ క్రతుహుత జప
బ్రహ్మ చర్యంబులను బడయ బడిన
పుణ్యఫలము బడయబోలు నశేష పా
పక్షయంబగు శుభంబు పెరుగు

– నన్నయ భట్టారకుడు

నన్నయగారి భారతావతారికలో భాగంగా ఉగ్రశ్రవసుడు భారతస్తుతి గావించే కట్టకడపటి పద్యాల్లో యిదొకటి.

సూత పౌరాణికుడైన ఉగ్రశ్రవసుడు శౌనకాది మునులతో యిట్లా అంటున్నాడు. “ఈ మహాభారతాన్ని సమగ్రంగా, ఏకాగ్ర చిత్తంతో పఠించిన వారికి “ధర్మారంభ సంసిద్ధి” కలుగుతుంది. శ్రమారహితంగా, చతుర్వేదాలను, పద్ధెనిమిది ఆది పురాణాలను, వాటి యధార్థ స్వరూపాన్ని విశదం గావించి మోక్షమార్గాన్ని తెలిపే శాస్త్రాల పరమార్థాన్ని, గ్రహింపగల సత్ఫలితం ఒనగూరుతుంది”.

“దానాలచే, బహువిధ జపతప హోమాలచే, బ్రహ్మచర్యంచే, ఏ ఫలితాలు కలుగుతాయో, ఆ పుణ్యఫలాలన్నీ భారత పారాయణంచే సమకూరుతాయి. అశేష పాప నాశనం కలుగుతుంది. శుభం వర్ధిల్లుతుంది.”

చతుర్వేదాలు, పద్ధెనిమిది పురాణాలు, సకల ధర్మ శాస్త్రాలు, వీటన్నింటి సారం మహాభారతం. మహాభారతం శరీరమైతే దాని ఆత్మ భగవద్గీత.

అమృతత్వ సాధనయే వేద మానవుల ధ్యేయం. ఉపనిష త్సారమిదే:

“అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతం గమయ”

మహాభారతమూ ఇదే పరమార్థాన్ని బోధిస్తున్నది:

“న కర్మణా న ప్రజయా ధనేన
త్యాగే నైకే అమృతత్వ మానశుః
పరేణ నాకం నిహితం గుహాయామ్
విభ్రాజితే తస్య తయో వింశతి”

ప్రతి ప్రాణిలోను పరమాత్మ స్వరూపం ఉన్నదని గీతాచార్యుడు బోధిస్తాడు: “ఈశ్వరస్సర్వ భూతానాం హృద్దేశేర్జున తిష్ఠతే”.

ఈ సమాజానికి మానవుడే మూలం. మానవులందరి సమిష్టి స్వరూపమే సమాజం. మహాత్మా గాంధీ ఒకానొక రచనలో ఇట్లా పేర్కొన్నారు: “సమాజమనే వృత్తానికి మానవుడే కేంద్రబిందువు. సమాజం యొక్క వృత్తపరిధి విస్తరింపవచ్చు. లేదా సంకోచింపవచ్చు. కానీ మానవుడనే కేంద్రబిందువే స్థిరమైనది”.

లో్కకళ్యానం

వ్యక్తిగత కళ్యాణం లేనిది లోక కళ్యాణం అసంభవం. అదే సమయంలో లోకకళ్యాణం, వ్యక్తిగత కళ్యాణం, పరస్పరం సంఘర్షించినప్నుడు, వ్యక్తిగత సౌఖ్యం కోసం లోకకళ్యాణాన్ని పరిత్యజించడం ధర్మవిరుద్ధం. దాని బదులుగా లోకకళ్యాణం కోసం వ్యక్తిగత ప్రయోజనాలు తృణప్రాయంగా త్యాగం చెయ్యడమే ధర్మబధ్ధమైనది. సనాతన భారతీయ ధార్మిక సందేశమిదే. ఇదే మహాభారత సారాంశం. భారతం, దాని సారాంశమైన గీత చదవడంచే “ధర్మారంభ సంసిద్ధి యగు” నన్న సందేశంలోని పరమార్థమిదే అని భావిస్తాను.

జరామరణాలు లేని రెండు రష్యన్ నవలలున్నాయి. ఒకటి టాల్ స్టాయ్ రచించిన “యుద్ధము శాంతి” (War and peace). రెండవది డాస్టొవిస్కీ రచించిన “నేరము శిక్ష” (Crime and punishment).

1812లో నెపోలియన్ రష్యాదేశంపై దురాక్రమణ కాంక్షతో దండెత్తినప్నుడు దాన్ని త్రిప్పికొట్టడానికై సలిపిన పోరాటంలో జీవితాన్ని ధార పోసిన రష్యన్ వీరుల జీవన వృత్తాలే “యుద్ధము శాంతి” యొక్క ప్రధాన ఇతివృత్తం. అసమగ్రమైన భగవంతుని సృష్టిలో ధార్మిక జీవనం సాగించడమెట్లా అనే ప్రశ్నతో మొదలుకొని మాతృభూమికై సామాన్య పౌరులు ఆత్మబలిదానం చేయవలసిన అవసరాన్ని చాటి చెప్పడం దాకా సాగిన 1350 పేజీల సుదీర్ఘ నవల యిది. దీనిలో పాత్రలు అసంఖ్యాకమైనవి.

దీనికి భిన్నంగా, “నేరము శిక్ష” రాస్కల్నికోవ్ అనే ఒకేవొక వ్యక్తి యొక్క గాథ. రాస్కల్నికోవ్ నిరుపేద విద్యార్ధి. పోషింపవలసిన తల్లి, చెల్లెలు. రాస్కల్నికోవ్ మేధావి, విద్యావంతుడు. భావోన్మాదంతో కూడిన విచిత్ర మనస్తత్వం కూడా రాస్కల్నికోవ్ కు వున్నది.

ఒక వృద్ధవనిత రాస్కల్నికోవ్ వంటి నిరుపేద విద్యార్థులకు దారుణమైన చక్రవడ్డీలకు అప్పులిచ్చి నిర్దాక్షిణ్యంగా బాకీ వసూలు చేస్తుంటుంది. ఇట్టి వ్యక్తులు సమాజానికి చీడపురుగులని, అట్టి వృద్ధురాలిని అంతం చెయ్యక తప్పదనీ భావించి రాస్కల్నికోవ్ పథకం ప్రకారం రహస్యంగా ఆ వర్షీయసిని హతమారుస్తాడు. ఆమెను హత్యచేసి వెళుతుండగా ఆమె సోదరి కనబడుతుంది. రహస్యం పొక్కుతుందని తలపోసి ఆ వృద్ధురాలి సోదరిని కూడా రస్కల్నికోవ్ హత్య చేస్తాడు. ఈ సంఘటన తర్వాత రాస్కల్నికోవ్ హృదయంలో తీవ్రమైన అంతర్మధనం చెలరేగుతుంది. చిట్టచివర రాస్కల్నికోవ్ తనకు తానుగా పోలీసులకు లొంగి పోతాడు. న్యాయస్థానం విధించిన కఠిన శిక్షను ఆత్మ తృప్తితో స్వీకరించి, దూర సైబీరియాలో దీర్ఘ ప్రవాస జీవితం వెళ్ళబుచ్చుతాడు.

యుద్ధము-శాంతి

లోకకళ్యాణం కోసం వ్యక్తిగత కళ్యాణం బలి గాక తప్పదనేదే యీ రెండు నవలల సారాంశం. ఇవి ఇతర భాషల్లోకి తర్జుమా చెందినప్పుడు వీటిని పఠించిన ఫ్రెంచి తత్వవేత్త రోమే రోలా ఇట్లా అన్నాడు: “యుద్ధము శాంతి” ఒక అఖండ మానవ సముద్రం. “నేరము శిక్ష “అనే నవల కేవలం ఒకేవొక వ్యక్తి అంతరంగంలో చెలరేగిన ఆధ్యాత్మిక సముద్రఘోష. ఈ రెండు నవలలు, దేనికదే సాటి”.

ఈ ప్రపంచ ప్రసిద్ధ నవలలు ప్రచురింపబడడానికి కనీసం రెండు వేలయేండ్ల పూర్వమే మహాభారతం, భగవద్గీత, వ్యాసమునీంద్రుని వాగ్దర్పణం నుండి వెలువడినవి. సమాజ శ్రేయస్సుకై వ్యక్తిగత శ్రేయస్సును తాకట్టు పెట్టడమే జీవన పరమార్థమని ఈ రెండూ తెలుపుతాయి.

వందలాది పాత్రలు కలిగిన తరతరాల మానవ సమాజమే భారత సంహితలోని “హిందూ మహాసముద్రం”.

రణరంగం నట్టనడుమ తక్షణ కర్తవ్యమేదో బోధపడక, మహాసముద్రం వలె ఘోషించే ఒకానొక వీరుని అంతరంగమే అర్జున విషాదయోగం.

గీతకు కథారూపం భారతం. భారతమనే కథకు పారమార్థిక సూత్రీకరణ భగవద్గీత.

“గీత ఒక తెగకు, ఒక ధర్మానికి పరిమితమైనది కాదు. అది సమస్త మానవాళికీ చెందినది” అంటారు డా రాధాకృష్ణన్:

“Gita is set forth as a tradition which has emerged from the religious life of mankind. It is articulated by a seer who sees truth in its many-sidedness and believes in its saving power. Gita represents not any sect of Hinduism, but Hinduism as a whole, not merely Hinduism but religion as such, in its universality, without limit of time and space, embracing within its synthesis the whole gamut of the human spirit, from the crude fetishism of the savage to the creative affirmations of the saint”.

ప్రతి వ్యక్తిలో దైవాంశతో బాటు దానవాంశ కూడా వున్నది. భగవద్గీత లోని దైవాసుర సంపద్విభాగ యోగంలో దేవ లక్షణాలైన సాత్వికప్రవృత్తులతో బాటు తామసిక ప్రవృత్తులైన దానవ లక్షణాలు కూడా క్షుణ్ణంగా బోధింపబడినవి.

లోకంలో దేవతలకన్న అసురులే అధికమని బృహదారణ్యకోపనిషత్తు ఘోషిస్తున్నది.

శాంతరస ప్రధానమైనది మహాభారతం. రాక్షసప్రవృత్తిని వీడి దేవతా ప్రవృత్తిని మానవజాతి అలవరచుకోవడమే జీవన పరమార్థమని మహాభారత సందేశం.

అసుర ప్రవృత్తికి అమృతం లభిస్తే భూమాతకే ప్రమాదమని పురాణాలు హెచ్చరించినవి. అందుకే జగన్మోహిని అవతారంలో ఉన్న మహావిష్ణువు అసురులకు అమృతం అందకుండా జాగ్రత పడతాడు. కారణం, సృష్టి బ్రహ్మ చేతిలో ఉన్నది కానీ, అసుర సృష్టి సంభవింపకుండా నిరోధించడం అతని చేతిలో లేని పని.

చరాచర ప్రకృతిలో తనను తాను దర్శించగల్గడమే మానవ జీవన పరమార్ధం. ఆత్మసంయమన యోగంలో గీతాచార్యుడు యిదే పేర్కొంటున్నాడు:

“సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్వ సమదర్శనః”

“యోగముతో కూడుకొన్న మనస్సు కలవాడు సమస్త చరాచర ప్రాణికోటి పట్ల సమదృష్టి కలవాడై తన్ను సర్వభూతములలో ఒకనిగా, సర్వభూతములు తనయందే ఉన్నవిగా దర్శిస్తున్నాడు.”

వ్యాసమహర్షి అవతరణతో భారతీయ సనాతన ధర్మం కొన్ని శతాబ్దాల పాటు తేజోవిరాజమానంగా ప్రకాశించింది.

ఇదే సమాజంలో తదుపరి కాలంలో సత్యము, ధర్మము, క్రమక్రమంగా నశింపసాగినవి. అంధవిశ్వాసాలీ భారత సమాజాన్ని పట్టి పీడింపసాగినవి. కులాలుగా, మతాలుగా, వందల కొలది చిన్నచిన్న రాజ్యాలుగా దేశం ఛిన్నాభిన్నమై పోయింది. శకులు, హూణులు, యవనులు, తురుష్కులు, పోర్చుగీసులు, డచ్, ఫ్రెంచి, బ్రిటీష్ దేశాల వారి దండయాత్రలు దశాబ్దాల తరబడి ఈ భూఖండంపై అవిచ్ఛిన్నంగా సాగి సనాతన జాతి జవసత్వాలను పీల్చి పిప్పి చేసినవి.

“మహమ్మదీయ మతం యీ దేశం నలుమూలలా విస్తరించడానికి కేవలం తురకల దండయాత్రలే కారణం కాదు. మానవుడు మరొక్క మానవుణ్ణి సాటివానిగా చూడలేని స్థితికి చేరడమే జుగుప్సాకరమైన భరతదేశపు పతనావస్థకు ప్రధాన హేతువు” అని స్వామి వివేకానంద పేర్కొన్నాడు.

ప్రపంచంలోని పలుదేశాల వలెనే ఆ కాలంలో భారతదేశంలో సైతం అసురప్రవృత్తి అడ్డు అదుపు లేకుండా వ్యాపించింది. మతమౌఢ్యం, అంధవిశ్వాసాలు, సాంఘీక దురాచారాలు, అనైక్యత, అంతులేని దారిద్ర్యం, యావత్ దేశానికీ శాపం వలె పరిణమించినవి.

పంతొమ్మిదవ శతాబ్దపు ఉత్తరార్థం, ఇరవయ్యవ శతాబ్దపు పూర్వార్థం ఈ దేశచరిత్రనొక మలుపు తిప్పినవి. ఆధునిక భారతానికి భావ చైతన్యం, విప్లవ స్పూర్తి ప్రసాదించిన మూల పురుషులు ముగ్గురు. ముగ్గురూ వంగదేశస్థులే: రాజా రామమోహనరాయ్, బంకిం చంద్ర ఛటర్జీ, స్వామి వివేకానంద.

ఆనందమఠం

దాదాపు 170 ఏండ్ద క్రింద బంకించంద్ర రచించిన నవల “ఆనందమఠం”. ఈ నవలలోనిదే “వందేమారత గీతం”. ఈ నవలలో వంగదేశంలోని హైందవ సన్యాసుల సమూహమొకటి వుంటుంది. ముస్లిమ్ పాలకులపై వారు విజయం సాధిస్తారు. తదుపరి భరతఖండాన్ని పాదాక్రాంతం చేసుకున్న బ్రిటిష్ వారిని పారద్రోలడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఆ సమూహానికి నాయకుడైన సన్యాసికి అదృశ్యగురువు వుంటాడు. ఆంగ్లేయులకు, సన్యాసులకు నడుమ భీకరమైన పోరు జరుగుతుంది. పలువురు కాషాయధారులు అందులో ప్రాణాలు పోగొట్టుకుంటారు. యుద్ధం జరిగిన నాటి రాత్రి గుట్టలుగా పడివున్న శవాల మధ్య కాషాయధారుల నాయకుడైన సన్యాసి సంచరిస్తున్న సమయంలోనే అకస్మాత్తుగా అతని కట్టెదుట ఆ అదృశ్య గురుదేవుడు ప్రత్యక్షమౌతాడు.

శిష్యునితో గురుదేవుడు ఇట్లా అంటాడు: “ఈ యుద్ధాన్ని కొనసాగించవద్దు. నీకీ సమరంలో విజయం ప్రాప్తించదు. అనవసరంగా నీ ప్రాణాలే పోతాయి.”

“ఆంగ్లేయులు నీకన్నా శక్తిమంతులు. విజ్ఞానవంతులు. వారు అమోఘమైన పాలనాదక్షులు. వారి అపార సైన్యబలం, యుద్ధవ్యూహా చతురత ముందు నీ సైన్యశక్తి, చతురతా అతి దుర్బలములు”.

“నీ దేశానికి ఆధ్యాత్మిక జ్ఞానం పుష్కలంగా వున్నది. దానికి బదులుగా ఆంగ్లేయులకు భౌతిక విజ్ఞాన శాస్త్రంలో అపారమైన ప్రావీణ్యత ఉన్నది. భౌతిక విజ్ఞాన సంపద నీ దేశానికి సమగ్రంగా లభ్యమయ్యే దాకా ఆంగ్లేయుల కన్న నీవెప్పుడూ వెనుకంజలోనే వుంటావు.”

“మొట్టమొదట ఆంగ్లేయుల వలె భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని, వారి పాలనాదక్షతను, వారి సైన్య శక్తినీ ఆర్జించు. ప్రస్తుతం నీ దేశం నైతిక పతనమనే అగాధమైన లోయకు చేరువలో వున్నది”.

“మొట్టమొదట నీ క్షీణసమాజాన్ని ఉద్ధరించు. ఆంగ్లేయులతో పోరాటానికిది సమయం కాదు”.

సన్యాసి గురుదేవుని మాటలు చెవిని పెట్టడు. “నేను పోరాడి తీరుతాను. వంగదేశపు పొలాలన్నీ తెల్లవారి రక్తంతో తడుపుతాను” అంటాడు.

వందేమాతరం

“నీ ఇష్టం” అంటూ గురుదేవుడు అదృశ్యమౌతాడు. మరునాటి పోరాటంలో ఆ సన్యాసి ఆంగ్లేయుల తుపాకీ గుండ్లకు గురియై వెల్లువలై పారే రక్తంతో “వందేమారతం” అని బిగ్గరగా నినదిస్తూ నేలపై పడి ప్రాణాలు విడుస్తాడు.

ఈ నవల వెలువడిన పిదప 1857 నాటి ప్రథమ భారత సంగ్రామం జరిగింది. దానిలో తంతియా తోపే, వీరవనిత లక్ష్మీబాయి వంటి వారు ప్రాణాలు పోగట్టుకున్నారు. ఆ తిరుగుబాటు బ్రిటీష్ వారిచే నిర్దాక్షిణ్యంగా అణిచివేయబడింది.

1905 లో కర్జన్ ప్రభువు చేతులమీదుగా వంగదేశ విభజన జరిగిన అనంతరం దేశంలో మరొక్కమారు సాయుధ విప్లవం చెలరేగింది. ఖుదీరామ్ బోస్ వంటి ముక్కు పచ్చలారని బాలకులు సైతం తమ నిండు ప్రాణాలు ఆ పోరాటంలో బలి పెట్టవలసి వచ్చింది. ఆ ఉద్యమాన్ని సైతం ఆంగ్లేయులు ఉక్కు పాదంతో అణగద్రొక్కినారు.

లోకమాన్య తిలక్ నిర్యాణానంతరం, 1920 నుండి 1947 దాకా జరిగిన స్వాతంత్ర్య మహోద్యమానికి నాయకుడు మహత్మాగాంధీయే.

“అహింసా పరమోధర్మః” అనే ఆర్షవాణి ఈ సత్యాగ్రహోద్యమానికి ప్రేరణ. మరొక ప్రేరణ “The principles of civil disobedience” అనే గ్రంథం. అమెరికన్ తత్వవేత్త హెన్రీ డేవిడ్ థోరూ రచించినది. ఈ అహింసా సూత్రాలపై ఆధారపడి దక్షిణ ఆఫ్రికాలో గాంధీజీ సాగించిన పోరాటం విజయవంతమైనది. అదే అహింసా సూత్రాలపై ఆధారపడి భారతదేశంలో అదే బాపూజీ కొనసాగించిన ధర్మయుద్ధం భారత చరిత్రనే కాక ప్రపంచ చరిత్రనే మలుపు తిప్పింది. సాయుధులైన సైనికులు లేని సహాయ నిరాకరణోద్యమమది. పీడిత మానవకోటి సత్యము, ధర్మములే ఆయుధాలుగా సలిపిన పోరాటమది. ప్రతి యోధునికీ గీతాబోధనలే శిరోధార్యమైన దినాలవి. లోకమాన్య తిలక్, గాంధీజీ, మాలవీయ, వినోబాబావే, జవహర్ లాల్ నెహ్రూ, సుభాస్ బోస్ వంటి పోరాట యోధులందరూ గీతచే ప్రేరేపితులైన వారే.

ఇరవయ్యవ శతాబ్దపు పూర్వార్థం జాతి పునురుజ్జీవన యుగం. గోఖలే, తిలక్, రానడే వంటి నాయకులు, రబీంద్రనాధ్ టాగోర్ వంటి కవీశ్వరులు, అవనీంద్రనాథ్ వంటి చిత్రకారులు, జగదీశ్ చంద్రబోస్, సివీ రామన్ వంటి శాస్త్రజ్ఞులు, రామకృష్ణ పరమహంస, వివేకానంద, అరవిందయోగి, రమణమహర్షి వంటి యోగి పుంగవులు, డా. రాధాకృష్ణన్, జిడ్డు కృష్ణమూర్తి వంటి తత్వవేత్తలు ప్రభవించిన కాలమది.

మహాత్మాగాంధీ ధనుర్ధారి

ఆధునిక భారతీయ సాంస్కృతిక పునురుజ్జీవన యుగంలో మహాత్మ గాంధీయే ధనుర్థారి యైన అభినవ పార్థుడు. సత్యమే ఆయన ధనస్సు. అహింస ఆయన బాణ సముదాయం. సత్యాగ్రహమే ఆయన సమరవ్యూహం. నిరాయుధులైన కార్యకర్తలే ఆయన సైన్యం.

1905 నాటి వందేమారతం ఉద్యమంలో పాల్గొని శిక్ష అనుభవించిన యోధులలో అరవింద ఘోష్ కూడా ఒకడు. అనతి కాలంలోనే రాజకీయాలకు స్వస్తి పలికి, పుదుచ్చేరి కేంద్రంగా ఆ యోగి అనంత ఆధ్యాత్మిక ప్రస్థానం సాగింది. ఆధునిక భారతపు అసమాన విద్వాంసుడు, కవి, బహుభాషాకోవిదుడే గాక, భవిష్యత్ దార్శనికుడైన మహా యోగి పుంగవుడు, అభినవ వ్యాస మహర్షి, అరవింద ఘోష్. అరవిందుని ఆధ్యాత్మిక రచనలు అపూర్వములు, అసంఖ్యాకములు.

భారతదేశానికి స్వాతంత్ర్యం లభించినప్పుడు జాతికి అరవిందయోగి ఇచ్చిన సందేశాన్ని తిరుచిరాపల్లి ఆకాశవాణి కేంద్రం ప్రసారం చేసింది. ఆ సందేశంలో ఆయన అన్నాడు:

“నా జన్మదినం ఆగస్టు 15. స్వతంత్ర భారతం కూడా ఆగస్టు 15 ననే ప్రభవిస్తున్నది. ఇది యాదృచ్ఛికం కాదు. పరమేశ్వరుని నిర్దేశం”.

“నా చిరకాల స్వప్నాలివి”:

“నా మొదటి స్వప్నం సమగ్ర, సమైక్య, స్వేచ్ఛాభారతం అవతరించడం. ఈశ్వరకృపతో ఆ కల నేడు నెరవేరింది. కానీ మతప్రాతిపదికన ఈ దేశం నేడు విడిపోవడం దురదృష్టకరం. ఈ విభజన ఏదో ఒకనాడు తొలగి, అప్రయత్నంగానో, ప్రయత్నపూర్వకంగానో, సమైక్య భారతం పునః అవతరించక తప్పదు”.

“ఈ దేశం హిందువులుగా, మహమ్మదీయులుగ, భౌగోళికంగానే గాక మానసికంగా సైతం విడిపోవడం భారతజాతికి శ్రేయస్కరం కాదు. దీనివల్ల దేశం అనేక అల్లర్లను, అనర్థాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ రెండు జాతులు నరస్పర ద్వేషభావన కలిగి వుండడంచే దేశం బలహీనమై, మళ్లీ విదేశీయుల చేతుల్లో పడి స్వాతంత్ర్యం కోల్పోయే ప్రమాదం సదా పొంచి వుంది”.

“నా మరొక స్వప్నం ఆసియా ఖండం స్వేచ్ఛా ప్రపంచంలో అడుగు పెట్టడం, వసుధైక ప్రపంచ సాధనకై తన పాత్రను పోషించడం. ఆ కల కూడా నెరవేరుతున్నది.”

“నా మరొక స్వప్నం వసుధైక ప్రపంచం ఆవిర్బవించడం. ఈ సాధనలో భారతదేశం నిర్వహించవలసిన పాత్ర ఎంతో గణనీయమైనది. ఆ కల కూడా తప్పక వాస్తవ రూపం ధరిస్తుంది”.

“యావత్ ప్రపంచం భారతావని యొక్క సనాతన ఆధ్యాత్మిక చింతనను వరప్రసాదంగా పొందడం నా మరొక కల. ఇప్పటికే ఐరోపా, అమెరికా ఖండాలపై భారతీయతా ప్రభావం ఉన్నది. ఈ ప్రభావం విశ్వ వ్యాప్తమై జ్వాలాతోరణంగా ప్రకాశించడానికి ఎంతో కృషి అవసరం. ఈ దిశగా హైందవ సోదరులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేయవలెను.”

“ప్రతి మనిషీ అతీంద్రియ జ్ఞానిగా ఎదగడం, ఉన్నతో న్నతమైన ఆధ్యాత్మిక జీవన సోపానాలను అధిరోహించడం, సమగ్ర సుందరం, ఆవంత దోషమైనా లేని స్వచ్ఛ స్ఫటికాకారపు మానవాభ్యుదయ సమాజం స్థాపింపబడడం నా చివరి కల. ఈ స్వప్న సాఫల్యానికి, భారతదేశమే చొరవ తీసుకోవలసి వున్నది”

“ఈ స్వప్నాలకు వాస్తవ రూపం కల్పించడం స్వతంత్ర భారతావనికి సాధ్యమా అసాధ్యమా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.”

ఆభినవ వ్యాసుడైన అరవింద యోగి సమాధి చెంది నేటికి దాదాపు డెబ్భై ఏండ్లు గడచినవి. ఆయన కలలు గన్న భారతీయుల ఆధ్యాత్మిక ప్రగతి, ఆసియా ఖండం యొక్క ఆధ్యాత్మిక ప్రగతి, ఎంతదాకా నెరవేరినవో, ఈ దేశప్రజలందరూ ఆత్మవిమర్శ చేసుకోవలసి వుంది.

వసుధైక కుటుంబం

వసుధైక కుటుంబం యొక్క ఆవిర్భావంలో భారతదేశం యొక్క పాత్రను, అసియాఖండం యొక్క పాత్రను అరవింద మహర్షి నొక్కి వక్కాణించడంలో ఒక అంతరార్థం వున్నది.

ఒకానొకప్పుడు అన్ని మతాలు ఆసియాఖండం లోనే జన్మించినవి. హైందవ, జైన, బౌద్ధ ధర్మాలు, యూదు, మహమ్మదీయ, క్రైస్తవ ధర్మాలు, పారశీకుల జొరాస్ట్రియన్ ధర్మం, చైనా ప్రజల కన్ఫ్యూషియన్ ధర్మం, ఒకటేమిటి, సమస్త ధర్మాలు ఈ సువిశాలమైన ఆసియా ఖండం లోనే మొలకెత్తి, పాశ్చాత్య దేశాలన్నింటా శాఖోపశాఖలుగా వ్యాపించినవి.

నేడీ ఆసియాఖండం ఉద్రిక్త పరిస్థితిలో వుంది. ఇరవయ్యవ శతాబ్దపు తొలి రోజుల్లో స్వేచ్ఛాపథంలో, అభ్యుదయ సూత్రాలే ఆధారంగా పురోగమించిన భారత్, చైనా, రష్యా, టర్కీ, ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలన్నీ నేటి ఇరవయ్యొకటవ శతాబ్దంలో మితవాదానికే ఆహ్వానం పలుకుతున్నాయి. పలుదేశాల్లో సామ్యవాద శక్తులు కుప్పకూలినవి. విశాల మానవాభ్యుదయం బదులుగా, ప్రకృతి వనరులను దోచుకొనే పెట్టుబడి దారులదే పై చేయి నేడు. అసుర గణాలు దేశదేశాలా విజృంభిస్తున్నాయి. వాటికే అమృతం పోస్తూ మన చేటు మనమే కోరి తెచ్చుకుంటున్నాము. “ఏకం సత్ విప్ర బహుదా వదన్తి” అని ఎలుగెత్తి చాటిన చోట మత ద్వేషం పెరుగుతున్నది. మానవునికీ, మానవునికీ నడుమ పరస్పరాద్వైతం సాధింపవలసిన మతాలు మనుషుల నడుమ చిచ్చు పెడుతున్నాయి. బధిరాంధులైన ఆసియా దేశనేతలు స్వేచ్ఛను కోల్పోయిన ఆఫ్ఘన్ ప్రజల గోడు పట్టించుకోవడం లేదు.
మానవకోటికే ఆచార్యత్వం నిర్వహింపవలసిన హైందవజాతి కర్తవ్యతా విమూఢమై, ఉదాసీనత వహిస్తున్నది. అణ్వస్త్రాలు పలుదేశాలు సమకూర్చుకొని ఒకదానిపై ఒకటి కాలుదువ్వుతున్నాయి.

ఈ ధర్మగ్లాని నుండి, భారతావని, తక్కిన ఆసియా దేశాలు ఏనాటికి విముక్తి సాధించగలవు? వసుధైక కుటుంబాన్ని ఆసియా ఎప్పుడు సాధించగలదు?

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles