Friday, April 26, 2024

మిత్రుల గుండెల్లోనే ఉంటాడు దేవిప్రియ

కొంతమందికి కొందరు ఆప్తమిత్రులు ఉంటారు. ఒక వ్యక్తికి మహా అయితే డజను కంటే ఎక్కువమంది ప్రాణమిత్రులు  ఉండరు. తక్కినవారంతా స్నేహితులూ, బంధువులూ. కానీ దేవిప్రియకి పాతికమందికి పైగా ఆప్తులు అనిపించుకునేవారు ఉన్నారు. వారిలో ప్రతి వ్యక్తితో ఆయనకి ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. ప్రతి మిత్రుడూ తానే అందరికంటే దేవిప్రియకు సన్నిహితుడుగా భావించేవాడు. అటువంటి ఆప్తమిత్రులలో శివారెడ్డి వంటి కవులు ఉండేవారు. నా బోటి జర్నలిస్టులు ఉండేవారు. పల్లా రాజేశ్వరరెడ్డి వంటి విద్యావేత్తలూ ఉండేవారు. డాక్టర్ నీలిమ, శ్రినివాస్ వంటి వైద్యులూ ఉండేవారు. అది దేవిప్రియలోని స్నేహశీలం. హృదయవైశాల్యం, వైవిధ్యం.

నాలుగున్నర దశాబ్దాల మైత్రి

మాది నాలుగున్నర దశాబ్దాల మైత్రి. మొదటిసారి కలుసుకున్న క్షణం నుంచీ నన్ను ఖాన్ సాబ్ అని పిలవడం, నేను కూడా ఆయనను అదే పేరుతో పిలవడం అలవాటు. ఎందుకు అట్లా జరిగిందో ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ముస్లింగా జన్మించిన ఆయన కంటే నేను మంచి ఉర్దూ మాట్లాడతాననే అభిప్రాయం ఉండేది. బహుశా అది కారణం కావచ్చు. దేవిప్రియ మంచి మాటకారి. స్నేహితులతో అత్యంత అభిమానంగా, ప్రేమగా మాట్లాడటం అతడి కంటే బాగా తెలిసినవారు నాకు ఎవ్వరూ తారసపడలేదు. ఉదయం ఫోన్ వస్తే ‘రాత్రి కలలోకి వచ్చారు ఖాన్ సాబ్. మనం ఇద్దరం న్యూయార్క్ వీధులలో తిరుగుతున్నామట. మీరు స్టాట్యూ ఆఫ్ లిబర్టీని మరోసారి చూద్దాం పదండి అన్నారట. అక్కడికి వెళ్ళి ఇద్దరం స్టాట్యూ కింద ఫొటో దిగామట,’ అంటూ కబుర్లు చెప్పేవారు. కలలో కనిపించడాన్నిసందర్భంగా చేసుకొని అనేక సార్లు ఫోన్ చేశారు.

ఇది చదవండి: దేవిప్రియ ఇక లేరు

ఖేలావని

సరిగ్గా నలభై అయిదు సంవత్సరాల కిందట నేను బెంగుళూరులో ‘ఆంధ్రప్రభ’ ఉపసంపాదకుడుగా పని చేస్తున్న రోజుల్లో నా చేత ‘ఖేలావని’ శీర్షిక కింద క్రీడావ్యాఖ్య రాయించేవారు. అసిస్టెంట్ ఎడిటర్ , జర్నలిజంలో మా గురువుగారు కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యంగారి అనుమతి తీసుకొని వారంవారం ప్రజాతంత్రకు వ్యాసాలు రాసేవాడిని. పొల్లుపోకుండా అందమైన శీర్షికతో ప్రచురించేవారు. హైదరాబాద్ వచ్చినప్పుడు విధిగా కలుసుకొని కొన్ని గంటలు కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ, స్వయంగా ఎన్ని పనులు సమాంతరంగా చేస్తున్నప్పటికీ ఆయన మొహంలో శ్రమపడుతున్న భావన కనిపించేది కాదు. తొందరగా మాట్లాడటం ముగించి పని చేసుకోవాలన్న ధోరణి అస్సలు ఉండేది కాదు. మిత్రులకోసం ఎంత సమయం కేటాయించడానికైనా సిద్ధంగా ఉన్నట్టు కనిపించేవాడు.

ఉదయంలో సహచరులం

ఇద్దరం ‘ఉదయం’ దినపత్రికలో పని చేశాం. నేను విజయవాడ ఎడిషన్ బాధ్యుడిగా ఉండేవాడిని. ఆయన హైదరాబాద్ లో ‘ఆదివారం అనుబంధం’ చూసేవారు. అప్పుడప్పుడు విజయవాడ వచ్చి అందరినీ పలకరిస్తూ ఉండేవారు. అటువంటి ఒక సందర్భంలో మార్క్సిస్టు మహానాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య నిర్యాణం జరిగింది. సుందరయ్యగారు నాకు ఆదర్శనాయకుడు. ఇంగ్లీషు జర్నలిజం నుంచి తెలుగు జర్నలిజంలోకి మారడానికి కారకుడు. నేనూ, దేవిప్రియ ఇద్దరం వెళ్ళి సుందరయ్యగారికి శ్రద్ధాంజలి ఘటించాం. అప్పటి ఫొటో ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది. దేవిప్రియ ఆల్బమ్ లో కూడా ఉండేది. ఆ రోజు విజయవాడ ఆఫీసులో కూర్చొని దేవిప్రియ సుందరయ్య మీద ‘రన్నింగ్ కామెంటరీ‘ రాశాడు. టెలిప్రింటర్ పైన మోహన్ కి పంపిస్తే బొమ్మ వేశాడు. ఆ రోజు రన్నింగ్ కామెంటరీ మార్క్సిస్టు పార్టీ నాయకులకు బాగా నచ్చింది. పార్టీ ఆఫీసులో గోడమీద ఎనిమిది పాదాలూ రాసుకున్నారు.

ముగ్గురు అసాధారణ ప్రతిభావంతులు

నేను ’ఉదయం‘ సంపాదకుడిగా 1989 నవంబర్ లో హైదరాబాద్ వచ్చిన తర్వాత నిత్యం కలుసుకునేవాళ్ళం. ‘ఉదయం’ లో ముగ్గురు అసాధారణ ప్రతిభావంతులతో కలసి పని చేసే అదృష్టం నాది. పతంజలి, నేనూ ఒకే సంస్థలో సమానహోదాలో పని చేసినప్పటికీ ఒకే కార్యాలయంలో పని చేయలేదు. ఏబీకే ప్రసాద్ గారు ‘ఉదయం’  స్థాపించి, కొంతకాలం నిర్వహించి, వాసుదేవరావుగారితో కలసి నిష్క్రమించిన తర్వాత పతంజలి హైదరాబాద్ ఎడిషన్ బాధ్యతలు చూసేవారు. నేను విజయవాడ, తిరుపతి ఎడిషన్ల బాధ్యతలు నిర్వహించేవాడిని. ఇద్దరం చెరో రోజూ సంపాదకీయాలు రాసేవాళ్ళం. తెలుగు సాహిత్యంలో అసాధారణ నవలారచయితగా శాశ్వతంగా నిలిచిపోయే సృజనశీలి పతంజలి. మరో అసాధారణ వ్యక్తి మోహన్. అతడంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. బాగా చదువుకున్నవాడు. అద్భుతమైన గీత సృష్టించే అసాధారణమైన ప్రజ్ఞ అతడి సొంతం. దేవిప్రియ సరేసరి. మనతో మాట్లాడుతూనే ఉంటాడు, మనసులో పాదాలు అల్లుకుంటూ ఉంటాడు. రాత్రి ఎనిమిదింటి దాకా ‘ఉదయం’ కార్యాలయానికి వచ్చే అని రకాల పత్రికలూ తిరగేస్తూ, వచ్చిపోయేవారితో మాట్లాడుతూ ఉండేవాడు. రాత్రికి రన్నింగ్ కామెంటరీ రాసిన కాగితం నా దగ్గరికి పంపించేవారు. అందులో మార్పు చేయవలసిన అవసరం సర్వసాధారణంగా ఉండేది కాదు. పత్రిక విధానాలకి సంబంధించి ఇబ్బందులు ఏమైనా ఉంటే చూసేందుకు నాకు పంపించేవారు. నేను మోహన్ దగ్గరికి పంపేసరికి రాత్రి ఎనిమిదిన్నర అయ్యేది. అప్పటికే మోహన్ చుట్టూ అరడజను మంది సహచరులూ, మిత్రులూ కూర్చొని టీలూ, సిగరెట్లూ తాగుతూ ఎడతెగని చర్చ నడిపిస్తూ ఉండేవారు. ఒక కుర్రాడిని మోహన్ పక్క నిలబెట్టి ఒత్తిడి చేస్తే ఎడిషన్ పూర్తయ్యే ముందు బొమ్మ దిగేది. ఎడిషన్ అంతా సిద్ధమై చివరి ఐటంగా దేవిప్రియ-మోహన్ ల రన్నింగ్ కామెంటరీ పెట్టి పేజీలు విడుదల చేసిన సందర్భాలు అనేకం. ముగ్గురు మిత్రులూ ఈ లోకం వీడి వెళ్ళిపోయారు. ముందు పతంజలి, తర్వాత మోహన్, ఇప్పుడు దేవిప్రియ.

ఇది చదవండి: అంబేడ్కర్ రాజ్యాంగం డొల్లపదాల కలబోత కాదు : దేవిప్రియ

అమ్మచెట్టు నుంచి

అమ్మచెట్టు నుంచి చివరి పుస్తకం వరకూ అన్ని పుస్తకావిష్కరణల సభలలోనూ నేను ఉన్నాను. చిన్నతనంలో కవిత్వం రాశాను కానీ ఊహ తెలిసిన తర్వాత, క్షేత్రవాస్తవికతను పట్టించుకోవడం మొదలు పెట్టిన తర్వాత, జర్నలిజం వృత్తిగా ఎంచుకున్న అనంతరం కవిత్వానికి స్వస్తి చెప్పాను. మా తెలుగు మాస్టారు కొంపెల్లి కృష్ణమూర్తిగారు ఎనిమిదో తరగతి చదివే రోజుల్లోనే ఛందోబద్ధంగా పద్యాలు రాయించేవారు. కానీ వామపక్ష రాజకీయాలలో తిరిగి, వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఊహాజగత్తు నుంచి బయటికి వచ్చాను. అటువంటి అకవినైన నాతో కూడా దేవిప్రియ కవిత్వం రాయించాడు. ‘వార్త’లో సుమారు సంవత్సరం పొడుగునా కవితలు రాశాను. నేనే సంపాదకుడిని కనుక కవితలు బాగున్నా, లేకున్నా ప్రముఖంగా ఎడిటోరియల్ పేజీలో ప్రచురించేవాళ్ళం. న్యూయార్క్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్స్ పైన ఉగ్రవాదులు దాడి చేసిన రోజున కవిత్వానికి స్వస్తి చెప్పాను.  డైలీ సీరియల్ మొదలు పెట్టాను. దేవిప్రియ కవిత్వాన్ని ఆస్వాదించడం మాత్రం నేను మానలేదు. ఎప్పుడు అంత తెలుగు నేర్చుకున్నాడో, ఎప్పుడు అంతలా చదువుకున్నాడో తెలియదు. తెలుగుతో పాటు ఇంగ్లీషుపైన కూడా సమానాధికారం ఉండేది. ముఖ్యంగా తెలుగు పరిజ్ఞానం చిన్నప్పటి నుంచే దండిగా ఉండేది. క్రమంగా నేర్చుకొని, అధ్యయనం చేసి సంపాదించుకున్నవిద్య  కాదు అది. తెలుగుసాహిత్యం సంపూర్ణంగా నేర్చుకున్న తర్వాతనే పుట్టినట్టున్నాడు. అక్షరం రాయడం ప్రారంభించినప్పటి నుంచీ అవలక్షణం లేకుండా, ఆక్షేపణకు అస్కారం లేని పదాలే కాగితంపైన పడేవి. శివారెడ్డి, నారాయణరెడ్డి వంటి కవులతో సమానంగా, కొండొకచో వారికంటే మిన్నగా, భిన్నంగా, వేగంగా, మనోరంజకంగా, ఆలోచింపజేసే విధంగా, నిరవధికంగా సాగిన కవితాప్రస్థానం దేవిప్రియది. ఆయన సమకాలికులందరి కంటే భిన్నమైన వ్యక్తిత్వం. ఆత్మవిశ్వాసం ఉండేది. అక్షరం స్వరూపంలో, ధ్వనిలో రాజీపడే ప్రసక్తి లేదు. నూటికి నూరు పాళ్ళూ ఫర్ఫెక్షనిస్టు.

అజంతాను తలపించేవాడు

ఈ విషయంలో దేవిప్రియను ఎప్పుడు చూసినా నాకు అజంతా గుర్తుకు వచ్చేవారు. అజంతాతో, దీక్షితులుతో నేను ‘ఆంధ్రప్రభ’లో ప్రత్యక్షంగా 1979 నుంచి 1984 వరకూ పని చేశాను. ముఖ్యంగా అజంతా, దీక్షితులూ, నేనూ  కలసి రోజుకు కనీసం పది హెడ్డింగ్ లు ఖరారు చేయడానికి కొన్ని గంటలు జుట్టు పీక్కునేవాళ్ళం. నాలుగైదుసార్లు టీ తాగేవాళ్ళం. మాకు ఉన్న అనుభవానికీ, భాషాపరిజ్ఞానానికీ పది శీర్షికలూ అలవోకగా రాసి ఇచ్చేయవచ్చు. కానీ అజంతా ఆమోదం దుర్లభం. దీక్షితులూ, నేను ఒక్కొక్క శీర్షికకి చెరి ఐదారు ప్రత్యామ్నాయాలు రాసి చూపించేవాళ్ళం. ఒక్కొక్కసారి అక్షరాల ఆకారం నచ్చేది కాదు. ధ్వని నచ్చేది కాదు. కూర్పును ఒప్పుకునేవారు కాదు. హెడ్డింగ్ రాసి చూపించగానే గట్టిగా నిట్టూర్చేవారు. అంటే నచ్చలేదన్నమాట. ఆయనకు నచ్చే హెడ్డింగులు రాసే  సరికి మా తల ప్రాణం తోకకి వచ్చేది. అది గొప్ప శిక్షణ. ఆ విధంగా రాటు తేలాం. అజంతా లో నాకు కనిపించిన లక్షణాలు కొన్ని దేవిప్రియలో కూడా కనిపించేవి. న్యూస్ ప్రింట్ ముక్కలపై రాస్తూ,  ఉండలు చుట్టి పారవేస్తూ పోతూ ఉంటే ఎప్పటికో ఆయన మెచ్చేదీ, ఆయనకు నచ్చేదీ కాగితంపైకి వచ్చేది.

హెచ్ఎంటీవీలో మళ్ళీ

‘ఉదయం’ నుంచి దేవిప్రియ ముందుగానే ‘ఆంధ్రజ్యోతి’కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2009తో నేను హెచ్ఎంటీవీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న రోజుల్లో నా ఆహ్వానాన్ని పురస్కరించుకొని దేవిప్రియ ఆ సంస్థలో చేరారు. అక్కడ కూడా దృశ్యశ్రవణ మాధ్యమంలో ‘రన్నింగ్ కామెంటరీ’ ప్రయోగం చేశాం. 2009 డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినంనాడు నాటి హోంమంత్రి పి. చిదంబరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు అర్ధరాత్రి ప్రకటించారు. కొన్ని గంటల వ్యవధిలోనే లగడపాటి రాజగోపాల్, సీమాంధ్రకు చెందిన పెక్కుమంది కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీ ఎంపీలూ, ఎంఎల్ఏలూ రాజీనామాలు సమర్పించారు. తెలంగాణలో సంబరాలు, సీమాంధ్రలో కారాలూమిరియాలూ. సీమాంధ్ర, తెలంగాణ రాజకీయ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. ఒకరిపై ఒకరు వాగ్బాణాలు సంధిస్తున్నారు. ఆ దశలో సామరస్య సాధనకోసం ఏదైనా చేయాలని సంకల్పించాం. డిసెంబర్ 20న హైదరాబాద్ జూబిలీ హాల్ లో ప్రారంభమైన కార్యక్రమానికి ‘ఆంధ్రప్రదేశ్ దశ-దిశ‘ అని దేవిప్రియ, నేనూ కలిసే నామకరణం చేశాం. ఆ కార్యక్రమం ప్రతి ఆదివారం ఏదో ఒక జిల్లా కేంద్రంలో ఏడు మాసాలపాటు సాగి చరిత్ర సృష్టించింది.  ఇద్దరి బాటలూ వేరైన సందర్భాలలో కూడా మాటామంతీ నిరవధికంగా సాగుతుండేది. మా స్నేహంలో అపార్థాలు లేవు. అలకలు లేవు. ఒకరి పరిమితులు ఒకరికి తెలుసు కనుక, ఇద్దరం మంచి స్నేహితులం కనుక పరస్పరం గౌరవించుకుంటూ, ప్రేమించుకుంటూ జీవనయానంలో అత్యధికభాగం సాగించాం. సుదీర్ఘకాలంలో ఇద్దరి జీవితాలలో అనేక పరిణామాలు సంభవించాయి. చెప్పుకోవాలంటే అనేక సంగతులు ఉన్నాయి. మచ్చుకు కొన్నిటిని ప్రస్తావించాను.  

నిమ్స్ ఆస్పత్రిలో చివరి రోజులు

చివరి ఘట్టంలో నిమ్స్ ఆస్పత్రిలో నేను వెంట ఉండి చేర్పించాను. ఫలానా సమయానికి ఆస్పత్రికి వెళ్ళాలంటే నేను అల్వాల్ లో ఖాన్ సాబ్ ఇంటికి వెళ్ళాను.  ఆయనా, నేనూ, దేవిప్రియ కుమారుడు ఇవా నిమ్స్ కి వెళ్ళాం. కాలు కొంత భాగం తీసివేయాలని, కృత్రిమపాదం అమర్చుతారనీ, మామూలుగా నడవవచ్చుననీ డాక్టర్లు చెప్పారు. పల్లా రాజేశ్వరరెడ్డి ప్రభుత్వంలో మంచి హోదాలో ఉన్నారు. ఆయన నిమ్స్ కి వచ్చి డాక్టర్లతో మాట్లాడి ఒక రోడ్ మ్యాప్ ని సిద్ధం చేశారు. నేను ఆఫీసుకు పోతూ, ఇంటికి వెడుతూ నిమ్స్ దగ్గర ఆగి కొంతసేపు ఆయనతో గడిపేవాడిని. తెనాలి నుంచి మిత్రుడు సురేష్ రెండు విడతల వచ్చాడు. చివరి రోజున మాజీ ఎంఎల్ఏ రాజా (రాజేంద్రప్రసాద్), సురేష్ ఇద్దరూ కలిసి వచ్చారు. డాక్టర్ శ్రీనివాస్,  నీలిమలు కనిపెట్టుకునే ఉన్నారు. శివారెడ్డి వచ్చి కంట తడిబెట్టారు. దేవిప్రియ కుమార్తె సమత అక్కడే ఉంది. ఇవా తోడుగానే ఉన్నాడు. కాలు కొంత భాగం తీసివేసిన తర్వాత చొక్కా విప్పేసి చిరునవ్వు తగిలించుకొని ఒక ఫోటో తీయించుకొని మిత్రులందరికీ పంపించాడు. ధైర్యంగా ఉన్నాడు, కోలుకుంటున్నాడు, అంతా బాగానే ఉందనుకున్న దశలో పల్స్ రేటు పడిపోవడం, కిడ్నీ పని చేయకుండా పోవడంతో సంక్షోభం ఆకస్మికంగా కమ్ముకొచ్చింది. మూత్రపిండాలకు డయాలిసిస్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పల్స్ రేటు పూర్తిగా పడిపోయింది. ఒక గొప్ప కవినీ, ప్రతిభావంతుడైన పాత్రికేయుడినీ, అంత కంటే గొప్ప మిత్రుడినీ మృత్యువు కబళించింది.

మరచిపోవడం కష్టం

దేవిప్రియను మరచిపోవడం కష్టం. ఆయన గుర్తుకు వచ్చే సందర్భాలు జీవితంలో నిత్యం సంభవిస్తుంటాయి. ఆయన మాటలూ, చూపులూ, పలకరింపులూ ఎప్పటికీ పచ్చగానే, వెచ్చగానే గుండెనిండా ఉంటాయి. ఆయన లోటు సాహిత్య ప్రపంచంలో, జర్నలిజంలో తీరనిది అని చెబితే పడిగట్టు మాటగా వినిపిస్తుంది. కానీ దేవిప్రియ వంటి వ్యక్తి మరొకడు లేడు. అతడు లేని లోటు భర్తీ చేయడం ఎవ్వరి వల్లా కాదు. అతడిది ప్రత్యేకత సంతరించుకున్న వైవిధ్యభరితమైన వ్యక్తిత్వం. వస్త్రధారణలో, కవనరచనలో ఎంత అందంగా ముస్తాబై ఉండేవాడో మానసికంగా అంతే పరిశుభ్రంగా ఉండేవాడు. ఒకరి గురించి నిందాత్మకంగా మాట్లాడటం నేను వినలేదు. యువతీయువకులను ప్రోత్సహిస్తూ మాట్లాడటం విన్నాను. దేనికైనా చిరునవ్వే సమాధానం. చిరస్మరణీయుడు. మాబోటివారి గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాడు.

(హైదరాబాద్ లక్కీకాపుల్ సెంట్ హోటల్ లో ఆదివారంనాడు- 24 జనవరి 2021- సరస్వతీ సమ్మాన్ శివారెడ్డి ఆవిష్కరించిన ‘కవిసంధ్య ప్రత్యేక సంచిక’ లో ప్రచురితం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles