Sunday, September 15, 2024

దేవిప్రియ ఇక లేరు

  • నిమ్స్ లొ చికిత్స పొందుతూ అంతిమ శ్వాస
  • కాలుకు పుండై ఆస్పత్రిలో చేరిక
  • నాలుగు మాసాలుగా అస్వస్థత
  • శనివారం మధ్యాహ్నం అంత్యక్రియలు

హైదరాబాద్: ప్రముఖ కవి, జర్నలిస్టు, సీని గేయరచయిత దేవిప్రియ ఇక లేరు. ఇక్కడి నిమ్స్ లో చికిత్స పొందుతున్న దేవిప్రియ శుక్రవారం అర్ధరాత్రి (తెల్లవారితో శనివారం) కన్ను మూశారు. ఇటీవల ఆయనకు కాలిగి గేంగ్రిన్ అయిన కారణంగా మోకాలు కింది భాగం తొలగించారు. డాక్టర్ గంగాధర్ ఈ ఆపరేషన్ చేశారు. శస్త్రచికిత్స జరిగిన తర్వాత మూడు రోజుల వరకూ ఆయన కోలుకుంటున్నట్టు కనిపించారు. గురువారం నుంచి అకస్మాత్తుగా కిడ్నీ పని చేయక పోవడంతో సమస్యలు వచ్చాయి. అప్పుడు డయాలిసిస్ చేయాలని ఎక్యూట్ కేరే సెంటర్ కి తరలించారు. అవయవాలలో చాలా భాగం పని చేయడం లేదని చెప్పి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తరలించి వెంటిలేటర్ పెట్టారు. ఆ సంక్షోభం నుంచి బయటపడే అవకాశాలు తక్కువని వైద్యులు దేవిప్రియ కుమారుడు ఇవాతో శుక్రవారం సాయంత్రం చెప్పారు. వెంటిలేటర్ పై ఉన్న దేవిప్రియ కన్నుమూసినట్టు డాక్టర్లు ఈ రోజు (శనివారం) ఉదయం 7 గంటలకు ప్రకటించారు.

devi priya

సాహిత్య అకాడెమీ అవార్డు

దేవిప్రియకు 2017లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. ‘గాలిరంగు’ కవితా సంకలనం ఆధారంగా ఈ అవార్డు ఇచ్చారు.  గొప్ప కవిగా, జర్నలిస్టుగా, మేధావిగా పేరు తెచ్చుకున్న దేవిప్రియ అనారోగ్యంతో బాధపడుతూ కూడా కవితలు రాశారు. అనారోగ్య కారణంగా తన మానసిక పుత్రిక అని పిలుచుకునే డాక్టర్ నీలిమ శ్రీనివాస్ నివాసంలో మూడు మాసాలు ఉన్నారు. అక్కడి నుంచి అల్వాల్ లో సొంత ఇంటికి వెళ్ళే ముందు ‘చిక్కింది జింక’ అనే కవిత రాశారు. అందులోనే తన పని అయిపోయినట్టు ధ్వనించారు. అల్వాల్ లో ఆయన సొంత ఫ్లాట్ ఉంది. దాని పేరు ‘అమ్మచెట్టు’. చిన్ననాటి జ్ఞాపకాల కవితల సమాహారం ఆ పుస్తకం. కవిత్వంతో శ్వాసిస్తూ బతికి నికార్సయిన కవి దేవిప్రియ.

devi priya

షేక్ ఖాజా హుస్సేన్

షేక్ ఖాజా హుస్సేన్ గా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సరిగ్గా రెండేళ్ళకు 15 ఆగస్టు 1949లో జన్మించిన దేవిప్రియ విద్యాభ్యాసం గుంటూరులో జరిగింది. ఆయన ఓల్గాగా ప్రసిద్ధురాలైన లలితాదేవి సమకాలికులు, ఒకే కళాశాలలో చదువుకున్నారు. విద్యార్థిదశలోనే కవితలు రాశారు. సినిమాలకు స్క్రిప్టులూ, పాటలూ రాయాలనే అభిలాషతో మద్రాసు వెళ్ళారు.‘ప్రజాతంత్ర’ పత్రికకు చిన్న వయస్సులోనే సంపాదకుడిగా పని చేశారు. అందులోనే మహాకవి శ్రీశ్రీ ఆత్మకథను ‘అనంతం’ పేరుతో ప్రచురించారు. సమాజానందస్వామి పేరుతో సామాజికాంశాలపైన కవితలు రాసేవారు.

ప్రేమవివాహం

తాను ముస్లిం. కలం పేరు దేవిప్రియ. రాజ్యలక్ష్మి అనే క్రైస్తవ యువతిని ప్రేమించి హైదరాబాద్ తీసుకొని వచ్చి ప్రముఖ కవి శివారెడ్డి ఆశీస్సులతో పెళ్ళి చేసుకున్నారు. ఒక కొడుకు, ఒక కూతురు. ఇద్దరి వివాహాలు జరిపించారు. నాలుగేళ్ళ కిందట భార్య రాజ్యలక్ష్మి కన్నుమూశారు. ఒంటరిగా అల్వాల్ లోనే ఉండేవారు. సమీపంలోనే నివాసం ఉంటున్న కుమార్తె సమ్ము ఆయన బాగోగులు చూసుకునేవారు. నిమ్స్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు కొడుకూ, కూతురూ ఆయన దగ్గరే ఉన్నారు.

ఆంధ్రప్రభ, ఉదయం, ఆంధ్రజ్యోతి

అమ్మచెట్టు, నీటిపుట్ట, చేపచిలుక, తుపాను తుమ్మెద, గాలిరంగు, గరీబు గీతాలు, సమాజానందస్వామి గీతాలు మొదలైన సంపుటాలను వెలువరించారు. ఎన్నికల కమిషన్ సలహాదారు కె.జె. రావు జీవితంపైన ఇంగ్లీషులో పుస్తకం రాశారు. అడ్వర్టయిజ్ మెంట్ కాపీ రాయడంలో సిద్ధహస్తుడు. ఉదయం పత్రికలో రన్నింగ్ కామెంటరీ పేరుతో రాజకీయాలపైన సెటైర్లు రాసేవారు. వాటికి ప్రముఖ కార్టూనిస్టు మోహన్ బొమ్మలు వేసేవారు. రన్నింగ్ కామెంటరీకి విశేషమైన పాఠకాదరణ ఉండేది. ‘ఉదయం’ కంటే ముందు దేవిప్రియ, మోహన్ ‘ఆంధ్రప్రభ’లో ఇదే ప్రయోగం చేశారు. ‘ఉదయం’లొ రెసిడెంట్ ఎడిటర్లుగా పనిచేసిన కె. రామచంద్రమూర్తికీ, పతంజలికీ బాగా సన్నిహితంగా ఉండేవారు. ‘ఉదయం’ తర్వాత ఆంధ్రజ్యోతిలో పని చేశారు. అనంతరం ‘హైదరాబాద్ మిర్రర్’ అనే పత్రిక నెలకొల్పి దానికి సంపాదకత్వం నిర్వహించారు. ‘ఉదయం’, ‘ఆంధ్రజ్యోతి’లొ ఆదివారం విభాగాన్ని పర్యవేక్షించేవారు.

స్నేహశీలి

దేవిప్రియ బాగొగులు చూసుకున్న ముఖ్యమైన వ్యక్తి శాసనమండలి సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి. నిమ్స్ లో రామచంద్రమూర్తి చేర్పించారు. దేవిప్రియ అనారోగ్యం సంగతి వైద్యులతో మాట్లాడి, ఆయనకు ఏ లోటూ లేకుండా వైద్యం జరగడానికి వ్యవస్థను ఏర్పాటు చేసినవారు రాజేశ్వరరెడ్డి. కవులలో, రచయితలలో, జర్నలిస్టులో వందలాది మిత్రులున్న దేవిప్రియ స్నేహమే ప్రాణంగా జీవించిన వ్యక్తి. మానవత్వం గుబాళించిన కవి, జర్నలిస్టు. ఆయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంతాపం తెలియజేశారు.

ఇది దేవిప్రియ చివరి కవిత. డాక్టర్ నీలిమ శ్రీనివాస్ నివాసంలో ఉన్న చివరి రోజుల్లో రాశారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles