Wednesday, May 8, 2024

అంబేడ్కర్ రాజ్యాంగం డొల్లపదాల కలబోత కాదు : దేవిప్రియ

దేవిప్రియ గాలిరంగు కవితా సంపుటికి కేంద్ర సాహత్య అకాడెమీ 2017 పురస్కారం అందుకున్న సందర్భంగా 2018, ఫిబ్రవరి 12 తేదీ న్యూఢిల్లీలో ప్రసంగించారు. అందులో ఓ భాగం:

‘నాది ధృడమైన మనసు కాకపోవచ్చు. నా సాహిత్యంపై నాకు అలవిమాలిన గర్వం లేకపోవచ్చు. నా సాటి కవులలో కొందరికి ఉన్న ధారణశక్తి నాకు లేకపోవచ్చు. కానీ ఒక విషయం మాత్రం నేను బలంగా నమ్ముతున్నాను. మానవ విముక్తిని నేను నరనరానా కాంక్షిస్తున్నాను. అణచివేతకు గురైనవాడి స్వరాన్ని వినిపించడానికి నేను కట్టుబడి ఉన్నాను. అంతరాత్మను లెక్క చేయకుండా, మరణానంతర ఊహా ప్రపంచాలు, అభూత కల్పనల మోజులో కనుక మనం పడిపోతే రేపటి తరాలు పురాఅటవిక భవిష్యత్లోకి కళ్లు తెరుస్తాయి.

జైనయుగం తరువాత తమిళనాడులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు  చర్మం ఒలిసి వేలాడదీయబడిన వర్గాలకి పట్టినగతే ప్రశ్నించేవారికి ఇప్పుడు పడుతుందనే భయాలు పెరుగుతున్నాయి.

నిరంతర శోధనను ప్రేరేపించిన ఉపనిషత్తుల దేశంలో ఇలాంటి పరిస్థితులు, ఇప్పటికే సంఖ్య తరగిపోతున్న భారతీయ జిజ్ఞాసువులను వెంటాడుతున్నాయి.

ఒక పద్ధతి ప్రకారం సాగుతున్న హింసాత్మక దాడుల పీడకలలు, సగం ఆకలితో, సగం నిద్రతో అలమటిస్తున్న  దేశాన్ని కల్లోలపరచడం ఆగాలి.

వివేకవంతుల స్వరం బలంగా వినిపించకపోతే అరాచకశక్తుల గొంతులు పెరుగుతాయి.

ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత దేశంలో అధిక సంఖ్యాక ప్రజలు ఇప్పటికీ, శతాబ్దాలుగా అనుభవించిన బాధలు, కష్టాలనే ఇంకా భరిస్తున్నారు.

 ఈ పరిస్థితులు మన సృజనాత్మక ప్రపంచాన్ని ప్రభావితం చేయలేకపోతే మనలో ఏదో పెద్ద లోపం ఉందనే అనుకోవాలి.

వ్యవస్థ బాగానే ఉంది. మార్చవలసింది యేమీ లేదనుకోవడం కన్నా నిరర్ధకమైన ధోరణి మరొకటి ఉండదు.

ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. ఖండాలూ, సముద్రాలూ దాటి అవి చెవుల్లో హోరెత్తతూనే ఉన్నాయి.

ఇది ఆలోచనాపరులందరూ కళ్లు తెరవవలసిన సమయం.

వారు తమతమ సౌకర్యవంతమైన క్షేత్రాల్లోంచి బయటకు వచ్చి,

తమ పాదాల కింద జరుగుతున్న భూప్రకంపనలను స్పర్శించాలి.

భారత రాజ్యాంగంలోని ప్రవేశిక డాక్టర్ అంబేడ్కర్ మనకు అందించిన ప్రజాస్వామ్య పవిత్ర గ్రంథం అది డొల్ల పదాల కలబోత కాదు. సాహిత్య రంగంలో ఉన్న సామాన్యులమైన మనం, సామాజికంగా వెనకబడిన వర్గాలతో కలసి రాజ్యాంగ స్ఫూర్తి అమలు అయ్యేందుకు కృషి చేయాలి. సమాజంపై బాధ్యత కలిగిన ఒక కవిగా నేను 

దేశ నిర్మాణంలో రెక్కలు ముక్కలు చేసుకున్న ప్రజల చరిత్ర మాత్రమే బలంగా ఎలుగెత్తి చెప్పాలని ఆశిస్తాను.

అంతేకానీ అధికార దాహంతో రాజ్య విస్తరణ కాంక్షతో రక్తపుటేరులు పారించిన చక్రవర్తులు, జహాపనల చరిత్రను కీర్తించవలసిన పని నాకు లేదు.

accepting award from chairman, kerndriya sahitya academy
accepting award from chairman, kendriya sahitya academy

కవులుగా, రచయితలుగా మనం స్వప్నాల్ని ఆవిష్కరించడంతో పాటు వాటిని సాకారం చేసే దిశగా దేశ నిర్మాణానికి వినమ్రంగా ఇటుకలు అందించాలి.

రేపటి మన పిల్లలందరూ హాయిగా బడికి వెళ్లి చదువుకోగలిగే దేశ నిర్మాణం జరగాలి. జబ్బుల నుంచి విముక్తి కలిగించే ఆస్పత్రులు,

చేయడానికి పని, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు , వేసుకోవడానికి దుస్తులు ఉండాలి.

అన్నింటికన్నా ముఖ్యంగా ఆలోచించే స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కు ఉండాలి.

నేను స్వేచ్ఛకు ఇచ్చే నిర్వచనం ఇదే. అదే నా దష్టిలో అసలైన భారం.

మరణంపై దేవిప్రియ కవిత

మరణం

ఒక తీర్చలేని రుణం-

తల్లి కడుపునుంచి

తుదిశ్వాస నిశ్శబ్దం వరకూ

అదే నీ అసలు బతుకు,

దరహాసాల్లో

పరిహాసాల్లో

బృందఘోషలో

ఏకాంత శోషలో

మరణమే నీ యదార్థ చాయ..”

                         – దేవిప్రియ

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles