Thursday, June 13, 2024

బ్రహ్మ ముహూర్తం విశిష్టత

ఏదైనా ఒక పనిని ప్రారంభించడానికి నిర్ణయించుకున్న సమయాన్ని ముహూర్తం అంటారు. సూర్యోదయానికి రెండు ఘడియల ముందు “అసురీ ముహూర్తము” అని, దానికి రెండు ఘడియల ముందు కాలాన్ని “బ్రహ్మ ముహూర్తం” అంటారు. ఒక ఘడియకు 24 నిమిషాలు. ఒక ముహూర్తం అంటే రెండు ఘడియల కాలం. ఒక పగలు ఒక రాత్రిని కలిపి అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రమునకు 30 ముహూర్తాలు. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ కనుక దీనికి బ్రహ్మ ముహూర్తం అని పేరు. అంటే సూర్యోదయానికి 96 నిమిషాలకు ముందు “బ్రహ్మ ముహూర్తము” ప్రారంభమవుతుంది. ఇది బ్రహ్మ జ్ఞాన ధ్యానాదులకు అనుకూల సమయం. ఈ శుభ కాలానికి చదువుల తల్లి సరస్వతీ దేవి యొక్క పతి పేరు పెట్టడం జరిగింది.  కళాభ్యాసం కూడా ఈ సమయమున చేయాలని విశ్వసింపబడుతోంది. ఈ సమయాన్ని “సరస్వతీ యానం” అని కూడా అంటారు.

అనూరుడికి వరం

కశ్యప బ్రహ్మ, వినతలకు జన్మించిన వాడు అనూరుడు. ఆయన గరుత్మంతుని సోదరుడు. సూర్యునికి రథసారథి. వినత తొందరపాటుతో తన అండాన్ని పగుల గొట్టగా అంగవికలుడైన అనూరుడు జన్మించాడు. బ్రహ్మ ఆయనను సూర్యునికి సారథిగా నియమించి, అనూరుడు భూలోకములో మొదటగా కనిపించిన కాలమున బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారని, ఆ సమయానికి ఏ నక్షత్ర, గ్రహాలు కీడు చేయలేవు అని, అనూరునికి వరం ఇచ్చినట్లు, అందుకే బ్రహ్మ ముహూర్త కాలం ఉన్నతమైనదని పురాణగాధ.  ఇందులోని వాస్తవమేమిటంటే , ఈ సమయంలో ఏ పనులు చేసినా ఆశించిన ఫలితాలను సాధించవచ్చునని శాస్త్ర వచనాలు.  ఒక పరిశోధనా సంస్థ, విద్యలో  వెనకబడటంపై అధ్యయనం జరిపి, అలాంటి విద్యార్థులు బ్రహ్మ ముహూర్తమున చదివిన ఫలితం బాగా ఉంటుందని నిర్థారించారు.

“బ్రహ్మ ముహూర్తే ఉత్తిష్ఠే స్వాస్థ్య రక్షార్ధ మాయుషః

తత్ర సర్వార్థి శాంత్యర్థం స్మరేచ్ఛ మధుసూదనమ్”

‘బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి మాధవుని స్మరణతో కార్యోన్ముఖులైన వారికి ఆరోగ్యం, రక్షణ, ఆయుష్షు, సర్వ సంపదలు, సుఖ శాంతులు లభిస్తాయి. మహర్షి శుశ్రుతుని ప్రకారం తెల్లవారు జాము సమయం ( బ్రహ్మ ముహూర్తం) అమృతం వంటిది. అధర్వణ వేదం ప్రకారం ఈ సమయంలో చేసే సాధన వల్ల సత్వగుణ సంపద పెరుగుతుంది. సూర్యోదయం తర్వాత కూడా నిద్రిస్తే తమోగుణం (బద్ధకం, ఆలస్యం, అజాగ్రత్త…) పెరుగుతుంది. అర్థరాత్రి దాటే వరకూ మెలకువగా ఉండడం వల్ల రజోగుణం (క్రోధం, దంభం, దర్పం, విపరీత ప్రతిస్పందన…) పెరుగుతుంది. అందుకే తెల్లవారు జామున ఆలోచించు, పగలు కార్యోన్ముఖుడివికా! రాత్రి నిద్రోన్ముఖుడివికా! అంటారు మన మహర్షులు.

ఇదీ చదవండి :జ్యోతిష శాస్త్రంలో ఏకాభిప్రాయం అసాధ్యమేనా?

తెల్లవారుజామున పథకరచన

తెల్లవారు జామున ఆలోచించి, ప్రణాళికలు వేసుకోవటం వల్ల వ్యూహాత్మకంగానూ, ముందు చూపుతోనూ ఆలోచించి, ప్రతిస్పందించగల్గుతాం అంటారు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి కండోలిజా రైస్. తెల్లవారు జామున అంతర్ముఖలమై మేథోమథనం చేస్తే మనలోనే మనకు ఎన్నో విషయాలు అవగతమవుతాయి.  96 నిమిషాలు సూర్యోదయానికి ముందుగా మేల్కోని, తమతమ నిర్దేశిత పనులు చేసే వారికి లక్ష్య సిద్ది జరుగుతుందని నమ్మకం. అలాగే  పాఠ్యాంశాలను అధ్యాయనము చేయుట చాలా మంచిదని పెద్దలు చెబుతారు. తెల్లవారు జామున లేచే వారికి సూర్యుడి నుంచి, చంద్రుడి నుంచి, నక్షత్రాల నుంచి కాంతి లభించటం వల్ల అది అత్యంత శక్తవంతమైన  సమయమనీ, ఆ సమయంలో లేచే వారి జీవితం కాంతివంతమవుతుందని ఉపనిషత్తులు చెబుతున్నాయి. భగవంతుడిచ్చిన శక్తి అందరిలోనూ ఉంది. కానీ దాన్ని జాగృతం చేయాల్సిన బాధ్యత మనదే. శరీరాన్ని, మనసును ప్రకృతిలో లీనం చేసి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తుంటే శరీరానికి ఆరోగ్యం, మనసుకు ఆహ్లాదం మనవెంటే ఉంటాయి.

ఎవరు ప్రాజ్ఞుడు?

“కర్తవ్యమ్ ఆచారం కామమ్ అకర్తవ్యమ్ అనాచారమ్

తిష్ఠతి ప్రాకతాచారో యసః ఆర్య ఇతిస్మ్రతః”

చేయవలసిన పనులు చేయవలసిన సమయంలో చేస్తూ, చేయకూడనివి వదిలేస్తూ, సదాచారంతో మసలేవాడే ప్రాజ్ఞుడు/ వివేకవంతుడు. ‘తెల్లవారుజాము సమయం ఎంతో శక్తివంతమైంది. పవిత్రమైంది’. ఈ సమయంలో లేచి పని చేసుకుంటూ ఉంటే అసలు చెడు తలంపులు వచ్చేవి కావు. ఎప్పుడైనా అనివార్య కారణాల వల్ల తెల్లవారు జామున లేవలేకపోతే ఈ ప్రపంచం నన్ను వదిలేసి తన పనిని ప్రారంభం చేసిందని నాలో నేనే సిగ్గుపడేవాడినంటారు.. లోకమాన్య బాలగంగాధర్ తిలక్!

అదొక బాధ్యత

తెల్లవారు జామున లేవటం అనేది ఒక బాధ్యతగా మారాలి. అప్పుడే దాన్ని ఆనందించగల్గుతాం. దాన్ని బరువుగా భావించి ఎవరి కోసమో లేస్తున్నాం అనుకుంటే దాని ఫలితం, ఆనందం రెండూ తక్కువైపోతాయి. వివిధ పోటీలలో  పాల్గొనే వారిలో 90 శాతం పైగా తెల్లవారు జామున లేచి, సాధన చేసి పతకాలు సాధించిన వారే. స్వశక్తితో జీవితంలో ఉన్నత స్థానాలు అధిరోహించిన మేథావులు, రాజకీయ వేత్తలు, కళాకారులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, అధికశాతం తెల్లవారు జామున లేచి సాధన చేసిన వారే. తెల్లవారు జామున లేవడం తమ జీవిత ప్రాథమిక సూత్రంగా మలచుకున్నవారే. ఇదే విషయాన్ని సశాస్త్రీయంగా నిరూపించారు.

ఉదయం ప్రశాంతం

ఉదయం సమయంలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదలై, మనసులోని ఒత్తిళ్ళను తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. తలలో కుడివైపున ఉన్న ఒకానొక గ్రంధి జాగృతమై ఉన్నప్పుడు విద్యాభ్యాస పాటవాన్ని పెంచుతుంది.  ఆయుర్వేద శాస్త్రం ప్రకారం అపాన వాయువు సూర్యోదయం ముందు మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది. వ్యర్థ పదార్థాలను శరీరాన్నుంచి వదిలించి వేస్తుంది. అలాగే తెల్లవారు జామున శరీరంలోకి ప్రాణవాయువు కూడా ఎక్కువ తీసుకోగలం. సాధారణంగా తెల్లవారు జామున మాత్రమే రెండు నాసికా రంధ్రాల నుంచీ వంద శాతం గాలి పీల్చగలం. మిగతా సమయాల్లో ఒకటి 50 శాతం, ఒకటి 100 శాతం పని చేస్తాయి.

ముఖ్యనిర్ణయాలన్నీ తెల్లవారుజామునే

బెంజమిన్ ఫ్రాంక్లిన్… ‘గత 50 సంవత్సరాల్లో నేను నిద్రపోతూ ఎప్పుడూ సూర్యుడికి పట్టుబడలేదు.’ అంటారు.. అమెరికా రాజ్యాంగ పితామహుడు థామస్ జెఫర్‌సన్, జాతిపిత మహాత్మాగాంధీ కూడా తెల్లవారు జామున ఒక గంటలో చేయగలిగిన పని, మిగతా ఏ సమయంలోనైనా కనీసం రెండు, మూడు గంటలు పడుతుందని, ఆలోచనా స్పష్టత, అమలు చేసే పటిమ ఆ సమయంలో మెండుగా ఉంటాయని, తన జీవితంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు తెల్లవారు జామున తీసుకున్నవేననీ, చెప్పడం ఈ సమయానికి ఉన్న ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles