Thursday, May 2, 2024

మీడియా నిషేధంపై చంద్రబాబు మండిపాటు

  • స్పీకర్ తమ్మినేని కి లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబు
  • ప్రజాస్వామ్యంలో మీడియా ప్రధాన భాగస్వామి
  • మీడియా హక్కులు హరించే జీవో కూడా ఇచ్చారుః
  • చట్టసభల కార్యక్రమాలను ప్రసారం చేసిన తొలి ప్రభుత్వం టీడీపీదే

అమరావతి : శాసనసభ శీతాకాల సమావేశాలకు మీడియాను అనుమతించకుండా, మీడియా పాయింట్ ను తీసివేస్తూ ఆదేశాలు ఇవ్వటాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రధాన భాగస్వామి అయిన మీడియాను నిషేధించడం అప్రజాస్వామ్యం. ప్రజా సమస్యలపై ప్రజావాణి వినిపించి, చట్టసభల నిర్వహణను, జరిగే తీరును, చర్చలను ప్రజలకు యథాతథంగా చేరవేయడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమైంది.

ఈ ప్రభుత్వం గతంలో జీవో నెంబర్ 2430 ద్వారా మీడియా హక్కులను హరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే శిక్షించాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ జీవోను ఈ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ మీడియా కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఈ జీవోను తప్పుబట్టింది. ఇప్పుడు చట్టసభల్లోకి మీడియాను నిషేధించడం అంతకంటే దారుణమైన చర్యగా భావిస్తున్నాము.

నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షానికి ఉన్నది

ప్రజా సమస్యలపై ప్రభుత్వ స్పందనను, ప్రభుత్వ పాలనా శైలిని చర్చించి అవసరమైతే వాటిపై సలహాలు, నిరసనలు తెలిపే హక్కు ప్రతిపక్షానికి ఉంటుంది. అందులో భాగంగా అధికారపక్షం, ప్రతిపక్షం వ్యవహారశైలిని నిస్పక్షపాతంగా ప్రజలకు చేరవేసే అవకాశం ఒక్క మీడియాకు మాత్రమే ఉంది. అటువంటి మీడియాను నిషేధించడం, పత్రికా హక్కులను కాల రాయటం,  ప్రజాస్వామిక విలువలను అణగదొక్కటంగా మేము భావిస్తున్నాము. పార్లమెంటు సమావేశాలకు మీడియాను అనుమతించారు. అక్కడ లేని నిషేధం ఇక్కడ ఎందుకు విధిస్తున్నారు? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.

చట్టసభల చర్చను ప్రత్యక్ష ప్రసారం చేసిన ఘనత టీడీపీదే

1998లో తెలుగుదేశం పార్టీ దేశంలో ప్రథమంగా చట్ట సభల్లోని కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. అయినప్పటికీ చట్టసభల్లో జరిగిన చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేసి చట్టసభల్లో ప్రజాప్రతినిధుల వ్యవహారశైలిని ప్రజలకు చెప్పిన ఘనత టీడీపీదే. కాలక్రమేణా చట్టసభల్లోని కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం పార్లమెంటు కూడా ప్రారంభించింది. చాలా రాష్ట్రాలు కూడా దీన్ని ఆమోదించి అమలు చేస్తున్నాయి. కాబట్టి ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో టీడీపీ అవలంభించిన చర్యలు, అనుసరించిన విధానాలు అందరికీ తలమానికంగా నిలిచాయి. చట్ట సభల్లోని అంశాలను ప్రజలకు తెలియకుండా ఉండటానికి మీడియాను నిషేదించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.

అన్ని మీడియా సంస్థలకూ సమానావకాశాలు ఇవ్వండి

చట్టసభల్లోని కార్యక్రమాలను ప్రజలకు యథాతథంగా తెలియజేసే అవకాశం ఉన్న మీడియాను నిషేధించడంపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నిరసిస్తూ వెంటనే చట్టసభల్లో ప్రత్యక్ష ప్రసారాలను తరతమ భేదాలు లేకుండా అన్ని మీడియా సంస్థలకు అవకాశం ఇవ్వాలని, చట్టసభల సమావేశాలు జరుగుతున్నన్ని రోజులూ మీడియా పాయింట్ ను అనుమతించాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యంకి అర్థం సభలో మెజారిటీ అయినప్పటికి, సభా కార్యక్రమాలను యథాతథంగా ప్రజలకు తెలియజేసే అవకాశం ఇవ్వడమే నిజమైన పరమార్థం’’ అని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles