Monday, April 29, 2024

రామాయణంలో బుద్ధుణ్ణి ఎందుకు తిట్టారు?

ఉత్తర భారత దేశంలోని ఖుషీనగర్ సమీపంలో సాధారణ శకానికి ముందు 483 లేదా 400 బీసీఈలో బుద్ధుడు తన ఎనభయ్యవయేట మహాపరినిర్వాణం చెందాడు. ప్రస్తుతం ఇది ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ జిల్లాలో ఉంది. అక్కడ ఆయన స్మృతి చిహ్నంగా పడుకుని ఉన్న బుద్ధ విగ్రహం ఏర్పాటు చేశారు. తర్వాత కాలంలో ఆ విగ్రహం స్ఫూర్తితోనే పాలకడలిలో విష్ణుమూర్తి పవళించి ఉండడాన్ని రూపొందించుకున్నారు. ఒక్కొక్కటిగా- ‘అవతారాల’న్నీ ఆ తర్వాతే వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న బుద్ధ విగ్రహాల్ని మార్చి మార్చి, హిందూ దేవుళ్ళను చేసుకున్న విషయాలు తేటతెల్లమయ్యాయి. అయ్యప్ప అయినా, బాలాజీ అయినా, పండరినాధుడనా- నాశనం చేసిన బుద్ధవిగ్రహాలే! బౌద్ధారామాల్ని మార్చి ఆలయాలు చేసుకున్న ఘన చరిత్ర దాచేస్తే దాగేది కాదు గదా? ఈ విషయాల్ని దేశ ప్రజలు గుర్తించారు. గుర్తుంచుకున్నారు. ప్రతి విషయాన్నీ ఆ కోణంలో విశ్లేషిస్తున్నారు. సృష్టి జరిగినప్పుడు ఆ దేవదేవుడు దిగి వచ్చి వేదాలు, పురాణాలు, పవిత్ర గ్రంథాలు అన్నీ మనిషికి ఇచ్చి వెళ్ళాడు – అనేది అబద్ధమని తేలిపోయింది. బౌద్ధ సాహిత్యంలో హిందూ దేవీదేవతల్ని దూషించడం లేదు. హిందువుల పవిత్ర గ్రంథం రామాయణంలో బుద్ధుణ్ణి దూషించడం ఉంది. అంటే హిందువుల రామాయణ రచనకు ముందే బుద్ధుడు ఈ నేలమీద పుట్టి, బుద్దిజాన్ని ప్రచారం చేశాడనీ ఒప్పుకున్నట్టే కదా? కుట్రలు, దొంగతనాలు తప్పక బయటపడతాయి.

Also read: జూన్ 21ని ‘హ్యూమనిస్ట్ డే’ గా గుర్తుంచుకుందాం!

అసలు రాముడు ముందుగా బోధిసత్వుడైనప్పుడు, రామాయణంలో మళ్ళీ బుద్ధుణ్ణి తిట్టాల్సిన అవసరమేమొచ్చిందీ? – అనేది ప్రశ్న! అయితే జవాబు సులభంగా దొరకదు. కొంచెం లోతుగా పరిశీలించాలి. కలుషితమై ఉన్న మెదళ్ళను శుభ్రం చేసుకుని, కొత్తగా ఆలోచిస్తేనే విషయం బోధపడుతుంది! జంబూ ద్వీపమని పిలవబడ్డ ఈ భరతఖండంలో సమ్యక్ సభ్యత వర్థిల్లుతూ ఉండేది. తర్వాత క్రమంగా అది ఆసియా ఖండమంతా వ్యాపించింది. ఆ తర్వాత యూరోప్, అమెరికాల దాకా పాకింది. బుద్ధుని జాతక కథల్ని ఆసియా దేశాలన్నీ స్వీకరించాయి. అనువాదాలలో వాటిని తమ స్వంతం చేసుకున్నాయి. వాటిలో దశరథ జాతక కథ ఒకటి. ఇది సుత్తపిటకలోని ఖుద్ధక నికాయలో 461వ జాతక కథ. దీనిలో కథానాయకుడు బోధి సత్వుడైన రాముడు. అన్ని కథల వలెనే ఈ  కథ కూడా ఇతర బౌద్ధ దేశాలకు వెళ్ళింది. మార్పులు చేర్పులతో అది ‘రామాయణం’గా మారింది. ఆయనం అంటే పథం – మార్గం అని అర్థం. బోధి సత్వుడైన రాముడి మార్గం లేదా పథం అని అర్థం చేసుకోవాలి. అందరికి అందరూ ఆ కథను వారికి ఇష్టమైన రీతిలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేసుకున్నారు.

ఉదాహరణకు ఇండోనేషియాలో యోగేశ్వర్ రచనగా ‘‘రామాయణ్ క కావిన్’’ గా వెలువడింది. కంపూచియాలో ‘‘రామకీర్తి,’’ థాయ్ లాండ్ లో ‘‘రామకీయేన్,’’ లావోస్ లో ‘‘రామ్ జాతక్,’’ బర్మా (మయాన్మార్)లో రామ్ వత్య్రు,’’ మలేషియాలొ ‘‘హీకాయణ్ సేరీ రామ్,’’ ఫిలిప్పీన్స్ లో ‘‘మహాలాదియా లావణ్,’’ టిబెట్ లో ‘‘రామ్ కథ’’  చైనాలో ‘‘దశరథ కథనమ్,’’ ఇంకా ‘‘అనామక్ జాతకమ్,’’ మంగోలియావారి ‘‘రామ్ కథ,’’ జపాన్ వారి ‘‘రామ్ కథ,’’ శ్రీలంక ‘‘రామ్ కథ’’ నేపాల్ వారి ‘‘భానూ భక్తకృత రామాయణ్’’ ఉన్నాయి. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా దేశాలలో బుద్ధుణ్ణి ఇస్లామీకరణ  చేసుకుంటే – భారతదేశంలో అదే బుద్ధుణ్ణి బ్రాహ్మణీకరించుకున్నారు. బోధిసత్వుడైన రాముడి కథ ఇస్లాం దేశాలలో ఎక్కువ మార్పునకు లోను కాలేదు. కానీ, భారత దేశంలో మాత్రం రాముడి వ్యక్తిత్వమే పూర్తిగా మార్చేశారు. బోధిసత్వుడైన రాముణ్ణి హింసాత్మక రాముడిగా మార్చుకున్నారు. భారత దేశం నుండి ఇతర దేశాలకు వెళ్ళిన బౌద్ధ జాతక కథలు ముఖ్యంగా రాముడి కథ – కొద్ది మార్పులకు మాత్రమే లోనయ్యింది. పైగా, రాముడు ‘‘బోధిసత్వు’’డన్న విషయాన్ని ఎవ్వరూ మార్చలేదు. ఇప్పటికీ ప్రపంచ దేశాల్లోని రామాయణాల్లో రాముడు బోధిసత్వుడే! ఇక్కడ భారత దేశంలో మాత్రం రాముణ్ణి బ్రహ్మణవాదిగా చూపించడానికి నానా తంటాలు పడ్డారు.

Also read: మూఢనమ్మకాలపై కందుకూరి పోరాటం

వాల్మీకి రామాయణం అయోధ్య కాండ 108వ సర్గలో బుద్ధుణ్ణి దూషించడం కూడా జరిగింది. జాగ్రత్తగా గమనించండి.

యధాహి చోరః స తధా హి బుద్ధ్

స్వథాగత నాస్తిక్ మంత్ర్ విద్యీ

ఎలాగయితే, దొంగకు దండన అవసరమవుతుందో, అదే విధంగా వేదాలను వ్యతిరేకించే బుద్ధుడు ఇంకా అతని అనుచరులు, బౌద్ధమతావలింభికులు దండనీయులవుతారు.  బోధిసత్వుడి స్ఫూర్తితో సృష్టించుకున్న రాముడి వ్యక్తిత్వాన్ని మార్చివేయడమే కాకుండా, బుద్ధుడు వేదాలను దేవుణ్ణీ నిరాకించాడన్న నెపంతో, అక్కసు వెళ్ళబోస్తూ దూషించారు కూడా! అలాగే, ఇంకా చూడండి-

తస్మాధ్వి యః శక్యతమ్:  పూజానా

సనాస్తి కె నాభీ ముఖో బుద్ధస్యతూ      13511

తథాగత్ (నాస్తిక విశేషణం) ఇంకా నాస్తిక్ (చార్వాక)లను కూడా ఇదే క్రమంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజాక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాజు ద్వారా దొంగలకు ఎలాంటి శిక్షలు ఇప్పిస్తామో, నాస్తికులకు కూడా అలాంటి శిక్షలే ఇప్పించాలి. ఈ విషయంతో సంబంధం లేని నాస్తికుల పట్ల – పండితులైన బ్రహ్మణులు ఎప్పుడూ నిర్లిప్తంగా ఉండకూడదు. వదిలేయకూడదు – అని బ్రాహ్మణవాదులకు ఈ శ్లోకంలో ఒక హెచ్చరిక ఉంది.

రామాయణం రచించిన వాల్మీకి

సృష్టించుకున్న రాముడి పాత్ర గొప్పతనం చాటుకోవడానికి – కొన్ని శతాబ్దాలకు ముందు వాస్తవంగా జీవించిన బుద్ధుణ్ణి దూషించడం ఎందుకూ? వాల్మీకి రామాయణం అయోధ్య కాండలో తమ రాముణ్ణి పొగడుతూ పొగుడుతూ మధ్యలో ఇల బుద్ధుణ్ణి తిట్టడం కనిపిస్తుంది. ఒక నాటి సంస్కృతులన్నీ బుద్ధుని కాలంనాటి శ్రమన సంస్కృతితో ముడివడి ఉన్నవే..! ఆ విషయం బ్రాహ్మణార్యులు గ్రహించరు. కాలక్రమంలో నశించిపోయిన మానవ నాగరికతలు, సభ్యతలు, చిహ్నాలు పట్టించుకోరు. అవసరం లేకపోయినా ప్రతి విషయంలోనూ దూరి, తమ  వైదిక సంస్కృతిని జొప్పిస్తుంటారు. అందువల్ల, ఈ మనువాదుల దాడి ఈ నాటిది కాదు. దాన్ని తిప్పికొట్టాల్సిన తరుణం ఆసన్నమైంది! మన భారతదేశంలో హైందవమత బోధకులు ప్రచారం చేసిన రామయణాన్ని మనం బాగా జీర్ణించుకుని ఉన్నాం కాబట్టి, విషయం ఆ కోణంలోంచి చూడొద్దు. మనం మాట్లాడుతున్నది బౌద్ధ సాహిత్యంలోని దశరథ జాతక కథ గురించి. బోధిసత్వుడైన రాముడి గురించి, అంటే బుద్ధుడి గురించే –  ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి. సజీవంగా తిరుగాడిన బుద్ధుణ్ణి స్ఫూర్తిగా తీసుకుని, విష్ణుమూర్తిని, అతడి అవతారాలను సృష్టించుకున్నారన్న విషయం ముందు అర్థం చేసుకోవాలి.

Also read: సెంగోల్:  రాజ్యాంగం పై సర్జికల్ స్ట్రైక్

బుద్ధుడు జ్ఞాన సముపార్జనన కోసం రాజ్యం, అంతఃపురం, సుఖసంతోషాలు వదిలి మార్గం కనుక్కొవడానికి వెళ్ళాడు. సృష్టించుకున్న రాముడు తండ్రి మాట మీద అడవికి వెళ్ళాడు. ప్రపంచం గానీ, జనం గానీ ఆయన దృష్టిలో లేరు. ఒక ధ్యేయమే లేదు. వాస్తవానికీ, కల్పనకూ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. భార్యాబిడ్డల్ని సురక్షితంగా అంతపురంలో ఉంచి – బుద్ధుడు సమస్యాపరిష్కారం కోసం అడవికి వెళ్ళాడు. తనతో పాటు భార్యను అడవుల్లో తిప్పి, తనే సమస్యల్లో పడ్డాడు – దేవుడైన రాముడు. పైగా తాను సురక్షితంగా అంతఃపురంలో ఉండి, భార్యను అడవికి పంపించాడు. అమానవీయ, అనైతిక ప్రవర్తనలకు చిలువలు పలువలుగా వ్యాఖ్యానాలు చెప్పుకుని వైదిక మత ప్రబోధకులు తమ రామాయణం ఒక గొప్ప పవిత్ర గ్రంథమనే భ్రమ కల్పించారు. అందుకు మూలమైన బుద్ధుణ్ణి, బుద్ధుడి జీవితాన్ని దాచేశారు. ఈ దేశ మూలవాసుల్ని ఎలా దోచేశారో – అదే సూత్రం బౌద్ధ సాహిత్యానికి, బౌద్ధ విశ్వవిద్యాలయాలకూ వర్తింపజేశారు. హాయిగా సహజంగా జీవన విలువలతో ఉన్న ఒక మహా మానవుడి కథను మార్చి దేవుడి కథగా తిరగరాసుకుని… పాపం బ్రహ్మణార్యులు తరించిపోయారు!

బౌద్ధ భిక్షువులు

ఇరాక్ ప్రాంతం నుంచి వలస వచ్చిన ఆర్యులు తమ ఆదిపత్యాన్ని నిలుపుకోవడానికి తాము పవిత్రులమనీ, ఉన్నతులమనీ, బ్రాహ్మణార్యులమనీ ప్రకటించుకున్నారు. మనుస్మృతి, పురాణాలతో సహా అన్ని సంస్కృత గ్రంథాలూ రాసుకున్నారు. వాటితో దేశంలో వర్ణవ్యవస్థన సుస్థిరం చేశారు. వలస రావడం తప్పుకాదు. ఈ భూభాగం మీద స్థిరనివాసాలు ఏర్పరచుకోవడమూ తప్పుకాదు. ఆఫ్రికాలో మొదలైన ఆది మానవ జాతులు ప్రపంచ వ్యాప్తంగా వలసలు వెళ్ళాయని ఆధునిక జన్యశాస్త్రం ధ్రువీకరించింది. మూలవాసులని ఎవరినైతే అటున్నామో – వారు కూడా అంతకు ముందు ఆ మహావలసల ఒరవడిలో తరలి వచ్చినవారే. అయితే, తమను తాము స్థిరపరచుకోవడానికి అంతకు ముందున్న సంస్కృతుల్ని, జీవన విధానాల్ని, నాగరికతల్ని, భాషల్ని ధ్వంసం చేయడం దుర్మార్గం! తమ అబద్ధాలకు, కుట్రలకు, కుతంత్రాలకు పవిత్రతను ఆపాదించడం, తమను తాము దైవాంశసంభూతులమని ప్రచారం చేసుకోవడం- దౌర్జన్యం!! ముందుగా వచ్చి, హాయిగా స్థిరపడి, వ్యవసాయం, పశుపోషణ అభివృద్ధి చేసుకుని, సాంకేతిక పరిజ్ఞానం సాధించిన సింధూప్రాంత ప్రజల్ని దోచుకని, నాశనం చేసి వెళ్ళగొట్టింది ఎవరూ? తర్వాత కాలంలో వలస వచ్చిన బ్రాహ్మణార్యులే కదా? ఈ దేశంలోని చార్వాక, బౌద్ధ, జైన ఆలోచనా విధానాల్ని ధ్వంసం చేసి, తమదైన బ్రహ్మణవాదాన్ని ప్రవేశపెట్టి, శతాబ్దాలుగా జనాన్ని హింసిస్తున్నదెవరూ? దేవుడు, దయ్యం, జన్మ, పునర్జన్మ, శాంతి, పూజ, బలి వంటి మూఢనమ్మకాల్ని ప్రవేశపెట్టి, ప్రజల్ని మానసిక బానిసలుగా మార్చి పని చేయకుండా సుఖపడుతున్నది ఎవరూ? శ్రమకూ,  చెమటకూ విలువ లేకుండా చేసిందెవరూ? ప్రపంచంలో ఎక్కడా లేని సమస్యల్ని సృష్టించిన ఈ దోషుల్ని ఊరికే వదిలేస్తామా? వీరి అప్రకటిత అధికారాన్ని సాగనిస్తామా? వారి కుళ్ళు ఆలోచనల్ని ఎండగట్టమా? ప్రపంచ పౌరులంతా సమానులే – అన్న విషయం చెప్పి, ఒప్పించి ఒక విలువైన మానవవాద ప్రపంచాన్ని తీర్చిదిద్దుకోవాలి! ఊరికే ఆలోచిస్తూ కూర్చోవడం కూడా కాదు, ఇక ఆ దిశలో తక్షణం కార్యోన్ముఖులు కావడం అవసరం! అవసరం కాదు, అత్యవసరం!!

Also read: ‘జైహింద్’ ఆలోచన మన హైదరాబాదువాడిదే!

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles