Saturday, December 7, 2024

సాయం చేద్దాం.. సాయం పొందుదాం..

సంపద సృష్టిద్దాం – 23

‘‘సంపద సృష్టిద్దాం’’ పేరుతో ఒక శీర్షిక ప్రారంభిస్తున్నప్పుడు అందరి మనసుల్లో ఏవో అనుమానాలు. మార్కెట్లో చలామణిలో ఉన్న రకరకాల స్కీములు, స్కాముల గురించి పాఠకులకు విశదం చేస్తామనుకున్నారు కొందరు. మార్కెట్‌ ఎనాలిసిస్‌ చేస్తూ షేర్‌ మార్కెట్‌, మూచువల్‌ ఫండ్స్‌ గురించి తెలియజెప్తామనుకున్నారు మరికొందరు. ధనలక్ష్మీ మంత్రాలు, ధన సంపాదన యంత్రాల గురించి ప్రస్తావిస్తామనుకున్నారు ఇంకొందరు. కాని, దానికి భిన్నంగా ఈ శీర్షిక నడుస్తుందని ముందుగానే విన్నవించుకున్నాం. ఈ కాలమ్‌లో కేవలం ‘నిరంతరం తలచుకోవడం’ ద్వారా అంతులేని సంపద ఆర్జించవచ్చని చెప్పడం కొందరికి ఆశ్చర్యం కలిగించింది.   ఇది ఆకర్షణ సిద్ధాంతం అని, చాలా దేశాల్లో దీనిని విజయవంతంగా సాధన చేస్తున్నారని తెలుసుకున్నాక దీనిగురించి మన తెలుగు పాఠకులకు తెలియజెప్పాలన్న తాపత్రయంతో ప్రారంభించిన శీర్షిక ఇది.

Also read: వైద్యం విఫలమైన వేళ…

డబ్బే సమస్తం

కొంతమంది చాలా సునాయాసంగా డబ్బు గురించి చులకనగా మాట్లాడుతారు. వారికి డబ్బు పట్ల గౌరవం లేదని ఈ విశ్వానికి చెప్పడమన్న మాట అది. ‘డబ్బు చెట్లకు కాస్తుందా’ అమాయకంగా అడుగుతారు కొందరు. నిజానికి డబ్బును తయారుచేసే కాగితం చెట్టు నుంచి తయారైందే. అందుకని అదొక పనికిమాలిన మాటగా మనం భావించాలి. అలా మనతో ఎవరైనా మాట్లాడితే నిర్మొహమాటంగా వారు డబ్బు పట్ల చేస్తున్న తప్పిదాన్ని విశదపరిచి వెంటనే వారితో స్నేహం మానుకోవాలి. డబ్బుపట్ల నిర్లక్ష్య భావన కలిగినవారితో స్నేహబంధాన్ని తెంపుకోవడం.. వారికి మనం చేస్తున్న కీడుగా భావించకండి. మనకు మనం చేసుకుంటున్న మేలుగానే తలచండి. ‘డబ్బు పాపిష్టిది’ అని కొందరంటారు. ఇది మరీ బూతు. డబ్బు మన సంబంధ బాంధవ్యాలను చెడగొడుతుందనే ఉద్దేశంతో పుట్టిన పదబంధం ఇది. కాని డబ్బు లేనిదే దేనికీ మనం కొరగామని తెలుసుకుంటేనే మనకు బతుకు. ‘కుక్కను తంతే డబ్బు రాలుతుంద’ని కొందరంటారు. కాని కుక్కను తంతే కుక్క కరిచే ప్రమాదముంది గాని, పైసలు మాత్రం రాలవు. ఇలాంటి పడికట్టు పదాలను మనం వాడకూడదు. వినకూడదు. వారెన్‌ బఫెట్‌ చెప్పిన సూత్రాన్ని గుర్తు పెట్టుకోండి. రెస్పెక్ట్‌ మనీ. డబ్బును గౌరవించమని ఆయన చెప్పిన మాట చద్దన్నం మూట.

Also read: పారిపోవద్దు, ఫైట్‌ చేద్దాం!

ఆకర్షణ సిద్ధాంతం చాలా ప్రాచీనమైనది. మనిషంత ప్రాచీనమైనది. అయితే దానికి కావలసిందల్లా సరిగా ఆలోచించడమే. మన అంతశ్చేతనలో తిష్టవేసిన రుణాత్మక ఆలోచనలను బలవంతంగా బద్దలుగొట్టి తరిమేసి, పాజిటివ్‌ ఆలోచనలను ఓ క్రమ పద్ధతిలో మన మనసులో, మన హృదయంలో, మన ఆలోచన ధోరణిలో చేర్చడమే. మన మనసులో ఒక అద్భుత దీపం ఉంటుందని మనం చెప్పుకున్నాం. మనం తలచుకోగానే ఆ అద్భుతదీపం మన కోరికలను తీరుస్తుంది. కాని, ఆ కోరిక చాలా స్పష్టంగా ఉండాలి. దానికోసం పాజిటివ్‌ అఫర్మేషన్లు చేస్తుండాలి. ఈ విషయాలతో పాటుగా సమయానుకూలంగా డబ్బు మనల్ని చేరిన తర్వాత ఆ డబ్బును రెట్టింపు చేసుకోవడానికి, విశ్వం మనకు అందించిన డబ్బును సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా ఆర్థిక విషయాల గురించిన పాఠాలు చెప్పుకుంటున్నాం. అసలు ఆర్థిక రంగంలో మనిషి సాధిస్తున్న ఆలోచనల ప్రగతి అపూర్వమైనది. మనకంటూ విడిగా ఉండే ఆలోచనల కంటే డబ్బుకున్న మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి వీలుగా అనేకమంది ఆలోచనలను ఇందులో భాగంగా మీకు అందిస్తున్నాం.

Also read: సమస్తమూ అంతశ్చేతనతోనే..

అడుగు – నమ్ము – పొందు

మన పొరుగునున్న కేరళ, ఒడిషా రాష్ట్రాలకు తుపానులు కొత్త కాదు. అక్కడి ప్రజల జీవితాలలో కలకలం రేపుతుంటాయి. ఒక్కరోజు రాత్రికే ప్రచండ గాలులు జీవితాలను తలకిందులు చేస్తాయి. నాలుగేళ్ల కిందట అలా వచ్చిన ఒక తుపాను సృష్టించిన విలయానికి ఆపన్న హస్తం అందించాలని కొందరు కేరళ ఇంజనీరింగ్‌ విద్యార్థులు పూనుకున్నారు. ఒక పిరమిడ్‌ ఆలోచన రూపొందించారు. మన స్నేహితులకు 150 రూపాయలు కనిష్టంగా, ఐదు వేల రూపాయలు గరిష్టంగా కేవలం పదిమందికి సాయంగా అందించే వినూత్న ఆలోచన ప్రజల ముందుంచారు. మూడు వేల రూపాయలను ఐదుగురికి సాయం అందించాక, మరో ఇద్దరు మిత్రులకు ఈ అవకాశం అందివ్వాలి. వారు కూడా ఇదే విధంగా కేవలం పదిమందికి సాయం అందించడానికి పురికొల్పాలి. ఆ ఇద్దరూ చెరో మరో ఇద్దరిని సాయం అందించే విధంగా ఇందులో చేర్పించాలి. ఇలా కేవలం పది లెవెల్స్‌లో 1024 మంది స్నేహితులు, స్నేహితుల మిత్రులు ఈ ఛత్రం కిందకు వస్తారు కదా. మరి మీకు ఇందులో ఎంత సాయం అందుతుందో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. అక్షరలా ఎనభై ఆరు లక్షల రూపాయలు. ఆఫీసు లేదు, ఉద్యోగం లేదు, పై అధికారి లేడు, టార్గెట్లు లేవు, ఒత్తిళ్లు లేవు, వస్తువు అమ్మడం లేదు, వస్తువు కొనడం లేదు. కేవలం సాయం చేస్తూ సాయం అందుకుంటున్నారంతే. కేరళలో ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఆ విద్యార్థులు కొన్ని వందల కోట్ల రూపాయలు సేకరించి తుపాను బాధితులకు విరాళంగానూ, పునారావాస కార్యక్రమాలు చేపట్టడానికి వినియోగించారు. ఆ తరువాత అందులో కొంతమంది విద్యార్థులు చదువులు పూర్తయ్యాక దీనినే ఒక ఉపాధిగా ఎంచుకున్నారు. ఈ మోడల్‌ సాయాన్ని సీరియస్‌గా తీసుకుని ఒక ఫైనాన్షియల్‌ ఆప్‌ తయారుచేశారు. ఈ విషయంలో మరింత విస్తృత ప్రచారం కల్పించి, లక్షలాది మంది యువతీ యువకులను ఈ పథకంలో చేర్పించి, కేరళలో కొన్ని వేలమందిని కోటీశ్వరులుగా తయారు చేశారు. దీనిమీద ఎన్నో కేసులు నమోదయ్యాయి. వాటినన్నిటిని విజయవంతంగా గెలిచి నిలిచారు. ఈరోజు ఒక పెద్ద కార్పొరేట్‌ సంస్థగా అవతరించారు.

Also read: కాపీక్యాట్‌ మార్కెటింగ్‌

తప్పక చేయండి: మీ ఇంటి ప్రధాన ద్వారం బయట లంగరు (యాంకర్‌) స్టిక్కర్‌ను అతికించండి. అది డబ్బును లంగరుగా చేసి మీ ఇంటిలోకి సంపదను ఆహ్వానిస్తుందో లేదో తెలియదు గాని, డబ్బును మీరు ప్రేమిస్తున్నారన్న సందేశం మీ అంతశ్చేతనకు చేరుతుంది. విశ్వానికి సందేశం పంపుతున్నట్టు మీ మనసు నమ్మడం ప్రారంభిస్తుంది. ఇంటిలో ద్వారాల దగ్గర చిన్న చిన్న వేదికలు అమర్చి ఆకర్షణీయమైన బొమ్మలను అలంకరించండి. ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు గమనించారా? సీరియస్‌గా వెళ్లిపోతున్న మిమ్మల్ని ఒక్క క్షణం ఆపి ఆ బొమ్మలు చూడమని నిలదీస్తాయి కదా! మరి వాటికంటే మన ఇల్లు ఏం తక్కువ? పగిలిపోయిన, పాడైపోయిన, పాతబడిన బొమ్మలను మారుస్తుండండి. కొందరు సంపన్నుల ఇళ్లల్లో కోట్ల రూపాయల విలువ చేసే చిత్తర్వులు గోడల మీద ఉండడం మనం సినిమాల్లో మాత్రమే చూసి సంతోషిస్తామా? మన ఇంటిని అలా అలంకరించలేమా? ఆలోచించండి.

Also read: పరోక్ష ఆదాయం

దుప్పల రవికుమార్‌

రవికుమార్ దుప్పల
రవికుమార్ దుప్పల
దుప్పల రవికుమార్ సిక్కోలు బుక్ ట్రస్ట్ ప్రధాన సంపాదకులు. ఆంగ్ల అధ్యాపకులు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మొబైల్ : 99892 65444

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles