Saturday, July 13, 2024

కాపీక్యాట్‌ మార్కెటింగ్‌

సంపద సృష్టిద్దాం -19

మనిషి అనుకరణ జీవి. పుట్టినప్పటి నుంచి ప్రతి విషయం అనుకరణ ద్వారా నేర్చుకుంటాడు. మాట్లాడడం, నడవడం, రకరకాల పనులు చేయడం, చివరకు బతుకు తెరువు సంపాదించడం వరకు ప్రతీదీ కాపీ. 95 శాతం ప్రజలు ఒకరి పనినే ఇంకొకరు కాపీ కొడుతూ, అందరూ ఒకే ఆర్థిక పరిస్థితిలో ఉంటారు. మన పొరుగువారు, మన మిత్రులు, మన తాతతండ్రులు ఏ పని చేస్తే మనం కూడా అదే పని చేస్తున్నాం. వాళ్లందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. మనం కూడా ఉద్యోగాలే చేస్తున్నాం. వాళ్లందరూ ఏ జీవన స్థితిని చేరుకుంటే మనం కూడా అదే జీవనస్థితిని చేరుకున్నాం. వారి జీవితాల్లో ఎదుగూబొదుగూ లేకుంటే, మన జీవితాల్లో కూడా అంతే. వారిది రాజీ జీవితం. వారిని కాపీ కొట్టాం కాబట్టి, మనది కూడా రాజీ జీవితమే. కాపీ కొట్టి బతకడం మనకు నామోషీ కాదు కాబట్టి పేదవారిని, మధ్యతరగతిని అనుకరించకుండా, సంపద సృష్టికర్తలను అనుకరిస్తే సరి!

Also read: పరోక్ష ఆదాయం

పాపం కానిది కాపీ

ఇదివరకు మనం డబ్బును, సమయాన్ని లీవరేజ్‌ చేసుకుని మరింత ఆదాయాన్ని సృష్టించడం గురించి తెలుసుకున్నాం. డబ్బును లీవరేజింగ్‌ చేయడం అంటే ఒక రూపాయి పెట్టుబడి పెట్టి, వంద రూపాయలు లేదా వెయ్యి రూపాయలు సంపాదించడం. ఉదాహరణకు రియల్‌ ఎస్టేట్లో, స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం. కాలం గడుస్తున్న కొద్దీ పది శాతానికి మించి ఆదాయం సంపాదించడం. అవి ఎంతో ఆచితూచి వేయవలసిన అడుగులు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మన పెట్టుబడిని పూర్తి రిస్క్ లో పెట్టే ఆకర్షణీయమైన పథకాలు కదా! అయితే మన ఆదాయంలో కొంత మొత్తం మాత్రమే వీటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా నిరంతర ఆదాయం అందించే విధంగా మన పోర్టుఫోలియోను తీర్చిదిద్దుకోవచ్చు. కాని ఏ మాత్రం రిస్క్ లేనిది సమయాన్ని లీవరేజింగ్‌ చేయడం. అంటే సమయాన్ని వెచ్చించి సంపదను సృష్టించడం. చాలా విచిత్రమైన విషయం ఏమంటే, డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఒకరికి మరొకరితో పొంతన లేదు. ఎవరి సమర్ధత వారిది. కాని సమయాన్ని పెట్టుబడిగా పెట్టడం చాలా సులువు. మనం ధనికులమా, పేదవారిమా, లేదంటే మనం తెలివైనవారమా, తెలివిలేనివారమా అనే తేడా లేకుండా సమయం మాత్రం అందరికీ ఒక్కలాగే సమకూరుతుంది. రోజుకు 24 గంటలు. వాడుకో మానుకో. అంతే. ఒక పెద్దాయన హార్డ్ వేర్‌ దుకాణానికి వెళ్లి బాగా పనిచేసే రంపం అడుగుతాడు. చాలా పదునైన రంపాన్ని కొన్నాడు. వారం రోజులు తిరక్కుండానే ఆ పెద్దాయన దుకాణానికి వస్తాడు. చేతులంతా రక్తం. పాలిపోయిన ముఖం. చిందరవందరగా ఉన్న పెద్దాయనను చూసి దుకాణదారు ఆశ్చర్యపోతాడు. కనుక్కుంటే రంపం పని చేయడం లేదని చెప్తాడు. వెంటనే షాపాయన ఒక లావు కర్రను సెకనులో రంపంతో కోస్తాడు. పెద్దాయన నివ్వెరపోతాడు. నేను రంపపు పళ్లున్నవైపు కాకుండా, తిరగేసి కోస్తున్నా, అందుకే ఏమీ తెగడం లేదని పశ్చాత్తాపపడతాడు. ఎంత శక్తిమంతమైన సాధనాలున్నా వాటిని వాడడం రాకపోతే, ఉత్తమ ఫలితాలు సాధించలేం!

Also read: అందరికీ ఆర్థిక అక్షరజ్ఞానం

ఒక ఎకరం భూమి కొని ప్లాట్లు వేసి, తానొక్కడే తెలిసిన వారందరికీ అమ్మడం కంటే, ఏజెంట్లను నియమించుకుని వారికి కొంత కమిషన్‌ ముట్టజెప్పి త్వరగా ప్లాట్లను అమ్మడం ఒక రకమైన లీవరేజింగే. సమయాన్ని ఆదా చేయడం. ఇప్పటి టీ టైం దుకాణాల మాదిరిగా ఒకే రకమైన వస్తువు లేదా సేవను పలు ప్రదేశాల్లో అందించడం ఫ్రాంచైజింగ్‌ కిందకు వస్తుంది. ఇది కూడా సమయాన్ని లీవరేజ్‌ చేయడమే. అద్భుతమైన అనుకరణ ద్వారా హోటళ్లు, రెస్టారెంట్లు, తినుబండారాల దుకాణాలు ఈ ఫ్రాంచైజింగ్‌ పద్ధతిలో ఏటికేడాది లాభాల ఆర్జనలో రికార్డులు సృష్టిస్తుండడం మనకు తెలిసిందే. పెద్ద ఉదాహరణగా లలితా జ్యూయెలర్స్‌ దాదాపు ప్రతి జిల్లాలోనూ ఒక దుకాణం తెరవటం మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే కొందరు ఓనర్లు తమ వ్యాపారాన్ని ఫ్రాంచైజింగుకు ఇవ్వరు. ఎన్ని శాఖలైనా తామే నిర్వహిస్తారు. ఇచ్చేవారేమో లైసెన్స్‌ కోసం లక్షలాది రూపాయలు వసూలు చేస్తారు. ఆపైన రాయల్టీలు చెల్లించాలి. ఇదంతా ఆర్థిక భారం. లాభాలు వస్తాయని తెలిసినా, పెద్ద ఎత్తున డబ్బులు పెట్టుబడిగా పెట్టడం ద్వారా మాత్రమే ఈ రంగంలోకి ప్రవేశించగలుగుతాం.

Also read: బిజినెస్‌మేన్‌

అడుగు – నమ్ము – పొందు

లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టకుండా, డబ్బులు పెట్టి దశాబ్దాల కాలం ఎదురుతెన్నులు చూడకుండా సామాన్యులు సంపన్నులయ్యే అవకాశం సాధ్యమయ్యేది నెట్‌వర్క్‌ మార్కెటింగ్‌లోనే. కేవలం అనుకరణ ద్వారా ప్రతిరోజూ కొంత సమయాన్ని పెట్టుబడిగా పెట్టి సంపదను సృష్టించి, ఆర్థిక స్వతంత్రులు కాగలరు. ఈ పద్ధతి నిజంగా అందరికీ పనిచేస్తుందా అని ప్రశ్నించకండి. దీనిని అర్థం చేసుకుని, యథాతధంగా కాపీకొట్టి సంపదను సృష్టించే ధైర్యం, తెలివి మీకున్నాయా లేదా? అంతే. ఈ సందర్భాన్నే ఎవరో ప్రసిద్ధ శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌కు చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడట. మళ్లీ తనకు ఇదంతా వివరంగా చెప్పమన్నాడట. దానిని అర్థం చేసుకున్నాక ఆయన ఒకే మాట అన్నారు, ‘ఇది ప్రపంచంలో ఎనిమిదో వింత’. కాంపౌండింగ్‌ అంటే అంతే మరి. మనకు నచ్చిన విషయం గురించి ఇంకొకరికి చెప్పాలని ఉబలాడపడతాం కదా. ఎగ్జాక్ట్ గా అదే చేసి ఆదాయాన్ని పొందడమే నెట్వర్క్‌ మార్కెటింగ్‌. ఇంటింటికీ తిరగకుండా (సమయాన్ని వెచ్చించి ఇతరులకు చెప్పి) కొంచెం అమ్మకాలు చేయడం, ఈ బిజినెస్‌లోకి మరికొంత మందిని తీసుకురావడం అనే రెండు పనులు చేయడమే ఈ బిజినెస్‌. కానీ దీనికి అవసరమైన శిక్షణ చాలా ముఖ్యమైనది. చాలా కంపెనీలు వస్తువులు కొనిపించడం లేదా అంటగట్టడంలో శ్రద్ధ చూపిస్తాయి. లేదా కొత్తవారిని చేర్పించడంలో శ్రద్ధ చూపిస్తాయి. ఇలాంటివి చాలా ప్రమాదకరం. మనల్ని నిజమైన లీడర్లుగా తయారుచెయ్యడంలో అలక్ష్యం వహిస్తాయి. శిక్షణ ద్వారా ఆర్థిక జ్ఞానం అందించే కంపెనీ కోసం వెతకాలి.

తప్పక చేయండి: ప్రస్తుతం మన రాష్ట్రంలో డైరక్ట్‌ సెల్లింగ్‌ బిజినెస్‌లో ఉన్న ఏవైనా ఐదు కంపెనీల గురించి తెలుసుకున్నారా! మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామి సంస్థ ఆమ్వే గత కొన్నేళ్లుగా మొదటి స్థానంలో ఉంది. మోడీకేర్‌, మీ లైఫ్‌ స్టైల్‌, హెర్బాలైఫ్‌, వెస్టిజ్‌ కంపెనీలవి తర్వాతి స్థానాలు. వాటి ఉత్పత్తులు, వాటి ధరలు, వాటి నాణ్యతలను పరిశీలించి, బేరీజు వేయండి.

Also read: డైరీ రాద్దామా!..

దుప్పల రవికుమార్‌

రవికుమార్ దుప్పల
రవికుమార్ దుప్పల
దుప్పల రవికుమార్ సిక్కోలు బుక్ ట్రస్ట్ ప్రధాన సంపాదకులు. ఆంగ్ల అధ్యాపకులు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మొబైల్ : 99892 65444

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles