Monday, April 29, 2024

వైద్యం విఫలమైన వేళ…

సంపద సృష్టిద్దాం – 22

ఇప్పుడు మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులకు పెట్టిన ముద్దుపేరు జీవనశైలి వ్యాధులు. అంటే అవి మనకు సోకితే మరి తగ్గే ప్రసక్తి లేదు. వాటితో మనం సహజీవనం చేయాల్సిందే. మేనేజ్‌ చేసుకుంటూ ఉండడమే. నిజానికి మనం డాంబికంగా చెప్పుకుంటున్న వైద్య సాంకేతిక ప్రగతి ఒట్టి డొల్ల. రోజురోజుకు ఆసుపత్రులు పెరిగిపోతున్నాయి. వైద్యులు పెరిగిపోతున్నారు. అందరూ పెరిగితే వ్యాధులు తగ్గాలి కదా! కాని ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. దీనికి కారణం మన వ్యాధులను నయం చేయడంలో మన వైద్యశాస్త్రం దారుణంగా విఫలమవడమే. వ్యాధులను నయం చేసే ప్రసక్తే లేదని డాక్టర్లు వాపోతున్నారు. వారు ప్రసుత్తం చేస్తున్నది కేవలం మేనేజ్‌ చేయడమే. దీని గురించి మనం ఆలోచిస్తున్నామా? కోటీశ్వరులు కాబోతున్న సాహసవీరులు నీరసంతో ముక్కుతూ మూలుగుతూ ఆసుపత్రుల చుట్టూ తిరగడం దేనికి సంకేతం కాగలదు!

Also read: పారిపోవద్దు, ఫైట్‌ చేద్దాం!

చిరుధాన్యాలు కాదు.. సిరిధాన్యాలు

జీవనశైలి వ్యాధులు మనకు సంక్రమించేది జీవితంలో మనం అనుసరిస్తున్న శైలి వల్ల కాదు. మనం తినే ఆహారం వల్ల. భారతదేశంలో మొదటి మధుమేహం కేసు క్రీస్తుపూర్వం గుర్తించలేదు. క్రీస్తు శకం 500లో గుర్తించారు. సుసృతుడు తన చరకసంహితలో ఈ వ్యాధి లక్షణాలు వివరించాడు. మన దేశంలో మనిషి చరిత్రకు పది వేల సంవత్సరాల చరిత్ర ఉందనుకుంటే కేవలం గత పదిహేను వందల సంవత్సరాల నుంచే ఈ వ్యాధి ఎందుకు మొదలైంది? అంతకుముందు ఎనిమిది వేల ఐదువందల సంవత్సరాల పాటు మధుమేహం ఎందుకు లేదు? అర్థం చేసుకున్నవారికి అర్థమైనంత.

 విఫలమవుతున్న వైద్యశాస్త్రం గురించి తెలుసుకుంటున్న కొందరు మానవీయ వైద్యులు దీని గురించి అన్వేషించడం ప్రారంభించారు. వారికి తెలిసిన విషయాలు బయటి ప్రపంచానికి వెల్లడి చేయడానికి జంకుతున్నారు. మందుల కంపెనీలు ప్రజల ప్రాణాలతో ఆడుతున్న జూదాన్ని చూసి విస్తుపోతున్నారు. ఆ మాఫియా చేస్తున్న ఆగడాలను ప్రాణాలకు తెగించి కొందరు వాస్తవాలు వెల్లడిస్తున్నారు. వాటిని ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. చాలా ఆసక్తికరమైన ఈ విషయాలను మెయిన్‌స్ట్రీమ్‌ మీడియా పట్టించుకోదు. అది ప్రజలకు చేరదు. మన ఆరోగ్యాన్ని అల్లకల్లోలం చేస్తున్న మూడు తెల్లటి పదార్ధాలుగా వీటిని గుర్తించారు. తెలుపు బియ్యం, తెల్లగా మిరిసిపోయే ఉప్పు, తెల్లటి పంచదార. మూడు ప్రాణాంతకాలు.

Also read: సమస్తమూ అంతశ్చేతనతోనే..

తృణ ధాన్యాల (మిల్లెట్స్‌)ను పక్కనపెట్టి, మన ప్రధాన ఆహారంగా వరి మారిన తర్వాత రోగాల సంఖ్య పెచ్చరిల్లింది. గ్రామాలలో డబ్బున్న వారు వారి తాహతు చూపించుకోవడానికి అన్నట్టు వారి ఆహారంలో బియ్యం చేర్చారు. వారి జీవితంలో చేరిన రోగాలను డబ్బున్నవారికి వచ్చిన రోగాలుగా పిలిచేవారు. అదే గ్రామంలో బియ్యం జోలికి పోకుండా తాజా కాయగూరలు, ఆకుకూరలు, జొన్నలు, సజ్జలు, కొర్రలు వంటి తృణ ధాన్యాలను ఆహారంలో తీసుకున్న వారు ముదిమి మీదపడినా ఆరోగ్యంగా ఉండడం మన పెద్దలు మాత్రమే గమనించిన విషయం. క్రమక్రమంగా ఊరంతా తృణధాన్యాల స్థానంలో బియ్యాన్ని భర్తీ చేసి విజయవంతంగా రోగాలను కొని తెచ్చుకున్నారు. ఎలాంటి నేలలోనైనా పండే తృణధాన్యాలను విస్మరించాం. కేవలం మాగాణిలో పండే బియ్యాన్ని నెత్తిన పెట్టుకున్నాం. వర్షంతో సంబంధం లేకుండా ఆరుగాలం పండే తృణధాన్యాలను తృణీకరించాం. పుష్కలంగా నీరుంటేనే వరిని అందించే పంటపై ఆధారపడ్డాం. నేల సారాన్ని పెంచడానికి ఎరువులను వాడాం. ఐదు దశాబ్దాలు గడవక ముందే నేల సారం నిస్సారమైందని గగ్గోలు పెట్టి సేంద్రీయ వ్యవసాయం చెయ్యండని రైతును ప్రార్థిస్తున్నాం. ఈ విషయంలో ప్రభుత్వాలు కార్పొరేట్లకు ఊడిగం చేశాయనే చెప్పాలి. 70లలో రేడియోలో వచ్చిన ‘చేనుకు చేవ రైతుకు రొక్కం’ ప్రకటనలు చెవుల్లో గింగురుమంటున్నాయి. ఇప్పుడేమో ఎరువులు లేని పంటల కోసం మనం నివశిస్తున్న ఇంటి మిద్దె మీద తోటలు పెంచుకోమని ఊదరగొడుతున్నాం.

Also read: కాపీక్యాట్‌ మార్కెటింగ్‌

అడుగు – నమ్ము – పొందు

జొన్నలు, సజ్జలు, సామలు, కొర్రలు, అండుకొర్రలు, రాగులు, అరికలు వంటి చిరుధాన్యాల ఉపయోగం వెలకట్టలేనిది. రోగాల అంతు చూసే ఈ ధాన్యాలను మన ఆహారంలో జోడిద్దాం. అత్యంత సాధారణ జీవితం అద్భుతాలు సృష్టిస్తుందంటే ఏమిటో స్వయంగా చూడవచ్చు. ఎప్పుడూ తిండిమీద ఉండే ధ్యాస, యావ తప్పిపోతాయి. మన పూర్తి ఫోకస్‌ సంపద సృష్టించడం మీదకు మరలుతుంది. జొన్నలు, సామలు తినడమంటే చప్పటి ఆహారం అనుకోకూడదు. అన్నం మాత్రం వట్టిదే తింటే ఏమంత రుచిగా ఉంటుంది కనుక? అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు తినొచ్చు. మాంసాహారానికి దూరం కానక్కర్లేదు. ఏమి కావాలంటే అది, ఎలా కావాలంటే అలా వండుకుని తినొచ్చు. జస్ట్‌ బియ్యం బదులుగా బియ్యంకంటే చవకైన ఈ చిరుధాన్యాలను చేర్చడమే. పైగా బియ్యానికి బదులుగా ఎనిమిది రకాల ప్రత్యామ్నాయాలు. అవీ చవకైనవి. నాణ్యమైనవి. మేలైనవి. ఇప్పటికే ఏవైనా వ్యాధులు ఒంటికెక్కించుకుంటే నయం చేయడానికి వీలుగా ఒక ఆరు నెలలపాటు వీటికి కషాయాలు చేర్చాలి. అవన్నీ మనకు నిత్యం దొరికే ఆకులతో చేసినవే. జీవితాంతం వాడనవసరం లేదు. వైద్యులపై ఆధారపడడాన్ని బాగా తగ్గించుకోవచ్చు. వీటికి సంబంధించిన పోషక విలువలు గురించి, కషాయాల తయారీ గురించి, రుచికరమైన పిండివంటలు తయారీ గురించి రంగుల చిత్రాలతో పుస్తకాలు కోరినవారికి వాట్సప్‌ ద్వారా పూర్తి ఉచితంగా పంపించగలను. సిరిధాన్యాలలో కొన్ని విటమిన్లు, పోషకాలు ఉండవని కొందరు వాపోతున్నారు. బియ్యంలో మాత్రం ప్రపంచమంతా ఉందా! అందులో లేనివాటి గురించి గుండెలు బాదుకోవద్దు. డ్రైఫ్రూట్స్‌, ఆయా కాలాల్లో దొరికే పళ్లు, ఎరువులు, పురుగు మందులు వాడని ఆకుకూరలు, కాయగూరలు మిగిలిన శేషాన్ని పూరిస్తాయి.

మనం వైద్యశాస్త్రాన్ని, వైద్యులను గౌరవిస్తూనే ప్రస్తుత వైద్యరంగంలోని పరిమితుల గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. దీని మతలబులు తెలియని ఎంతోమంది వైద్యులు గుండె జబ్బులతో, క్యాన్సర్లతో నానాయాతనలు పడుతున్న సంగతి మనకు తెలిసిందే. కేవలం సుగర్‌, బిపిలకే కాదు మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, చర్మ సంబంధిత రోగాలకు సైతం ఇప్పటి వైద్యం పూర్తి స్వస్థత చేకూర్చకపోవడం మనం గమనిస్తున్నాం. బతికినంత కాలం మందులు తీసుకుంటూ ఉండమని వైద్యులు సూచిస్తుండడం మనకు తెలిసిందే. పాము కరిచినప్పుడు, కరిచిన పాము గురించి వాకబు చెయ్యడం కంటే రోగికి వైద్యం చేయడం పైనే మన దృష్టి పెట్టడం తెలివైన పని. అదే విధంగా వైద్య వ్యవస్థను నిందించడం కంటే మన ఆరోగ్యాలను చాలా చవకగా సరిచేసుకోవడమే మన ముందున్న మెరుగైన దారి.

Also read: పరోక్ష ఆదాయం

దుప్పల రవికుమార్

రవికుమార్ దుప్పల
రవికుమార్ దుప్పల
దుప్పల రవికుమార్ సిక్కోలు బుక్ ట్రస్ట్ ప్రధాన సంపాదకులు. ఆంగ్ల అధ్యాపకులు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మొబైల్ : 99892 65444

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles