Tuesday, April 30, 2024

‘రామా,లక్ష్మణా, కాపాడండి’ అంటూ రోదించిన సీత

రామాయణమ్82

జటాయువు మరణము రగిల్చిన వేదన మనసును దహించి వేస్తుండగా చెట్టూ పుట్టా పట్టుకొని తిరుగుతూ ‘‘రామా లక్ష్మణా, రండి. ఇప్పుడు మీరు నన్ను రక్షించండి’’ అంటూ రావణునకు అందకుండా పరుగెడుతున్న సీతాదేవి వెనుక తానుకూడా నిలునిలు అంటూ పరుగెత్తుతూ ఆవిడను దొరకబుచ్చుకుని చేతితో జుట్టుపట్టుకుని అమాంతము లేపి గాలిలోకి ఎగిరినాడు రావణుడు.

Also read: రావణ ఖడ్గప్రహారంతో కుప్పకూలిన జటాయువు

ఒక్కసారిగా మృగములు పక్షులు రామలక్ష్మణులు ఉన్నవైపుకు పరుగెడుతుండటం చూసి తన అపహరణ వార్త ఎరిగించటానికే అనుకొని ‘‘ఓ పశుపక్ష్యాదులారా, రామునికి ఎరుకపరచండి’’ అంటూ అరుస్తూ ఆకాశమార్గాన తీసుకొని పోబడుతున్న సీతాదేవిని  దివ్యదృష్టితో గమనించిన బ్రహ్మదేవుడు రావణుని మరణసమయము ఆసన్నమయినదని సంతసించాడు. ఋషి, ముని, దేవగణాలకు సంతోషము, దుఃఖము ఒకదానితో ఒకటి కలిసి పోయి హృదయమందు వర్ణనాతీతమైన భావతరంగాలు ఉవ్వెత్తున లేచినవి. సీతారాముల వియోగము, సీతాదేవి కష్టము వారికి దుఃఖకారణము. రావణసంహారమునకు పడిన బీజము వారికి సుఖకరము మరియు సంతోషదాయకము.

Also read: రావణుడిని తీవ్రంగా హెచ్చరించిన జటాయువు

ఆకాశంలో సీతాదేవి కట్టుకున్న పచ్చని పట్టువస్త్రము గాలికిరెపరెపలాడుతూ  మేఘమండలములోని మెరుపులా భాసిల్లింది. రావణుడు తాను అపహరించిన  సీతాదేవిని తీసుకొని  ఆకాశ మార్గాన  వెళుతూ తన అంకమందు కూర్చుండబెట్టుకొని వేగముగా ప్రయాణిస్తూ ఉన్నాడు.

అప్పుడు ఆ తల్లి ఆకసములో ప్రయాణించే ఒక నిప్పుల ముద్దలాగా కనపడ్డది. నల్లని మేఘమును వెనుక ఉంచుకొని ప్రయాణించే చందమామలాగ కనపడ్డది .

వాడు ఆవిడ కొప్పుపట్టుకొన్నప్పుడు ఊడిన సిగపూలు రాలి ఆకసమునుండి జారి పడుతూ భూపతనమవుతున్న పూలనదిలాగా ఉన్నది. విదిలించుకొంటున్న ఆవిడ పాదములనుండి ఒక నూపురము జారి మెరుపుచక్రములాగా ధ్వనిచేయుచూ నేల రాలింది. పెనుగులాడుతున్న ఆవిడ శరీరమునుండి అలంకారములన్నీ దివినుండి భువికి జారే నక్షత్రాలా అన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఆవిడ మెడ నుండి జారిపడుతున్న ముత్యాల హారము ఆకాశ గంగ భూమికి దిగివస్తున్నట్లుగా కనపడ్డది.

Also read: సీతను రథములో బలవంతంగా ఎక్కించుకున్న రావణుడు

రావణుడి గమన వేగానికి పుట్టిన గాలికి ఊగిన వృక్షములు సీతాదేవికి భయపడవద్దని ధైర్యము చెపుతున్నట్లుగా అనిపించింది.

వన్య మృగములన్నీ తల పైకి ఎత్తిచూస్తూ కోపముగా  రావణుని గమనమార్గమును అనుసరించి పరుగులుపెట్టినవి. గోదావరీ మాత సీతాదేవినే చూస్తూ తన దారినే మరచి గమనదిశను మార్చి క్రింద కానరాక లోయలో పడిపోయింది. సూర్యుడు కాంతిహీనమై తెల్లగా కనపడ్డాడు. లేదు సత్యానికి స్థానము లేదు. ధర్మానికి స్థానము లేదు. ఋజుత్వానికి స్థానము లేదు. మంచితనానికి స్థానము లేదు అని సమస్త భూతగణాలు ఆక్రోశిస్తూ గుంపులు గుంపులుగా చేరి అగుపించాయి.

రాముడెక్కడున్నాడో, లక్ష్మణుడు ఎక్కడున్నాడో అని ఆకసమునుండి క్రిందకి చూస్తూ వెతుకుతూ ‘‘రామా లక్ష్మణా, కాపాడండి’’ అంటూ విలపించసాగింది సీతామహాసాధ్వి.

Also read: రావణుడికి సీతమ్మ హెచ్చరిక

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles