Thursday, May 2, 2024

తెలంగాణకు కృష్ణా జలాలలో వాటా కేటాయించడం లేదు ఎందుకని?

ఒకానొక రాష్ట్ర ముఖ్యమంత్రితో లేదా అధికారపార్టీతో తన పార్టీ సంబంధబాంధవ్యాలను అనుసరించి కేంద్రమంత్రి జలవనరుల వివాదాల పరిష్కారంకోసం ఏర్పాటు చేసిన అత్యున్నత సంఘంలో వ్యవహరిస్తారు. ఉదాహరణకు కేంద్రంలోని ఎన్ డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తో స్నేహంగా ఉంటోందని అనుకుందాం. అప్పుడు ఇతర రాష్ట్రం నీటి వనరుల విషయంలో అననుకూల పరిస్థితిలోకి నెట్టబడుతుంది. నదీజలాల నిర్వహణ మండలి (రివర్ బోర్డు) అధ్యక్షుడుగా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి హోదా కలిగిన వ్యక్తి ఉంటాడు. రెండు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు సభ్యులుగా ఉంటారు. ప్రతి బోర్డులోనూ ఒక ప్రవీణుడిని కేంద్రం నియమిస్తుంది. ప్రతి బోర్డులోనూ ఒక సభ్యుడే కార్యదర్శిగా వ్యవహరించే వ్యక్తి ఉంటారు. ఆ స్థానంలో కేంద్ర ప్రభుత్వంలో చీఫ్ ఇంజనీరు హోదా కలిగిన అధికారిని నియమిస్తారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో నిండిన రెండు బోర్డులపైన పెత్తనం చెలాయించే ఎపెక్స్ బాడీ (సర్వోన్నత సంస్థ) సమావేశాలకి జలవనరుల శాఖ మంత్రి అధ్యక్షత వహిస్తారు. రెండు బోర్డులూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించవలసి ఉంటుంది. నదీజలాల నిర్వహణ మండళ్ళ, సర్వోన్నత సంస్థ పనితీరును వివరించే అంశాలు చాలా ఉన్నప్పటికీ, కేంద్రమంత్రి దగ్గర అసలైన అధికారాలు ఉంటాయన్న మాట మాత్రం నిజం. వివాదాలు పరిష్కరించేందుకు విస్తారమైన ప్రక్రియ, యంత్రాంగం ఉన్నాయి. వాస్తవంలో మాత్రం అన్ని అధికారాలు కేంద్రప్రభుత్వం చేతిలో కేంద్రీకృతమై ఉంటాయి. ఇది రాష్ట్రాల హక్కులకూ, స్వయంనిర్ణయాధికారాలు ఉండాలనే సిద్ధాంతానికీ, రాష్ట్రాలకు రాజ్యాంగం ఉద్దేశించిన స్వేచ్ఛకూ పూర్తిగా విరుద్ధం. భారత దేశం రాష్ట్రాల సమాఖ్య కావడానికి బదులు రాష్ట్రాలను కేంద్రం పరిపాలించే పరిస్థితి దాపురించింది. కేంద్రం రాష్ట్రాల అధికారాలను హరించడం సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం.

జస్టిస్ బ్రిజేష్ కుమార్ తిరస్కృతి

కృష్ణా నదీజలాలలో తమ వాటా నిర్ణయించవలసిందిగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా ట్రిబ్యూనల్ అధిపతి జస్టిస్ బ్రిజేష్ కుమార్ ని కోరుతూ వచ్చింది. నాలుగు ప్రవాహిత రాష్ట్రాల మధ్య కృష్ణ నీటిని పంచాలనే డిమాండ ను జస్టిస్ బ్రిజేష్ కుమార్ అంగీకరించలేదు. 2016 అక్టోబర్ లో జస్టిస్ బ్రిజేష్ కుమార్ నాయకత్వంలోని ట్రిబ్యూనల్ ఈ కింది అభిప్రాయాలు వెలిబుచ్చింది.

  1. నాలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలను తిరిగి కేటాయించాలనే

 అంశం పునర్ వ్యవస్థీకరణ చట్టం 89వ సెక్షన్ లో ఎక్కడా లేదు.

  • నీటిని తిరిగి కేటాయించడం సంగతి లేదు సరికదా, తెలంగాణ అనే మాటే ఆ సెక్షన్ లో లేదు.
  • కృష్ణా బేసిన్ వెలుపల నీటి వినియోగంకోసం చేసిన కేటాయింపులు చారిత్రక కారణాల వల్ల సరైనవి.
  • కనుక బేసిన్ ఆవల ఉన్న రాయలసీమకు కృష్ణాజలాలు పొందే అర్హత ఉంది.
  • సమైక్య ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన నీటినే రెండు రాష్ట్రాలూ – ఆంధ్రప్రదేశ్, తెలంగాణ – పంచుకోవాలి. ఒక్క నీటి బొట్టు తక్కువ కానీ ఎక్కువ కానీ కాదు.
  • నీటి పంపిణీ సమానంగా జరగలేదు, తప్పుడు తీరులో జరిగింది కనుకనే రాష్ట్ర విభజన జరిగిందంటూ తెలంగాణ రాష్ట్రం చేస్తున్న వాదన సరైనది కాదు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లో తెలంగాణ ప్రభుత్వం పదే పదే చెప్పిన ఈ కారణం విభజన బిల్లులోని ప్రధానమైన అంశాలలో కానీ, ప్రకటిత  లక్ష్యాలలో కానీ విభజనకు చూపించిన కారణాలలో కానీ ఎక్కడా లేదు.
  • ‘‘తెలంగాణ ప్రజల రాజకీయ, ప్రజాస్వామ్య  ఆశలను నెరవేర్చడంకోసమే ప్రధానంగా రాష్ట్ర విభజన జరిగింది. నదీ జలాల పంపిణీలో అసమానతల వల్ల కాదు.’’

ఇదివరకు బచావత్ ట్రిబ్యూనల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన నీటిని ప్రాజెక్టుల వారీగా కేటాయిస్తామని 17 సంవత్సరాలుగా వివాదాన్ని వింటున్న ట్రిబ్యూనల్ చెప్పడం దురదృష్టకరం. కొత్త రాష్ట్రం ఏర్పాటును గుర్తించడానికి కానీ దానికి నీటిలో న్యాయమైన వాటా కేటాయించడానికి కానీ ట్రిబ్యూనల్ సిద్ధంగా లేదు. ఒక మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ట్రిబ్యూనల్ ఇంతటి అన్యాయాన్ని కొనసాగించడం ధర్మం కాదు.  

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles