Saturday, October 5, 2024

నదీజలాల వాటా వివాదాన్ని మరింత జటిలం చేసిన కేంద్రం: అధికార, ప్రతిపక్షాలు మేలుకోవాలి – మాడభూషి శ్రీధర్

నదుల గెజిట్ ఉపసంహరించాలని నల్లగొండ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ డిమాండ్

కేంద్రం కృష్ణా గోదావరి నదీజలాల వివాదాన్ని పరిష్కరించకుండా కొత్త సమస్యను సృష్టించిందని, రెండు రాష్ట్రాలలో గోదావరి కృష్ణా నదులపై సాగునీటి ప్రాజెక్టులను కబళించడానికి అన్యాయమైన గెజిట్ నోటిఫికేషన్ తెచ్చిందని భారత సంవిధాన విద్యార్థి న్యాయశాస్త్ర ఆచార్యులు మాడభూషి శ్రీధర్ అన్నారు. రాష్ట్రాల అధికారాలను కాదని, రాష్ట్రజాబితాలో ఉన్న ‘నీరు’ అంశంపైన గెజిట్ ఉత్తర్వులు జారీ చేసే అధికారాన్ని రాజ్యాంగమూ ఇవ్వలేదు, రాష్ట్రవిభజన చట్టమ ఇవ్వలేదని,  ఇది రాష్ట్రాల నదీజలాలను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవడమే అవుతుందని, ఈ గెజిట్ రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని విమర్శించారు.

తెలంగాణ ఏర్పడిన తరువాత ఉమ్మడి రాష్ట్రానికి అంతకుముందు కేటాయించిన నదీజలాలలో రెండు రాష్ట్రాల వాటాలను నిర్ధారించడానికి ట్రిబ్యునల్ వేసే మౌలిక బాధ్యతను విస్మరించింది కేంద్రం. సుప్రీంకోర్టులో తెలంగాణ పిటిషన్ వేస్తే, తాము ట్రిబ్యునల్ వేస్తామని హామీ ఇచ్చి పిటిషన్ ఉపసంహరించాలని కేంద్రం కోరింది. తెలంగాణ ఉపసంహరించుకున్నది. కాని కేంద్రం న్యాయసలహా కోరినపుడు కొత్త ట్రిబ్యునల్ విషయంలో ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది.  ట్రిబ్యునల్ లేకుండా వాటాలు తేలవు, నదులలో నీటిలభ్యత తేలకుండా ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం కేంద్ర జల సంఘం ఒప్పుకోదు. కేంద్ర అనుమతులు లేని ప్రాజెక్టులకు అనుమతులుతెచ్చుకోకపోతే వాటివినియోగాన్ని ఆపేస్తామని అందుకు ఆర్నెలలే గడువని కేంద్రం గెజిట్ ఆదేశిస్తున్నది. వాటాల నిర్ణయం లేకుండా అనుమతులు రావని కేంద్రానికి తెలుసు. అయినా అన్యాయంగా ఆపేస్తాననడం ఒక విచిత్రం అని మాడభూషి శ్రీధర్ అన్నారు,

రాజ్యాంగంలో రాష్ట్ర జాబితాలో నిర్దేశించిన విధంగా తమ రాష్ట్రాలలో పారే నీటిని స్వేచ్ఛగా ఉపయోగించుకునే హక్కు రాష్ట్రాలకు ఉంటుంది.  కృష్ణా గోదావరి నదుల పైన అనేక ప్రాజెక్టులను కేంద్రం స్వాధీనం చేసుకోవడంతో తెలంగాణ లో సంక్షోభం ఏర్పడింది. జూలై 15 2021లో కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ తర్వాత దాదాపు పూర్తి నిర్మాణమైన ప్రాజెక్టులను ఉపయోగించకుండా చేస్తున్నదని. ఆప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వవలిసిన కేంద్రమే ఏ అనుమతీ ఇవ్వకుండా ఆర్నెల్లలో రాష్ట్రాలే అనుమతులు తేవాలని, లేకపోతే ప్రాజెక్టులు ఎక్కడిక్కడ నిలిచిపోతాయని ఈ గెజిట్ బెదిరిస్తున్నదని అన్నారు. 

ఇరు రాష్ట్రాల మధ్య నదీజలాల విషయంలో సమస్యలు తలెత్తితే రాష్ట్రం అభ్యర్థన మేరకు ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయవలసిన బాధ్యత కేంద్రానిదే అనీ ఆ బాద్యత వదిలేసి కేంద్రం ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవడం  సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వారన్నారు.

ఈ దేశంలో నదీజలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం వస్తే, ట్రిబ్యునల్స్ ద్వారా పరిష్కారం సాధించవలిసిందే గానీ, ఏ నదులవిషయంలోనూ ఏ రాష్ట్రంలోనూ సాగునీటి ప్రాజెక్టులను ఆధీనంలోకి తీసుకున్న దాఖలాలు ఇంతవరకు ఎక్కడా లేదన్నారు. ఇది కేంద్రం తీసుకున్న దారుణమైన నిర్ణయమని రాష్ట్రాల హక్కులను కాలరాయడమే అనీ ఉన్నారు.

జూలై 15 2021లో కృష్ణా గోదావరి నదీ జలా ప్రాజెక్టులగురించి గెజిట్ నోటిఫికేషన్ లో ఉన్న దారుణాల గురించి అన్యాయం గురించి ప్రజలకు, పౌర సమాజానికి పత్రికాలోకానికి తెలియజేసి చైతన్యం కలిగించడం చాలా అవసరమనీ, తెలంగాణ ప్రభుత్వం ఈ గెజిట్ ను వ్యతిరేకించినప్పడికీ, దీని అమలును తీవ్రంగా ప్రతిఘటించవలిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు మౌనం వీడి, ఈ గెజిట్ అనర్థాలను అర్థం చేసుకోవాలని, వ్యతిరేకించాలని, కేంద్రం ఉపసంహరించుకునేందుకు వత్తిడి చేయాలని, అందులో భాగంగానిరసన కార్యక్రమాలను ఉద్యమ కార్యాచరణకు ప్రజలు రాజకీయ పక్షాలు సిద్ధం కావాలని మాడభూషి శ్రీధర్ అన్నారు.

నదీజలాల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడం సమానత్వపు హక్కుకు విరుద్దం”-

కె. రామచంద్రమూర్తి

————————————————

“కృష్ణా గోదావరి నదులకు ఎగువన ఉన్న రాష్ట్రాలలో ఏ విధమైన ఆధిపత్యం చలాయించకుండానే దిగువ రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ యొక్క నది హక్కులను కేంద్రం పూర్తిగా తన అధీనంలోకి తీసుకోవడం భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కుకు విరుద్ధమని “- ప్రముఖ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి అన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు ఈ విషయంలో సవ్యంగా వ్యవహరించడంలేదు కనుకనే పౌరసమాజం పట్టించుకోవలసి వచ్చిందనీ, తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం కల్పించుకోవలసి వచ్చిందనీ వివరించారు. ఉద్యమిస్తేనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకుంటాయని అన్నారు.

గతంలో ఎన్నడు లేనివిధంగా కేంద్రం జోక్యం ఏమిటి.?

కె.శ్రీనివాస్ రెడ్డి ప్రముఖ పాత్రికేయులు

—————————————–

గతంలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నదీజలాల విషయంలో ,ప్రాజెక్టుల విషయంలో జోక్యం చేసుకోవడం ఏమిటని ప్రముఖ పాత్రికేయులు కే శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఇంత జరుగుతున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించి కూర్చున్నదే తప్ప కార్యచరణ తీసుకోలేదన్నారు. కేంద్రం విడుదల చేసిన ఈ గెజిట్ నోటిఫికేషన్ వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా ప్రజల కు తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంలో ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి గెజిట్ నోటిఫికేషన్ వ్యతిరేకంగా పోరాడాల్సి అవసరముందన్నారు.

తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్రం పెత్తనం ఏందీ..?

ఆచార్య కోదండరాం జన సమితి పార్టీ అధ్యక్షులు

————————————————

తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో కేంద్రానిది మితిమీరిన జోక్యం అని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. నదీజలాల విషయంలో కేంద్రానికి నియంత్రించే అధికారం ఉంధే తప్ప పెత్తనం చేసే అధికారం లేదని వారన్నారు. కేంద్రానికి లేని అధికారాన్ని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందని ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్యని వారన్నారు. ఇదే గెజిట్ నోటిఫికేషన్ అమలైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులు కేంద్రం ప్రాజెక్టులుగా మారిపోతాయన్నారు. ఇప్పటివరకు నీటి కేటాయింపులు చేసే అధికారం ట్రిబ్యునల్ కు  ఉండేదని..రాబోయే కాలంలో ఆ  అధికారం వాటికి ఉండబోదని ..ఇదే తంతు కొనసాగితే తెలంగాణలో ప్రాజెక్టులు కట్టడం సాధ్యం కాదన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు ముప్పై మూడు ప్రాజెక్టులు పెండింగ్ లో  ఉన్నాయని వీటిని ఎవరు పూర్తి చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు

నల్లగొండ జిల్లా ప్రాజెక్టులు పూర్తి కావడం అసాధ్యం.

శ్యాం ప్రసాద్ రెడ్డి రిటైర్డ్ ఇంజనీర్

———————————-

కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలైతే నల్లగొండ జిల్లా లో పెండింగ్ లో ఉన్న ఎస్ ఎల్ బి సి ఉదయ సముద్రం ప్రాజెక్టులు లాంటివి పూర్తి కావడం అసాధ్యం అని రిటైర్డ్ ఇంజనీర్ శ్యాం ప్రసాద్ రెడ్డి అన్నారు. వరద నీటి కోసం కట్టుకుంటున్న ప్రాజెక్టు అనుమతులు నిలిపివేయడం కేంద్రం యొక్క దుర్మార్గ బుద్ధి అన్నారు. కేంద్రం సూచన మేరకు కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  సుప్రీం కోర్టులో వేసిన ట్రిబ్యునల్ కు   సంబంధించిన దావాను విత్ డ్రా చేసుకున్నప్పటికీ నేటికీ కొత్త ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయలేదంటే తెలంగాణ గొంతు నొక్కడానికే ప్రయత్నం చేస్తున్నట్లుగా స్పష్టంగా కనపడుతుంది అన్నారు.

గెజిట్ నోటిఫికేషన్ కు  కారణం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అలసత్వమే

డి లక్ష్మీనారాయణ రిటైర్డ్ ఇంజనీర్

—————————————

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నా ఏ ఒక్క ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తి చేయలేదన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన అలసత్వమే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి కారణం అయింది అన్నారు. ఏనాడు కూడా నదీజలాల విషయంలో తెలంగాణ రాష్ట్రం ..ట్రిబ్యునల్లో గాని,బోర్డు లో గాని తమకు దక్కాల్సిన న్యాయబద్ధమైన వాటా గురించి కొట్లాడ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం 300 టీఎంసీల నికర జలాలను 220 టీఎంసీలు మిగులు జలాలు మొత్తంగా 520 టీఎంసీలు వాడుకోవాల్సి ఉండగా నేటికీ 270 టీఎంసీలు కూడా దాట లేదన్నారు. నదీజలాల విషయంలో ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న స్పష్టత అన్నారు.

కృష్ణానదిని రాయలసీమకు అప్పజెప్పే చర్యలను వ్యతిరేకిద్దాం

అంబటి నాగయ్య తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు

—————————

పోలవరం ముంపు మండలాలను కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తోనే ఆంధ్రాలో కలపడం మూలంగా తెలంగాణపై పెత్తనం ప్రారంభమైందని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అన్నారు. నదీజలాల విషయంలో బేషిన్ లు లేవు బేషజాలాలు లేవు అన్న ముఖ్యమంత్రి తో కలిపి ఉద్యమాలు చేయలేమని.. కృష్ణా నదిని రాయలసీమ కు అప్పజెప్పే చర్యలను ప్రారంభించాడని వారన్నారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముగింపులు కృష్ణా గోదావరి నదీ జలాల సంరక్షణ కు సంబంధించి నల్గొండ డిక్లరేషన్  పేరుమీద సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి గారు ఈ కింది తీర్మానాలను ప్రవేశ పెట్టడం జరిగింది.

1. జూలై 15 2021 న కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన గెజిట్ ను ఉపసంహరించుకోవాలి.

2. తెలంగాణ నీటి కేటాయింపుల కోసం కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలి.

3. రాజ్యాంగ విరుద్ధమైన అప్రజాస్వామిక మైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా నల్లగొండ జిల్లా ప్రజలు ఒకరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని తీర్మానం చేశారు.

తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రముఖ విద్యావేత్త ఎం.వి గోనా రెడ్డి సమన్వయం చేయగా.. ఈ కార్యక్రమంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చైర్మన్ రణదీప్ రెడ్డి ,ఇండియా అధ్యక్షులు రాజారెడ్డి,డి.పి.రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్, సిపిఐ జిల్లా కార్యదర్శి నెలికంటి సత్యం, టిడిపి బాధ్యులు తుమ్మల మధుసూదన్ రెడ్డి, నెల్లూరు దుర్గాప్రసాద్, సిపిఎం పార్టీ బాధ్యులు తుమ్మల వీరారెడ్డి, మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు హరిందర్, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, ప్రముఖ న్యాయవాదులు జి. వెంకటేశ్వర్లు, రియాజుద్దీన్, జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి  శ్రీధర్ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పల్లా దేవేందర్ రెడ్డి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ , డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఇ సి హెచ్ గురువయ్య అనంత రెడ్డి ,సలీం పాషా తదితరులు పాల్గొన్నారు.

  • రాజారెడ్డి,

అధ్యక్షుడు, తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం, అమెరికా, ఇండియా

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles