Thursday, May 2, 2024

నదుల నిర్వాహక మండళ్ళ నిర్వాకం

  • రాష్ట్రాల జలశక్తిని హరించిన కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ

కృష్ణా జలాలు- 3

నదీ జలాలలో దామాషా ప్రకారం తెలంగాణ జిల్లాలకు వాటా ఇవ్వడానికి ఆంధ్ర పాలకులు నిరాకరించడం తెలంగాణ ఉద్యమ ఉధృతికి ప్రధాన కారణం. అందువల్లనే తెలంగాణ సరిహద్దు జిల్లా మహబూబ్ నగర్ అత్యంత వెనుకబడిన జిల్లాగా పేరు తెచ్చుకొని దేశం మొత్తానికి సంచార కార్మికులను (పాలమూరు కూలీలు) అందిస్తోంది. కృష్ణా,గోదావరి మహానదుల నీటిని ఏకపక్షంగా వినియోగించుకోవడం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సైతం కొనసాగుతోంది. రెండు రివర్ మేనేజ్ మెంట్ బోర్డులను ఏర్పాటు చేయాలని  2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఆదేశించింది. 2014లోనే బోర్డులను ఏర్పాటు చేసినప్పటికీ వాటి పరిధిని ఏడేళ్ళు పైబడినా మొన్నటి దాకా నిర్వచించలేదు. అందువల్ల వివాదం, ఎక్కువ నీరు వాడుకుంటున్నారంటూ పరస్పర ఆరోపణలు చేసుకోవడం కొనసాగుతోంది.

ఇది వాణిజ్య కార్పోరేట్ రంగంలో ఒక సంస్థలో మిగిలిన సంస్థలను విలీనం చేసినట్టూ, ఒక సంస్థ తక్కిన సంస్థలను కొనుగోలు చేసినట్టూ, స్వాధీనం చేసుకున్నట్టూ నదీ జలాల వ్యవహారాన్ని కేంద్రం స్వాధీనం చేసుకున్నది. కృష్ణా, గోదావరి మేనేజ్ మెంట్ బోర్డుల (కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ) పరిధులను నిర్ణయించడం పేరు మీద కేంద్రం 15 జులై 2021న ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.  వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాలకు గల అధికారాలనూ, పరిధులనూ ఊడబెరికి బోర్డులకు అప్పగించింది. అందుకే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల (కృష్ణా బేసిన్ లో 35, గోదావరి బేసిన్ 71) నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లొనుంచి కేంద్ర ప్రభుత్వం లాగివేసుకున్నదనే విమర్శలు వినిపించాయి. ప్రాజెక్టుల నిర్వహణలో  వ్యయప్రయాలసన్నిటినీ రాష్ట్రాల నెత్తిన పెట్టింది. బోర్డులకు అధ్యక్షులుగా కానీ ఇతర సభ్యులుగా కానీ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు కానీ ఇతర అధికారులు కానీ అనర్హులంటూ కేంద్ర నోటిఫికేషన్  నిషేధం విధించడం విడ్డూరం. కేంద్ర అధికారులను నియమించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్రం బాబులు (అధికారులు) నిజంగానే కృష్ణా, గోదావరి నదులను సొంతం చేసుకొని వారి రాజకీయ యజమానుల అభిమతానికి తగినట్టు నడుచుకుంటారు. అందువల్ల రాష్ట్రాలకు అధికారాలు లేకుండా చేసి రెండు ప్రధాన నదులనూ కేంద్రం స్వాధీనం చేసుకున్నట్టే అవుతుంది.

Also read: విభజన రాజ్యాంగపరమైన అవసరం

బోర్డులు తమ విధ్యుక్తధర్మాన్ని సమర్థంగా నిర్వహించడానికి వీలుగా బోర్డులకు  బీజధనంగా రూ. 400 కోట్లు చెల్లించాలని రాష్ట్రాలను ఆదేశించింది. బోర్డులు డిమాండ్ చేసిన తర్వాత 15 రోజులలోపు అదనపు నిధులను డిపాజిట్ చేయాలని కూడా నోటిఫికేషన్ స్పష్టం చేసింది. ఎంతో కాలం నుంచి లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులపైన ఖర్చు చేస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిధులనూ, సిబ్బందినీ, ఆస్తులనూ, ప్రాజెక్టులనూ, నిర్వహణాధికారాలనూ, నియంత్రణ అధికారాన్నీ సర్వస్వం కేంద్రానికి సమర్పించుకోవాలి. సర్వాధికారాలు కేంద్రానికి అప్పగించి అన్ని భారాలనూ, బాధ్యతలనూ రాష్ట్రాల నెత్తిన రుద్దింది ఈ నోటిఫికేషన్.

అన్ని ప్రాజెక్టుల నిర్వహణపైన ఈ రెండు  బోర్డులూ రెండు రాష్ట్రాలకూ ఎటువంటి ఆదేశాలనైనా జారీ చేస్తూ ఉండవచ్చు. వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా శిరసావహించాలి. తమ ఆదేశాలు అమలు చేయించుకోవడానికి బోర్డులకు సంపూర్ణమైన అధికారాలు దఖలు చేశారు. కర్మాగారంలో, యంత్రాలలో, స్టోర్స్ లో ఉన్నవన్నీ, సమస్త వాహనాలు, అన్ని అస్తిపాస్తులు కేఆర్ఎంబీకీ, జీఆర్ ఎంబీకీ చెందుతాయి. కేఆర్ బీసీ, జీఆర్ బీసీ పరిధుల విషయంలో ఏమైనా వివాదం వచ్చిన పక్షంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఖరారు (పేరాగ్రాఫ్ 0). అనుమతులు లేని ప్రాజెక్టులకు ఆరు మాసాలలోగా అనుమతులు సాధించుకోవాలి. ఇప్పుడు అనుమతులు లేకుండా నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులపైనా పనిని వెంటనే నిలుపుజేయాలి. వాటి నిర్వహణను నిలిపివేయాలి.

రాష్ట్రానికి ఆర్థిక సంక్షోభం ఏర్పడినా సరే నిర్మాణంలో ఉన్న సకల ప్రాజెక్టులనూ నిలిపివేయవలసిందే. ఇందులో కేంద్రం బాధ్యత ఏమీ ఉండదు. పనులు నిలిపివేసిన కారణంగా నిలిపివేయడానికి ముందు కానీ తర్వాత కానీ షెడ్యూల్డ్ – 2లొ పేర్కన్న ప్రాజెక్టుల విషయంలో ఎవరైనా కాంట్రాక్టర్లు ట్రిబ్యూనళ్ళకు ఫిర్యాదు చేసినా, హైకోర్టు గడప తొక్కినా, సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఆ కేసులకు సంబంధించిన సమస్త బాధ్యతనూ ఆయా రాష్ట్రాలు భరించవలసిందే.    

రెండు రివర్ మేనేజ్ మెంట్ బోర్డులనూ నెలకొల్పి వాటి పరిధిని నిర్ణయించే అధికారం కేంద్రానికి ఈ నోటిఫికేషన్ ఇస్తుంది. బోర్డులను 2014లో ఏర్పాటు చేశారు. కానీ వాటి పరిధి గురించి 2020లో ఆలోచించారు. నదులను స్వాధీనం చేసుకుంటున్నట్టు నోటిఫికేషన్ 15 జులై 2021న  జారీ చేశారు. దిల్లీలో ఉన్న చక్రవర్తి (బాద్షా) కాళ్ళ దగ్గర తమ సౌర్వభౌమాధికారాన్ని పెడుతున్నామనే సంగతి రాష్ట్రాలు గ్రహించాలి.

Also read: జలవివాదానికి ఉత్తమ పరిష్కారమార్గం సూచించిన ప్రధాన న్యాయమూర్తి

(రచయిత డీన్, ప్రొఫెసర్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్ర యూనివర్శిటీ, హైదరాబాద్, మాజీ కేంద్ర సమాచార కమిషనర్)

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles