Thursday, April 25, 2024

జలవివాదానికి ఉత్తమ పరిష్కారమార్గం సూచించిన ప్రధాన న్యాయమూర్తి

  • మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోవాలి
  • న్యాయవిచారణే కావాలనుకుంటే మరో బెంచ్ కి అప్పగిస్తాను: జస్టిస్ రమణ

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ చెప్పినట్టు కృష్ణ, గోదావరి నదీజలాల పంపిణీపైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ముదురుతున్న వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడం ఒక్కటే ఉత్తమమైన మార్గం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపైన జలవివాదానికి సంబంధించి దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాఖ్య చేశారు. తాను రెండు రాష్ట్రాలకూ చెందిన వ్యక్తి కనుక ఈ సమస్యపై న్యాయశాస్త్రం ప్రకారం పరిష్కారం చెప్పడానికి ప్రయత్నం చేయజాలనని సముచితమైన రీతిలో స్పష్టం చేశారు.  నదీ జలాలను, ఇతర వనరులనూ కేంద్రానికి అప్పగించకుండా మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ ప్రయత్నం చేయాలి. నిజాయతీగా ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడుకొని పరిష్కరించుకోవడం అత్యుత్తమమైన పద్ధతి. రెండు వైపులా మంత్రులూ, అధికార పార్టీ నాయకులూ నోరు పారేసుకోవడం వల్లనే శత్రుభావం పెరుగుతుంది. అనవసరంగా ఆవేశకావేశాలను రెచ్చగొట్టి ఓటు బ్యాంకులను కొల్లగొట్టాలని రాజకీయ నాయకులు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. నేరుగా సమాలోచనలు జరపడం ద్వారా సమస్య పరిష్కరించుకోవచ్చునని మహారాష్ట్రతో వివాదం పరిష్కరించుకోవడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఉదాహరణగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ పట్ల కూడా అదే వైఖరి అవలంబించాలి. గట్టిగా ప్రయత్నించినా పరిష్కారం సాధ్యం కాని పక్షంలోనే జాతీయ స్థాయిలో ప్రవీణుల మధ్యవర్తిత్వాన్ని కోరాలి.

ఇటీవల అస్సాం, మిజోరం సరిహద్దులో కాల్పుల సంఘటనను దృష్టిలో పెట్టుకొని ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, దక్షిణాది రాష్ట్రాల ప్రజలు సోదరులనీ, ఒకరికి ఒకరు హాని చేయాలని కలలో కూడా అనుకోరనీ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ తరఫున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే అస్సాం, మిజోరం సరిహద్దులో కాల్పులు జరిగిన సంగతి ప్రస్తావించారు. ‘ఈశాన్య భారతంలో ఏమి జరిగిందో చూసినట్లయితే…’ అంటూ దవే మొదలు పెట్టగానే జస్టిస్ రమణ జోక్యం చేసుకొని, ‘మీ కలలో  కూడా ఆ విధంగా ఆలోచించకండి. మేమంతా సోదరులం’ అని అన్నారు. తాను ఆంధ్రప్రదేశ్ కీ, తెలంగాణకూ సంబంధించిన వ్యక్తినని కూడా అన్నారు. ఈ కేసుపైన తాను న్యాయపరంగా తీర్పు చెప్పజాలనని చెబుతూ కొన్ని ప్రత్యామ్నాయాలు సూచించారు. ‘‘మీరు ఈ సమస్యను మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకుందామనుకుంటే మధ్యవర్తిత్వానికి పంపుతాను. కాదూ న్యాయపరంగానే పరిష్కరించాలీ అనే పక్షంలో మరో బెంచ్ కి పంపుతాను,’’అని జస్టిస్ రమణ అన్నారు.

ఏపీ ఆరోపణలు

తాగునీటినీ, సాగునీటినీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయమైన వాటా అందకుండా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నదని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్ లో ఆరోపించింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే మొదట సుప్రీంకోర్టు గడప తొక్కిన తెలంగాణ రాష్ట్రం అచ్చంగా ఇదే రకమైన ఆరోపణ చేసింది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం  నియమించిన ఉన్నత మండలి (ఎపెక్స్ కౌన్సిల్) నిర్ణయాలను పాటించడానికి తెలంగాణ ప్రభుత్వం నిరాకరిస్తున్నదని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. అదే చట్టం కింద ఏర్పాటు చేసిన కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేస్తున్నదని ఏపీ ప్రభుత్వం విమర్శించింది.   

Krishna flows through Telangana and Andhra Pradesh

తెలంగాణ ప్రభుత్వం, దాని అధికారుల రాజ్యాంగవ్యతిరేకమైన, అన్యాయమైన, అధర్మమైన చర్యల కారణంగా ఏపీ ప్రజల ప్రాథమిక హక్కులకు తీవ్రమైన భంగం వాటిల్లుతున్నదనీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తాగడానికీ, వ్యవసాయానికీ నదీజలాలలో న్యాయంగా రావలసిన వాటా రావడం లేదని ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.

కృష్ణా నదీజలాల అజమాయిషీ మండలి (కృష్ణ రివర్ మేనేజ్ మెంట్ బోర్డు) పరిధి ఏమిటో స్పష్టంగా తెలియజేయడంలో కేంద్రం విఫలమైనదంటూ ఏపీ పిటిషన్ తప్పు పట్టింది. పరిధి తెలియజేస్తూ జులై 15న కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసిందనీ, పరిధి చెప్పమంటే నదీజలాల వ్యవహారం మొత్తాన్ని తానే స్వీకరిస్తున్నట్టు కేంద్రం ప్రకటించిందని తెలంగాణ తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ సిఎస్ వైద్యనాథన్ వ్యాఖ్యానించారు. దీంతో వ్యవహారం గాడి తప్పిందని న్యాయవాది అన్నారు. ‘రాష్ట్రంలో జలవిద్యుత్తు ఉత్పత్తిని పెంచేందుకు వంద శాతం స్థాపిత శక్తి మేరకు ఉత్పత్తి చేయాలని నిర్ణయించడం జరిగిందంటూ 28 జూన్ 2021న తెలంగాణ ప్రభుత్వం  ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (టీఎస్ జెన్కో)ను ఆ మేరకు ఆదేశించింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది ప్రజల జీవించే హక్కును కాపాడేందుకు వెనువెంటనే జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తూ ప్రధానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జులై 1న, జులై 7న రెండు లేఖలు రాశారని పిటిషన్ పేర్కొన్నది. చాలా సంవత్సరాలు నిష్క్రియాపరత్వంలో ఉండిన కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా మేల్కొని నదులను స్వాధీనం చేసుకున్నది. వివాదాన్ని పరిష్కరించడానికి బదులు, కేంద్రం పెద్దగా వ్యవహరించి పరిస్థితిని చక్కబెట్టే బదులు  రెండు పిల్లుల మధ్య రొట్టె ముక్క వివాదంలో కోతి చేసినట్టు కేంద్రం వ్యవహరించింది. ఆవేశపూరితమైన అంశాన్ని కేంద్రం మరింత వివాదాస్పదం చేయడం విడ్డూరం.

CMs of TS and AP

తెలంగాణ సీఎం వైఖరి

కేంద్రం జారీ చేసిన ఆదేశాలను ప్రస్తావించి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేంద్రం తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదనీ, ఆంధ్రప్రదేశ్ దాదాగిరి చేస్తున్నదనీ వ్యాఖ్యానించారు. కోదాడ నుంచి నాగార్జున సాగర్ వరకూ 15 ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి కృష్ణా బేసిన్ లో నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటి కొరత లేకుండా చర్యలు చేపడతానని ఆయన అన్నారు. గోదావరి, కృష్ణ బేసిన్  లను అనుసంధానం చేయడం ద్వారా నల్లగొండకు గోదావరి నీరు తీసుకువస్తాననే ఎన్నికల వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

నీరు రాష్ట్ర జాబితాలోని అంశం. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలనీ, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్నీ తప్పుగా అన్వయించింది. నదీ జలాలను కేంద్రం తీసుకోవచ్చునని 2014 ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఎక్కడా లేదు. కేంద్రానికీ, రాష్ట్రాలకీ మధ్య సార్వభౌమత్వాన్ని పంచుకోవడంలో సైతం ఈ అంశం ప్రస్తావన లేదు. నదీ జలాల నిర్వహణలో తెలుగు రాష్ట్రాలకు స్వయంనిర్ణయాధికారాలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల పరిధి నుంచి నదీ జలాలను అమాంతంగా కాజేయడం ద్వారా సమాఖ్య సూత్రాన్ని కేంద్రం నీరు కార్చింది.  

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles