Tuesday, November 29, 2022

ప్లవాభివందనం

ప్లవనామ సంవత్సరం ఆరంభమైంది. మన జీవితంలోకి కొత్త వసంతం ప్రవేశించింది. కొత్త శోభలు వస్తాయనే కోటి ఆశల మధ్య అందరం పండుగ చేసుకుంటున్నాం. మనతో పాటు కన్నడ సోదరులు, కొంకణి సోదరీమణులు, బాలి పౌరులందరూ వేడుక చేసుకుంటున్నారు. జనవరి 1వ తేదీ ఇంగ్లిష్ లెక్కల ప్రకారం కొత్త సంవత్సరం. ఆ రోజు తప్పకుండా అందరం గ్రీటింగ్స్ చెప్పుకుంటాం. “ఉగాది” పూర్తిగా మనదైన సంప్రదాయంలో వచ్చే కొత్త ఏడాది. ఈ ఏడాదికి స్వాగతం పలుకుతూ అందరికీ అభినందనలు పలుకుదాం.

35వ వత్సరం ప్లవ

తెలుగు సంవత్సరాలు మొత్తం 60. అందులో ‘ప్లవ’ 35వ సంవత్సరం పేరు.’ప్రభవ’ నుంచి ‘అక్షయ’ దాకా వుండే ఈ సంవత్సరాలన్నీ 60ఏళ్ళకొకసారి మళ్ళీ వస్తూ ఉంటాయి. అదే కాలచక్రం. ప్లవ అంటే ఎగరడం, దాటడం అని అనేక అర్ధాలు ఉన్నాయి. కష్టాలను దాటి, సుఖాలను ఎగిరి అందుకుంటామనే విశ్వాసాన్ని ప్రోది చేసుకుందాం. స్థూలంగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ఫలితం లభిస్తుందని చెబుతుంటారు. ‘ప్లవ’ నామ సంవత్సరంలో జలసమృద్ధి అధికంగా ఉంటుందని అంటారు. అంటే, నీరు సమృద్ధిగా ఉంటుందని అర్ధం. మానవ మనుగడలో నీరు ప్రాణాధారం. అతి వృష్టి ఇబ్బందులు రాకుండా, అనావృష్టితో క్షామం రాకుండా వర్షాలు సక్రమంగా కురిస్తే, అంతకంటే మనం కోరుకునేది ఏముంటుంది?

ఇక నుంచీ అన్నీ శుభాలే

ప్లవ తర్వాత వరుసగా వచ్చే సంవత్సరాలు శుభకృత్, శోభకృత్. శుభకృత్ లో ప్రజలు శుభంగా ఉంటారు, శోభకృత్ లో సుఖంగా ఉంటారని పండితులు అర్ధాలు చెబుతున్నారు. ఏ రీతిన చూసినా, ఈ సంవత్సరం మొదలు వచ్చే కాలమంతా మంచికాలమనే మహర్షుల అభిప్రాయం. అట్లే కానిమ్ము. ఉగాది అన్నా, యుగాది అన్నా ఒకటే అర్ధం. ఆది అంటే మొదలు, ప్రారంభం. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుద్ధ పాఢ్యమి నాడు సృష్టి జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. శాలివాహన చక్రవర్తి చైత్ర శుద్ధ పాఢ్యమి నాడే పట్టాభిషేకం చేసుకొని, తన వీర పరాక్రమాలతో పాలించి, శాలివాహన యుగకర్తగా పేరు తెచ్చుకున్నాడని చరిత్ర చెబుతోంది.

తెలుగు సంవత్సరం ఆరంభం

తెలుగువారి తొలి సంవత్సరం ఉగాది నాడే ఆరంభం అవుతుంది కాబట్టి, అది మనకు ముఖ్యమైన రోజు, పండుగ రోజు. కొత్త పనులను ఈరోజునే ప్రారంభించడం మన ఆనవాయితీ. షడ్రుచుల సమ్మేళనంగా ఉండే “ఉగాది పచ్చడి” మనకు ఎంతో ప్రీతిపాత్రమైంది. జీవితంలోనూ తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే విభిన్నమైన అనుభూతులు, అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, వాటికి సిద్ధంగా ఉండు అని ఈ పచ్చడి మనల్ని హెచ్చరిస్తుంది. అదొక సంకేతం (సింబాలిజం), అదొక సందేశం (మెసేజ్). మరాఠీ వాళ్లు కూడా ఉగాది జరుపుకుంటారు. దాన్ని “గుడి పడ్వా” అని వారు పిలుచుకుంటారు. మిగిలిన రాష్ట్రాల్లోనూ ఈ పండుగ ఉంది. తమిళులు “పుత్తాండు” అని, మళయాళీలు “విషు” పేరుతో, సిక్కులు ” వైశాఖి”పేరున, బెంగాలీలు ” పోయెల్ బైశాఖ్ ” గా వేడుకలు జరుపుకుంటారు. మనకూ – వారికీ సంప్రదాయంలో చిన్న చిన్న వ్యత్యాసాలు మాత్రమే ఉంటాయి.

వేప పువ్వు పచ్చడి

పంచాంగ శ్రవణం, రాశి ఫలాలు తెలుసుకోవడం మన ఆనవాయితీ. వ్యక్తిగతమైన ఫలాలతో పాటు రాష్ట్ర ఫలాలు కూడా తెలుసుకోవడం ఒక సరదా, ఒక సంప్రదాయం. ‘ఉగ’  అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ‘అది’ అంటే మొదలు కాబట్టి ‘ఉగాది’ అనే పేరు వచ్చింది. కన్నడవారు యుగాది అని పిలుస్తారు. ఉగాది నాడు తెలుగునాట వేప పువ్వు పచ్చడి తీసుకోవడం, పంచాంగం వినడం, హితులను, స్నేహితులను కలుసుకోవడం, పెద్దలను పూజించడం, గోమాతను ఆరాధించడం, ఏరువాక సాగించడం మొదలైనవి ముఖ్య ఆచారాలు. కవి సమ్మేళనం కూడా మనం ఎంతో ప్రియంగా జరుపుకుంటాం. కష్టాలను మరచి అనందంగా ఉండడం, తోటి వారికి సాయపడడం, రేపటి పట్ల ఆశాభావంతో సాగడం, మానవ సంబంధాలను పెంచుకుంటూ మానవత్వం నింపుకోవడం పండుగల పరమార్థం. ప్లవ నామ సంవత్సరం కష్టాలను దాటిస్తుందని, సుఖాలకు, శుభాలకు స్వాగతం పలుకుతుందని ఆకాంక్షిద్దాం.

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles