Wednesday, April 24, 2024

మహామానవతావాది – సర్ చార్లీ చాప్లిన్

‘ది గ్రేట్ డిక్టేటర్’ సినిమాలో చాప్లిన్ ద్విపాత్రాభినయం చేశాడు. ఒకటి, హిట్లర్ పాత్ర (డిక్టేటర్), రెండు, హిట్లర్ పోలికతో ఉన్న మంగలి పాత్ర. మిలట్రీ అధికారులు హిట్లర్ రాకకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సభలో హిట్లర్ సైనికుల్ని ఉద్దేశించి మాట్లాడవలసి ఉంది. కానీ ఆ సమయానికి హిట్లర్ బదులు అతడి పోలికలతో ఉన్న మంగలి చేరుకుంటాడు. అతడే హిట్లర్ అనుకొని అధికారులు గౌరవ వందనం సమర్పిస్తారు. అతణ్ణి వేదికమీదకి తీసుకొని వెళతారు. అతి సామాన్యుడైన మంగలి ఏం మట్లాడగలడూ? ఒక నిమిషం తడబడి ఆ తర్వాత ఒక సామాన్యుడుగా తను కోరుకుంటున్నదేమిటో అదే మాట్లాడతాడు. మానవత్వాన్ని తట్టిలేపుతూ కవితాత్మకంగా సాగిందీ ఆ ఉపన్యాసం. హిట్లర్ ను ఎద్దేవా చేసే చార్లీ చాప్లిన్ తన అంతరంగాన్ని అతి సామాన్యుడైన మంగలివాడి పాత్ర ద్వారా ఈ విధంగా వ్యక్తం చేశాడు. ఇది ఒక రకంగా చార్లీ చాప్లిన్ అంతరాత్మ మానవాళికి చేసిన ఉద్బోధ. మహావిదూషకుడి మహోపన్యాసం. ఇది వెలువడి డెబ్బయ్ ఏళ్లు (1940) అయినా ఇంకా నిత్యనూతనంగా ఉంది. ఈ కాలానికి సరిపడే విధంగా కూడా ఉంది. చాప్లిన్ మహానటుడు, మహాదర్శకుడు అనడానికి ఇదొక మంచి ఉదాహరణ. ‘ద గ్రేట్ డిక్టేటర్’ సినిమాలోని చాప్లిన్ ఉపన్యాసం పూర్తి పాఠం తెలుగులో ఇక్కడ మీకందిస్తున్నాను. మనుషులైన వారందరూ ఈ విషయాల్ని గుండెల్లో భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది.

‘‘క్షమించాలి. నాకు చక్రవర్తిని కావాలని లేదు. అలాంటి ఉద్దేశమే లేదు. ఎవరినో జయించాలని కానీ, ఎవరి మీదనో పెత్తనం చలాయించాలని కానీ నాకు లేదు. తెలుపు…నలుపు అన్న తేడా లేదు. ప్రతివారికీ చేయగలిగినంత సహాయం చేయాలనే ఉంది. మనం ఒకరికొకరం సహాయపడుకుంటూ ఉండాలి. ఎదుటివారి సంతోషమే మనకు స్ఫూర్తిని, సంతృప్తిని ఇస్తుంది. వారి దు:ఖం కాదు- ఒకరిని అసహ్యించుకోవడం, అవహేళన చేయడం మనం కోరుకోం. ఈ విశాల ప్రపంచం అందరిదీ. తల్లిభూదేవి బిడ్డలం మనమంతా. ఆమె దగ్గర దేనికీ కొదవలేదు. మన జీవితం స్వేచ్ఛకూ, ఆనందానికీ ప్రతిరూపమవ్వాలి.

Also Read: బౌద్ధ మార్క్సిస్టు – రాహుల్ సాంకృత్యాయన్

‘‘కానీ మనం దారి తప్పుతున్నాం. స్వార్థం మనుషుల అంతరాత్మలను విషపూరితం చేస్తోంది. కుత్సితాలతో ప్రపంచాన్ని కుంచింపజేస్తోంది. కుటిలత్వానికీ, కర్తపాతానికీ మానవుల్ని చేరుస్తోంది. వేగాన్ని అభివృద్ధి పరిచాం. నిజమే. కానీ మనలో మనమే ముడుచుకుంటున్నాం. కావల్సినవన్నీ యంత్రాలు తయారు చేస్తున్నాయి. కానీ, మన కోర్కెల దాహం తీరడం లేదు.

‘‘మన విజ్ఞానం మనలను మానవ ద్వేషులుగా చేస్తూ ఉంది. మన తెలివితేటలు మనల్ని నిర్దయులుగా, కఠినాత్ములుగా తీర్చి దిద్దుతున్నాయి. మనం చాలా ఎక్కువగా ఆలోచిస్తాం. అవసరమైనప్పుడు చాలా తక్కువగా స్పందిస్తాం. యంత్రాల యంత్రాంగం కన్నా మనకు మానవత్వపు మనుగడ ముఖ్యం కావాలి. మితిమీరిన తెలివితేటల కన్నా మర్యాద, మన్నన, దయార్ద్ర హృదయం కవాలి. ఈ లక్షణాలు లేని జీవితం భయానకమై నశిస్తుంది.

‘‘రేడియో, విమానాలు మానవుల్ని దగ్గరి పరిధిలోకి చేరుస్తున్నాయి. మనవునిలోని మంచితనమే వీటిని కనుక్కోగలిగింది. విశ్వమానవసౌభ్రాతృత్వాన్ని ఎలుగెత్తి చాటింది. ఈ నా మాట ప్రపంచంలోని కోటాను కోట్ల ప్రజలకు అందుతోందని నాకు తెలుసు. పురుషులు, స్త్రీలు, పసిపిల్లలు, నిరాశాసదృశులు…పీడించే ఈ వ్యవస్థకు బలైన అమాయకులూ… ఎవరూ నిరాశపడవద్దు. మానవ పురోగతికి అది గొడ్డలిపెట్టు.

‘‘ఈర్ష్యాద్వేషాలు నశిస్తాయి. నియంతలు నశిస్తారు. ప్రజల నుంచి లాక్కున అధికారం మళ్ళీ  ప్రజలకే దక్కుతుంది. స్వేచ్ఛా-స్వాంత్ర్యాలు నశించవు. తాత్కాలికంగా అణచబడ్డా అవి సంకెళ్ళు తెంపుకొని ధైర్యంగా బతుకుతాయి.

సైనికులారా ఆలోచించండి!

దుష్టుల పక్షాన, దుర్మార్గుల పక్షాన నిలబడద్దు.

మీకు తిండిపెట్టి కసరత్తులు చేయించి, మిమ్మల్ని పూర్తిగా వాడుకునేవాడు ఎలాంటవివాడో ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించండి.

మీ ఆలోచనల్ని, మీ అనుభూతుల్ని శాసించే హక్కు ఎవ్వరికీ లేదు. మీరు పశువులు కారు. గడ్డిపోచలుకాదు. మానవ యంత్రాలకు దాసోహమనేది లేనే లేదు. యాంత్రిక మేధస్సులు, మాంత్రిక హృదయాలూ గల కృత్రిమమైన యంత్రాలు వాళ్ళు. 

మీరు యంత్రాలు కాదు – మనుషులు!

మనుషులు!! – మీరు యంత్రాలు కాదు.

మానవత్వం పట్ల మీకు అచంచల విశ్వాసం ఉంది.

ఎదుటివారిని ప్రేమించగల గొప్ప హృదయం ఉంది.

ఎవరిచేతా ప్రేమించబడని కొద్దిమంది యంత్ర-మానవులు మాత్రమే అసహజంగా, అసహ్యంగా, కృత్రిమంగా ప్రవర్తిస్తారు.

వీర సైనికులారా!

స్వేచ్ఛ కోసం పోరాడండి. బానిసత్వంకోసం కాదు.

మీలో ఒక మహత్తర శక్తి ఉంది. జీవితాన్ని అందంగా, ఆనందంగా, సుఖప్రదంగా, ప్రశాంతంగా తీర్చిదిద్దుకోగల శక్తి మీలో ఉంది. యంత్రాల్ని సృష్టించుకగల నేర్పరులు మీరే యంత్రాలై పోకుండా మనుషులుగా నిలదొక్కుకునే ఆత్మశక్తి మీలోనే ఉంది. దాన్ని బయటికి లాగండి. ఇంకా ఆలస్యమెందుకూ?

రండి! ప్రజాస్వామ్యం పేరిట ఏకమై

ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుందాం!

ప్రతివాడికీ పని, యువతకు మంచి భవిష్యత్తు

వృద్ధాప్యానికి భద్రత గల

ఒక మంచి సమాజాన్ని సృష్టిద్దాం.

అబద్ధాలూ, మాయమాటలూ చెప్పి అవినీతిపరులంతా, అహంకారులంతా గద్దెలెక్కుతున్నారు. వాగ్దానాలను నిలబెట్టుకున్నవారు ఇంతవరకూ లేరు.

ఇప్పుడు మనకై మనమే వాటిని సాధిద్దాం.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైతం

స్వేచ్ఛకు అడ్డుగోడల్ని తొలిగిద్దాం.

దురాశ, దు:ఖం, అసూయ, కూరత్వాలకు

నిలువ నీడ లేకుండా చేద్దాం.

శాస్త్రసాంకేతికాభివృద్ధి సాధించే ప్రగతివైపు

పయనిద్దాం రండి!!

అందరం ఏకమౌదాం!’’

ఇదీ చాప్లిన్ ఉపన్యాసం. ఇక్కడ మరొక విశేషముంది. హిట్లర్ ను చార్లీ చాప్లిన్ ఆటపట్టించాడు. కానీ, హిట్లర్ చాప్లిన్ అభిమానులలో ఒకడు.

ఎటువంటి వివాదాలకు తావులేకుండా ‘వరల్డ్స్ గ్రేటెస్ట్ ఎంటర్ టేయినర్’గా ప్రపంచాన్ని నవ్వుతో శాసించిన ‘గ్రేట్ డిక్టేటర్’గా భావించబడ్డ సర్ చాఫ్లీ చాప్లిన్ (16 ఏప్రిల్ 1889 – 25 డిసెంబర్ 1977) తన విజయరహస్యాన్ని తానే అనేక సార్లు బేరీజు వేసుకున్నాడు. మానవ మనస్తత్వాన్ని అనేక కోణాల్లోంచి విశ్లేషించుకున్నాడు. దాన్ని బట్టే తెరమీద తన వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకున్నాడు. అమోఘంగా రక్తికట్టించాడు కూడా! ‘ఈ ప్రజలు దేన్ని చూసి నవ్వుతారు?’ అనే శీర్షికతో చాప్లిన్ 1918లో ఒక అమెరికా పత్రికకు వ్యాసం రాశాడు. అందులో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. అయితే అవి ఎంత సామాన్యమైనవో అంత విలువైనవి కూడా.

Also Read: మన పురాణ పాత్రల మూలాలు ఈజిప్టులో ఉన్నాయా?

‘‘హాస్యం టోపీ ఎగిరిపోవడంలో లేదు. దాన్ని పట్టుకోవడానికి ఒక పెద్ద మనిషి పడే అవస్థలో ఉంది. ప్యాంటు పగిలిపోవడంలో లేదు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పడే తికమకలో ఉంది. అలాగే జారిపోయే ప్యాంటును వదిలేస్తే ఎవ్వరికీ నవ్వు రాదు. కానీ జారిపోకుండా పైకి అనుకుంటూ హడావుడి పడిపోవడంలో హాస్యం ఉంది. అమ్మాయి నగ్నత్వాన్ని ప్రదర్శిస్తున్న పోస్టర్ ను, ఒక పెద్దమనిషి  నిలబడి తనివితీరా చూస్తుంటే ఎవరికీ నవ్వురాదు. సమాజంలో తాను ఒక పెద్దమనిషినని గుర్తుంచుకొని అలా చూస్తూ ఉంటే తన వ్యక్తిత్వానికి దబ్బతగులుతుందని బాధపడుతూ, ఉండలేకపోతూ, చూడనట్టు నటిస్టూ చూస్తూ ఉండడంలో హాస్యం ఉంది. బలహీనుడై ఉండి, పహిల్వాన్ తో ఛాలెంజ్ చేయడం, తెలివిగా తన్నులు తప్పించుకుంటూ ఉండడంలో హాస్యం ఉంది. హాస్యం కత్తిమీద సాములాంటిది. ఎక్కడ ఏ కొద్దిగా బెడిసికొట్టినా హాస్యానికి బదులు జుగుప్స, ఏవగింపు కలుగుతాయి.

ప్రపంచాన్ని తరతరాలుగా కదిలిస్తూ వస్తున్ చార్లీచాప్లిన్  సునిశితహాస్యం ఎక్కడి నుంచో రాలేదు. మాయలూ, మంత్రాలూ అందులో ఏమీ లేవు. జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న చాప్లిన్ మేథస్సులోంచి వచ్చింది. నిజానికి జీవితాన్ని జీవితాంతం చదివినా సరిపోదు. అలాంటి జీవితంలో నవ్వించగల అంశాల గూర్చి నిరంతరం ఆలోచిస్తూ గడిపిన చాప్లిన్ మరొక ముఖ్యమైన విషయం కూడా గ్రహించాడు. ప్రేక్షకులు ఊహించిందే తెరమీద కనిపిస్తే నవ్వరనీ, ప్రేక్షకులు ఊహించని విధంగా విభిన్నమైన ధోరణిలో ప్రవర్తిస్తూ ఉండడం వల్ల వారిలో ఉత్కంఠ, ఉత్సాహం పెరుగుతుందని ఆయన గ్రహించాడు. ప్రేక్షకుల, బలహీనతల్ని ఆయన ఎప్పుడూ దెబ్బతీయలేదు. ఇదొక గొప్ప సుగుణం! తనకు తాను కల్పించుకున్న బలహీనతలతోనే ప్రేక్షకులకు నవ్వు బలాన్నిచ్చాడు. ప్రపంచాన్ని నవ్వులతో శాసించిన మొనగాడు చాప్లిన్ తప్ప మరొకరు లేరు.

Also Read: ఒక వైజ్ఞానికుడూ, ఒక హేతువాది : పుష్పాయం భార్గవ

‘‘నూటికి పది మంది బాగా ఉన్నవాళ్ళూ, తొంభయి మంది లేనివాళ్ళూ ఉన్న ఈ సమాజంలో… తొంభయ్ శాతం ప్రజల్ని నవ్వించడానికి, పది శాతంమందిని గేలిచేయడంలో తప్పేమిటి?,’’  అన్నది ఆయన ప్రశ్న! వర్గ దృక్పథాన్ని ఇంత సులభంగా, సరళంగా చెప్పినవాళ్ళు బహుశా ఎవ్వరూ లేరేమో!  హాస్యంతో మానవవాదానికి ఊపునిచ్చిన మహనీయుడు కూడా మరొకరు లేరేమో!!

(ఏప్రిల్ 16 చార్లీ చాప్లిన్ జయంతి)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles