Tuesday, November 12, 2024

గ్రామాలలో ఐటీ వెలుగులు!

  • వర్క ఫ్రం విలేజీ పథకం
  • విద్యుత్ వలయం నుంచి బయటపడితేనే ఇది సాధ్యం
  • ఆలోచన మంచిదే, ఆచరణే ప్రధానం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఆధునిక సమాచార సాంకేతికతను (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని)మరింతగా సద్వినియోగం చేసుకుంటూ, యువతరానికి బాసటగా నిలవాలనుకుంటోంది.’వర్క్ ఫ్రం హోం’ అందరికీ తెలిసిందే. ఇది ఎక్కువగా పెద్ద పెద్ద పట్టణాలకు, నగరాలకే ఇంత వరకూ పరిమితమైంది. ఇక నుంచి కుగ్రామాలను సైతం అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ‘వర్క్ ఫ్రం విలేజ్’ విధానానికి రూపకల్పన చేస్తోంది. ఇది సంపూర్ణంగా విజయవంతమైతే, పల్లెసీమల రూపురేఖలు మారిపోతాయి. అరచేతిలో సమస్త ప్రపంచం వలె, పల్లెటూరు నుంచే ప్రపంచంతో మరింతగా కలువవచ్చు.సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసుకోవచ్చు, పోటీ పరీక్షలకు బాగా తయారుకావచ్చు, ఉన్నత విద్యను పొందవచ్చు,  నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. ఇవన్నీ ఇంటి నుంచే సాధించవచ్చు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్, ఐ పాడ్స్, లాప్ టాప్స్, డెస్క్ టాప్ కంప్యూటర్స్ పల్లెల్లోనూ వాడుతున్నారు. కరోనా కాలంలో, వర్క్ ఫ్రం హోం విధానం బాగా అమలులోకి వచ్చింది. ఐటీ రంగంలో పనిచేసేవారే కాక, మిగిలిన కమ్యూనికేషన్స్, సేవా రంగాలలో ఉండేవారు కూడా ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కాకపోతే, పల్లెలు, చిన్నపట్టణాలలో నెట్ సిగ్నల్ చాలా బలహీనంగా ఉంటుంది. పల్లెల్లో వై ఫై వ్యవస్థ అందుబాటులో లేదు. దాని వల్ల పల్లెలకు రావడానికి ఎక్కువమంది సుముఖత చూపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చే కొత్త సాంకేతిక విధానం ద్వారా సమస్యలకు కాలం చెల్లి, దూరం తరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also read: కన్నడసీమను విషాదంలో ముంచిన పునీత్

వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ

గ్రామాల నుంచే పనిచేసే పరిస్థితులు రావాలని, అవి మరింత శక్తివంతంగా రూపాంతరం చెందాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునివ్వడం, దానిపై ప్రత్యేకమైన దృష్టి సారించడం అభినందనీయం. ‘వై ఎస్ ఆర్ డిజిటల్ లైబ్రరీ’ విధానంపై తాజాగా సమీక్షా సమావేశం జరిగింది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా సద్వినియోగం చేసుకోవాలని, విలేజ్ డిజిటల్ లైబ్రరీలు యువతకు ఉపయోగపడాలని, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇవన్నీ సాకారమవ్వాలంటే అంతరాయం లేని బ్యాండ్ విడ్త్ తో ఇంటర్నెట్ కనెక్షన్స్ బాగా పెరగాలి. దశలవారీగా ఈ పథకం విస్తరణ చెందే అవకాశం ఉందని భావించాలి. మూడు దశల్లో ఈ ప్రయాణం జరగాలని తొలిగా ప్రణాళికలు వేస్తున్నారు. అందులో భాగంగా, విశాఖపట్నం,తూర్పు గోదావరి, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టి సారించాలని కలెక్టర్లకు ఆదేశాలు అందినట్లు సమాచారం. డిజిటల్ లైబ్రరీలలో కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లతో పాటు మౌలిక సదుపాయాల రూపకల్పన జరగాల్సివుంది. ఐరన్ రాక్స్, పుస్తకాలు,మాగజిన్స్  మొదలైనవి ఏర్పాటు చేయడం ద్వారా సకల సదుపాయాలు అందిస్తున్నట్లు భావించాలి. 2022 ఏడాది చివరికల్లా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో నిరంతరాయంగా, పూర్తి స్థాయి బ్యాండ్ విడ్త్ తో ఇంటర్నెట్ అందుబాటులోకి తేవాలనే లక్ష్యాన్ని పెట్టుకోవడం శుభపరిణామం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13వేల గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీ కేంద్రాలు ఏర్పాటుకావడం, రాష్ట్ర చరిత్రలోనే కీలకమైన ప్రస్థానం. గ్రామవాసులు సైతం, ముఖ్యంగా యువత ప్రపంచానికి మరెంతో దగ్గర కానున్నారు.

Also read: రసకందాయంలో పంజాబ్ ఎన్నికల రంగం

ముందు కరెంట్ కష్టాలు గట్టెక్కాలి

రాష్ట్రానికి కరెంటు కష్టాలు పెరగనున్నాయనే వార్తలు ఈ మధ్య బాగా వినపడుతున్నాయి. కోతలు పెరుగుతాయని అంటున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు పెరిగితే ఆ దుష్ప్రభావం ఇంటర్నెట్ పైనా పడుతుంది. దీనివల్ల డిజిటల్ లైబ్రరీల పథకం ఏ మేరకు అనుకున్న లక్ష్యాలను సాధిస్తుందో చూడాలి. ముందుగా విద్యుత్ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి. సమాచార స్రవంతికి, పల్లెసీమల ప్రగతికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంతముఖ్యమో, రవాణా అనుసంధానం అంతే ముఖ్యం. మంచి రోడ్లు, విద్యుత్ సదుపాయాలు ఎంతో కీలకం. పల్లెలు,పట్టణాలలో చాలా చోట్ల రోడ్ల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. కనీస సదుపాయాలు లేని గ్రామాలు రాష్ట్రంలో ఇంకా చాలా ఉన్నాయి. గిరిజన ప్రాంతాలలోనూ మౌలిక సదుపాయాలు ఇంకా అభివృద్ధి చెందాల్సి వుంది. సమాంతరంగా వీటిపైనా దృష్టి నిలపాలి. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు సాంకేతికతపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఆధునిక ప్రపంచానికి దగ్గరవ్వాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మించింది లేదు. పల్లెసీమలలో డిజిటల్ లైబ్రరీల స్థాపన రాష్ట్ర ప్రగతికి, రేపటి తరాల సుస్థిర అభివృద్ధికి బంగారుబాటలు వేయాలని ఆకాంక్షిద్దాం.

Also read: ఇంటి నుంచి ఐటీ పనికి త్వరలో స్వస్తి

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles