Thursday, April 25, 2024

ఇంటి నుంచి ఐటీ పనికి త్వరలో స్వస్తి

  • అందరినీ కార్యాలయాలకు పిలిపించాలని ఐటీ సంస్థల ప్రయత్నం
  • వర్క్ ఫ్రం హోమ్ తో విసిగిపోయిన కొందరు ఉద్యోగులు
  • బరువు పెరిగి, చురుకుదనం తగ్గిన సిబ్బంది
  • కరోనాను గమనంలో ఉంచుకొని ఆచితూచి అడుగు వేయడం ఉత్తమం

కరోనా లాక్ డౌన్  నిబంధనల సడలింపుల తర్వాత క్రమంగా అన్ని రంగాలు ఒకప్పటి సాధారణ పనిసంస్కృతికి ( వర్క్ కల్చర్) వచ్చేస్తున్నాయి. చాలా విభాగాల కార్యాలయాలు తెరుచుకున్నాయి. సినిమా ధియేటర్లలోనూ 100శాతం ప్రవేశానికి ప్రభుత్వాలు అనుమతిని మంజూరు చేశాయి. ఐ.టి రంగం మాత్రం ఇంకా సాధారణ పరిస్థితుల్లోకి రాలేదు. ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ విధానంలోనే కొనసాగుతోంది. గతంలోనూ ఈ సంస్కృతి ఉన్నప్పటికీ అది కేవలం పాక్షికంగా ఉండేది. కరోనా కాలంలో ఐటీ సంస్థలన్నీ 100 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించాయి. వచ్చే డిసెంబర్ నుంచి ఈ విధానానికి స్వస్తి పలికి, అందరినీ కార్యాలయాలకు రప్పించాలని ప్రణాళికలు వేస్తున్నాయి. ఈ దిశగా ఇప్పటికే సిబ్బందికి సమాచారాన్ని ఇచ్చేశాయి. దేశంలోని పెద్దపెద్ద సంస్థలన్నీ 2022 జనవరి నుంచి వేగాన్ని పెంచాలని చూస్తున్నాయి.   టీసీఎస్,ఇన్ఫోసిస్, విప్రో,   హెచ్ సీఎల్ మొదలైన సంస్థలు 90శాతం సిబ్బందిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. టాప్ టెన్ సంస్థలకే కాక మధ్య తరహా, చిన్నస్థాయి సంస్థలు కూడా ఇదే దారిలో నడవాలని చూస్తున్నాయి. ఫలితాలలో అభివృద్ధిని సాధించడంతో పాటు క్రమశిక్షణను పెంచాలని భావిస్తున్నాయి.

Also read: రజనీ బాబాసాహెబ్ ఫాల్కే పురస్కారం బస్సు డ్రైవర్ సహా ఆత్మీయులందరికీ అంకితం

టీకాలను ముమ్మరం చేశారు

ఈ ఉద్దేశ్యంతో ఇంతకు ముందునుంచే వ్యాక్సినేషన్ పై స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించాయి. ఉద్యోగుల్లో సుమారు 70శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యేలా చూశాయి. ఒక డోసు తీసుకున్నవారు దాదాపు 95శాతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ‘వర్క్ ఫ్రం హోం’కు స్వస్తి పలికే క్రమంలో కొన్ని సంస్థలు వేరు వేరు లక్ష్యాలను పెట్టుకున్నట్లు మార్కెట్ లో ప్రచారం జరుగుతోంది. 2025 వరకూ 25శాతం సిబ్బందిని ఇంటినుంచే పనిచేయించాలని టీసీఎస్ వంటి సంస్థలు ఆలోచిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఇన్ఫోసిస్ సంస్థ హైబ్రిడ్ విధానాన్ని అమలుచేయాలని చూస్తోంది. పరిస్థితులు, వెసులుబాటును బట్టి ఇంటి నుంచి కొందరు, కార్యాలయాలకు వచ్చి కొందరు పనిచేయడమే ‘హైబ్రిడ్ విధానం’. విప్రోలో  రెండు డోసులు పూర్తయిన ఉద్యోగులు వారానికి రెండు రోజుల పాటు ఆఫీస్ కు రావడం ఇప్పటికే ప్రారంభమైందని అంటున్నారు. కొన్ని సంస్థల్లో కనీసం వారానికి ఒకరోజు కొందరు వచ్చి వెళ్తున్నారు. సీనియర్ల విషయంలో కొంచెం తేడాలు ఉన్నాయి. కరోనా కాలంలో ఆరోగ్య రక్షణతో పాటు ఖర్చులు తగ్గించుకోవాలని చాలా కంపెనీలు భావించాయి. ఆ క్రమంలోనే పూర్తిస్థాయిలో ఇంటి నుంచే పనిచేసే సంస్కృతిని అమలులోకి తెచ్చారు. ఇది కొంతవరకూ బాగానే కలిసి వచ్చింది. ఖర్చులు తగ్గిన మాట వాస్తవమే కానీ, ఉత్పాదకతపై ప్రభావం చూపించాయాని కొన్ని సంస్థలు చెబుతున్నాయి. పేరుకే ‘ఇంటి నుంచి పని’, కానీ, పనిభారం పెరిగిపోయిందని, కొత్త కొత్త లక్ష్యాలు, అదనపు బాధ్యతలు కూడా అప్పచెబుతున్నారని కొందరు ఉద్యోగులు విమర్శిస్తున్నారు. కొందరు ఉద్యోగులు బయట ప్రాజెక్టులు కూడా చేపట్టి, అదనపు ఆదాయం కోసం పనివేళలు వెచ్చిస్తున్నారని కొన్ని సంస్థలు చెప్పుకొస్తున్నాయి.  కరోనా కాలంలో కొన్ని సంస్థల్లో కొందరు ఉద్యోగులకు స్వచ్ఛందంగా తప్పుకొనే పరిస్థితులు కూడా వచ్చాయని సమాచారం. కొత్త ఉద్యోగుల నియామకం మళ్ళీ మొదలైంది. క్రమంగా సంఖ్యను పెంచుకుంటూ వెళ్లాలని సంస్థలు చూస్తున్నాయి. డిమాండ్ -సప్లై సూత్రం ఇక్కడ వర్తిస్తుంది. అవసరాల మేరకు, ప్రాజెక్టుల డిమాండ్ మేరకే నియామకాల విధానం ఉంటుందని భావించాలి.

Also read: సకారాత్మక సంచలనాలకు చిరునామా స్టాలిన్

సమీప కాలంలో ఐటీ రంగంలో వేగం

అతి సమీప కాలంలోనే మళ్ళీ ఐటీ రంగంలో వేగం పుంజుకుంటందని అంచనా వేయవచ్చు. ప్రపంచ వ్యాప్త ఐటీ రంగంలో ఇండియా పాత్ర గణనీయమైంది. భారతీయ ఐటీ సంస్థలు పెట్టుబడులను పెంచుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలను పెంచుకొనే దిశగా చేపట్టే చర్యల్లో వేగం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు కూడా ఐటీ సేవల వినియోగాన్ని పెంచుతున్నాయి. కరోనా కాలంలో పోగొట్టుకున్న ప్రగతిని తొందరగా తిరిగిరాబట్టాలనే లక్ష్యంతో ఐటీ సంస్థలు పథకాలను రచిస్తున్నాయి. ఆధునిక సమాజ ప్రగతిలో ఐటీ రంగం పాత్ర చాలా విలువైనది. అనేక కుటుంబాల ముఖచిత్రాన్నే ఈ రంగం మార్చేసింది. దీనివల్ల చాలా కుటుంబాల్లో కొనుగోలు శక్తి పెరిగింది. అదే సమయంలో పట్టణాలు, నగరాలు, ముఖ్యంగా ఐటీ సంస్థలు ఎక్కువగా ఉన్న చోట జీవించేఖర్చులు (కాస్ట్ అఫ్ లివింగ్ ) బాగా పెరిగాయి. ఇది మిగిలిన రంగాల్లో జీవించేవారిపై పడింది. వర్క్ ఫ్రం హోం వల్ల నిన్నటి దాకా టూ లెట్ బోర్డులు పెరిగిపోయాయి. మాల్స్, రెస్టారెంట్స్, రోడ్లపై రద్దీ తగ్గింది. ఇక నుంచి మళ్ళీ ఊపందుకోనున్నాయి. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడం వాస్తవమే కానీ పూర్తిగా పోలేదు. రెండు డోసులు వేసుకున్నవారికి కూడా వైరస్ సోకి, ఇబ్బంది పడుతున్నారు. వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టి, థర్డ్ వేవ్ లు, ఫోర్త్ వేవ్ లు ముగిసేంత వరకూ వర్క్ ఫ్రం హోం విధానాన్ని ఆచితూచి అవలంబించడమే శ్రేయస్కరం. ఎక్కువ కాలం ఇంటికే పరిమితమై పోవడం వల్ల మానసికంగా అసౌకర్యానికి గురైనవారు, శరీరం బరువు పెరిగి, చురుకుదనం తగ్గినవారు, బద్ధకంతో మానసిక పటుత్వాన్ని కోల్పోయినవారు కొందరు ఉన్నారని మానసిక విజ్ఞానశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మళ్ళీ ఆఫీస్ కు వెళ్లి పనిచేసే వాతావరణం పట్ల హర్షాన్ని వ్యక్తం చేసేవారూ ఉన్నారు. ఐటీ పరిశ్రమ మళ్ళీ అభివృద్ధి బాటలో పట్టడం చాలా కీలకం. అదే సమయంలో కరోనా జాగ్రత్తలు పాటించడం అంతే ముఖ్యం.

Also read: అటు చైనా, ఇటు పాకిస్తాన్, అడకత్తెరలో భారత్

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles