Saturday, April 27, 2024

రైతు ఉద్యమం ఫలితంగా ఎంఎస్ పీపై చర్చ ‘ఎందుకు’ నుంచి ‘ఎట్లా’కు మారింది. చివరి గమ్యం ‘ఎప్పుడు’ అన్నది

చాలామంది పాఠ్యపుస్తకాలలో ఉండే ఆర్థిక శాస్త్రానికి కట్టుబడి ఎంఎస్ పీ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. కానీ చర్చ ఎంఎస్ పీని ఎట్లా చెల్లించాలన్న స్థాయికి చేరుకున్నది.

యోగేంద్రయాదవ్

భారత దేశంలో కనీస మద్దతు ధరపై చర్చను తాజా రైతు ఉద్యమం సమూలంగా మార్చివేసింది. చరిత్రాత్మక 13 నెలల ఉద్యమం 2021లో సాగి కనీస మద్దతు ధర (మినిమమ్ సపోర్ట్ ప్రైస్-ఎంఎస్ పీ) ‘ఏమిటి’ అనే చర్చ నుంచి ‘ఎందుకు’ అనే  దిశగా మార్చింది. ఎంఎస్ పీ ‘ఎందుకు’ నుంచి ఎంఎస్ పీ ‘ఎప్పుడు’ అనే చర్చకు ప్రస్తుత రైతు ఉద్యమం తెరలేపింది.

నేను 2016, 2017లలో చాలా మీడియా కార్యాలయాలకు వెళ్ళాను. రాష్ట్రాలలో అనేక మండీల ద్వారా ఎంఎస్ పీ యాత్రను జైకిసాన్ ఆందోళన్ నిర్వహించింది. అధికారికంగా ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే చాలా తక్కువ ధరకు అధికార మండీలలోనే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించడం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. గ్రామలలో అయితే మరీ తక్కువ ధరకు అమ్ముకునేవారు. కొన్ని పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసే కొన్ని ప్రాంతాలలో తప్పిస్తే తక్కిన ప్రాంతాలలో రైతులకు ఎంఎస్ పీ అనేది ఒకటి ఉన్నదనే సంగతి కూడా తెలియదు. ‘‘కిసాన్ కీ లూట్’’ అనే రోజువారీ పత్రం తయారు చేసేవాళ్ళం. ఎంఎస్ పీ కంటే తక్కువ ధరకు అమ్మడంవల్ల రైతులు ఎంత నష్టబోతున్నారో అధికారికి లెక్కల ప్రకారం ప్రకటించేవాళ్ళం. కొంతమంది అంకితభావం కలిగిన జర్నలిస్టులు మినహా మీడియాలో మా కృషికి గుర్తింపు లభించేది కాదు.

అందుకే మేము వార్తాపత్రికల కార్యాలయాలకీ, టీవీ కార్యాలయాలకూ వెళ్ళాం. అక్కడ మీడియా ప్రతినిధుల మొహాలలో శూన్య దృక్కులు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఎంఎస్ పీ అంటే  ఏమిటి? ఎంఎస్ పీ గురించి వినిన కొద్దిమంది మీడియా ప్రతినిధులు కూడా అది ఎంఆర్ పీ (మినిమమ్ రిటైల్ ప్రైస్) లాంటిదే అని అనుకుంటున్నారు. అది దేశం అంతటా అమలు జరగదు. ఎంఎస్ పీ అన్నది విధిగా చెల్లించాలనీ, ఈ నిబంధనను పాటించడంకంటే ఉల్లంఘించడం ఎక్కువనీ ప్రభుత్వ లెక్కలు వేసి చూపిస్తే మీడియా మిత్రులు తెల్లమొహం వేశారు.

Also read: శివాజీలాగా రాహుల్ గాంధీ కూడా ఒక చివరి నుంచి నరుక్కొస్తున్నాడు. అది చిన్నాచితకా రాజకీయమా?

2020-21లో జరిగిన రైతు ఉద్యమం ఒక మేలు మలుపు. మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ పైన ప్రధానంగా దృష్టిపెట్టినప్పటికీ ఉద్యమంలో రెండవ ప్రధాన డిమాండ్ ఎంఎస్ పీ. ప్రధాని నరేంద్రమోడీ మూడు చట్టాలనూ వాపసు తీసుకోవడానికి అంగీకరించిన అనంతరం కూడా ఎంఎస్ పీకి చట్టపరమైన హామీ ఇవ్వాలంటూ రైతు ఉద్యమం మరో నెలరోజులు కొనసాగింది. ఏదో కమిటీ వేస్తానంటూ అస్పష్టమైన ప్రకటన చేసి ప్రభుత్వం అప్పట్లో తప్పుకున్నది. ప్రభుత్వం నియమించిన కమిటీ ఏమీ చేయలేదు. చేసే అధికారం కూడా దానికి లేదు. కానీ ఉద్యమం వల్ల చరిత్రాత్మకమైన మార్పు సంభవించింది. రైతులలో అధిక సంఖ్యాకులు ఎంఎస్ పీ గురించి విన్నారు. కాకపోతే ప్రభుత్వం ఎందుకు ఇంత పట్టుదలగా ఉన్నదో వారికి అర్థం కాలేదు. ఎంఎస్ పీ ని ఎట్లా నిర్ణయిస్తారో, దాన్ని ఏ సూత్రం ప్రకారం నిర్ణయిస్తారో తెలియకపోయినప్పటికీ తమకు న్యాయంగా రావలసిన ఎంఎస్ పీ రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటున్నదనే వాస్తవాన్ని రైతు ఉద్యమకారులందరూ గ్రహించారు. ఎంఎస్ పీ డిమాండ్ చేయడంలో తమ ఉద్దేశం ఏమిటనే అంశంపైన రైతు ఉద్యమకారులలో ఏకాభిప్రాయం కుదిరింది.

ఏకాభిప్రాయానికి దారితీసిన మూడు అంశాలు

రైతు ఉద్యమంలో వచ్చిన ఏకాభిప్రాయంలో మూడు అంశాలు ఉన్నాయి: ఎక్కువ ధర, విస్తృతమైన అవకాశం, ప్రభుత్వాన్ని కట్టిపడేసే వాగ్దానం.

మొదటగా, ప్రస్తుతం ఎంఎస్ పీ నిర్ణయించడానికి పాటిస్తున్న పద్ధతి అన్యాయమైనది. గట్టుబాటు ధర నిర్ణయించే విధంగా విధానాన్ని మార్చాలి. అంటే రమేష్ చంద్ కమిటీ సూచించిన సాంకేతిక అంశాలు పాటిస్తే సూత్రాన్ని మార్చకుండానే ఎంఎస్ పీని పెరిగేది. కానీ డాక్టర్ స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టు ఎంఎస్ పీ పంట పండించడానికి అయ్యే ఖర్చుకు అందులో సగం కలిపితే వచ్చే మొత్తం కంటే తక్కువ ఉండరాదు. ఇది పెనుమార్పు. దానినే అధికార సంభాషణలలో సీ2 కాస్ట్ అంటారు (ఉదాహరణకు క్వింటాల్ ధాన్యం పండించడానికి రెండు వేల రూపాయల ఖర్చు అవుతే ఎంఎస్ పీ మూడు వేల రూపాయల కంటే తక్కువ ఉండరాదు).

Also read: గణతంత్రం మరణించింది, గణతంత్రం జయహో!

రెండు, ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించినట్టు కేవలం 23 రకాల పంటలకే మద్దతు ధర ప్రకటిస్తామంటే సరిపోదు. అన్ని వ్యవసాయ దిగుబడులకూ, పండ్లకూ, పాలకూ, కోడిగడ్డులకూ ఎంఎస్ పీని విస్తరించాలి.

మూడు,  కనీస మద్దతు ధర హామీ అన్నది నోటిమాటగా మిగలకూడదు. దీన్ని చట్టం చేసి అమలు చేసే బాధ్యతను ప్రభుత్వం భుజస్కంధాలపైన పెట్టడం ఒక్కటే మార్గం. వామపక్ష భావాలున్న కిసాన్ సభ, డజన్ల కొద్దీ ఉన్న భారతీయ కిసాన్ సంఘాలూ, ఆర్ఎస్ఎస్ కు అనుబంధమైన భారతీయ కిసాన్ సంఘ్ – అన్ని సంఘాలూ ఈ డిమాండ్ తో ఏకీభవిస్తున్నాయి.

ఎంఎస్ పీ హామీని ఎట్లా అమలు చేయవచ్చునో అనే విషయంపైన కూడా రైతు ఉద్యమ సంఘాలలో అవగాహన ఉంది. ఉద్యమం పాత, నాటు పద్ధతికి దూరంగా జరిగింది. రాతలోకి రాకపోయినా మాటల్లో ఆ స్పష్టత ఉంది. విమర్శకులు మాత్రం పాత పద్ధతులనే పట్టుకొని వేళ్ళాడుతున్నారు.

అనామకులపైన దాడి చేయకండి

ఎంఎస్ పీ చట్టపరమైన హామీని రెండు రకాలుగా అభివర్ణిస్తున్నారు. ఈ రెండు పద్ధతులలోనూ హామీని ఎగకొట్టడం తేలికే. అందుకే వాటికి కూడా రైతు ఉద్యమం దూరంగా జరిగింది.

ఒక వైపు, ప్రభుత్వం ధాన్యం  మొత్తాన్ని ఎంఎస్ పీ చెల్లించి కొనాలనే డిమాండ్ ఉంది. ఇది ప్రభుత్వం అత్యధికంగా రైతులకు మేలు చేయాలన్న డిమాండ్. రైతులందరికీ ఎంఎస్ పీ చెల్లించాలంటే అందరి రైతుల దగ్గరా ధాన్యాన్ని ప్రభుత్వమే ఎంఎస్ పీ రేటు చెల్లించి కొనుగోలు చేయాలి. ఈ విధంగా అడగడాన్ని విమర్శించేవారు రైతు ఉద్యమాన్ని తప్పుపడుతున్నారు. అసాధ్యమైన పని ప్రభుత్వం చేయాలని కోరుతున్నారని అంటున్నారు. ఎంఎస్ పీ కంటే తక్కువ ధరకు అమ్మే ధాన్యం అంతటినీ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం దగ్గర భౌతిక వసతులు ఉండవు. నిధులు కూడా ఉండవు. ఒక వేళ ప్రభుత్వం ఆ పని చేస్తే ధాన్యం వ్యాపారంలో ప్రభుత్వం గుత్తాధిపత్యం చెలాయిస్తున్నదనే విమర్శ వస్తుంది. పైగా ఈ క్రమంలో ప్రభుత్వ అసమర్థత కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. చివరకు నష్టబోయేది రైతులే. ప్రభుత్వమే తమ ధాన్యాన్ని ఎంఎస్ పీ చెల్లించి కొనుగోలు చేయాలని రైతులు కోరుకోవడం లేదు. వారికి ఏదో ఒక పద్ధతిలో ఎంఎస్ పీ రేటు తమ ధాన్యానికి రావడం ప్రధానం.

Also read: బీజేపీని ఓడించేందుకు ‘ఇండియా’ కు మూడు రణక్షేత్రాలలో మూడు వ్యూహాలు

మరోవైపు ప్రభుత్వం అతి తక్కువ పాత్ర పోషిస్తే సరిపోతుందనే వాదన ఉన్నది. దీని ప్రకారం ఎంఎస్ పీ చెల్లించనివారిని శిక్షించే వ్యవస్థ ఉండాలన్న ప్రతిపాదన వచ్చింది. అంటే ప్రభుత్వం ఎంఎస్ పీ హామీని చట్టప్రకారం శిక్షించే కార్యక్రమంగా మార్చాలన్నమాట. ఎంఎస్ పీ కంటే తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసే వ్యాపారులపైన ప్రభుత్వం చట్టప్రకారం శిక్షాత్మక చర్యలు తీసుకుంటే వ్యాపారస్తులు బహిరంగంగా కొనరు. రైతులు తక్కువ ధరకు రహస్యంగా అమ్ముకుంటారు. ప్రభుత్వం ఎంఎస్ పీ కోసం నయాపైసా ఖర్చు చేయకుండా రైతులకు ఎంఎస్ పీ ధరలు లభించేటట్టు చేయగలదనే నమ్మకం నిరాధారమైనది. ఇది అనుభవంలో అసాధ్యమని నిరూపితమైన ప్రతిపాదన. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)చట్టాలు చాలా రాష్ట్రాలలో ఉన్నాయి. కానీ  ఆ చట్టాలు అమలు చేయడం అసాధ్యం. ఎంఎస్ పీ చెల్లించనివారిపైన శిక్షాత్మక చర్యలు తీసుకుంటామంటే వ్యాపారం నల్లబజారుకు చేరుకుంటుంది. రైతులకు చేయవలసిందంతా చేశామని ప్రభుత్వం నటించడానికి అవకాశం కల్పిస్తుంది.

ఈ రెండు పద్ధతులకూ దూరంగా రైతు ఉద్యమ సంస్థలూ, వాటి సానుభూతిపరులూ జరిగారు. ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకున్న విమర్శకులు పైన పేర్కొన్న రెండు పద్ధతులను పట్టుకొని విమర్శిస్తున్నారు. ఇవి రెండూ కాకుండా బుకే విధానం (పుష్పగుచ్ఛం పద్ధతి) ఒకటి రైతు ఉద్యమకారుల ఆమోదం పొందుతున్నది. నాలుగైదు సూత్రాలను కలిపి ఈ విధానాన్ని రూపొందించారు. దీనివల్ల ఆశించిన ఫలితం పొందవచ్చుననే అభిప్రాయం రైతాంగంలో వినిపిస్తున్నది. ఈ విధానం కింద రైతులకు తాము పండించిన పంట మొత్తానికీ ఎంఎస్ పీ రేటు ప్రకారం అమ్ముకునే హక్కు ఉన్నదని ప్రభుత్వం అంగీకరించాలి. ఇందుకోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రారంభించాలి. వాటికి నిధులు సమకూర్చాలి. ఇన్ని పథకాలు అమలు చేసినప్పటికీ రైతులు ఎవరైనా తమ ధాన్యాన్నిఎంఎస్ పీ కంటే తక్కువ ధరకు అమ్ముకోవలసి వస్తే అటువంటి రైతులకు ఎంఎస్ పీ రాకపోవడం వల్ల వచ్చిన నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేయాలి.

బుకే ప్రక్రియ

ఎంఎస్ పీ హామీని నెరవేర్చడం కోసం ప్రభుత్వం మూడు రకాలుగా జోక్యం చేసుకోవాలని బుకే ప్రక్రియ ప్రతిపాదిస్తున్నది.

మొదటిది, కొన్ని పంటల సేకరణను పెంచడానికి అనుగుణంగా ప్రభుత్వం ఏమైనా పథకాలను ప్రారంభించవచ్చు. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థలో పప్పుదాన్యాలూ, వంటనూనెలూ కలిపి వాటి విస్తృతిని పెంచవచ్చు. ఈ విధానం తమిళనాడు వంటి రాష్ట్రాలలో ఇప్పటికే అమలులో ఉంది. విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో పాలు, కోడిగుడ్డు, పండ్లు వడ్డించవచ్చు. తృణధాన్యాలను తినడాన్ని ప్రోత్సహించవచ్చు. పప్పుధాన్యాలు పండించడాన్ని లాభసాటిగా చేయవచ్చు.  ఇవన్నీ రైతుల ప్రయోజనాల కోసమే కాకుండా స్వతంత్రంగా ప్రభుత్వానికి సిఫార్సు చేసిన విధానాలు. ఈ విధానాలు అమలు చేయడం వల్ల తృణధాన్యాల, పప్పుల, నూనెగింజల సేకరణతో పాటు పాలు, కోడిగుడ్డు సేకరణ కూడా పెరుగుతుంది.

Also read: రాజ్యం-జాతీయత నమూనా ఇప్పటికీ ఆదర్శప్రాయమే 

రెండోది, ప్రభుత్వం మార్కెట్లో రకరకాలుగా ప్రభావవంతంగా జోక్యం చేసుకోవచ్చు.  పాడైపోయే వస్తువులు సరఫరా ఎక్కువైతే వాటి ధరలు పడిపోతాయి. అటువంటి సందర్భాలలో ప్రభుత్వం అటువంటి వస్తువును చిన్న మొత్తంలోనైనా ఎంఎస్ పీ చెల్లించి కొనాలి. దాని ద్వారా మార్కెట్లో స్థిరత్వం ఏర్పడుతుంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (మార్కెట్లో జోక్యం చేసుకునే పథకం) ద్వారా ఈ పని చేయవచ్చు. నిజానికి ఈ పధకం కేంద్రప్రభుత్వం దగ్గర ఉన్నది. కాకపోతే  ఈ పథకానికి నిధులు ఇవ్వకుండా ఎండగడుతున్నది. రైతులు నిర్వేదంలో ధాన్యం తక్కువ ధరకు అమ్మకుండా చూసేందుకు గిడ్డంగుల పథకం ఒకటి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. రైతులకు ఎంఎస్ పీ చెల్లించడానికి సిద్ధపడే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లను ప్రభుత్వం ప్రోత్సహించవచ్చు. ఆహార ధాన్యాల ఎగుమతులపైన అనవసరమైన నిర్బంధాలను ప్రభుత్వం తొలగించవచ్చు. దిగుమతులను రైతు ప్రయోజనాలకు నష్టదాయకంగానూ, వినియోగదారులకూ, వ్యాపారులకూ అనుకూలంగానూ ప్రభుత్వం అనుమతిస్తున్నది.  ఈ విధానానికి స్వస్తి చెప్పాలి.

ఈ చర్యలన్నింటి వల్లా కాగల ఖర్చు ఎంఎస్ పీ చెల్లించి ధాన్యం కొనుగోలు చేయడానికి కాగల ఖర్చుతో పోల్చితే చాలా తక్కువ.

చట్టపరమైన హామీ మూడో స్థాయిలో వర్తిస్తుంది. కొంతమంది రైతులకు కొన్ని పంటల విక్రయంలో ఎంఎస్ పీ సాధించడంలో పైన పేర్కొన్నఅన్నిపద్ధతులు ఆచరించినా విఫలమైన పక్షంలో ఆ రైతులు ఎంత నష్టబోతున్నారో అంత ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధపడాలి. ఇది భావాంతర మార్గం. చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. వాటి విజయాలు రకరకాలుగా ఉన్నాయి. ఆయా సీజన్లలో మార్కెట్ రేట్లూ, ఎకరానికి ఎంత పంట పండుతుందనే అంచనా ఆధారంగా ఎంత చెల్లించాలో ప్రభుత్వం నిర్ణయించుకోవచ్చు. ఆ మొత్తాన్ని కర్షకుడి బ్యాంక్ ఖాతాలో జమచేయాలి.

కొత్త వ్యవస్థాపరమైన ఏర్పాటు

ఇదంతా చేయాలంటే నూతన వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ఎంఎస్ పీ ఏయే ధాన్యాలకు ఇవ్వాలో గుర్తిస్తూ పార్లమెంటు చట్టం చేయాలి. ఎంఎస్ పీ ని స్వతంత్రంగా నిర్ణయించడానికి వీలుగా ఒకానొక స్వతంత్ర సంస్థను నెలకొల్పాలి. ఎంఎస్ పీ అమలు చేయడానికి అనువైన నిబంధనలను రూపొందించాలి. ఇప్పుడున్న కమిషన్ ఆన్ అగ్రికల్చరల్  కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సీఏసీపీ)ని రద్దు చేసి దాని  స్థానంలో ఎంఎస్ పీ నిర్ణయాన్నీ, దాని అమలునూ, అందులో అన్ని రకాల వ్యవసాయదారులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికీ బాధ్యత వహించే స్వతంత్ర సంస్థను చట్టప్రకారం ఏర్పాటు చేయాలి. ఇందుకోసం ప్రభుత్వం అవసరమైనంత పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసి దాని నిర్వహణకు సరిపోనే నిధులు మంజూరు చేయాలి.

రైతు ఉద్యమం ఎంఎస్ పీ చర్చను ముందుకు తీసుకొని వెళ్ళింది. ఇప్పటికీ ఎంఎస్ పీ అంటే ఏమిటో అర్థం కానివారు ఉన్నారు. కొంతమంది ప్రభుత్వమే సమస్త ధాన్యాన్నీ కొనాలనడం అసమంజసమని వాదించేవాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఆర్థికశాస్త్రాన్ని పుస్తకాలలో చదువుకొని అసలు ఎంఎస్ పీ ఎందుకుండాలని ప్రశ్నించేవారూ ఉన్నారు. ఎంఎస్ పీ ఎట్లా సాధించాలనే చర్చ ఇప్పుడు రైతు ఉద్యమకారులు చేస్తున్నారు.  రైతు ఉద్యమం, కాంగ్రెస్ పార్టీ మద్దతు వల్ల చర్చ ఎంఎస్ పీ ‘ఎప్పుడు’ అమలు జరుగుతుందన్న అంశంపై కేంద్రీకృతం అవుతుందని ఆశిద్దాం. రాజకీయ అభీష్టం ఉన్నట్లయితే చట్టపరమైన మార్గం దొరికి తీరుతుంది.

Also read: హిందూమతవాదానికీ, బహుజనవాదానికీ మౌలికమైన తేడా ఉంది

Yogendra Yadav
Yogendra Yadav
యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు. స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ సంస్థల సభ్యుడు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై శ్రమిస్తున్న బుద్ధిజీవులలో ఒకరు. దిల్లీ నివాసి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles