Thursday, March 28, 2024

భయాందోళనలో బంగ్లాదేశ్ హిందువులు

  • మతసామరస్యం కాపాడాలని ప్రజలకు ప్రధాని హసీనా పిలుపు
  • లౌకికవాద చట్టానికి తిరిగి వెడతామంటూ మంత్రి ఉద్ఘాటన

బంగ్లాదేశ్ లో ఏం జరుగుతోంది? అక్కడ మైనారిటీలుగా మనుగడ సాగిస్తున్న హిందువులపై దౌర్యన్యానికి కారణాలు ఏమిటి? బంగ్లాదేశ్ లోమతకలహాలు ప్రారంభమైన వెంటనే ప్రభుత్వం రంగంలో దిగింది. శాంతిభద్రతలను పునరుద్ధరించింది. కానీ పరిస్థితి ఇప్పటికీ ఉద్రిక్తంగానే ఉన్నది. ఒక చిన్న కొంటె పని లేక కుట్రపూరితమైన పని, దానికి దండిగా సోషల్ మీడియా ప్రచారం కలిసి హింసాకాండ సృష్టించాయి. ఒక వదంతి వినిపించగానే దాని నిజానిజాలు నిర్థారణ చేసుకోకుండా స్పందించి వీరంగం వేయడం, ఇతర మతాలవారిపైన దాడులు చేయడం అన్నది దక్షిణాసియా దేశాలలో అధికం. బంగ్లాదేశ్ ఇందుకు మినహాయింపు కాదు. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారకుడైన బంగబంధు ముజీబుర్ రెహ్మాన్ తన దేశానికి లౌకిక రాజ్యాంగం కావాలని కోరుకున్నాడు. 1972లో అటువంటి రాజ్యాంగాన్నే ప్రవేశపెట్టారు. ఆయనను హత్య చేసి అధికారంలోకి వచ్చిన సైనికాధికారులు రాజ్యాంగాన్ని కూడా మార్చివేశారు. బంగ్లాదేశ్ ను ఇస్లామిక్ రిపబ్లిక్ గా మార్చారు.

ప్రాణాలు తీసిన పుకారు

బంగ్లాదేశ్ లోని క్యుమెల్లా అనే ప్రాంతంలో అక్బోబర్ 13 ఉదయం ఒక పుకారు షికారు చేయడం మొదలు పెట్టింది. హిందూ ప్రార్థనామందిరంలోయ దుర్గామాత పూజ జరిగే చోట ఒక హిందూ దేవతావిగ్రహం కాలుపైన పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని ఉంచి అపచారం చేసినట్టు చూపించే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసుల ఎమర్జెన్సీ నంబర్ 999కి ఒక యువకుడు ఫోన్ చేసి వారిని హెచ్చరించాడు. పోలీసు అధికారి వెంటనే మఫ్టీలో అక్కడికి చేరుకున్నాడు. అంతలోనే ఫోయెజ్ అహ్మద్ అనే వ్యక్తి ఫేస్ బుక్ లో లైవ్ కథనం నడిపిస్తూ ఉదయం ఏడింటి నుంచి ఏడున్నర వరకూ దేవతావిగ్రహం మోకాలుపైన ఉన్న ఖురాన్ ను చూపిస్తూకథ నడిపించాడు. ‘‘ముసల్మానులారా, కళ్ళు తెరవండి,’’ అంటూ ఎలుగెత్తి చాటాడు. ఫేస్ బుక్ లో లైవ్ చాట్ కాగానే యువకులు అక్కడికి చేరుకోవడం ప్రారంభమైంది. గుంపు క్రమంగా పెద్దది అవుతూ వచ్చింది. ఏదో గొడవ జరిగేటట్టు ఉందని పసిగట్టిన పోలీసులు శాంతంగా ఉండాలంటూ యువకులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అంతలోనే కొంతమంది యువకులు దుర్గా పూజను ఆపుచేయాలంటూ డిమాండ్ చేశారు. కొందరు దుర్గాపూజ జరిగే ప్రాంతంపైన రాళ్ళు విసరడం ఆరంభించారు. పందకొండు, పదకొండున్నర మధ్యలో పూజామందిరాన్ని ధ్వంసం చేశారు.

పోలీసు సాయం కోరుతూ 999 నంబరుకు ఫోన్ చేసిన వ్యక్తిని ఎక్రాం హుస్సేన్ గా గుర్తించారు. దుర్గా మంటపానికి రెండు కిలోమీటర్ల దూరంలో నివాసం ఉండే అతడు సంవత్సరం కిందట సౌదీ అరేబియా నుంచి బంగ్లాదేశ్ కు వలస వచ్చాడు. అతడినీ, ఫోయెజ్ నీ అరెస్టు చేశారు.

సోషల్ మీడియా చేసిన అపకారం

కానీ సోషల్ మీడియా ప్రచారంతో మతద్వేషం వేగంగా వ్యాపించింది. హిందూ దేవాలయాలపైనా, మైనారిటీ హిందువుల నివాసాలపైనా దాడులు జరిగాయి. వంద షాపులపైన దాడులు జరిగాయి. కుమిల్లా నుంచి అల్లర్లు కురిగ్రాం, చాంద్ పూర్, మౌల్వీబజార్, గాజీపూర్, మున్షీగంజ్, ఫెర్నీ, నవోఖాలీ, లక్ష్మీపూర్, ఛటోగ్రాం, బందర్ బన్ వంటి ప్రాంతాలకు పాకాయి. బంగ్లాదేశ్ లో నివసిస్తున్న వేలాదిమంది హిందువులలో భయం గూడుకట్టుకున్నది. ఈ నేపథ్యంలో జరిగిన దుర్గా పూజోత్సవం ఈ సారి భయాందోళనల మధ్య సాగింది. బంగ్లాదేశ్ లో మతసహనానికి పెద్ద పీట వేసే సంస్కృతి ఉంది. రాజ్యాంగం రాజ్యమతాన్ని ఇస్లాంగా పేర్కొన్నప్పటికీ ఇతర మతాలను ఆదరించాలనీ, పండుగలనూ, పబ్బాలనూ గౌరవించాలనీ రాజ్యాంగం స్పష్టం చేస్తున్నది.

వారం రోజుల తర్వాత దేవతా విగ్రహం మోకాలిపైన ఖురాన్ పెట్టిన వ్యక్తిని ఇక్బాల్ హుస్సేన్ గా అధికారులు గుర్తించారు. ఇక్బాల్ కదలికలనూ, దేవతా విగ్రహం దగ్గర ఖరాన్ గ్రంథాన్ని పెట్టడామూ సీసీటీవీ ఫుటేజీ స్పష్టంగా చూపించింది. ఇక్బాల్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఏ రాజకీయ భావజాలమో తెలియదు.  అతడి వెనుక ఎవరో ఉండి ఉండాలి. మతసామరస్యాన్ని చెదరగొట్టడానికి ఎవరో పని గట్టుకొని ప్రతయ్నిస్తూ ఉండాలి. 

బంగ్లాదేశ్ జనాభా 16 కోట్లు. 2013 జనాభా లెక్కలు వెల్లడించిన వివరాల ప్రకారం సున్నీ ముస్లింలు జనాభాలో 89 శాతం మంది. హిందువులు పది శాతం. తక్కిన ఒక్క శాతం మందిలో క్రైస్తవులూ (ఎక్కువగా రోమన్ కాథలిక్కులు), బౌద్ధులూ, షియా ముస్లిలూ, అహ్మదీయాలూ ఉంటారు.

ఇక్బాల్ వెనుక ఎవరున్నారు?

ఎవరో రెచ్చగొడితేనే ఇక్బాల్ ఖురాన్ ను దేవతా విగ్రహంపైన పెట్టి ఉంటాడంటూ బంగ్లాదేశ్ హోంమంత్రి అసదుజ్జమన్ ఖాన్ ఆరోపించారు. ఇది ఒక పథకం ప్రకారం జరిగిన అరాచకం అంటూ బంగ్లాదేశ్ హిందూబుద్ధాక్రిస్టియన్ఐక్యపరిషత్ ప్రధాన కార్యదర్శి రాణాదాస్ గుప్తా అనుమానం వెలిబుచ్చారు. స్థానిక మానవ హక్కుల సంస్థ అయిన్ ఓ సాలీష్ కేంద్ర (ఏఆస్ కె- ఆస్క్) వెల్లడించిన లెక్కల ప్రకారం 2013 నుంచి 2021 వరకూ హిందువులపైన 3,710 దాడులు జరిగాయి. ఈ ఘటనలను విడియోలో రికార్డు చేశారు. హిందూ దేవాలయాలపైన దాడులు చేయడం, హిందువులకు చెందిన ఆస్తులు లాగివేసుకోవడం, మొదలైన దౌర్జన్యాలను ఈ హక్కుల సంస్థ నమోదు చేసి తొమ్మిది పత్రికలలోనూ, డిజిటల్ పత్రికలలోనూ ప్రచురించింది.

బంగ్లాదేశ్ లో పదో పార్లమెంటు ఎన్నికలు 5 జనవరి 2014 నాడు జరిగాయి. మూడో సారి ప్రధానిగా షేక్ ముజిబుర్ రెహ్మాన్ కుమార్తె షేక్ హసీనా ఎన్నికైనారు. ఆమె నాయకత్వంలోని అవామీ లీగ్ గెలుపొందింది. ఆ సందర్భంలో జరిగిన హింసాకాండలో హిందువులతో సహా చాలామంది పౌరులు మరణించారు. హిందువుల ప్రాణాలు రక్షించేందుకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలనీ, శాంతిభద్రతలను కాపాడవలసిన యంత్రాంగంలో దోషులు ఉన్నట్లయితే వారిని గుర్తించి ఏరివేయాలని కూడా మానవ హక్కుల సంస్థ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. శాంతిభద్రతల యంత్రాంగం అత్యంత జాగరూకతతో వ్యవహరించకపోతే మరింత రక్తపాతం జరిగే ప్రమాదం ఉన్నదనీ, విపరీతమైన ఒత్తిడిలో అధికారులు పని చేస్తున్నారనీ, ఆచితూచి అడుగేయాలనీ హ్యూమన్ రైట్స్ వాచ్ అసియా డైరెక్టర్ బ్రాడ్ ఆడమ్స్ వ్యాఖ్యానించారు.

9 ఏళ్ళ కిందట బౌద్ధులూ, హిందువులపై దాడులు

రామూ అనే ప్రాంతంలో బౌద్ధమతస్థులపైన 2012 సెప్టెంబర్ మాసం ఆఖరి వారం చివరి రోజులైన 29, 30లలో  తీవ్రమైన దాడులు జరిగాయి. దస్ రాజ్ దాస్ అనే నర్సినగర్ నివాసి ముస్లింల పరువుతీసే పోస్టింగ్ పెట్టాడనే వదంతితో ప్రభావితమై బౌద్ధారామాలకూ, ఇళ్ళకు నిప్పుపెట్టారు. 30వ తేదీన హిందువులకు చెందిన పది దేవాలయాలనూ, వంద నివాసాలనూ తగులపెట్టారు. ‘‘నేను చాలామంది ముస్లిం స్నేహితులతో కలిసి పెరిగాను. అందరం స్కూల్ లో, కాలేజీలో చదువుకున్నాం. కలిసి ఆడుకున్నాం. సాంస్కృతిక కార్యక్రమాలకు కలిసే వెళ్లేవాళ్ళం. మతవిభేదాలు అనే మాటే మాకు తట్టలేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో కనిపిస్తున్న పరిణామాలు మాకు కొత్తగా అనిపిస్తున్నాయి. భద్రత ఏదీ? పాలనా యంత్రాంగం ఎక్కడుంది? అంతమంది అమాయకులపైన దౌర్జన్యం చేయడాన్నీ, దాడులు చేయడాన్నీ భగవంతుడు ఉపేక్షిస్తాడా?’’ అంటూ క్యుమిల్లాకు చెందిన హిందూ వైద్యుడు ఒకరు ప్రశ్నించారు.

హింసాకాండ జరిపినవారిని శిక్షిస్తామని ప్రధాని షేక్ హసీనా హామీ ఇచ్చారు. ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దనీ, నిగ్రహం పాటించాలనీ ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మతసామరస్యాన్ని కాపాడవలసిందిగా కోరారు. దాడులు జరిగిన ప్రాంతాలను అధికారులూ, మంత్రులూ సందర్శించారు. తమ తమ ప్రాంతాలలో శాంతికి భంగం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని అవామీ లీగ్ నాయకులకు హసీనా పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు మతసామరస్యం అత్యంత ప్రధానమని అధికారపార్టీ నాయకులు పదే పదే చెబుతున్నారు.

మత సామరస్యానికి పెద్దపీట

అన్ని మతాలకు సంబంధించిన పండుగలకూ ప్రభుత్వ సెలవు దినాలు ప్రకటించే ఇస్లామిక్ దేశం బంగ్లాదేశ్ ఒక్కటే. ఈ ఏడాది దుర్గాపూజ సందర్భంగా ప్రధాని మూడు కోట్ల టాకాలను హిందూ కల్యాణ్ ట్రస్ట్ కు  విరాళంగా ఇచ్చారు (ఒక ఇండియన్ రూపాయికి 1.14 బంగ్లాదేశ్ టాకాలు సమానం). ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్ పీ) మితవాద పార్టీగా పేరు తెచ్చుకున్నది. 1971లో బంగ్లాదేశ్ అవతరణను వ్యతిరేకించిన జమాయత్ –ఇ- ఇస్లామీతో పొత్తుపెట్టుకొని పరిపాలన చేసింది. బేగం ఖలీదా జియా కేబినెట్ లో యుద్ధద్రోహులకు స్థానం కల్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ హింసాకాండలో బీఎన్ పీ-జమాత్ కూటమి ప్రచ్ఛన్న హస్తం  ఉన్నదని అధికారపక్షం చేస్తున్న ఆరోపణలను ప్రతిపక్షం ఖండిస్తున్నది. ‘‘అన్ని మతాలకూ స్వేచ్ఛ ఉండాలని బీఎన్ పీ కోరుకుంటుంది. ఇది మా విధానమని మేము ఎప్పుడో నిరూపించాం,’’ అని బీఎన్ పీ  ప్రధాన కార్యదర్శి మీర్జా ఫక్రుల్ ఇస్లామ్ అలంగీర్ వాదించారు. వచ్చే ఎన్నికలలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించేందుకు ఒక ఎత్తుగడగా అవామీ లీగ్ ఈ కలహాలను కావాలని సృష్టించిందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలూ, సాంస్కృతిక సంఘాలూ, విశ్వవిద్యాలయాల అధ్యాపకులూ, యువజన నేతలూ, పౌరసమాజం ప్రముఖులూ బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఖండించారు. ఐక్యరాజ్య సమితి, అమెరికా, ఇండియాలు కూడా ఖండించాయి. ఒక తప్పుడు వార్త కారణంగా ఘర్షణలు జరగడం అరడజను మంది మరణించడం, డజన్ల మంది గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. తగలబడుతున్న బస్సు ఫోటోను పెట్టుకొని బంగ్లాదేశ్ క్రికెటర్ మష్రఫే బిన్ మొర్తజా, ‘‘ఈ రోజు నేను రెండు పరాజయాలు చూశాను. ఒకటి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పొందిన ఓటమి. రెండవది గుండె పగిలిన మొత్తం బంగ్లాదేశ్ ది. ఇటువంటి ఘటనలు వద్దు. అల్లా మార్గదర్శనం చేయుగాక’’ అని రాశాడు.

బంగ్లాదేశ్ లౌకిక రాజ్యమనీ, 1972లో ఉన్న పరిస్థితికి మళ్ళీ వెడతామనీ, జాతిపిత, బంగబంధు ముజిబుర్ రెహ్మాన్ ప్రవేశపెట్టిన రాజ్యాంగాన్నే తిరిగి శిరసావహిస్తామనీ బంగ్లాదేశ్ సమాచార శాఖ సహాయమంత్రి మురాద్ హుస్సేన్ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ మూల ఆదర్శాలను సైనిక నియంతలు మంటగలిపారని ఆయన అన్నారు. పార్లమెంటులో ఎవ్వరూ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించేవారు లేరని ఆయన చెప్పారు.

‘‘నేను హిందువుని. కానీ నా గుర్తింపు, అస్థిత్వం అది కాదు. ఈ దేశ పౌరురాలిని నేను. అదీ నా అస్థిత్వం. భద్రత, రక్షణ కల్పించే బాధ్యత రాజ్యానిది,’’ అని ఒక హిందూ భక్తురాలు అన్నారు. ‘‘భారత దళారి అంటూ నన్ను అవహేళ చేయడం అంటే నా దేశభక్తిని ప్రశ్నించడమే. ఈ నేలను విడిచి మేం 1947లో కానీ, 1966లో కానీ, 1971లో కానీ, 2001లో కానీ పోలేదు. అటువంటి మాకు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవలసి రావడం భావ్యమా?’’ అంటూ కళ్ళలో నీరు పెట్టుకొని ఆమె అడిగారు. ఆమె ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం లేదు. దాడులకు బాధ్యులైనవారిని పట్టుకొని నిస్పక్షపాతంగా శిక్షిస్తే కానీ ఇటువంటి ప్రశ్నలకూ, భయసందేహాలకూ తావు లేకుండా పోదు.

(ఫాల్ట్ లైన్స్ గ్రో డీపర్ ఇన్ బంగ్లాదేశ్ అనే శీర్షికతో ద హిందూ ఓపెడ్ పేజీలో శనివారం సంచికలో వచ్చిన విశేషవ్యాసం ఆధారంగా)  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles