Saturday, February 24, 2024

సంపన్న భారతం

  • మిలియనీర్ల సంఖ్య పెరుగుదల
  • అంతరాలుసైతం పెరుగుతున్నాయి
  • ఇంకా మనది అభివృద్ధి చెందుతున్న దేశమే

ఐక్య రాజ్య సమితి ప్రాతిపదికన భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే వుంది. పేదరికం తగ్గాల్సిన అవసరం, ప్రజల తలసరి ఆదాయం పెరగాల్సిన ఆవశ్యకత దేశానికి ఉన్నాయి. కాకపోతే, తాజాగా కొన్ని సంస్థలు అందిస్తున్న నివేదికలు, అధ్యయనాల ప్రకారం చూస్తే భారత్ లో మిలియనీర్లు, మధ్యతరగతి వారి సంఖ్య సమీప భవిష్యత్తులో గణనీయంగా పెరుగుతుందని అర్ధమవుతోంది. 2031 కల్లా ఈ ప్రగతి నమోదవుతుందని తెలుస్తోంది. ఇది మంచి పరిణామం. దేశంలో గత కొన్నాళ్ళుగా ధనవంతుల జనాభా పెరుగుతోంది. రానున్న దశాబ్దంలో ఈ సంఖ్య సుమారు ఐదు రెట్లు పెరగనుందని నివేదికలు చెబుతున్నాయి. మధ్యతరగతి  కూడా ప్రగతి బాట పట్టనుంది. పట్టణాలతో పోల్చుకుంటే, పల్లె ప్రాంతాల ఆర్ధికస్థితి మరింత మెరుగవుతుందని చెబుతున్నారు. దేశంలోని ప్రజల ఆర్ధిక స్థితిగతులపై ఇటీవల ఒక సంస్థ అధ్యయనం చేసింది. ఆ సంస్థ పేరు ( ప్రైస్) పీపుల్స్  రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్జ్యూమర్ ఎకానమీ అండ్ ఇండియా సిటిజెన్ ఎన్విరాన్ మెంట్. ఏడాదికి 2కోట్ల రూపాయల కంటే ఎక్కువగా సంపాయించేవారు ఈ ఇదేళ్లలో (2021 నాటికి) రెట్టింపైనట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య 18 లక్షలని సమాచారం. ఇదే సంఖ్య 2031 నాటికి ఐదు రెట్లు పెరిగి 91 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. మిలియనీర్ల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో శరవేగంగా పెరుగుతోందని చెబుతున్నారు. గడిచిన ఐదేళ్లలో ఈ సంఖ్యలో పెరుగుదల పట్టణాల్లో 10.46శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 14.2శాతం నమోదైనట్లు నివేదిక చెబుతోంది.

Also read: యువముఖ్యమంత్రి రేవంత్ కేబినెట్ లో సీనియర్లు

పెరుగుతున్న మధ్యతరగతి

ఏటా 5 లక్షలు నుంచి 30లక్షల రూపాయిల వరకూ సంపాదించే మధ్యతరగతి జనాభా కూడా గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ సంఖ్య 43.2కోట్లు వుంది. వచ్చే 2031నాటికి 71.5కోట్లకు చేరుతుందని అంచనా. దీని ప్రకారం చూస్తే దేశంలో దాదాపు 25కోట్లమంది పేదరికం నుంచి బయటపడనున్నారని విశ్వసించాలి. ఏడాదికి 1.25లక్షల రూపాయిల కంటే తక్కువ ఆదాయం వున్న నిరుపేదల సంఖ్య వచ్చే 10ఏళ్లలో సగానికి పైగా తగ్గే అవకాశాలు ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది .గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు, వ్యవసాయేతర కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయి. పల్లెల్లో వ్యాపారాలు తద్వారా ఉపాధి, ఉద్యోగాలు, ఆదాయం పెరగడం శుభపరిణామం. భారతదేశంలో మిలియనీర్ల సంఖ్య బాగా పెరిగిపోతోందని అంతర్జాతీయ అధ్యయన సంస్థలు కూడా చెబుతున్నాయి. ఇదంతా నాణానికి ఒకవైపు. మరోవైపు కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. పెరుగుతున్న జనాభా, మౌలిక సదుపాయాల కొరత, పెరుగుతున్న అసమానతలు, నిరుద్యోగం మొదలైన జాడ్యాలు ఇంకా దేశాన్ని పీడిస్తూనే వున్నాయి. ఆర్ధిక-సామాజిక అంతరాలు పూర్తిగా తొలగిపోవాలి.

Also read: రేవంత రెడ్డికి పట్టం

దశ మారాలి

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అందించే నివేదికల ప్రకారం చూసినా, భారత్ లో పేదరికం తగ్గుముఖం పడుతున్నట్లు అంచనా వేసుకోవాలి. ఇది ప్రమోద పరిణామం. పీవీ నరసింహారావు పుణ్యమా అని, ఆయన తెచ్చిన ఆర్ధిక సంస్కరణల వల్ల దేశం గతి మారింది, ప్రగతి పెరిగింది. ప్రగతిరథ చక్రాలు ఇంకా పరుగులెత్తాల్సివుంది. అభివృద్ధి చెందుతున్న దశ నుంచి అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి భారత్ సత్వరమే చేరాలి. ఆ బాధ్యత ప్రభుత్వాలదే.

Also read: అజాతశత్రువు అస్తమయం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles