Saturday, April 27, 2024

ఆచార్య ఏ.బి.మాసిలామణి పేరుతో పోస్టల్ కవర్, నవంబర్ 30 న విశాఖపట్టణంలో….

కేథలిక్ చర్చి ఆరాధనలలో లాటిన్ బదులు ‘స్థానిక భాష’ వాడకానికి ‘సెకెండ్ వ్యాటికన్ కౌన్సిల్ ‘ 1962 లో అనుమతి ఇచ్చింది. కొత్తగా తెలుగు కేథలిక్ చర్చి తమ ఆరాధనలలో ‘ప్రోటస్టెంట్ చర్చి’ తరహాలో తెలుగులో ఆరాధన, స్తుతికీర్తనలు ఆలపించాలి. కానీ  అప్పటికప్పుడు సాహితీ విలువలున్న తెలుగు కీర్తనలు, వాటికి స్వరాలు,ఇవన్నీ వారు వెతుక్కోవడం ఎలా? అప్పుడు ‘రెడీమేడ్’ గా వారికి  దొరికిన కొంగు బంగారం – ఆచార్య రెవ. ఏ.బి. మాసిలామణి సుమధుర స్తుతి గీతాలు!

ఆంగ్లంలో ‘టవరింగ్ పర్సనాలిటీస్’ అని వొక పదం ఉంది. ఇప్పుడు దాని అవసరం పెద్దగాలేదు గాని, వొకప్పుడు ఈ పదం వాడకం కూడా కొంచెం ఎక్కువ వుండేది. కారణం అప్పట్లో అటువంటి వ్యక్తిత్వాలు ఉన్న మహనీయులు ఉండేవారు. అటువంటి ‘పర్సనాలిటీ’ కి భారత ప్రభుత్వం తరపున పోస్టల్ శాఖ అరుదైన గౌరవం ఇస్తున్న సందర్భంగా ఈ వ్యాసం!  

మాసిలామణి, ఈ స్టాన్లీ జోన్స్ తో మాసిలామణి

కొందరికి, వాళ్ళ తల్లిదండ్రులు తమ పిల్లలు పెద్ద అయ్యాక పేరు గానీ పెట్టారా? అని మనకు అనిపించేట్టుగా అవివాళ్ళకు సరిగ్గా సరిపోతాయి! వీరి తాత ఏబెల్ బెల్లరే లోని ‘ఏ. బి.’ వీరి పేరులోని మాసిలామణి పక్కన వచ్చిచేరింది. ఇది మన తెలుగు పేరు కాదే, అనిపించేట్టుగా ఉన్న ఈ ‘మణి’ ఆంధ్రప్రాంతంలో సారస్వతం వెల్లివిరిసిన గోదావరి తీరాన, పిఠాపురంలో 19 నవంబర్ 1914 లో పుట్టారు. హైందవ ఆర్ష సంప్రదాయం నుంచి క్రైస్తవంలోకి వచ్చిన మూడవ తరం వీరిది. విమలా మాసిలామణి వీరి సతీమణి. వీరికి నలుగురు సంతానం.

‘మీ ఓన్లీ’ తరహా క్రైస్తవ పరిచర్య జరుగుతున్న ఈ రోజుల్లో, ఆచార్య ఏ.బి. మాసిలామణి విశిష్టత ఏమిటో ఈ తరానికి అర్ధం అయ్యేట్టుగా చెప్పడం కొంచెం కష్టమే. పాతతరం వారికి ఆయన గొప్ప వక్త అని తెలుసు, అయితే అందరికీ ఆయన జనరంజక కీర్తనల ద్వారా బాగా దగ్గరగా తెలుసు. అయినా, ఎవరైనా ఆయన గురించి ఇంకా తెలుసుకుని, ఇప్పుడు ఏమి చేయాలి, ఇది ఈ తరం ప్రశ్న. పైకి చెప్పకపోయినా, ఇప్పటి ‘ఎవాంజలిస్ట్’లకు కూడా కలిగే అనుమానం ఇది!

సహజవిద్వత్తుకు తోడు కఠోరశ్రమ

అయితే ఇక్కడ వొక మాట చెప్పాలి. మండు వేసవి మధ్యాహ్నసమయంలో ‘రిలీఫ్’ కోసం, దగ్గరలోని ఏదో వొక పెద్ద చెట్టు క్రిందికి దారినపోయే పదిమంది చేరి, కాస్సేపు సేదతీరి వెళుతుంటారు. అయితే, ఆ చెట్టు ఎలా ఎదిగిందో ఎవ్వరూ పట్టించుకోరు. దాని కొమ్మలు అంతలా విస్తరించి ఊడలు దిగి… ఇంత వెడల్పుకు వొక వృక్షం విస్తరించి పదిమందికి నీడను ఇస్తున్నది అంటే, దాని వ్రేళ్ళు భూమి లోపలికి ఎంతగా లోతుకు దిగితే, అది సాధ్యం అయ్యుండాలి?! ఎటువంటి అనుకూలత లేని వాతావరణ పరిస్థితుల్ని అది తట్టుకుని అలా స్థిరంగా నిలబడి ఉండాలి?! మనమైనా అంతే. సహజ విద్వత్తు, కఠోరశ్రమ లేకుండా ఎవరికీ అది సాధ్యం కాదు. ఆచార్య ఏ.బి. మాసిలామణి అందుకు తిరుగులేని ఉదాహరణ.

స్వస్థలం సామర్లకోటలో వీరి విద్యాభ్యాసం పండితులు చెట్టి భానుమూర్తి గారి వద్ద సాగింది. అప్పటికే మూర్తిగారు ఆర్ష సంప్రదాయాన్ని విడనాడి క్రైస్తవంలోకి వచ్చిన పండితులు, ఉపాధ్యాయులు. మూర్తి గారు అక్కడి బడి విద్యకు స్వస్తి చెప్పి, కాకినాడ బాప్టిస్ట్ సెమినరీలో వేదాంత విద్యా బోధనకు వెళ్ళడంతో, యువకుడైన మాసిలామణి స్కూల్ చదువు తర్వాత వారిని అనుసరించారు. అప్పటికి అది దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సెనేట్ ఆఫ్ సిరంపూర్ కాలేజ్ యూనివర్సిటీ అనుబంధంగా వున్న సెమినరీ! అక్కడ మాసిలామణి ఎల్.టి హెచ్. పూర్తిచేయడంతో వారి తొలి బైబిల్ విద్య పూర్తి అయింది. తర్వాత పశ్చమ బెంగాల్లోని యూనివర్సిటీ కాలేజి సిరంపూర్ లో 1941-1945 లో ఆంగ్ల ప్రిన్సిపాల్ జి. హెచ్. సి. అంగస్ పర్యవేక్షణలో బ్యాచులర్ ఇన్ డివినిటీ పూర్తిచేసారు. అందులో బైబిల్ వాక్య అన్వయం, గ్రీక్ బైబిల్ అధ్యయనం, ‘క్రిష్టియన్ థియాలజీ’ మాసిలామణి అభ్యసించారు.

పాస్టర్స్ తో మాసిలామణి

క్రైస్తవ వేదాంత విద్య స్కాలర్

ఇదే కాలంలో యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా పరిధిలోని సిరంపూర్ కాలేజి నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎం. ఏ.) చేసారు. కెనెడియన్ బాప్టిస్ట్ చర్చి (సి.బి.ఎం.) పాస్టర్ గా ఉత్తర సర్కార్ జిల్లాల్లో పనిచేస్తూ ఉండగా, ఉన్నత విద్యలో వారికున్న మక్కువ గమనించి, మాసిలామణిని బాప్టిస్ట్ సెమినరీ కౌన్సిల్ కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ టొరంటో పరిధిలోని ఇమ్మాన్యుయేల్ కాలేజ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ థియాలజీ చేయడానికి పంపింది. క్రైస్తవ వేదాంత విద్య స్కాలర్ గా మాసిలామణి ‘Hindu Anticipations of the Christian Gospel’ (క్రైస్తవ సువార్త నుంచి హిందువు ఆశించేవి) అనే అంశంపై పరిశోధనాపత్రం సమర్పించి, 1953 లో మాస్టర్ ఇన్ థియాలజీ పూర్తి చేసారు. అధ్యయన అంశం విషయంగా చూసినప్పుడు, భారతసమాజంలో ఆర్షసంప్రదాయం నుంచి క్రైస్తవంలోకి వచ్చిన మూడవ తరం యువకుడిగా, వేదాంత విద్యాభ్యాసంలో మాసిలామణి దూరదృష్టితో కూడిన ఎంపిక అది. ఆ తర్వాత కాలంలో యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో తనతో కలిసి చదివిన, ఓల్డ్ టెస్ట్మెంట్ పండితుడు డబ్ల్యు. ఎం. డబ్ల్యు. రాత్ జబల్పూర్ సెమినరీ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న కాలంలో మాసిలామణి కాకినాడ బాప్టిస్ట్ సెమినరీ ప్రిన్సిపాల్ గా 1955-58 మధ్య పనిచేసారు.

ఒకే కాలంలో ఒక విదేశీ ఒక స్వదేశీ చెరొక సెమినరీలో పనిచేయడం అంటే, దీన్ని మనం ‘రీ ప్లేస్మెంట్’ దృష్టితో చూడాలి. మన దేశానికి 1947 నాటికి బ్రిటిష్ రాజ్యం నుంచి స్వాతంత్ర్యం వచ్చింది. దాంతో ప్రభుత్వంలో నుంచే కాకుండా, విదేశీ మిషనరీల అధీనంలో వున్న క్రైస్తవ సంస్థల నిర్వహణ బాధ్యతలను కూడా ఒక్కొక్కటిగా వారు భారతీయులకు  అప్పగించి వెళుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, సాంప్రదాయ హిందూ నేపధ్యం నుంచి క్రైస్తవంలోకి వచ్చిన మూడవ తరం యువకుడు – తన ఉన్నత విద్యానేపధ్యంతో, యాభై దశకం నాటికి దక్షణ భారతదేశంలో చేపట్టవలసిన బాధ్యతలు ఎటువంటివి కావడానికి ఆస్కారం ఉంది?

అరుదైన ఛాయిస్

అటువంటి ప్రత్యేక పరిస్థితులకు, అన్నివిధాలా అర్హుడైన మాసిలామణి, మనవద్ద ఉన్న అరుదైన ‘ఛాయిస్’ ల్లో వొకరు అయ్యారు! నిజానికి వేదాంత విద్యారంగ పరిపాలనా బాధ్యతలు, మిగతా కాలేజీలు, ఆసుపత్రులు అడ్మినిస్ట్రేషన్ కంటే పూర్తిగా భిన్నమైనవి. అప్పటికే, మాసిలామణి ‘కెనెడియన్ బాప్టిస్ట్ చర్చెస్ ఇన్ నార్తరన్ సర్కార్స్’ కన్వెన్షన్ కు అధ్యక్షుడు అయ్యారు. ఆ బాధ్యతల్లో అప్పటివరకు వున్న కెనడా దేశస్థుడు రెవ. జే.ఐ. రిచర్డ్ సన్ నుంచి మాసిలామణి ఆ బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత ‘టర్మ్’లో అదే సంస్థకు 1959 నాటికి ఆయన సెక్రటరీ అయ్యారు.  

అదే ఏడాది ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియా’ రెవ. మాసిలామణిని బాప్టిస్ట్ సెమినరీ కాకినాడ నుంచి ‘లీన్’ పైన తీసుకుని, తమ సికింద్రాబాద్ యూనిట్ కార్యాలయంలో ఆయన్నిలిటరేచర్ సెక్రటరీ పోస్టులో నియమించింది. భారతీయ క్రైస్తవ్యాన్ని తనదైన దృష్టికోణం నుంచి అప్పటికే అధ్యయనం చేసివున్న రెవ. మాసిలామణి ఈ కొత్త బాధ్యతల్ని ఒక సవాలుగా స్వీకరించారు.

సార్వత్రిక సమభావన

తన సాహిత్య ప్రతిభాపాటవాలతో ‘అర్థడాక్స్ చర్చి’ – ‘ప్రొటస్టెంట్ చర్చి’ మధ్య వొక సార్వత్రికసంఘ సమభావనను క్రైస్తవ సాహిత్య ధోరణుల్లో తెచ్చిన మార్పుల ద్వారా ఆయన సాధించారు. ఇక్కణ్ణించి వీరిని బెంగుళూర్ లోని బైబిల్ సొసైటీ సెక్రటరీగా నియమించడంతో 1963-69 మధ్య  ఆరేళ్ళ పాటు ఆ బాధ్యతలు నిర్వహించారు. ఈ కాలంలో వీరు బైబిల్ సొసైటీకి అందించిన సేవల్ని పలువురు తమ రచనల్లో ‘రికార్డు’ చేసారు.

డెబ్బై దశకం ఆరంభంలో రెవ. మాసిలామణి కెనెడియన్ బాప్టిస్ట్ సంఘంలో తమ సేవలు కొనసాగిస్తూనే, ‘అకాడియా డివినిటీ కాలేజి’ కెనడాలో విజిటింగ్ ప్రొఫెసర్ గా 1976 వరకు పనిచేసారు. ఇదే కాలంలో సరళ్ కుమార్ చటర్జీ ప్రిన్సిపాల్ గా ఉండగా వొకప్పుడు తాను విద్యార్ధిగా ఉన్న సిరంపూర్ బైబిల్ కాలేజిలో పార్ట్-టైం లెక్చరర్ గా కొన్నాళ్ళు రెవ.మాసిలామణి పనిచేసారు.

ఇలా వీరి క్రియాశీల జీవితం అంతా, అయితే అధ్యయనం – లేదా రచనా వ్యాసంగం ఈ రెండింటి మధ్యనే సాగడం కనిపిస్తుంది. రెవ. మాసిలామణి తన కీర్తనలలో మన దేశ భాషాసాంస్కృతిక విలువల్ని పొందుపర్చి, బ్రిటిష్ మిషనరీల నిష్క్రమణ జరుగుతున్న కాలంలోనే భారతీయ చర్చి స్వయం ప్రతిపత్తిని నిలిపారు. ఆయన ఆ పనిని రెవ. ఫాదర్ డి.ఎస్. అమలోర్పవదాస్ (1932-1990) కంటే ఎంతో ముందుగానే చేసారు అనేది క్రైస్తవ చరిత్ర రచయితల అభిప్రాయం.

అసాధారణ వక్త

రెవ.మాసిలామణికి ఇటువంటి విలువైన ‘అకడమిక్’ నేపధ్యం ఉన్న కారణంగానే, 70- 80 దశకాల్లో ఆయన ఏ సభలో వక్తగా ఉన్నా వారి సందేశాలు వినడానికి ప్రజల్లో విపరీతమైన ఆసక్తి ఉండేది. ఆయన తన ప్రసంగానికి ఎంచుకున్న బైబిల్ వాక్యాన్ని మూడు భాగాలుగా చేసి దాన్ని వివరించేవారు. మొదటిది EXEGETICAL వాక్యం మూల గ్రంధంలో ఏమున్నది, దాని అర్ధం ఏమిటి? అక్కడ తన సందేశం మొదలుపెట్టి, అక్కణ్ణించి క్రమంగా ప్రస్తుత సందర్భానికి వచ్చేవారు. రెండవది EXPOSITORY అంటే, వాక్య సందర్భం గురించిన వర్ణన, సూక్ష్మ వివరాలు క్షుణ్ణంగా చెబుతూ శ్రోతల ఏకాగ్రతను విషయంలోకి మరల్చడం. మూడవది DEVOTIONAL  ప్రసంగ అంతిమ లక్ష్యం అయిన… భక్తిభావంలో సభికుల ఆధ్యాత్మిక ఆర్తిని తీర్చడం! ఇలా ప్రసంగాన్ని వొక కళగా ఆయన మలిచారు!

అపోస్తులుడైన సెయింట్ తోమా స్థాపించిన మొదటి శతాబ్దపు దక్షణ భారతీయ చర్చి మార్థోమా సిరియన్ చర్చి, కేరళలో నిర్వహించే మర్మన్ సమావేశాలకు ఆసియా దేశాల నుంచి మార్థోమా చర్చి- అలెగ్జాండర్ మార్థోమా చర్చి ప్రముఖులు హాజరయ్యేవారు. అటువంటి అంతర్జాతీయ సదస్సుల్లో తెలుగువాడైన రెవ. మాసిలామణి 1970-1983 మధ్య ప్రధాన వక్తగా హాజరయ్యేవారు. అక్కడ ప్రధానంగా ఆయన వారికి Christology (క్రీస్తు కేంద్రిత) సువార్త బోధించేవారు. బహుశా అప్పటికి ఇంకా పాతనిబంధన యూదా మత సాంప్రదాయ ఆరాధనా పద్దతులకు దగ్గరగా ఉన్న ఆయా చర్చి ప్రతినిధులకు, రెవ. మాసిలామణి ‘నూతన వొడంబడిక’లో జీసస్ ప్రకటించిన ‘ఆత్మ’ కేంద్రిత సువార్తను బోధించేవారు.

కీర్తనల రచయిత

దక్షణ భారతదేశంలో ఆరాధనలో కీర్తనల సంప్రదాయం అనాదిగా ఉంది. కర్ణాటక సంగీత పితామహుడు త్యాగరాజ స్వామి తర్వాత 47 ఏళ్ల పాటు పురుషోత్తమ చౌదరి  జీవించివున్నారు. సహజంగానే త్యాగరాజ కర్ణాటక సంగీత ప్రభావం చౌదరి గారి కీర్తనల్లో  మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత కాలంలోని కీర్తనాకారుల కీర్తనలలో చౌదరిగారి ప్రభావం కనిపిస్తుంది. దాన్ని మనం చెట్టి భానుమూర్తి గారి కీర్తనలలో చూస్తాము. అయితే రెవ. మాసిలామణి వారి విద్యార్ధి కావడంతో తమ గురువు వొరవడిలో వీరి కొన్ని కీర్తనల్లో సంస్కృత ప్రభావం కనిపిస్తుంది.

రెవ. మాసిలామణి ఇలా తన ‘కెరియర్’ అంతా కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టుగా  తిరుగుతూఉంటే, ఉత్తరాలే ‘కమ్యునికేషన్’ సాధనమయిన అప్పటి రోజుల్లో నలుగురు పిల్లలతో శ్రీమతి విమలా మాసిలామణి గృహనిర్వహకత్వం ఎంత వోర్పుతో నిర్వహిస్తే, ఇదంతా సాధ్యమయిందో ఇప్పుడు ఊహించడం కూడా కష్టం. అయితే, వారి తర్వాత  పిల్లలు కూడా దేవుని సేవలో కొనసాగడానికి, రాబోయే కాలంలో ‘చర్చి’ పరిణామాలను ముందుగానే ఊహించి, ‘న్యూ లైఫ్ సొసైటీ’ పేరుతో హైదరాబాద్ లో క్రైస్తవ ఆధ్యాత్మిక, సేవాసంస్థను ప్రారంభించారు. ఇప్పుడు ఇది, ఆధ్యాత్మిక, వైద్య, విద్య, సేవా రంగాల్లోకి విస్తరించి పలు సేవలు అందిస్తూ వుంది.

థీంసాంగ్

విజయవాడ కృష్ణా నదీ తీరం రాణిగారి తోటలో రెండేళ్లకు వొకసారి చలువ పందిళ్ళ క్రింద వేలాది మందితో జరిగే ఆంధ్ర క్రైస్తవ మహాసభల్లో ‘కవి మాసిలామణి’ గురించి చెప్పకపోతే, ఈ వ్యాసం అసమగ్రం అవుతుంది. అన్ని డినామినేషన్ చర్చిల వేదికగా అప్పట్లో ఆ సభలు జరిగేవి. వీటికి వొక అంశం నిర్ణయించబడేది, అన్ని రోజులు అదే అంశం మీద వక్తల ప్రసంగాలు ఉండేవి. అయితే, అన్ని ప్రసంగాల సారంశాన్ని క్రోడీకరించినట్టుగా,  వొక ‘థీం సాంగ్’ ఉండేది. దాని రచయిత రెవ. మాసిలామణి!

అప్పట్లో కొందరు సంగీత ప్రియులు కేవలం ఈ కొత్త పాటకోసం వచ్చేవారు అనడం ఇప్పటి తరానికి అతిశయోక్తి అనిపించవచ్చు! సభలు జరిగినన్ని రోజులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలు కనీసం అరడజను సార్లు పైగా దీన్ని పాడేవారు. కారణం సభలు నుంచి జనం ఊళ్లకు తిరిగి వెళ్ళిపోయే లోపు అందరికీ దాన్ని పాడడం తర్ఫీదు కావాలి. ఆ తర్వాత ఆదివారం నుంచి వాళ్ళు దాన్ని తమ చర్చిల్లో పాడి మిగతావారికి దాన్ని నేర్పాలి! అలా జనరంజకం అయిన గీతాలే – ‘నడిపించు నా నావ’, ‘హే ప్రభు ఏసు హే ప్రభు ఏసు’, ‘రండి సువార్త సునాదంతో’, ‘మార్గము చూపుము ఇంటికీ’, ‘దేవుని నీతి ప్రతాపం’, వంటి గీతాలు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పుస్తకంలో వీరివి 13 కీర్తనలు వున్నాయి. అయితే, 2014 లో కీర్తనలు-కవులు జీవిత చరిత్రలు పుస్తకంలో దీని రచయిత శ్రీ దాస్ బాబు వీరు 30 కీర్తనలు రాసినట్టుగా చెబుతున్నారు.

చరిత్ర తనకు కావాల్సిన వ్యక్తుల్ని తయారు చేసుకుంటుంది అనేది మార్క్సిస్టు  తత్వవేత్తలు చెప్పే సూత్రం. తెలుగు క్రైస్తవ సమాజం విషయంలో వొక సంధికాలంలో తన చారిత్రిక పాత్రను పోషించడానికి బహుశా దేవుడు ముందుగా చేసిన ఏర్పాటు రెవ. ఏ.బి. మాసిలామణి. ఆయన తనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా పూర్తిచేసి 1990 లో కన్నుమూసారు. తన జీవితకాలంలో ఆయన సాధించిన డిగ్రీలు అన్నిటిని వదిలిపెట్టి, భారతీయ సంప్రదాయాన్ని అనుసరించి, తనకు తానే ఆచార్య ఏ.బి. మాసిలామణి అని ప్రకటించుకున్నారు.  

జాన్ సన్ చోరగుడి      

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles