Thursday, April 25, 2024

‘MLA’ వంతంగి పేరయ్య భూమి కధ

 “సాక్ష్యాన్ని అందించడంలో వారు విఫలమయ్యారు” ”

(They failed to produce a piece of evidence)   

 గత 30 ఏళ్లుగా నేను ఆదివాసీలు  పార్టీలుగా (వాదులు లేదా ప్రతివాదులు) వున్న  కేసులలో కోర్టులు ఇచ్చిన తీర్పులను చదువుతున్నాను. గిరిజనేతరుల న్యాయవాది దాఖలు చేసిన ప్లయింట్ (plaint) లేదా రిటన్ స్టేట్మెంట్ లో  (written statement) తప్పక ఒక వాక్యం కనిపిస్తూ వుంటుంది. “వీళ్ళు ట్రైబల్స్,  వారికి చట్టంపట్ల ఎలాంటి గౌరవo వుండదు (these people are tribal, they did not respect law).

ఇక గౌరవ న్యాయమూర్తులు రాసే తీర్పులలో ఈ మాట చాల మట్టుకు వుంటుంది. అది ‘వారు తమకు సాక్ష్యంగా ఒక్క కాగితం ముక్క కూడా చూపలేకపోయారు” (they were not able to produce a single piece of paper as evidence).

తేది: 24-04-2023న నా చేతికి అందిన ఒక కోర్టు వారి తీర్పులో “ సాక్ష్యం చూపలేకపోయారు (They failed to produce piece of evidence)” అనే వాక్యం కనిపించింది.

Also read: పేదలకు ఇళ్ళ కోసం .. పేదల భూములు ..

ఎంఎల్ఏ పేరయ్య

వంతంగి పేరయ్య  వయస్సు 75 ఏళ్ళు. కొండదొర  తెగకు చెందిన ఆదివాసీ ఈ పేరయ్య. అనకాపల్లి జిల్లా, చీడికాడ మండలం, కోనాం రెవిన్యూ గ్రామానికి చెందిన పలు  శివారు గ్రామాలలో పేరయ్య గ్రామం కూడా వుంది. దాని పేరు ‘కొండల కొత్తూరు’. గ్రామంలో 30 వరకు కొండదొర ఆదివాసీలు అనాదిగా జీవిస్తున్నారు. గ్రామం నిండా చింత చెట్లు. పేరయ్య గ్రామానికి పెద్ద. అంతే కాదు, ఆ చుట్టు ప్రక్కల కొండదొర  తెగ ఆదివాసీల పెద్దలలో తానూ ఒకడు.  గ్రామాన్ని ఆనుకొని బోడ్డేరు దిగువకు పారుతుoది. బోడ్డేరు దాటి పైకి ఎక్కితే అక్కడ పేరయ్య అతని పరివారం సాగులో వున్న 30 ఎకరాల మెట్టు భూమి కనిపిస్తుంది. ఆ భూమికి వారి పెద్దలు పెట్టిన పేర్లు 1. మాదల గరువు 2. నీల మెట్టు 3. ఇప్పమాను జోరు.  20 కుటుంబాలు ఆ మెట్టు భూమిని సాగుచేస్తున్నాయి. అదే వారి ఆస్తి. అదే వారి జీవనం.

ఎంఎల్ఏ పేరయ్య

‘వంతంగి పేరయ్య కధ’ అంటే ఆ గ్రామ కొండదొర గిరిజన రైతుల కధ అని అర్ధం. వంతంగి పేరయ్య కాస్త  ‘ఎంఎల్ఏ  పేరయ్య’ ఎలా అయ్యాడు ? సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ ఆయనకు టిక్కెట్ ఇవ్వగా పోటీలోకి దిగాడు పేరయ్య. 350 మంది ఓటర్లు  పేరయ్య శాసన సభకు వెల్లడానికి అర్హుడని భావించారు. అలా వంతంగి పేరయ్య కాస్త ఎంఎల్ఏ పేరయ్య అయ్యాడు జనాలకి. లిబరేషన్ పార్టి అనే ఎంఎల్ పార్టీ సిధాoతాలు ఏమిటో పేరయ్యకు తెలీదు. ఎంఎల్ఏ అయితే తమ  కుటుంబాల సాగులో వున్న భూమిని కాపాడుకోవచ్చన్నదే తనను పోటిలోకి దించిన  “మోటివేషన్” .

Connecting dots

20 ఏప్రిల్ 2023 న  నా చేతికి వచ్చిన తీర్పు పత్రం నిజానికి గౌరవ కోర్టు వారు ఏప్రిల్ నాలుగున ఇచ్చారు. కోర్టు వారి తీర్పు పేరయ్యకు వ్యతిరేకంగా వచ్చింది. వాదులుగా వున్న పేరయ్యకు, వారి తరుపున ఎలాంటి ‘ఫీజు’ లేకుండా కేసు వాదిస్తున్న యువ న్యాయవాదికి కోర్టు వారు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తీర్పు నఖలు ఇవ్వలేదు.  కాని ప్రతివాదులైన గిరిజనేతరులకు మాత్రం తీర్పు పత్రాలు వెంటనే  అందాయి. ఈ  ప్రతివాదులు  సామాజిక, ఆర్దిక, రాజకీయు అంతస్తులో ఎక్కడో పైన వున్న సామాజిక వర్గానికి చెందిన వారు. వారి సామాజిక వర్గపు రాజకీయ ప్రతినిధులు ప్రస్తుత పాలకుడ్ని అర్జెంటుగా దించేసి గద్దెను ఎక్కడానికి మహా కసితో ప్రయత్నం చేస్తున్నారు. ఈ గిరిజనేతర ప్రతివాదులలో,  ఒకరు జూబ్లిహిల్స్, మరొకరు ‘డిఫెక్టో’ (de-facto) రాజధాని విజయవాడ, ఇంకొకరు ‘డిజురి” (de-jure) రాజధాని విశాఖపట్నంకు చెందిన వారు. భూమి వున్నది మాత్రం కొండలకొత్తూరు గ్రామం  బోడ్డేరుకు పైన.

ప్రతివాదుల ఏజెంట్లు కొండలకొత్తూరుకు జేసీబీతో వచ్చారు.   ‘మీరు వేసిన కేసు కొట్టేశారు. ఈ భూమి మాదనీ, మేమే సాగులో వున్నామనీ కోర్టు వారు చెప్పే

శారు’ అంటూ జేసీబీతో భూమిలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు. పేరయ్య నేతృత్వంలో వూరు వూరంతా జేసీబీకి  అడ్డంపడింది. ఆ వెంటనే పోలీసుల నుండి ఫోన్. అప్పుడుగాని మాకు జరిగిన (connecting dots) తతంగo తెలియలేదు .

కోర్టులు  రెండు రకాలు

కోర్టులు  రెండు రకాలు. ఒకటి న్యాయవ్యవస్థ నడిపే సివిల్ / క్రిమినల్ కోర్టులు. రెండవది రెవిన్యూ శాఖ నడిపే ఎగ్జిక్యూటివ్ కోర్టులు.

అప్పటి వరకు సివిల్  కోర్టులు ఇచ్చిన తీర్పులలో ‘వారు తమకు సాక్ష్యంగా ఒక్క కాగితం ముక్క కూడా చూపలేకపోయారు” (they were not able to produce a single piece of paper) అనే వాక్యం చూస్తూ వచ్చిన నేను మొదటి సారి, ఒక రెవిన్యూ ఎగ్జిక్యూటివ్ కోర్టు ఇచ్చిన తీర్పులో “ఒక్క ముక్క కూడా తమకు సాక్ష్యంగా చూపలేకపోయారు” (They failed to produce a piece of evidence) అనే వాక్యం చూసి విషాదంలో కూరుకుపోయాను. వివరాలలోకి వెళ్ళే ముందు మీకు కొన్ని సంగతులు చెప్పాలి. లేకపోతె MLA పేరయ్య కధ అర్ధం కాదు.

Also read: ఉపాధి హామీ పధకoలో కేంద్ర తీసుకువస్తున్న కార్మిక వ్యతిరేక మార్పులను రద్దు  చేయాలి!

పేరయ్య 75 – అమృతకాల్ 75

పేరయ్య వయస్సు 75 ఏళ్లని చెప్పాను కదా. తాను  తన తండ్రి నుండి బోడ్డేరు పైన వున్న గరువులో సాగులో వున్నాడు. తనతోబాటు మరో 20 కుటుంబాలు సాగులో వున్నాయి. వారు పెంచిన జీడి మామిడి తోటలు, టేకు చెట్లు, పొలం గట్లపై  పెంచిన తాటి చెట్లు అక్కడికి వెళ్లి చూస్తే మీకు కనిపిస్తాయి. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, మెట్టు పల్లాలుగా వున్న భూమిని యంత్రాలతో చదును చేశారని గుర్తించగలరు. అది నిజమే. దానికి ఆర్దిక  సహాయం అటవీ శాఖ వారి ‘జాయింట్ ఫారెస్టు మేనేజ్మెంట్’ (JFM) ప్రోగ్రాం నుండి లభించింది. ఆ చుట్టుపక్కల ఏ రైతును అడిగినా అది కొండలకొత్తూరు గ్రామం కొండదొరల సాగులో వున్న భూమని  మీకు తప్పక  చెపుతారు. పేరయ్య వయస్సు ఇప్పుడు 75 ఏళ్లని చెప్పాను కదా , కాని వారు ఆ భూమి సాగు చేస్తున్నట్లుగా ఒక్క కాగితం ముక్క లేదు. సాగు వుంది, తోటలు వున్నాయి, మెట్టు వ్యవసాయం వుంది. కాని ఆ సంగతిని చెప్పే  ‘ఒక్క ‘కాగితం’ ముక్క లేదు. భూమి గురించి, సాగు గురించి, చెట్టు, చేమ గురించి తెలిసిన MLA పేరయ్యకు పాపం ఆ ‘కాగితం’ గురించి తెలీదు. చెప్పిన వారు లేరు. రాసిపెట్టిన వారు లేరు. ‘MLA’ పేరయ్య వయస్సు 75 ఏళ్ళు. ఇప్పుడు దేశం 75వ ఏట అమృతకాల్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకులు జరుపుకుటోంది. దాని వయస్సు కూడా పేరయ్య వయస్సే సుమా!

సివిల్ కోర్టు న్యాయమూర్తి తన ముందు విచారణకు వున్న వాజ్యంలోని భూమి వద్దకు రాడు. పత్రాలు (డాక్యుమెంట్స్) సహాయంతో నిరూపించమoటాడు. కాని రెవిన్యూ ఎగ్జిక్యూటివ్ కోర్టు మేజిస్ట్రేట్ అలా కాదు. భూమి వద్దకు వెళ్ళగలడు. అక్కడే విచారణ చేసి సాగులో ఎవరు వున్నది నిర్దారించుకోగలడు. అతనికి / ఆమెకు ఆ సౌలభ్యం వుంది. లేదా తన సబార్డినేట్ సిబ్బందిని భూమి మీదకు వెళ్లి, ఇరుగు పోరుగు రైతులను విచారించి నివేదిక ఇవ్వమని ఆదేశించగలడు. అలా చేయగలడు, చేయాలి కూడా. లేకపోతె సివిల్ కోర్టుకు – ఎగ్జిక్యూటివ్ కోర్టుకు తేడాయే లేదు.

మౌఖిక (నోటి మాట) సమాజం – పత్రాల (డాక్యుమెంట్స్) సమాజం

పేరయ్య అతని పరివారం కొండదొర  ఆదివాసీలు. వారిది మౌఖిక (నోటి మాట) సమాజం. ఆ సమాజం వారికి భూమి “సట్టా (స్పెక్యులేషన్) వ్యాపార” సరుకు కాదు. నాలుగు గింజలు పండిoచుకొని కడుపు నింపుకొనే ఒక జీవనాదరవు.

కాని ఆ భూమిని లాగేద్దాం అని చూస్తున్న ‘జూబ్లిహిల్స్’ రైతులు  “పత్రాల (డాక్యుమెంట్స్) సమాజం”కు చెందిన వారు. ఇప్పుడు వారిది  ‘డిజిటల్ సమాజo’ కూడా. వారికి పత్రాలు (డాక్యుమెంట్స్/ రికార్డులు) తెలుసు. అందులో తమ పేర్లను ఎలా, ఎక్కడ, ఎప్పుడు రాయించుకోవాలో వారికి బాగా  తెలుసు. ఇప్పుడు వారిది డిజిటల్ సమాజం అని కూడా చెప్పాను కదా, చంద్ర బాబు  ప్రవేశ పెట్టిన డిజిటల్ భూమి రికార్డులో నమోదు వారికి  మరింత సులువు, ఒక్క మౌస్ క్లిక్ తో మార్పించుకోగలరు.

Also read: దండోరా రిపోర్టు చెప్పిన భూసంస్కరణల కథాకమామీషూ

డిజిటల్ సమాజానికి చెందిన జూబ్లిహిల్స్ ‘సూపర్ రిచ్’ తో, మౌఖిక (నోటిమాట) సమాజానికి చెందిన పేరయ్యలు  పోటిపడాలి. ఈ పోటిలో నిజానికి రెవిన్యూ ఎగ్జిక్యూటివ్ కోర్టు ఒక రవ్వ మొగ్గు పేరయ్య వైపు చూపాలి. సదరు కోర్టు వారితో, “భూమి మీదకు వచ్చి చూడండి బాబు” అంటున్నాడు పేరయ్య. కాని, “నువ్వే సాగులో వున్నావని  కాగితం తెచ్చి చూపించూ” అంటున్నాడు రెవిన్యూ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్. ఎందుకని? ఆ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కి పేరయ్య బలహీనత ఏమిటో బాగా తెలుసు. అతని మొగ్గు ‘జూబ్లిహిల్స్’ వైపు వుంది.

75 ఏళ్లుగా సాగుచేస్తుండటం ఏమిటి? వారికి పత్రాలు (డాక్యుమెంట్స్/ రికార్డులు)  లేకపోవడం ఏమిటి? ఇది చదివేవారికి ఒకింత ఆశ్చర్యంగాను, నమ్మశక్యoగానూ వుండకపోవచ్చు. అది సహజం.

అచ్చియ్యపేట ఎస్ ఆర్ శంకరన్ శ్రామిక విద్యా శిక్షణాకేంద్రం సభ్యులు, పేరయ్య, రచయిత అజయ్ కుమార్

సర్వే & సేల్మేంట్స్ – రెవిన్యూ ఆపరేషన్స్

భూమి,  దాని హక్కులను ఒక సంక్లిష్టమైన సాలెగూడులా మార్చేశారు మన పాలకులు. ఎన్నో చట్టాలు, నియమాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, సెక్షన్ లు, సబ్ సెక్షన్ లు, వాటికి కోర్టులు ఇచ్చిన నిర్వచనాలు, పాలన పద్దతులు, కొలతలు, వాటి రికార్డులు ఇలా భూమి చుట్టూ ఒక మార్మిక ప్రపంచాన్ని ఏర్పరిచారు. ఒకోసారి, ‘బెస్ట్ బ్రెయిన్స్’ కి కూడా ఇవి ఒకపట్టాన కొరుకుడు పడవు. అందుచేత మరీ లోతుల్లోకి పోకుండా, వంతoగి పేరయ్య  పరివారపు కొండదొర రైతులే  దశాబ్దాలుగా  సాగు అనుభవంలో వున్నా  వారి వద్ద, వారే  భూమి సాగులో వున్నారనే చెప్పే  ‘ఒక్క పీస్ ఆఫ్ పేపర్’ ఎందుకు లేదో చెప్పే ప్రయత్నం చేస్తాను, టూకీగా.

కొండలకొత్తూరు వున్న ఆవాస గ్రామం, కోనాం రెవిన్యూ (పంచాయితీలో) భాగం. అది పూర్వం చోడవరం తాలుకాలోను, ఎన్ టీఆర్  తాలూకా-సమితి వ్యవస్థను  రద్దు చేసి మండలాలను  పెట్టడంతో ఈ రెవిన్యూ గ్రామం, చీడికాడ మండలంకు వెళ్ళింది. మన ఎంఎల్ఏ  పేరయ్యకు 75 ఏళ్ళు అనుకున్నాం కదా , అంటే ఆయన పుట్టింది సుమారుగా 1948 కావచ్చు.  అప్పటికే వారి తండ్రి, తమ తెగ రైతులు  ఆ భూమిలో సాగులో వున్నారు.

Also read: అజయ్ కల్లం చేతులమీదుగా సంపత్ పురంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ

కోనాం రెవిన్యూ గ్రామం, వడ్డాది మాడుగుల రాజుల / జమిoదారుల పాలనలో వుండిoది. 1948 జమీందారి రద్దు చట్టం ద్వారా జమిoదారి వ్యవస్థలు రద్దు అయినాయి. 1950-60 మధ్య జమిoదారి గ్రామాలలో “సర్వే & సెటిల్మెంట్’ జరిగింది. అనకాపల్లిలో ఎర్పాటు చేసిన “అసిస్టిoట్ సెటిల్మెంట్ ఆఫీసర్(ASO)” నేతృత్వంలో ఇవి జరిగాయి. ఆ చట్టం ప్రకారం జమిందారుల వద్ద సాగులో వున్న రైతులందరికీ   పట్టాలు రావాలి. అలా చూస్తే పేరయ్య బాలునిగా  వుండగానే తనకు, తమ తెగ వారికి రైత్వారి పట్టాలు వచ్చేసి వుండాలి. అయితే కోనాంలో నిన్నమొన్నటి వరకు (నాకు తెలిసి 1995 వరకూ) ఫ్యూడల్ ఏలుబడి సాగింది. ఇప్పటికి వేరే రూపాలలో సాగుతూనే వుంది. ఇక 1950-1960 మధ్య మీరు పరిస్థితి ఎలా ఉండేదో ఉహించండి. ఈ ఫ్యూడల్ ప్రభు వర్గాలతో చేతులు కలిపి, సర్వే & సెటిల్మెంట్ అధికారులు  ఆదివాసీలకు తీరని అన్యాయం చేసారు. తమ భూమికి  పట్టాదారులు కావలసిన వీరు  కేవలం సాగుదారులుగా మిగిలిపోయారు.

అయితే, కొండలకొత్తూరు కొండదొర ఆదివాసీలకు భూమికి పట్టాలు లేకపోతే లేకపోవచ్చు,  కాని వారు సాగులో వున్నారు. అది దశాబ్దాల తరబడి సాగుతున్న సాగు అనుభవం. గనుక దానిని న్యాయపరిభాషలో “ స్థిరమైన  సాగు” (settled Cultivation) అంటారు. 12 సంవత్సరాలు ఈ  “ స్థిరమైన  సాగు” (settled Cultivation) అనుభవం రికార్డులో నమోదైతే  వారికీ ఆ భూమి మీద పట్టా హక్కులు క్లయిం చేయడానికి ఒక న్యాయపునాది ఏర్పడుతుoది. 

ఈ సాగు అనుభవాన్ని నమోదు చేయవలసింది రెవిన్యూ అధికారులు. అదివారి విధినిర్వహణలో  ఒక ముఖ్యమైన భాగం. కాని,  గ్రామ కరణం (ఇప్పుడు VRO) నుండి తాశీల్దార్ వరకు ఆ పని చేయలేదు. అలా నమోదు చేయించుకోవాలని ‘MLA’ పేరయ్య, ఆయన పరివారానికి తెలీదు.  కోనాం ఫ్యూడల్ శక్తులు  ఈ పని జరగకుండా విజయవంతగా అడ్డుకోగలిగాయి.

ఆనాటి సర్వే & సెటిల్మెంట్ అధికారులు, తదుపరి  రెవిన్యూ అధికారులు కోనాం శివారు గ్రామాలుగా వున్న కొండలకొత్తూరు వంటి ఆవాస గ్రామాల ఆదివాసీలకు తీరని అన్యాయం చేశారు, చేస్తున్నారు.

మా సాగులు రికార్డు చేయండి!

 2015 నుండి కొండలకొత్తూరు కొండదొర ఆదివాసీలు తమ సాగు అనుభవాన్ని పరిశీలన చేయమని, నమోదు చేయమని తాశీల్దార్, రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO) , జిల్లా కలెక్టర్ ఇలా రెవిన్యూ అధికారులకు వినతిపత్రాలు ఇస్తూనే వున్నారు. చంద్రబాబు “ప్రజల వద్దకు పాలన”, “రెవిన్యూ సదస్సులు”, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘స్పందన’,  ఇలా ప్రతి ‘ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకూ’  వినతిపత్రాలు ఇస్తూనే వున్నారు. వాటిపై విచారణ జరపడంగాని, వారి సాగు అనుభవాన్ని గుర్తించి నమోదు చేయడం గాని రెవిన్యూ అధికారులు ఎన్నడూ  చేయలేదు.

భూమి యజమాని పేర్లను భూమి రికార్డులలో నమోదు చేయడానికి ఉద్దేశించినది “పట్టాదారు పాసు పుస్తకాల చట్టం” (దీని పూర్తీ పేరు AP RIGHTS IN LAND AND PATTADAR PASS BOOKS ACT 1971).  ఈ చట్టం అనుసరించి రికార్డులో మార్పులు చేసే సమయంలో,  సాగు అనుభవంలో వున్న వారికి తప్పని సరిగా నోటీసు ఇవ్వాలి. “మాకు నోటీసు ఇవ్వకుండా, మా అభ్యoతరాలను వినకుండా మార్పులు చేయరాదని” కొండలకొత్తూరు ఆదివాసీలు తాశీల్దారుకు లిఖిత పూర్వకంగా చెపుతూనే వున్నారు.

కేసు వున్నా  రికార్డు మార్చేసారు

అయినా ఏకపక్షంగా రికార్డు మార్చేశారు. పట్టాదారు పాసు పుస్తకాల చట్టం ఆధారం చేసుకొని, సంఘం ఇచ్చిన ఆసరాతో,   పేరయ్య మరి 20 మంది  కొండదొర రైతులు రెవిన్యూ (RDO) కోర్టులో తేది: 15-12-2021న కేసు దాఖలు చేశారు. తాశీల్దార్ కు నోటిసు వెళ్ళింది. నోటిసు అందుకున్నాక కూడా తాశీల్దార్ మరో ముగ్గురి పేరున తేది: 13-06-2022న రికార్డు మార్చేసాడు. సాగులోవున్న, కేసు వేసిన పేరయ్య ఇతర రైతులకు ఎలాంటి నోటీసు లేదు, సమాచారం లేదు.

తేది: 25-02-2023న ప్రతివాదులైన ‘జూబ్లి హిల్స్’  గిరిజనేతరులు RDO ముందు తమ వాదనలు వినిపిస్తూ కౌంటర్ వేశారు.  తేది: 04-03-2023 వాయిదా రోజు RDOకు వేరేపని వున్నకారణoగా కోర్టు జరగలేదు. తేది: 25-03-2023 వాయిదాకు, ఎండ తీవ్రత వలన 75 ఏళ్ల పేరయ్య సమయానికి కోర్టుకు చేరుకోలేకపోయాడు. పేరయ్య గ్రామం నుండి RDO కోర్టు 60 km దూరంలో వుంటుంది. నిజానికి ఆ రోజు, వాదులు – ప్రతివాదులు,  ఇరు పార్టీలు రాలేదని కోర్టు నమోదు చేసింది.

ఆశ్చర్యంగా తేది: 04-04-2023న రెవిన్యూ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (RDO)  కోర్టు పేరయ్య అతని పరివారం సాగులో ఉన్నట్లుగా ఎలాంటి సాక్ష్యం చూపలేకపోయారని కేసు కొట్టివేసారు. అంతేకాదు, ‘జూబ్లీహిల్స్’ భూమి యజమానులే సాగులో వున్నారని కూడా తేల్చేశారు. ఆ తీర్పు నఖలు ప్రతివాదులైన గిరిజనేరులకు వెంటనే అందింది. కాని ఆదివాసీల ప్రతినిధులమైన మాకు  20న మాత్రేమే చేతికి వచ్చింది.

“పట్టాదారు పాసు పుస్తకాల చట్టoలోని న్యాయ ప్రక్రియను  తాశీల్దార్ పాటించ లేదని కేసు వేస్తె, ‘వాదనలు’ (hearings)  చెప్పుకోవడానికి ఆదివాసీలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా, సివిల్ ప్రొసీజర్ కోడ్ ( Civil Procedure  Code – CPC) అనే న్యాయప్రక్రియను పూర్తిగా ఉల్లంఘించి తీర్పు ఇచ్చారు మేజిస్ట్రేట్  కోర్టు (RDO)వారు.

కొసమేరుపు

ఈ కేసుకు  తాశీల్దార్ ఇచ్చిన రిపోర్టులో,  భూమిలో కొంత భాగంలో జీడి తోటలు వున్నయిని రాసారు. కాని అవి ఎవరు వేశారో మాత్రం చెప్పలేదు. గౌరవ మేజిస్ట్రేట్  కోర్టు (RDO) వారు  అడగలేదు.

పేరయ్య, అతని  పరివారం చేతిలో వున్న 30 ఎకరాలు భూమిని లాగేయడానికి, తెర వెనుక వుండి మీటలు తిప్పుతున్న వారు చాలా పెద్దవారు. పేరయ్య పరివారమే సాగులో వుందని VRO నుండి RDO వరకూ అందరికి తెలుసు. ఆ మాట ‘కాగితం’ (డాక్యుమెంట్స్/ రికార్డులలో)  మీద రాయవలసింది కూడా వారే. కాని, వారె సాగులో వున్నట్లు పేరయ్య వద్ద చిన్న పిసరు “కాగితం” కూడా  లేదని అంటున్నారు. ఎలా వుంటిది ? వారు రాస్తే కదా!

Also read: అంతటివాడు చెప్పినా పరిష్కారానికి నోచుకోసి సమస్య

PS అజయ్ కుమార్

అజయ్ కుమార్ పీ ఎస్
అజయ్ కుమార్ పీ ఎస్
పీఎస్ అజయ్ కుమార్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో సోషల్ వర్కులో మాస్టర్స్ డిగ్రి (MSW) చేశారు. గత 30 ఏళ్లుగా ఆదివాసీల భూమి సమస్య, నిర్వాసిత, గ్రామీణ కార్మికుల హక్కుల కోసం పని చేస్తున్నారు. ‘ప్రభుత్వ భూమి పేదలదే’, ‘భూమి సమస్య – వ్యాసాలు 1, 2’, ‘కళ్యాణలోవ కధలు’ ప్రచురితమైన పుస్తకాలు. భూమి సమస్య వ్యాసాలు – 1కి, DNF Rural Journalist award foundation –Hyderabad వారి Rural journalist award for year 2008 లభించింది. ప్రస్తుతం అఖల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles