Saturday, July 13, 2024

ఎన్నికలలో బీజేపీ ప్రధానాస్త్రంగా ఉమ్మడి పౌరస్మృతి?

భోపాల్ లో ఇటీవల ‘మేరా బూత్ సబ్సే మజ్బూత్’ అనే ఎన్నికల తయారీ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్రమోదీ ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్)ను అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపైన ఉన్నదనీ, అది రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యత అనీ అన్నారు. భారత దేశం అంతటికీ వర్తించే ఉమ్మడి పౌరస్మృతిని రూపొందిచేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలి అని రాజ్యాంగంలోని 44వ అధికరణ స్పష్టం చేస్తున్నది. ఈ విషయంలో రాజ్యాంగనిర్మాతలకు ఎటువంటి సందేహం లేదు. మత ప్రాతిపదికపైన ఆనవాయితీగా వస్తున్న చట్టాలు, సంప్రదాయాలు అమలు జరగడం వల్ల కొన్ని మతాలకు చెందినవారికి అన్యాయం జరుగుతోంది. ముఖ్యంగా ముస్లిం మహిళలకు వైవాహిక జీవితం అనిశ్చితంగా, అనూహ్యంగా తయరయింది.

భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగ నిర్మాణ సభలో జరిగిన చర్చల సరళి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు  – ఈ మూడు కారణాలు ఉమ్మడి పౌరసంస్కృతి ఆవశ్యకతలను నొక్కి చెబుతున్నాయి. సమానత్వం, లింగభేదం పాటించకపోవడం, లౌకికవాదం ప్రాథమిక అంశాలుగా ఉమ్మడి పౌరసత్వం రూపొందాలని రాజ్యాంగం స్పష్టం చేస్తున్నది. దత్తత స్వీకరించడం, విడాకులు తీసుకోవడం, భరణం ఇవ్వడం వంటి అంశాలలో సామ్యం ఉండాలన్నది రాజ్యాంగ నిర్మాణ సభలో జరిగిన చర్చలలో వినిపించిన ప్రధానాంశం. అంబేడ్కర్, అల్లాడి కృష్ణస్వామి, కెఎం మున్షి, తదితరులు పాల్గొన్న చర్చలు గమనిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది.

ముస్లిం పురుషులు ఆగ్రహిస్తారన్న భయంతో ఇంతవరకూ ప్రభుత్వాలు ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయడానికి సాహసించలేదని బీజేపీ వాదన. నరేంద్రమోదీ సైతం తొమ్మిదేళ్ళకు పైగా అధికారంలో ఉన్నప్పటికీ ఆ చట్టాన్ని తేవడానికి సంకోచించారు.  కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి హామీ ఇచ్చే రాజ్యాంగం 370వ అధికరణాన్ని రద్దు చేశారు కానీ ఉమ్మడి పౌరస్మృతి జోలికి మాత్రం వెళ్ళలేదు. 2024 ఎన్నికలలో దీనిని తురుపు ముక్కగా వాడే ఉద్దేశంతో ఇప్పుడు ఆ ప్రస్తావన చేసి ఉంటారని కాంగ్రెస్, డిఎంకె, టీఎంసీ వంటి ప్రతిపక్షాల నాయకులు అంటున్నారు. ముస్లిం మహిళలకు పెద్ద సహాయకారిగా ఉండే విధంగా త్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన మోదీ ఉమ్మడి పౌరస్మృతిని కూడా రూపొందించి అమలు చేయగలిగితే ముస్లిం మహిళల హృదయాలను దోచుకోవచ్చునని భావిస్తున్నారు. ఈ క్రమంలో హిందూ పురుషులకు అభ్యంతరకరమైన చట్టం రూపొందే ప్రమాదం ఉంది. రాజ్యాంగ విలువలు, స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం తీసుకొని వచ్చినట్లయితే న్యాయమైన, నియమబద్ధమైన, సహేతుకమైన సమాజానికి దారితీస్తుంది. కానీ ప్రస్తుతం నరేంద్రమోదీ నాయత్వంలోని ప్రభుత్వం తీరుతెన్నులు గమనించినట్లయితే దానికి రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య విలువల పట్ల పట్టింపు లేదని అర్థం అవుతుంది. హిందూమతాన్ని అడ్డంపెట్టుకొని సమాజాన్ని విభజించడం కనిపిస్తుంది.

మెజారిటీ ప్రజలకు మాత్రమే అనుగుణంగా ప్రభుత్వాలు వ్యవహరించడం ప్రమాదకరం. ముస్లిం మహిళలకు సహాయకారిగా త్రిబుల్ తలాక్ ను రద్దు చేయడం సంతోషకరమే. కానీ త్రిబుల్ తలాక్ అనడం క్రిమినల్ నేరమని నిర్ణయించడం, దానికి శిక్ష విధించడం, అటువంటి శిక్షలు ఇతర మతాలవారికి లేకపోవడంతో పేచీ వస్తున్నది. అన్ని మతాలకూ సమానంగా వర్తించే చట్టాలు తేగలగాలి. ఉమ్మడి పౌరస్మృతి పట్ల ముస్లింలకు అభ్యంతరాలు ఉంటాయి. హిందువులకు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఆస్తి పంపకం, ఇతర అంశాల విషయాలు హిందువులకు, ముఖ్యంగా పురుషులకు, సమ్మతం కాకపోవచ్చు. ముందు ఉమ్మడి పౌరస్మృతిని హిందూమతస్థులపైన అమలు జరపండి అంటూ  ప్రధాని నరేంద్రమాదీని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సవాలు చేసింది ఈ కారణంగానే. అందుకనే ఏ మతం వారు ఆ మతంలో సమదృష్టితో, న్యాయబుద్ధితో సంస్కరణలు తేవాలని కొందరు సంస్కరణవాదులు వాదించారు. 2018లో లా కమిషన్ ఈ విషయంపైన దృష్టి పెట్టింది. ఏ మతానికి  ఆ మతం సంస్కరణలను అమలు చేసుకుంటే అప్పుడు సమాజం యావత్తూ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలతో హాయిగా ఉండవచ్చని భావించింది. కానీ వాస్తవంలో అది సాధ్యం కాలేదు. పార్లమెంటులో ఏ మతానికి చెందిన సభ్యులు ఎందరున్నారనే అంశం ప్రధానం కాకూడదు. పార్లమెంటుకు చట్టం చేసే అధికారం ఉండాలి. దేశంలోని అన్ని మతాలకూ, అన్ని కులాలకూ, అన్ని వర్గాలకూ పార్లమెంటు జవాబుదారీగా ఉండాలి.

ఇప్పుడు ప్రతి మతానికి ఉన్న పర్సనల్ లాలు (చట్టాలు) పార్లమెంటు ఆమోదించినవి కావు. వాటి అమలుకు ప్రత్యేకమైన, నిర్దిష్టమైన విధానం ఏమీ లేదు. మతపరమైన మైనారిటీలకే కాదు. జనాభాలో సగం ఉన్న మహిళలకే సమాన ప్రాతినిధ్యం పార్లమెంటులో లేదు. ఏ మతంపైనా దానికి ఇష్టంలేని ఆంక్షలనూ, నియమాలనూ, నిబంధనలనూ విధించకూడదు. ఏ నిబంధనలు ఏ మతానికి ఆమోదయోగ్యమో, ఏవి కాదో తెలుసుకోవడానికి విస్తృత ప్రాతిపదికపైన చర్చలు జరగాలి. ఒక్క పార్లమెంటులోనే కాదు. బయట సమాజంలో కూడా వివరంగా చర్చించాలి. తర్వాతనే తగిన నిర్ణయాలు తీసుకోవాలి.

ఒక పెళ్ళి విషయంలోనే కాదు. వివిధ మతాలకు వేరువేరు ఆచారాలు ఉన్నాయి. ప్రభుత్వం రక్షించవలసిన అంశాలు ఏమిటి? అందరి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదే. పిల్లల భవిష్యత్తుకు అంతరాయం కలగకుండా చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాల నుంచి మతాన్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. మెజారిటీ మతానికి అనుకూలంగా చట్టం ఉండాలనడం లేదా మెజారిటీ మతానికి ప్రతికూలంగా ఉండకూడదని వాదించడం – రెండూ పొరబాటే. ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించడం కత్తిమీద సాము వంటిది. ఇందుకు సమయం పడుతుంది. సహనం కావాలి. ఎన్నికలు జరగడానికి సంవత్సరం కూడా వ్యవధి లేదు. బహుశా ఎన్నికలలో దీనిని ప్రచారాస్త్రంగా ఉపయోగించుకొని, హిందువుల హృదయాలను మరింతగా గెలుచుకొని, ఎన్నికలలో గట్టెక్కాలన్నది ప్రధాని ఆలోచన కావచ్చు. 2019లో పుల్వానాలో సైనికులపైన పాకిస్తాన్ దాడి, అనంతరం బాలాకోట్ లో భారత సైనికుల సర్జికల్ స్ట్రయిక్స్ కారణంగా మోదీ నాయకత్వంలోని బీజేపీకి మంచి మెజారిటీ వచ్చింది. ఈ సారి ఉమ్మడి పౌరస్మృతి ఎన్నికల ఆయుధంగా వినియోగించాలని ప్రధాని ప్రయత్నిస్తున్నారని స్పష్టంగా కనిపిస్తున్నది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles