Saturday, September 7, 2024

హృదయదౌర్బల్యం విసర్జించాలి

భగవద్గీత77

పేరయ్య బహుపిరికివాడు. పిల్లి కాస్త కళ్ళు విప్పార్చిచూసినా దడుసుకునే రకం. మనిషిమాత్రం బాగా బలిష్ఠమైనవాడు. కండలు తిరిగిన శరీరమతనిది. అతను ఉండేది ఒక అటవీప్రాంతం. అతనికి పశువులు చాలానే ఉన్నాయి. ప్రతిరోజూ సాయంత్రం వాటికి మేతవేసి, కుడితిపెట్టి గానీ తను ఏ పనీ చూసుకోడు.

ఆ రోజు ఏదో పని మీద బయటకువెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి బాగా చీకటిపడింది. గొడ్లకు ఇంకా మేత పెట్టలేదు. ఇంటికి రావడం రావడమే ఇంటివెనకాలున్న దొడ్లోకి వెళ్ళాడు దైర్యవంతుడిలాగా. చేతిలో బాగా దృఢంగా ఉన్న ఒక దుడ్డుకర్ర పట్టుకెళ్ళాడు.

Also read: ప్రాధాన్యక్రమం నిర్ణయించుకోవడం ప్రధానం

కన్నుపొడుచుకొన్నా కానరాని చీకటి. అలవాటయిన ప్రదేశమేకాబట్టి వరిగడ్డివామునుంచి గడ్డిలాగుతున్నాడు. ఇంతలో పైనుంచి ఏదో దబ్బున తనముందుపడ్డ చప్పడు. ఏమీ ఆలోచించలేదు. చేతిలోఉన్న కర్రను గిర్రున బలంగా పదినిముషాలు తిప్పాడు. ఎదురుగుండా కదలికలు ఆగిపోయినయి. కాలుక్రింద ఏదో తడిగా అనుపించింది. గొడ్లకు మేతవేసి ఆ విషయమే మర్చిపోయి ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు. తెల్లవారిలేచి చూసుకుంటే కాలంతా ఎర్రగా ఉంది. ఏవో రక్తం మరకలు.

రాత్రి జరిగింది గుర్తుకువచ్చి దొడ్లోకి వెళ్ళాడు. వెళ్ళినవాడు వెళ్ళినట్లే ఒక్కగంతులో వెనక్కువచ్చిపడ్డాడు. రాత్రి తన కర్రదెబ్బలకు చచ్చిపోయింది ఒక పెద్దపులి. అది అప్పటికే ఆ గ్రామంలో ఎన్నో గొడ్లను, ఒకరిద్దరు మనుషులను పొట్టనపెట్టుకున్నది. దానిని చంపటానికి వేటగాళ్ళు కూడా వెతుకుతున్నారు.

Also read: విజయమో వీరస్వర్గమో తేల్చుకో!

ఒక్కగంతులో ఇంట్లోమంచంమీద కూలబడి గజగజ వణకడం మొదలుపెట్టాడు. ఆ వణుకు పెద్దజ్వరానికి దారితీసి ఒక పదిరోజులలో పేరయ్య పుటుక్కుమన్నాడు.

ఆ ఊరివాళ్ళు అతనింటిని పులిరాజుగారిల్లు అని అప్పటినుండి పిలవడం మొదలుపెట్టారు. భయం అనేది ఆలోచనలనుండి పుడుతుంది. ఈ ఆలోచనలను పదేపదే మన మనస్సు అనే వెండితెరమీద చూసుకుంటూ ఉంటే మనిషి నీరుకారిపోతాడు. వాడు అర్జునుడైనా సరే.

అందుకే వివేకానందుడు ఒకమాట చెపుతారు. The essence of Githa lies in one Sloka. i.e.,

క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్‌ త్వ య్యుపపద్యతే

క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్యోత్తిష్ట పరంతప

నాయనా నీకీ హృదయదౌర్బల్యం ఎక్కడనుండి దాపరించినదిరా తండ్రీ. దానంత దరిద్రము ఇంకొకటిలేదు. లే, లేచి యుద్ధం చేయి. నీవు గాండీవం పట్టుకుంటే వైరివీరుల గుండెలు గడగడవణకిపోతాయి. You are the conqueror. GET UP! అని గద్దించి చెప్పాడు వాసుదేవుడు.

పైశ్లోకంలో ఒక్కొక్క పదం తీసుకోండి

క్షుద్రం-క్షుద్రమైనది (The worst). హృదయదౌర్బల్యం-గుండెనీరుకారిపోవటం. త్యక్త్వా-విడిచిపెట్టి. ఉత్తిష్ఠ- లే (Get Up). పరంతప-శత్రువులను తపింపచేసేవాడా. Your are the conqueror. నిజమైన స్థితిని మరచిపోయిన మనలను మేల్కొల్పటానికే మాధవుడు మనకు గీతను అందించినది.

Also read: నీ మనసే నీ మిత్రుడు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles