Monday, October 7, 2024

మహోన్నత నవబౌద్ధుడు  భదంత డాక్టర్ ఆనంద కౌసల్యాయన్

నేను మరణించాక నా సమాధి పై బాబా సాహెబ్ అంబేద్కర్ కలలకి అను గుణంగా ఈ భారతదేశాన్ని నిర్మించే సమరంలో అమరుడైన ఒక సైనికుడి స్మృతి చిహ్నమిదని వ్రాయండి!”

భదంత డాక్టర్ ఆనంద కౌసల్యాయన్.  భారతీయ బౌద్ధ సారస్వత కేతనాన్ని సమున్నతంగా నిలిపిన అరుదైన మేధావి. బౌద్ధ ధర్మానికి కట్టుబడి జీవిస్తూ కూడా ప్రజాక్షేత్రంలో సామాజిక కార్యకర్తగా మనగలిగిన విలక్షణ దార్శనికుడు. 20వ శతాబ్దపు అత్యుత్తమ బౌద్ధ ఆలోచనాపరుల్లో ఒకడు.  మహా పండిత్ రాహుల్ సాంకృత్యాయన్, డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇరువురి ఆదర్శాల మేలు కలయిక. భారతీయ సంస్కృతిలోని చింతనాత్మక బౌద్ధ వారసత్వానికి తిరుగులేని ఉదాహరణ. స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న దేశభక్తుడు. ప్రపంచంలోని అనేకానేక దేశాలు, ప్రదేశాలు తిరిగి ఆయా వివరాలు నమోదు చేసిన విస్తృత యాత్రికుడు. మూల బౌద్ధాన్ని పాళీ భాషలో అధ్యయనం చేసి సారాన్ని సామాన్యుల దరికి చేర్చడానికి విశేష కృషి చేసిన బుద్దిజీవి. ఎన్నో ప్రజాభ్యుదయ గ్రంథాల రచయిత, స్వతంత్ర చరిత్రకారుడు,అనువాదకుడు. సంస్కరణ వాది, గాంధేయవాది, అధునాతన నవబౌద్ధుడు‌. ఇంకా ఎన్నో విశేషాల సమ్మేళనం ఆనంద్ కౌసల్యాయన్ అపూర్వ వ్యక్తిత్వం!

బౌద్ధంలోని మానవత్వం, గాంధీజీ సత్యాగ్రహం, అంబేద్కర్ సోషలిజం, రాహుల్జీ కమ్యూనిజం వంటి విశిష్టమైన గుణాలను స్వీకరించి తన మార్గాన్ని సర్వోన్నతంగా తీర్చిదిద్దు కున్నాడు. బౌద్ధ సాంప్ర దాయాల్ని నేర్చుకోవడం కోసం, పరిశీలించడం కోసం శ్రీలంక, నేపాల్, బర్మా, జపాన్, జర్మనీ, ప్రాన్స్, బ్రిటన్ వంటి  దేశా లెన్నింటినో పర్యటించాడు. ప్రపంచంలోని ప్రముఖ బౌద్ధ గురువులందర్నీ కలిసి చర్చించాడు. వివిధ రకాల సిద్ధాంతాల ఆదుపాదుల్ని పట్టి చూశాడు. ఆనంద కౌసల్యాయన్ అనితర సాధ్యమైన అధ్యయనం గురించి ఇప్పటికీ ఆయన అభిమానులు కథలుగా చెప్పుకుంటారంటే అతిశయోక్తి కాదు. అంత లోతుగా, విస్తృతంగా బౌద్ధ వాఙ్మయాన్నీ, భారతీయ సాహిత్య ధోరణులను చదివిన బౌద్ధ పండితులు అరుదు. ఆయన రచనలు చూస్తే ఈ విషయం తెలుస్తుంది. అణగారిన వర్గాల ప్రజలకి వెన్నుదన్నుగా, బహుజన హితం కోసం కట్టుబడి వ్యక్తిగత జీవితాన్ని సైతం త్యాగం చేసిన నిజమైన పరివ్రాజకుడు కౌసల్యాయన్!

Also read: నిఖార్సయిన విశ్వకళాతపస్వి నికోలస్ రోరిక్        

పంజాబ్ లో అంబాలా దగ్గర సోహనా గ్రామంలో 1905 లో హరనామ్ దాస్ గా జన్మించిన ఆయన లాహోర్ నేషనల్ కాలేజీలో బి. ఎ. చదివాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. రాహుల్ సాంకృత్యాయన్ స్పూర్తితో అధ్యయనం, దేశాటనాల్ని సాధనంగా చేసుకుని మొదట విశ్వనాధగా తర్వాత ఆనంద కౌసల్యాయన్ గా మారాడు.  బౌద్ధ సాహిత్యాన్ని మధించాడు. కులతత్వాన్ని, మతోన్మాదాన్నీ, మూఢ నమ్మకాల్ని, ఛాందస భావాల్ని నిరసిస్తూ విప్లవాత్మక రచనలు చేశాడు. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాల పై తన అనుభవాలతో వ్యాసాలెన్నో రాసాడు. ‘జో లిఖనా పడా’ అనే గ్రంథాన్ని మహాత్మా గాంధీకి, ‘బోధి జీవన పద్ధతి’ అనే పుస్తకాన్ని బాబా సాహెబ్ అంబేద్కర్ కీ అంకితం ఇచ్చాడు. అంబేద్కర్ కోసం “యదీ బాబా నా హోతే” అనే అద్వితీయ రచన చేశాడు.  ధమ్మ పథాన్ని హిందీ చేశాడు.  ప్రముఖ అజ్ఞాతవాది, పాశ్చాత్య నాస్తిక తత్వవేత్త ఇంగర్సోల్ కృషికి వ్యాఖ్యాతగా ‘స్వతంత్ర చింతన్,’  ‘ధర్మ్ కే నామ్ పర్’ మొదలైన పుస్తకాలు రాసాడు. పాల్ కారస్ రాసిన ‘ది గాస్పెల్ ఆఫ్ బుద్ధా’ ను హిందీలోకి అనువదించాడు. భగవద్గీత గురించి సాధికారిక విమర్శ రాసాడు. అనేక వ్యాసాలు, నవలలు,  కాల్పనిక సాహిత్యం కూడా రచించాడు!

Also read: చరిత్ర కలిగిన చరిత్రకారుడు!

భారతదేశంలో బౌద్ధ సాంస్కృతిక వికాసానికి కృషి చేసిన ఐదుగురు మహా బిక్షువులుగా ధర్మానంద కొశాంబి, రాహుల్ సాంకృ త్యాయన్, భంతే జగదీష్ కశ్యప్, బాబాసాహెబ్ అంబేద్కర్ లతో పాటు భదంత డాక్టర్ ఆనంద కౌసల్యా యన్ ని కూడా పేర్కొంటారు. అయితే,  భదంత ఆనంద కౌసల్యాయన్ ని బౌద్ధ జగత్తులో నిలిపిన రెండు గొప్ప పనులు, ఒకటి బాబాసా హెబ్ అంబేద్కర్ విశిష్ట రచనయిన, ‘బుద్దుడు : అతని ధర్మం’ గ్రంథాన్ని హీందీలోకి, పంజాబీ లోకి, ‘రిడిల్స్ ఆఫ్ హిందూయిజం’ గ్రంధాన్ని హిందీలోకి సమర్ధ వంతంగా అనువదించడం. అంబేద్కర్ మహోన్నత ఆలోచనల్ని లక్షలాది మంది ప్రజలకి చేర్చడానికి ఈ మహత్కార్యం దోహదపడింది. ఇక రెండోది, ముఖ్యమైనది, దక్షిణాది భావోద్యమకారులు గుర్తించాల్సినది, ప్రఖ్యాత భావోద్యమకారుడూ, అంబేద్కర్ని ఆకర్షించిన తెలుగువాడూ, సంస్కరణ వాది ప్రొఫెసర్ పోకల లక్ష్మీ నరసు అద్భుత రచన’ ది ఎస్సెన్స్ ఆఫ్ బుద్దిజం’ ని ‘బౌద్ధ్ ధర్మ్ కా సార్’ పేరిట హిందీలోనికి అనువాదం చేసి ప్రచురించడం. ప్రపంచ బౌద్ధ సాహిత్యంలోనే విశేష స్థానాన్ని పొందిన ఈ గ్రంథాన్ని హిందీ చేయడం ద్వారా,  బౌద్ధాన్ని కేవలం ఆధ్యాత్మిక మతంగా కాక, మార్పుకి సారధ్యం వహించే మాధ్యమంగా, మానవ జీవన విధానాన్ని విలువలతో కూడిన ఆచరణాత్మక వైఖరితో ప్రభావితం చేసే నైతిక మానవీయ మహా మార్గంగా ప్రతిష్టించగలగడం ఆనంద కౌసల్యాయన్ సాధించిన విశిష్ట విజయం!

Also read: భారతీయ విశిష్ట తాత్విక నిలయం చార్వాకాశ్రమం!    

అంబేద్కర్ హఠాన్మరణం తర్వాత ముంబాయి లోని దాదర్లో ఆయన అంత్య క్రియలు ఆనంద కౌసల్యాయన్ ఆద్వర్యంలోనే జరిగాయి. ఆ సమయంలో దీక్ష కోసం సిద్ధపడిన లక్షలాది మందిని సమన్వయపర్చిన ఘనత నిస్సందేహంగా ఆనంద కౌసల్యాయన్ దే.  అంతే కాక, బాబాసాహెబ్ మరణంతో  బౌద్ధ ధర్మ ప్రచారోద్యమంపై ప్రతికూల ప్రభావం పడకుండా, నాగపూర్లోని దీక్షాభూమిని తన  నివాసంగా చేసుకుని అంబేద్కర్ ఆశయాల్ని ఆచరణాత్మకంగా కొనసాగించడం కోసం,  జీవితాంతం అక్కడే ఉండి బౌద్ధ ధర్మ ప్రచారం చేసిన మహోన్నత బౌద్దుడు ఆనంద కౌసల్యాయన్.  అందుకే, ఆయన చేసిన కృషికి నివాళిగా మరణానంతరం దీక్షాభూమిలో  ఆనంద కౌసల్యాయన్ విగ్రహం ఈనాటికీ ఉంది. ఇదంతా ఒకెత్తయితే, రాహుల్జీ స్పూర్తితో బౌద్ధ పరివ్రాజకుడిగా ఆయన చేసిన ప్రయాణాలు ఒకెత్తు. దాదాపు ప్రపంచంలోని ప్రఖ్యాత బౌద్ధ దేశాలన్నీ వెళ్ళిన ఆయన ప్రతీ దేశం గురించి కూలంకషంగా అధ్యయనం చేసి విశ్లేషిస్తూ ప్రత్యేకమైన రచనలు సృష్టించారు. రాహుల్జీ తరువాత అంతటి యాత్రా సాహిత్యాన్ని రాసిన వ్యక్తి ఆనంద కౌసల్యాయన్ ఒక్కరే. ‘రాహుల్జీ బాల్ సదన్’ పేరిట పిల్లల కోసం విద్యా కేంద్రాన్ని కూడా స్థాపించి కొనసాగిం చారు. ప్రయాగలోని హిందీ సాహిత్య సమ్మేళన్, వార్ధాలోని రాష్ట్రభాషా ప్రచార సమితి వంటి సంఘాల్లో చురుకుగా పాల్గొన్న కౌసల్యాయన్, సులభమైన భాషను ప్రయోగించి సగటు మనిషి హృదయంలో బౌద్ధ ధర్మాన్ని ప్రతిష్టించడమే లక్ష్యంగా చేసుకుని జీవితాంతం నిబద్దతగా పనిచేశారు!

Also read: చెరిగిపోని ఒక మధుర జ్ఞాపకం – మా ‘బంటీ !

బాబాసాహెబ్ అంబేద్కర్ స్వప్నాల్ని నిజం చేయడానికి యుద్ధం చేసి అమరుడైన వాడినని ప్రకటించుకోగల ఏకైక బౌద్ధ యోధుడు కౌసల్యాయన్. కనుకనే, ‘మనుధర్మ శాస్త్రాన్ని ఎందుకు దహనం చేయాల్సి వచ్చింది?,” ‘‘స్వతంత్ర చింతన’’ వంటి గ్రంథాల్ని రచించి అంబేద్కర్ కి మద్దతుగా ప్రచారం చేశారు. ‘సులభ శైలిలో పాళీ భాష పరిచయం’ వంటి అమూల్య మైన గ్రంథాలను కూడా రాశారు. తెలుగులో కూడా ఒకట్రెండు ఆయన రచనల తర్జుమా జరిగింది.  హేతువాద మానవవాద దృష్టితో, తర్కబద్ద ప్రమాణాలతో క్లిష్టతరమైన ఎన్నో తాత్విక భావనల్ని అత్యంత సులువు గా రాయడం కౌసల్యాయన్ ప్రత్యేకత.  ఉత్తర భారతంలో ఈ మాత్రమైనా భావోద్యమాల ప్రభావం ఉందంటే అందుకు ఆనంద కౌసల్యాయన్ వంటివారే కారణం. భారతీయ తాత్విక ధోరణిలోని ఆరోగ్యకర అంశాల్ని కాపాడడం కోసం భదంత ఆనంద కౌసల్యాయన్ చేసిన కృషి భారతీయ బౌద్ధ సారస్వత చరిత్రలోనూ, ప్రగతిశీల ప్రజా పురోగామి క్షేత్రంలోనూ నమోదు చేయడం అవసరం. అందులో భాగంగా నవీన బౌద్ధ ప్రచారోద్యమాలు ఆయన కృషిని ఆ మేరకు గుర్తించి గౌరవించడం, అలానే నిర్మాణాత్మక ప్రజాతంత్ర భావజాలానికి తగినట్టుగా ఆయన వారసత్వాన్ని కొనసాగించడమే ఆ మహోన్నత వ్యక్తికి మనమిచ్చే చిరు నివాళి కాగలదు!

Also read: ‘చౌరీచౌరా’ ఘటనకి వందేళ్ళ సందర్భం!

(జూన్ 22 , భదంత డాక్టర్ ఆనంద కౌసల్యాయన్ 35 వ వర్ధంతి నివాళి)

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles