Tuesday, April 16, 2024

చరిత్ర కలిగిన చరిత్రకారుడు!

కంభంపాటి సత్యనారాయణ సీనియర్

 (మరుగునపడ్డ మహామేధావి)

“ఐదు దశాబ్దాలు కమ్యూనిస్టు పత్రికల్లో గడించిన రచనానుభవం నుంచి ఒక పరిశోధకుడిగా కంభంపాటి సత్యనారాయణ ఎదిగి A Study Of the History and Culture of the Andhras (ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి : ఒక అధ్యయనం) అనే గ్రంథాన్ని తమ జీవిత చరమ దశలో రచించారు. దాదాపు వెయ్యి పేజీల (937 పేజీల) ఈ ఉద్గ్రంథం రాశి (Quantity)లోనే కాదు, వాసి (Quality)లోనూ విలక్షణ గ్రంథం. ఈ ఉద్గ్రంథాన్ని తెలుగులోకి అనువాదం చేస్తూ, మహీధర రామమోహనరావు ‘నా మాట’లోముఖ్యమైన విషయాన్ని మనందరికీ మరొకసారి గుర్తు చేశారు. ఆ మాటల్ని కమ్యూనిస్టులే కాదు, దేశ ప్రగతిని కాంక్షించే వారందరూ గుర్తుంచు కోవల్సిన అవసరం ఉంది.

“..తెలుగు వాళ్ళు, ముఖ్యంగా అభ్యుదయ ఉద్యమంలో పనిచేస్తున్న వాళ్ళకి సామాజిక పరిజ్ఞానం అత్యవసరం. భారతదేశంలో బానిస విధానం ఉండేదా ?ఏ రూపంలో ఉండేది? వంటి సమస్యలు పరిశోధకులవి. సాధారణుడైన తెలుగువాడి నిత్యజీవిత పరిజ్ఞానంలో వాని పాత్ర బహు దూరం‌.

 కాని మన జీవితాన్ని ఆవరించుకుని ముందుకు అడుగు వేయకుండా నిరోధిస్తున్న కొన్ని సమస్యలున్నాయి. వానిలో కులం ఒకటి. మానవులంతా ఒకటే. వారిలో హెచ్చుతగ్గులు లేవు. ఉండ కూడదనేవాళ్ళు కూడా కులం పేరు చెప్పేసరికి బిగిసిపోతున్నారు”(ఆంధ్రుల సంస్కృతి – చరిత్ర – 1, హెచ్.బి.టి, 1981). అంతే కాకుండా కంభంపాటి ఉద్గ్రంథాన్ని గురించి మరో మాట కూడా ఆయన అన్నారు : “ఈ ప్రశ్నలకు సమగ్ర సమాధానం ఉందనను కానీ, వీనిని అర్థం చేసుకునేందుకు, సమాధానం ఊహించేందుకు కావాల్సిన సమాచారం నాకు కనబడింది.”

“అభ్యుదయోద్యమాలలో తలనెరసిన పెద్ద రచయిత మహీధర రామమోహనరావు గుర్తించినట్లు కంభంపాటి సత్యనారాయణ ఆంగ్ల గ్రంథం ‘‘ఆంధ్రుల సంస్కృతి – చరిత్ర : ఒక అధ్యయనం’’ చారిత్రక ప్రాముఖ్యతను మరో అభ్యుదయరచయితకానీ, కమ్యూనిస్టు యోధుడు కానీ గుర్తించినట్లు నా దృష్టి కి రాలేదు. ఆయనే ఈ గ్రంథాన్ని సంక్షిప్తానువాదం కాకుండా సంపూర్ణాను వాదం చేసినట్లయితే ఆంగ్ల భాష తెలియని తెలుగు పాఠకులు వర్గ, కుల, మత వ్యవస్థల గురించి తమ పరిజ్ఞానాన్ని పరిపుష్టం చేసుకోవడానికి, అవగాహనను పెంచు కోవడానికి తగిన సమాచారం అందించినట్లయ్యేది. ఆంధ్రుల సమగ్ర చరిత్రకు మార్క్సిస్టు దృష్టితో నాంది పలికిన కంభంపాటి చరిత్ర గ్రంథం, ఈనాడు దేశం ఎదుర్కొంటున్న విచ్ఛిన్నకర శక్తులు – కుల, మతాల్ని అర్థం చేసుకొని, వాటికి వ్యతిరేకంగా బహుముఖ పోరాటం చేయడానికి ఉపయోగప డుతుందని భావిస్తున్నాను..”

ఇరవై సంవత్సరాల క్రితం ఆంధ్రలో తొలి కమ్యూనిస్టుల్లో ఒకరూ, అద్వితీయ చరిత్ర కారుడు,అభ్యుదయ పాత్రికేయుడు, రచయిత, సంపాదకుడు, ఉద్యమశీలి కంభంపాటి సత్య నారాయణ సీనియర్ 21వ వర్ధంతి స్మారకోప న్యాసం సందర్భంగా 2004 లో విజయవాడ లో  టి. రవిచంద్ చేసిన విలువైన ప్రసంగమే, తదనంతరం “ఆంధ్రుల చరిత్రలో నూతన ఆవిష్కరణలు” పేరిట విశాలాంధ్ర ప్రచురించింది. అందులోనివే పైన పేర్కొన్న అభిప్రాయాలు. అర్ధశతాబ్ధ కాలంలో ఆంధ్రుల పై అక్టోబర్ విప్లవ ప్రభావం అనే వ్యాసం మొదలు A Forgotten Intellectual of the South (విస్మరించబడిన దక్షిణ భారత మేధావి) పేరిట కె. బి. కృష్ణ గురించి కంభం పాటి మెయిన్ స్ట్రీమ్ లో రాసిన అమూల్య మైన వ్యాసం వరకూ ఈ చిన్న ప్రసంగంలో తడిమిన రవిచంద్, డా.ఎమ్. పట్టాభి రామిరెడ్డి అన్నట్లు, కంభం పాటిని “చరిత్ర కలిగిన చరిత్రకారుడి” గా పేర్కొన్నారు!

చాలా ఏళ్ళ క్రితం కంభంపాటి గారి ‘A Study Of the History and Culture of the Andhras’ ను చదివి ఆ విస్తృతికి విస్తుపోయిన నాకు, చాలా రోజుల నుండి ఆ వర్క్ పై సమాలోచన జరిపి చర్చను పెట్టాలనే బలమైన ఆలోచన ఉండేది. ఈరోజు ఎవరో కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఆ గ్రంథం దాదాపు మరుగున పడిపోయింది. తొంభైఏళ్ళ క్రితమే మార్క్సిస్టు దృక్పథంతో స్వతంత్రంగా ఈ దేశంలోని భావోద్యమాలని పరిశోధించీ, కులనిర్మూలన కోసం నూతన పంథాను అనుసరించిన కె. బి. కృష్ణ వంటి మహా మేధావి కృషికి కూడా ఏవో ఆయన పుస్తకాలు ప్రచురించడం మినహా వామపక్ష శ్రేణులు న్యాయం చేయలేదు. కనీసం, భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురుల ఉరిశిక్షని ఖండిస్తూ కరాచీ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ ప్రవేశపెట్టిన తీర్మానం ఆ యోధుల్ని అవమాన పరిచేలా ఉందని భావించి దానికి వ్యతిరేకంగా ఓటు వేసి కాంగ్రెస్ నుండి బయటకొచ్చి కమ్యూనిస్టుగా మారిన కంభంపాటి వంటి స్వేచ్ఛాలోచనా పరుడి స్పూర్తినైనా కాపాడుకోవల్సి ఉంది!

మద్రాసులో అమీర్ హైదర్ ఖాన్ ఆద్వర్యంలో నిషేధిత పార్టీలో పనిచేశి వామపక్ష, సైద్ధాంతిక సాహిత్యాన్ని సుసంపన్నం చేశిన అలాంటి మహావ్యక్తి, స్వతంత్ర చరిత్ర కారుడు, పరిశోధకుడు, పాత్రికేయుడు, రచయిత, సిద్దాంతకర్తా, ఉద్యమకారుడు, కార్యశీలిని విస్మరించడంమంత విషాదం కమ్యూనిస్టు పార్టీ కి మరోటి లేదు. ఈ స్మారకోపన్యాసం ప్రతి అంతర్జాలంలో అందుబాటులో ఉంది. లేదా ఆసక్తి ఉన్న మిత్రులు నా వాట్సప్ 90320 94492 కి రిక్వెస్ట్ పెడితే సాఫ్ట్ కాపీ నేనైనా పంపగలను. కాలక్షేపం కోసం కాకుండా, ప్రత్యామ్నాయ చరిత్ర రచన పట్లా, ప్రత్యామ్నాయ ప్రజాతంత్ర ఉద్యమాల పట్లా ఆసక్తి, అధ్యయనం ఉన్న మిత్రులు కంభంపాటి సత్యనారాయణ గారి జీవితం, ఆచరణ పట్ల కృషి చేస్తే భావి తరాలకు ఒక భరోసాను కల్పించినవారు అవుతారని మనవి !

(2004 లో ఇచ్చిన ఈ ప్రసంగ పాఠాన్ని పదేళ్ళ తర్వాత 2013 లో రవిచంద్ ప్రేమగా నాకు  పంపారు. అప్పటికే ఈ ప్రసంగం నేను చదివి ఉన్నాను. ఇంకో పదేళ్ళు కూడా గడిచి పోయాక ఇప్పటికి గానీ ఈ మాత్రం పరిచ యానికి కూడా తీరింది కాదు. ప్రొ. హిరేన్ ముఖర్జీ, దేవీప్రసాద్ ఛటోపాధ్యాయ, ప్రొ. కొత్త సచ్చి దానందమూర్తి, ప్రొ.వి. రామకృష్ణ వంటి ప్రముఖులు ఇచ్చిన కంభంపాటి సత్య నారాయణ గారి స్మారకోపన్యాసాలు అన్నిట్నీ  పుస్తకంగా ప్రచురించారేమో నాకైతే తెలీదు కానీ, కంభంపాటి వంటి మహామేధావిని, ఆలోచనల్ని, శోధనల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళాల్సిన బాధ్యత అన్ని శ్రేణుల ప్రజాసంఘాలకు, బుద్ది జీవులకూ ఉందని భావిస్తూ చాలా రోజులుగా అనుకుం టున్న ఈ పుస్తకం పై చిన్న రైటప్!)

– గౌరవ్

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles