Saturday, September 30, 2023

నిఖార్సయిన విశ్వకళాతపస్వి నికోలస్ రోరిక్        

అద్వితీయ మహా జిజ్ఞాసి మహత్తర కృషి

వ్యక్తిత్వానికి ముందు ఎన్ని విశేషణాలనైనా చేర్చండి. వాటన్నిటికీ సరిపోయే అసాధారణ పేరది. జీవితం గురించి ఎన్ని విశిష్టతలనైనా పేర్చండి. అన్నిటికీ అలవికాని వన్నె తెచ్చే అఖండమైన ప్రయాణం ఆయనది. ఆయనో అద్భుతమైన సౌందర్యారాధకుడు, కవి, రచయిత, తత్వవేత్త, స్వాప్నికుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, సామాజిక కార్యకర్త, పురాతత్వశాస్త్రవేత్త, సత్యాన్వేషకుడు, ప్రత్యామ్నాయ ఆధ్యాత్మిక వాది, ఆచరణవాది, ప్రపంచ శాంతి ఉద్యమకారుడు, అనుభవవాది,  అద్వితీయ చిత్రకారుడు, అనేక సంస్థల వ్యవస్థాపకుడు, మతాలన్నింటినీ శోధించి నైతిక మార్గం ముఖ్యమని నమ్మినవాడు. ‘రోరికిజం’ ఆధ్యాత్మికత, సామాజికతల వినూత్న సిద్ధాంతం. ప్రపంచ వ్యాప్తంగా చికాగో, న్యూయార్క్ వంటి చోట్ల అంతెత్తునున్న అనేక అంతస్తుల్లో  ఆయన పేరిట కొనసాగుతున్న కళా ప్రదర్శనలు రోరిక్ విశిష్టతకి విలువైన చిహ్నాలు. మార్మిక మతవాది,  అగ్నియోగ సృష్టికర్త, అన్నిట్నీ మించి హిమాలయ ప్రకృతి ప్రేమికుడు, భారతీయతలోని అవిభాజ్యమయిన చింతనాశీలతను పరిపూర్ణంగా అర్ధం చేసుకున్న మానవీయ దార్శనికుడు!

అద్భుతమైన హిమాలయ దృశ్యం రోరిక్ కుంచె సృష్టి

రోరిక్…నికోలస్ రోరిక్ … భారతదేశపు ఆత్మని కళాత్మకంగా చిత్రించగల రవివర్మ మొదలు రవీంద్రనాథ్ టాగోర్ వంటి అతి కొద్దిమంది ఈ దేశపు చిత్రకారుల సరసన నిల్చిన ఏకైక కళాసౌందర్య యోధుడు. మహాత్మా గాంధీ మొదలు మహా వైజ్ఞానిక శాస్త్రవేత్త ఐన్ స్టీన్ వరకూ, లెనిన్ తో మొదలెడితే రూజ్‌వెల్ట్ దాకా విశ్వవ్యాప్తంగా ఆలోచనాపరులు ఎందర్నో ఆకర్షించిన మహావ్యక్తిత్వం ఆయనది. ఇవన్నీ ఒకెత్తయితే, తెలుగులో అద్వితీయ సౌందర్యో పాసకుడిగా, కళా తాత్వికునిగా నిల్చిపోయిన సంజీవ్ దేవ్ గురువుగా తెలుగు వారితో ఆయనకున్న సంబంధం మరొకెత్తు. సంజీవ్ దేవ్ అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో రోరిక్ ఒకరు. దేవ్ వివాహం నాటికి మరణించిన రోరిక్, భార్య హెలీనా ద్వారా తాను వేసిన హిమగిరుల చిత్రాన్ని బహుమతిగా పంపించిన ఘటన, రోరిక్ తో దేవ్ ఉత్తర ప్రత్యుత్తరాలు వంటి హృద్యమైన ఘటనల్ని సంజీవ్ దేవ్ గారి రచనల్లో కూడా చూడొచ్చు. హిమాలయాల్ని ప్రేమించడం మాత్రమే కాదు, ఆ అనంత శిఖరాలలో అడుగడుగూ సంచరించి అక్కడి వాతావరణ స్థితిగతులనూ, చెట్టు, చేమ, పశువు, పక్షి, గడ్డి, గాదం వంటి ప్రజాజీవన క్షేత్రాల్ని క్షేత్రస్థాయి లో చదివి ఆ సేకరించిన సమాచారాన్ని భద్రపరచిన అరుదైన ఔత్సాహికుడు!

Also read: చరిత్ర కలిగిన చరిత్రకారుడు!

రష్యాలోని సెయింట్ పీటర్స్‌ బర్గ్ లో జన్మించాడు. తండ్రి జర్మన్, తల్లి రష్యన్. రోరిక్ కవిత్వం, చరిత్ర, నిర్మాణశాస్త్రం, న్యాయశాస్త్రం,  కళల పట్ల ఆసక్తి కనబరిచేవాడు. 24 ఏళ్ళ వయసులోనే ‘కళా జగతి’ (Mir iskusstva /world of art) పత్రిక్కి సహసంపాదకుడిగా పనిచేశాడు. మొదట్లో రష్యా విప్లవాన్ని దగ్గరుండి సమర్ధించిన రోరిక్, మాక్సిమ్ గోర్కీతో పాటు గోర్కీ కమీషన్ లో కూడా పనిచేశాడు. సోవియట్ ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా మెలిగి కూడా అధికారిక పదవుల్ని కాదనుకున్నాడు. తర్వాత కళా సాంస్కృతిక విలువల పరిరక్షణకు సంబంధించిన బోల్షెవిక్ పాలసీతో విభేదించాడు. లెనిన్ అనుసరించిన విధానాలను వ్యతిరేకించాడు. దాంతో ఒత్తిడి మొదలైంది. తర్వాత ఫిన్ లాండ్ వలస పోయాడు. అప్పుడే బౌద్ధం, ఉపనిషత్ వేదాంత దర్శనాలు, రామకృష్ణ పరమహంస, వివేకానంద రచనలు ఆయన్ని ఆకర్షించి జీవన సహచరి హెలీనాతో పాటు సమాంతర నూతన ఆధ్యాత్మిక తాత్విక చింతన పట్ల ఆసక్తి కలిగించాయ్!

రోగాలనుు నయం చేసే సెయింట్ పాంటలీమీన్ హిమాలయాలపైన అన్వేషిస్తూ, రోరిక్ పెయిటింగ్.

ఆ దిశగా ఆయన చేసిన కృషి పేర్కొంటే అదొక ఉద్గ్రంథం అవుతుంది. మధ్య ఆసియా దేశాలు, యూరోప్, మంగోలియా,  స్కాండేవియా, ఫిన్లాండ్, చైనా, అమెరికా, లండన్, టిబెట్, జపాన్…ఒక్క చోటు కాదు, ఒక్క దేశమని లేదు. ప్రపంచంలోని వివిధ తాత్విక పద్ధతుల్ని పరిశీలనాత్మకంగా శోధించిన ఆయన వందేళ్ళ క్రితం 1923 లో ఇక్కడి హిమాలయాలతో పీకల్లోతు ప్రేమలో పడిపోయాడు. అంతే, కాశ్మీర్, లద్దాఖ్, పంజాబ్, సిక్కిం, స్పిటీ, లాహోల్ వంటి హిమ ప్రాంతాలు తిరిగుతూ కులూ లోయకు దాసోహమయ్యాడు. ‘ఉరుస్వతి’ పేరిట ఏకంగా హిమాలయ పరిశోధక విశ్వవిద్యాలయం స్థాపించి అనితర సాధ్యమైన కృషి చేశాడు. పత్రికతో సహా అనేక పరిశోధక గ్రంథాలు వెలువరించాడు. భాషా, సంస్కృతుల్నీ, చారిత్రక పరిణామాల్నీ పరిశోధించాడు.  హిమాలయాల్ని రోరిక్  ఎంత పిచ్చిగా ఆరాధించాడంటే, ఏకంగా (7000 ) అక్షరాలా ఏడువేల చిత్రాల్లో హిమ శిఖరాల సౌందర్యాన్ని ప్రోది చేశాడు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ ఇతర దేశంలోనూ కాకలుతీరిన ఏ కళాకారుడు/ చిత్రకారుడూ కూడా కనీసం ఊహించ సాహసించని అపార నిరంతర కృషి ఇది!

భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో రోరిక్

ఆయన అభిప్రాయాలు కొన్నింటితో వ్యక్తిగతంగా భిన్నాభిప్రా యాలు ఉన్నాయి. యోగ, టెలీపతి, శంభాలా వంటి రోరిక్ భావాలు నాకు నచ్చవు. అలాంటి అశాస్త్రీయ పద్ధతులు ఉన్నా, చివర్లో సైన్సు పట్లా, తాత్వికాన్వేషణ పట్లా ఆయన కనబర్చిన దృక్పధం , చేసిన కృషి తెలిస్తే విస్మయానికి లోనవక మానం. అగ్నియోగ పేరిట మతాన్ని నైతికతకి జోడించడం రోరిక్ చేశాడు.  జవహర్లాల్ నెహ్రూ కుటుంబం తోనూ, ఇందిరాగాంధీ తోనూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న రోరిక్ కొడుకులు యూరీ నికోలవిచ్ రోరిక్, స్వెతోస్లవ్ నికోలవిచ్ రోరిక్, భారతీయ చిత్రరాజాన్నేలిన నటి దేవికా రాణీ కోడలితో సహా మొత్తం కుటుంబం హేతుబద్ద జ్ఞానానికి, చింతనాత్మక సంశోధనకి ఇచ్చిన గౌరవం, చేసిన కృషి అపూర్వం. అలాంటి మహాకృషికి తగిన ప్రదేశంగా రోరిక్ ఎంచుకున్న ప్రాంతాన్ని దర్శించాలని ఎన్నాళ్ళగానో అనుకుంటున్నాను. అనుకోని తీరిక వల్ల మొన్ననే ఆ కల తీరింది. మిత్రుడు సతీష్ తో కలిసి కులూ లోయలోని నగ్గర్ గ్రామంలో అంతెత్తునున్న దేవదారు వృక్షాల మధ్య ఆయన స్మృతిలో గౌరవచిహ్నంగా, ఆ దారికి పేరు పెట్టిన  “రోరిక్ మార్గ్” లో,  ప్రపంచ కళాభిలాషుల స్వప్నం, సౌందర్యోపాసకుల స్వర్గం, కళనీ, ముఖ్యంగా చిత్రకళని ప్రేమించే వారు, హిమసీమల్ని ఆరాధించేవారు తప్పని సరిగా చూడవలసిన దర్శనీయ స్థలం,రోరిక్ ఎస్టేట్. అంతర్జాతీయ రోరిక్ స్మారక ట్రస్ట్ (International Roerich Memorial Trust) ఆద్వర్యంలో ఆర్ట్ గ్యాలరీ, ఫోక్ ఆర్ట్ మ్యూజియం చూసొచ్చేసాను. అక్కడే తన చిత్తరువులతో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన పంజాబ్ కి చెందిన గురుప్రీత్ సింగ్ అనే యువ ఔత్సాహిక చిత్రకారుడ్ని కలిసాం.  బడలికతోనే అయినా భారతీయ తాత్విక, సాంస్కృతిక చరిత్రని సుసంపన్నం చేసిన రోరిక్ దంపతుల స్మృతి చిహ్నల్నిలా నెమరేసు కుంటూ,ఆయన కృషి కోసం ఈ చిన్న రైటప్!

నికోలస్, హెలీనా రోరిక్

(పర్యటన మనలోని పరవశత్వానికి పరిమళం అద్దితే, అన్వేషణ మనలోని అహంభావాలని అంతం చేస్తుంది. ప్రయాణం మనిషి ప్రగతిపథం. మనలోని అవాంఛనీయతల నిర్మూలనం, వ్యక్తావ్యక్త అనుభూతుల సమ్మేళనం. ఆంతరిక కళాత్మకతకి, బాహ్య సౌందర్యానికి సంధానం. అలా ఎప్పటినుండో అనుకుంటున్న ఓ సుదీర్ఘ ప్రయాణం, జీవన యానంలో సాకారమైంది. హిమాలయాలలో చేసిన కొన్ని చిన్నపాటి ట్రెక్కింగ్ లతో పాటు ఎక్కడో పుట్టి మరెక్కడో చదివి అనేక దేశాలు తిరిగి ఇక్కడ ఇండియా హిమాలయ పర్వత శ్రేణుల మధ్య సంచరించీ, స్థానిక సంస్కృతుల్ని లోతుగా అధ్యయనం చేసి, ఇక్కడి ప్రజల్ని ప్రేమించి,వారితోనే జీవించి, భారతీయ తాత్వికత లో తాదాత్య్మం చెంది, ఇక్కడి మట్టిలో మమేకమైపోయి విశ్రమించిన ఒక మహత్తర మానవుడు చేసిన అసాధారణ కృషి, అపారమైన శోధన, అనంతమైన అన్వేషణలకి ఈ నాటికీ నిలిచి ఉన్న ప్రాసంగికతని ప్రాపంచిక నైతిక విలువల వెలుగులో సుస్థిరంగా నిలుపు కోవడం అవసరమనే అభిలాషే ఈ అక్షరకాంక్ష. అదే విశ్వనరుడిగా ఎదిగిన నికోలయ్ కాన్స్టాం టినోవిచ్ రోరిక్ (1874 – 1947) 150వ జయత్యుత్సవం సందర్భంగా ఆ మహావ్యక్తి స్మృతికి మనం ఇవ్వదగ్గ మనస్విత నివాళనేది నా అభిప్రాయం!)

Also read: భారతీయ విశిష్ట తాత్విక నిలయం చార్వాకాశ్రమం!    

– గౌరవ్

Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles