Friday, December 9, 2022

శ్రీరామ జననం

రామాయణమ్……4

యజ్ఞము పరిసమాప్తమయ్యింది, సరిగ్గా పన్నెండు మాసాలకు మరల వసంతము వచ్చినది!

 దశరధమహారాజు జీవితములో ఈ వసంతము ఒక్క కొత్తశోభను తెచ్చింది. మోడువారిన  ఆయన జీవితపు ఆశ మరల చిగురించింది.

దశరధుడి మనోరధము నెరవేరింది!

ఆరోజు చైత్రమాసంలో నవమి తిధి! పునర్వసు నక్షత్రం , అయిదు గ్రహాలు తమతమ ఉచ్ఛస్థితిలో ఉండగా!

 రవి మేషంలో ఉన్నాడు

కుజుడు మకరంలో ఉన్నాడు

గురుడు కర్కాటకంలో ఉన్నాడు

శుక్రుడు మీనంలో ఉన్నాడు

శని తులా రాశిలో ఉన్నాడు

ఆయా రాశులన్నీ కూడా ఆయా గ్రహాలకు ఉచ్ఛస్థానాలు!.

చంద్రుడు స్వస్థానమైన కర్కాటకంలో ఉన్నాడప్పుడు!

 అంటే పునర్వసు నాల్గవపాదం అన్నమాట!

గురుచంద్రయోగం సంభవించింది!

లగ్నము కూడా కర్కాటకమే!

ఆ శుభలగ్నమందు కౌసల్యాదేవి జగత్కల్యాణ కారకుడు, జగన్నాధుడు, ఇక్ష్వాకు వంశ వర్ధనుడు అయిన శ్రీ రామచంద్రుని పుత్రునిగా కన్నది!

శ్రీ రామ జననమయిన పదహారు గంటల తరువాత  భరతుడు మీన లగ్నంలో కైకేయికి జన్మించాడు! ఆయన నక్షత్రం పుష్యమి!

ఆ తరువాత మధ్యాహ్న కాలంలో కర్కాటక లగ్నంలో ఆశ్లేషా నక్షత్రంలో లక్ష్మణ, శత్రుఘ్నులకు జన్మనిచ్చింది సుమిత్రాదేవి!

Also read: దశరధ కుమారుడిగా అవతరిస్తానని దేవతలకు హామీ ఇచ్చిన విష్ణు

రాజ్యమంతా కోలాహలం!

ఉత్సవాలు, సంబరాలు, రాజు ఇచ్చే భూరిదానాలతో పదకొండురోజులు గడిచినాయి!

పదకొండవ రోజున నవజాతశిశువులకు నామకరణం జరిగింది.

ఆయన పుట్టి దశరథుడికి మహదానందం కలుగచేశాడు జనులందరికీ సంతోషం కలుగచేశాడు!

ఎవనియందయితే సర్వజనులకు ఆనందము కలుగుతుందో!

అతడే “రాముడు”

రమింపచేయువాడు రాముడు అని అర్ధం

 పెద్ద కుమారుడికి “రాముడు” అని పేరు పెట్టారు వసిష్ఠ మహర్షి!

సంపద, శోభ కలవాడు కావున లక్ష్మణుడు!

రాజ్యమును భరించువాడు కావున భరతుడు!

శత్రువులకు సింహస్వప్నము ,వారిని చంపువాడు కావున శత్రుఘ్నుడు! .

నలుగురు కుమారులను చూసుకొని దశరథుడు మురిసిపోతున్నాడు ఆయన ఆనందానికి అవధులు లేవు.

రాముడంటే మరీ! ఆయన అన్నిప్రాణాలూ రాముడే!

…..

రాబోయే రోజులలో రాముడికి ఎవరు సహాయం చేస్తారు?

మీరంతా రావణ సంహారం జరగాలని కోరుకున్నారు. విష్ణువు దశరధమహారాజు కొడుకుగా జన్మించాడు, మరి రావణునితో జరిగే పోరాటంలో ఎవరు పాల్గొంటారు?

ఆయన సైన్యం ఎవరు? విష్ణువుకు సైన్యసహకారం ఎవరిస్తారు?

ఆందరు దేవతల మదిలో ఈ ఆలోచన పుట్టించారు బ్రహ్మదేవుడు.

అందరు దేవతలను ప్రేరేపించాడు బ్రహ్మదేవుడు.

ఒకప్పుడు రావణాసురుని నందీశ్వరుడు శపించాడు!

నీకు వానరుల(కోతుల) వలన భయం కలుగుగాక! అని

ఈ శాపాన్ని తమకు వరంగా మార్చుకోవాలనుకున్నారు దేవతలంతా!

దేవతలంతా వానర స్త్రీల యందు మహాబలశాలురయిన పుత్రులుగా జన్మించారు!

అంతకుఎన్నో ఏళ్ళ  పూర్వమే జాంబవంతుడు బ్రహ్మదేవుడి ఆవులింతనుండి జన్మించాడు.

ఋషులు, సిద్ధులు, విద్యాధరులు, ఉరగులు, చారణులు  దివ్యశక్తులు కలవారంతా తమతమ కుమారులుగా వీరాధివీరులైన వానరులను సృజించారు.

దేవేంద్రుడు వాలిని,

 సూర్యుడు సుగ్రీవుని,

దేవగురువు బృహస్పతి తారుడు అనే బుద్ధిశాలి అయిన వానరుడిని,

కుబేరుడు  గంధమాధనుని

విశ్వకర్మ నలుడిని

అగ్ని నీలుడిని

అశ్వనీ దేవతలు మైంద ,ద్వివిదులను

వరుణుడు  సుషేణుడిని

పర్జన్యుడు   శరభుని

వాయుదేవుడు  శ్రీమంతుడు, వీర్యవంతుడు, వజ్రమయ దేహము గలవాడు, గరుత్మంతునితో సమానవేగము గలవాడు ,శత్రుభయంకరుడు అయిన హనుమంతుని సృజించాడు.

ఏ దేవుడికి ఏ రూపము, ఏ వేషము, ఏ పరాక్రమము,  ఏ తేజస్సు ఉండెనో ముమ్మూర్తులా అవే లక్షణాలతో అనేక కోట్ల వానరులు జన్మించారు!

Also read: రామకథ రచించమని వాల్మీకికి విరించి ఉద్బోధ

ఈ వానరులంతా కూడా అమితబల సంపన్నులు! యుద్ధంలో పెద్దపెద్ద కొండల వంటి రాళ్లు శత్రువుల మీద విసిరివేయగలరు. మహా వృక్షాలు వేళ్ళతో సహా పెకిలించి వైరివీరులను చావచితక కొట్టగలరు! సముద్రాలను కలియబెట్టగలరు. భూమిని నిట్టనిలువుగా చీల్చివేయనూగలరు! అరణ్యాలలో స్వేచ్చగా తిరిగే మదగజాలను ( ఏనుగులు) పిల్లిపిల్లల్లా చంకనవేసుకొని తిరుగగలరు! వారి సింహనాదాలకు ముల్లోకాలు కూడా కంపించి పోతాయి!

ఇలాంటి లక్షణాలున్న వానరవీరులంతా రామసహాయార్ధము భూమినిండా జన్మించి ఉన్నారు!.

……

అక్కడ అయోధ్యలో రాముడు శుక్లపక్ష చంద్రునివలే దినదిన ప్రవర్ధమానమవుతున్నాడు! ఆయన చేసే అల్లరికి అంతే లేకుండా ఉన్నది! ఆయన ఏమిచేసినా ఆ తండ్రికి మురిపెమే!

రారా  నారామా! అని గుండెలమీద కొడుకుని పరుండపెట్టుకొని అంత పెద్ద మహారాజు తాను కూడా చిన్నపిల్లవాడై వయసుమరచి, రాజునని మరచి కొడుకుతో ఒకటేఆటలు, పాటలు.

రాముని విడిచి ఒక్క క్షణముండలేని మరో ప్రాణి కూడా ఉంది అయోధ్య లో!

ఆ ప్రాణి ఎవరో కాదు లక్ష్మణస్వామి  ! రాముడి నీడ ఎలా ఉంటుంది ? అని అడిగితే ఇదిగో ఇలా ఉంటుంది అని లక్ష్మణుడి వైపు వేలెత్తి చూపటం అలవాటు చేసుకున్నారు అయోధ్యానగరవాసులు! ఇక అన్నగారికి తమ్ముడంటే పంచప్రాణాలు!

సౌమిత్రి ప్రక్కన లేనిదే ఈయనగారు ఏ పనీ చేయరు! అన్నం తినడు! ఆఖరుకు నిద్రపోవాలన్నా ప్రక్కన తమ్ముడు ఉండవలసినదే!

అదేవిధంగా మరొక జంట భరతశత్రుఘ్నులు

ఇలా నలుగురు కుమారులు ఆయన ఆనందాన్ని పెంపొందిస్తూ ఉండగా కాలం ఎలా గడచిపోతున్నదో తెలియరావటం లేదు దశరధమహారాజుకు!

ఆ కుమారులు నలుగురూ కూడా ధనుర్విద్యలో అపారపాండిత్యం సంపాదించారు,వేదవేదాంగాలు వారికి కరతలామలకం!

తల్లిదండ్రులను,పెద్దలను సేవించటంలో వారితరువాతనే ఎవరైనా,

సకలసద్గుణాలతో శోభిల్లే వరాల మూటలు దశరథ తనయులు!

కాలమిలా గడుస్తుండగా ఒకరోజు….!

Also read: రామాయణం -1

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles