Saturday, April 20, 2024

దిగ్గున లేచి సముద్రంపైన ప్రయాణం ప్రారంభించిన హనుమ

రామాయణమ్123

ఎవరివలనా సాధ్యము కాని పని చేయ సంకల్పించిన హనుమంతుడు శిరస్సు పైకెత్తి నందీశ్వరుడిలాగా  ఉన్నాడు. మహేంద్రపర్వత సానువులపై అటునిటూ వడివడిగా సంచరించాడు ఆంజనేయుడు. ఆ పర్వతము అనేక మృగ, పక్షి గణాలకు ఆవాస ప్రాంతము.ఈ మహాకపి యొక్క సంచారమునకు అవి అన్నీ ఒక్కసారిగా ఆందోళన చెందసాగినవి. ఆయన సూర్యదేవునకు, మహేంద్రునకు, వాయుదేవునకు, బ్రహ్మదేవునకు, సకలభూతములకు నమస్కరించి బయలుదేరుటకు నిశ్చయించుకొనెను.

Also read: లంక ప్రయాణానికి సిద్ధమైన హనుమ

ఒక్కసారిగా తన శరీరాన్ని పెంచివేశాడు హనుమంతుడు.

ఆయన దేహపరిమాణమెంతో కొలవటానికి ఎవరికీ శక్యము కావడంలేదు.

తన పాదాలతోనూ, చేతులతోనూ, ఆ మహేంద్రగిరిని గట్టిగా తొక్కిపట్టాడు ఆ మహాకపీశ్వరుడు.

ఆయన బలానికి తట్టుకోలేక అంతపెద్ద పర్వతము గజగజవణికిపోయింది. ఆ పర్వతం పగుళ్ళుబారింది. అలా కనిపించిన ఆ పగుళ్ల నుండి జలధారలు కురియసాగాయి. ఆ పర్వతపు పగుళ్ళు అనేక విధములయిన రంగులతో వింతవింతగా భాసిల్లాయి. ఆయన బరువును ఆ పర్వతం తట్టుకోలేకపోయింది. ఒక్కసారిగా అనేక విస్ఫోటనాలు సంభవించాయి. పెద్దపెద్ద బండ రాళ్ళు ఫెటేల్ ఫెటేల్ మని శబ్దంచేస్తూ పగిలి పోయాయి.

Also read: హనుమ పుట్టుపూర్వోత్తరాలు వెల్లడించిన జాంబవంతుడు

ఆ పెద్దపెద్ద బండరాళ్ళ మధ్యలో నివాసముంటున్న మహాసర్పాలు ఆ బాధకు తాళలేక తమ తమ పడగలు ఎత్తి బుసలు కొడుతూ రాళ్ళను తీవ్రంగా కాటువేయసాగాయి.

ఆ విషాగ్నిజ్వాలలు పర్వతము అంతటా వ్యాపించాయి. ఆ పర్వతము మీద ఉన్న ఓషధులేవీ ఆ విషాగ్నిజ్వాలలను శాంతింపచేయలేకపోయాయి.

ఏవో భూతాలు ఈ పర్వతాన్ని బ్రద్దలుకొడుతున్నాయని భయపడి అక్కడ నివాసముంటున్న విద్యాధరులు, కింన్నరులు ఉన్నపళంగా భయంతో ఆకాశంలోకి లేచిపోయారు.

ఆకాశంలో నిలచిన వారికి ఆ పర్వతంమీది మహా కపిరూపము కనపడ్డది. ఆకాశంలోని సిద్ధులు అనుకునే మాటలు వినపడి, హనుమంతుడి సముద్రలంఘనము గురించి వారికి తెలిసినది.

Also read: సంపాతి వృత్తాంతం

ఒక్కమారు వళ్ళు విదిలించి రోమములు దులుపుకొని ప్రళయకాల మేఘ గర్జనల వంటి ధ్వనులు చేసి తోకఝాడించి, భుజములు, కంఠము వంచి ఆకాశము వైపుచూస్తూ ఊపిరిబిగబట్టి ,పాదములు తొక్కిపట్టి ఎగరడానికి సిద్ధమయి తన చుట్టూ చేరిన వానరులతో ఇలా అన్నాడు హనుమంతుడు.

‘‘శ్రీరామ ధనుస్సు నుండి దూసుకుపోయే బాణంలా లంకకు వెళతాను. అక్కడ సీతమ్మ కనుపించిందా సరే. లేనిపక్షములో అటునుండి అటే సరాసరి స్వర్గానికి వెళతాను. అక్కడా సీతమ్మజాడ తెలియకపోతే రావణుడి జుట్టుపట్టుకొని ఈడ్చుకు వస్తాను. రావణుడితో సహా లంకానగరాన్ని పెకిలించి తీసుకు వస్తాను’’ అని పలికి సింహనాదము చేస్తూ వేగముగా గరుత్మంతుని వలే పైకి ఎగిరాడు మారుతాత్మజుడు.

ఆయన ధాటిగా ఒక్కసారి పైకిలేవగనే ఆ గమన వేగమునకు అప్పటివరకూ అదిమిపెట్టబడిన మహేంద్ర పర్వతమునుండి  వృక్షములన్నియూ కూకటివేళ్ళతో సహా పెకిలింపబడి  ఆయన వెంట, ఇంటికి వచ్చిన బంధువును సాగనంపే గృహస్థుల్లాగా కొంత దూరము ప్రయాణించాయి.

Also read: వానరులకు సీతమ్మ జాడ చెప్పిన సంపాతి

హనుమంతుడు గాలిలోకి లేచినప్పుడు పుట్టిన గాలికి చెట్లకుపూచిన పూవులన్నీ పెనుగాలికి రాలిన చందాన ఆయన మీద జలజలరాలి ఆయన శరీరాన్ని నింపివేసి వింతవింత రంగులతో  ప్రకాశింపచేశాయి.

ఆ పుష్పములచేత కప్పివేయబడిన ఆ మహాకాయుడైన కపి ఆకాశమునందు మెరుపుల మాలికలచేత కప్పివేయబడిన మహాజీమూతమువలే కనపడెను.

.

పుష్పాభిషేకము చేయబడిన ఆయన కాయము నుండి రాలిపడిన పూవులు అన్నియూ సముద్రములో పడి తేలుచుండెను.

నీటిమీద ఆ  నీలి సంద్రముపై తేలుతున్న పూవులు  ఆకాశములోని నక్షత్రములవలే ప్రకాశించి  చూచువారలకు రెండు ఆకాశములున్నవా అన్నట్లుగా భ్రమింపచేయుచుండెను.

పర్వతము మీది నిప్పులనెగళ్ళవలే ఆయన రెండు కన్నులు మెరుపులు మెరయుచుండెను.

అవి సూర్యచంద్రులవలే ప్రకాశించుచుండెను.

పర్వతమంతదేహము ,……..

తెల్లనికోరలూ,…….

చక్రాకారముగానున్నవాలము ….చూచువారలకు సూర్యుడు గూడుకట్టి ఉన్నాడా అని అనిపించెను.

ఆయన ప్రయాణించే వేగమునకు పుట్టిన గాలి చేసే శబ్దము మేఘగర్జనలవలే యుండెను.

ఆ గాలి సముద్రమును అల్లకల్లోలము చేసి దాని అడుగు కనపడునట్లు చేసెను. అప్పుడు అందులో జీవించు సకల జీవరాశులూ బయటపడినవి.

సముద్రములో నివసించు సర్పములు తమను తన్నుకు పోవుటకు గరుత్మంతుడువచ్చెనేమోఅని భీతిల్లినవి.

 మంచి వడితో ఆయన ప్రయాణిస్తుంటే ఆకాశములో ఒక తేజోపుంజము ప్రయాణించుచున్నట్లున్నది. దాని వేగము ఇంత అని చెప్పరాకున్నది!

సముద్రము మీద ఆయన నీడ పదియోజనములవెడల్పు, ముప్పది యోజనముల పొడవు యుండెను.

( యోజనము అనగా తొమ్మిదిమైళ్ళు).

బహుదూరము ప్రయాణము చేయు హనుమంతునికి కాస్త విశ్రాంతి ఇవ్వదలచి  సముద్రుడు ఇట్లు తలపోసెను.

Also read: అంగదుడికి హనుమ మందలింపు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles