Tuesday, September 10, 2024

ఆర్జేడీ అధినేతగా తేజశ్వియాదవ్

  • తండ్రి, తల్లి, అన్న, సోదరి సమక్షంలో శాసనసభాపక్షం తీర్మానం
  • అన్న తేజ్ ప్రతాప్ సైతం ఆమోదించినట్టు కనిపించాడు
  • కులప్రాతిపదికపైన జనాభా లెక్కలు చేపట్టాలన్న తేజశ్వి

తేజశ్వియాదవ్ రాష్ట్రీయ జనతా దళ్ అధినాయకుడుగా గుర్తింపు పొందాడు. లాలూ ప్రసాద్ యాదవ్ మొదటి కొడుకుకు కాకుండా రెండో కుమారుడైన తేజశ్వికి పార్టీ పగ్గాలు అప్పజెప్పారు. లాలూ దానా కేసులలో ఇరుక్కొని జైలుపాలైన దరిమిలా పార్టీని తేజశ్వి నడిపిస్తున్నారు. బిహార్ అసెంబ్లీకి 2020లో జరిగిన ఎన్నికలలో పార్టీకి ఆయనే సారథ్యం వహించారు. ఎన్నికల రంగంలో ప్రతిపక్ష కూటమిని నడిపించారు. బిహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడుగా ఆయనే వ్యవహరిస్తున్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలుసుకునేందుకు హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆర్జేడీ నాయకుడు కూడా తేజశ్వియాదవే.

తేజ్ ప్రతాప్ , తేజశ్వి యాదవ్ లతో తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్

మంగళవారం సాయంత్రం జరిగిన ఆర్జేడీ సమావేశంలో సభికులందరూ ఇక మీదట పార్టీలో అన్ని నిర్ణయాలూ తీసుకునే అధికారం తేజశ్వి యాదవ్ కే ఉంటాయని నిర్ణయించారు. ఈ మేరకు ఒక తీర్మానం ఆమోదించారు. బిహీర్ లో కులాల ప్రాతిపదికగా జనాభా గణన చేపట్టేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆర్జీడీలో ఈ పరిణామానికి ప్రాధాన్యం ఉంది. తేజశ్వియాదవ్ ను ఆర్జేడీ అధినాయకుడిగా ప్రకటించిన ఈ సమావేశంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, భార్య రబ్డీదేవి, పెద్దకొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్, పార్లమెంటు సభ్యురాలు, తేజశ్విసోదరి మీసా భారతి హాజరై నిర్ణయాలను ఆమోదించడం విశేషం. ఈ తీర్మానం ఆమోదించిన ఆర్జేడీ శాసనసభాపక్షం సమావేశానికి లాలూ ప్రసాద్ యాదవ్ అధ్యక్షత వహించారు. ఇంతవరకూ రాజ్యసభ లేదా లోక్ సభ లేదా శాసనసభ ఎన్నికలలో అభ్యర్థులను తేజశ్విని సంప్రదించిన తర్వాత లాలూ యాదవ్ నిర్ణయించేవారు. ఇకమీదల తండ్రి ఆమోదంతో నిమిత్తం లేకుండా తేజశ్వి అన్ని నిర్ణయాలూ తీసుకోవచ్చు.

మా అజెండా పైన అన్ని నిర్ణయాలనూ తేజశ్వి యాదవ్ తీసుకోవాలని తమ (ఆర్జేడీ) శాసనసభ్యులు ఏకగ్రీవంగా కోరారని సీనియర్ ఆర్జేడీ నాయకుడు ఉదయ్ నారాయణ్ చౌధరి ప్రకటించారు. ఎవ్వరికీ అభ్యంతరం లేదనీ, అందరూ ఈ నిర్ణయాన్ని మనస్పూర్తిగా ఆమోదించారనీ చౌధరి చెప్పారు.

లాలూ యాదవ్ సంతానంలో రాజకీయంగా తెలివైన వ్యక్తి తేజశ్వి యాదవ్. లాలూకు ఆరోగ్యం బాగుండటం లేదు. దానా కేసులు ఎడతెరిపిలేకుండా వస్తున్నాయి. విచారణ జరుగుతున్నాయి. శిక్షలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తేజశ్వికి సర్వాధికారాలూ, అన్నిబాధ్యతలూ అప్పజెప్పాలని లాలూకు ఆర్జేడీ సీనియర్ నేత శివానంద్ తివారీ గత వారం సలహా ఇచ్చారు. తన తర్వాత నాయకుడు ఎవరన్న అంశంపైన ఊహాగానాలకు తెరదించుతూ, కుటుంబ సభ్యులను ఒప్పింది లాలూ ప్రసాద్ మొత్తం పార్టీని తేజశ్వికి అప్పజెప్పాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా తేజశ్వి అగ్రజుడు తేజ్ ప్రతాప్ తమ్ముడు అంత వేగంగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడనడానికి అతని వ్యాఖ్యలూ, చర్యలూ నిదర్శనం. తమ్ముడితో పోటీ పడుతున్నట్టు, విభేదిస్తున్నట్టూ, నాయకత్వాన్ని తానూ ఆశిస్తున్నట్టూ గతంలో వ్యాఖ్యలు చేశారు. మంగళవారంనాటి సమావేశంలో మాత్రం తేజ్ ప్రతాప్ తొణకకుండా, బెణకకుండా కూర్చొని సభ నిర్ణయాన్ని స్వాగతించినట్టే కనిపించారు.

కులాల ప్రాతిపదికగా జనాభా లెక్కలు చేపట్టాలని మొదటి నుంచీ పట్టుపట్టిన వ్యక్తి తేజశ్వియాదవ్. తేజశ్వి పట్టుపట్టిన కారణంగానే, ఆయన ఒత్తిడి కారణంగానే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా జనాభా లెక్కలు కుల ప్రాతిపదికగా జరగాలని నిర్ణయించుకొని అఖిలపక్ష సమావేశం పెట్టారు. ఈ నిర్ణయం బీజేపీకి బొత్తిగా ఇష్టం లేదు. బీజేపీతో పొత్తులో ఉంటూ నితీష్ కుమార్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యకరం. మరోసారి బీజేపీకి జెల్ల కొట్టి ఆర్జేడీతో నితీష్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ (యూ) చేతులు కలిపే అవకాశం ఉన్నదా అని ఊహాగానాలు సాగుతున్నాయి. 2015లో బీజేపీతో తెగతెంపులు చేసుకొని నితీష్ కుమార్ తేజశ్వితో కలసి ఎన్నికలలో పోటీ చేసి బీజేపీని ఓడించారు. తేజశ్విని ఉపముఖ్యమంత్రిగా పెట్టుకొని కొంతకాలం ప్రభుత్వాన్ని నడిపారు. తర్వాత ఆ పొత్తును అటకెక్కించి మళ్ళీ బీజేపీతో చేతులు కలిపారు. ఆ విధంగా చాలా కాలంగా బిహార్ ముఖ్యమంత్రిగా మనగలుగుతున్నారు. అఖిలపక్ష సమావేశం నిర్ణయాల ప్రభావం బిహార్ రాజకీయాలపైన, జాతీయ రాజకీయాలపైన ఏ విధంగా ఉంటుందోనని రాజకీయ పరిశీలకులు వేచి చూస్తున్నారు. బీజేపీ బిహార్ శాఖ కూడా కుల ప్రాతిపదికపైన జనాభా లెక్కలు తీయాలని కోరుతోంది. అందుకే అఖిలపక్ష సమావేశంలో పాల్గొనడానికి బీజేపీ జాతీయ నాయకత్వం కూడా అనుమతించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles