Sunday, January 29, 2023

శత్రువులకూ, మిత్రులకూ ఆశ్చర్యం కలిగించిన కాంగ్రెస్ ఫలితాలు

  • మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ, మిత్రపక్షాల పైచేయి
  • హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ లో కాంగ్రెస్ ఆధిక్యం
  • కర్ణాటకలోనూ కాంగ్రెస్ ఢీ అంటే ఢీ
  • మహారాష్ట్ర వెలుపల ఎంపీ సీటు ప్రప్రథమంగా గెలుచుకున్న శివసేన
  • మూడు లోక్  సభ స్థానాలపైన సానుభూతి పవనాల ప్రభావం

దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలలో, ఒక యూనియన్ టెరిటరీలో మూడు లోక్ సభ స్థానాలకూ, 29 శాసనసభ స్థానాలకూ జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడినాయి. వాటి సందేశం ఏమిటి? సారాంశం ఏమిటి? నరేంద్రమోదీ – అమిత్ షా ద్వయాన్ని ఎన్నికలలో ఓడించడం అసాధ్యం కాదని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల ప్రవీణుడు ప్రశాంత్ కిషోర్ అభిప్రాయం ఏమైనప్పటికీ కాంగ్రెస్ తీసిపారవేయదగిన పార్టీ కాదనీ,  కాంగ్రెస్ బీజేపీకి గట్టి పోటీ ఇవ్వగలదనీ ఉపఎన్నికల పలితాలు సూచిస్తున్నాయి. త్రిణమూల్ కాంగ్రెస్ కు పశ్చిమబెంగాల్ లో తిరుగు లేదని కూడా మరోసారి రుజువైంది. అయితే, పశ్చిమబెంగాల్ అంటే దేశం అంతా కాదు. ఒక రాష్ట్రం మాత్రమే. అక్కడి బలం చూసుకొని తానే ప్రధానమంత్రి అభ్యర్థి అన్న చందంగా మమతా బెనర్జీ భావించడం కూడా శక్తికి మించిన లక్ష్యమేనని అర్థం చేసుకోవడం అవసరం.

బీజేపీ గెలిచిన చోట్ల నిస్సంకోచంగా విజయం సాధించింది. కాంగ్రెస్ గెలుపొందిన చోట్ల కూడా అంతే నిర్ద్వంద్వంగా గెలిచింది. మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీకి ఎదురు లేదు. బీజేపీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో కాషాయపార్టీని కంచికి పంపి కాంగ్రెస్ విజయపతాకను ఎగురవేసింది. రాజస్థాన్ లో కాంగ్రెస్ బలం నిరూపించుకుంది. కర్ణాటకలో సైతం బీజేపీని దెబ్బకొట్టగలిగింది. మహారాష్ట్రలో తన సీటు తాను గెలుచుకుంది. మహారాష్ట్ర వెలుపల దాద్రా నగర్ హవేలీలో లోక్ సభ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా శివసేన తన సత్తా నిరూపించుకుంది.

మూడు లోక్ సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలలో సానుభూతి పవనాల పాత్ర తక్కువదేమీ కాదు. హిమాచల్ ప్రదేశ్ లోని మండీ లోక్ సభ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ సతీమణి ప్రతిభాసింగ్ గెలుపొందారు. వీరభద్రసింగ్ ఆరు సార్లు శాసనసభకు ఎన్నికైనారు. అనేక తడవలు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. మంచి నాయకుడిగా పేరు ఉంది. ఆయన మరణం తర్వాత జరిగిన ఎన్నికలలో సహజంగానే ఆయన సతీమణికి అనుకూలంగా సానుభూతి పవనాలు వీచాయి. కార్గిల్ వీరుడిగా ప్రసిద్ధి చెందిన బ్రిగేడియర్ కుశల్ ఠాకూర్ ని బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టినప్పటికీ సానుభూతి పవనాల సహాయంతో ప్రతిభ ఏడు వేల మెజారిటీతో గెలిచారు. దాద్రా నగర్ హవేలీలోనూ లోక్ సభ ఇండిపెండెంట్ సభ్యుడు మోహన్ జీభాయ్ శాంజీభాయ్ కేల్కర్ అక్కడి ప్రభుత్వం తనను అవమానపరిచిందనే బాధతో, వేధించిందనే వేదనతో ముంబయ్ హోటల్ లో ఆత్మహత్య చేసుకున్నారు. అతడి భార్య కాలాబెన్ కేల్కర్ కి శివసేన టిక్కెట్టు ఇచ్చింది. బీజేపీ నిలబెట్టిన  గావిట్ మహేష్ భాయ్ పైన51 వేల మెజారిటీతో ఆమె నెగ్గారు. ఇది కూడా సానుభూతి పవనం ఆదారంగా సాధించిన విజయమే. మధ్యప్రదేశ్ లో ఖాండ్వా లోక్ సభ స్థానాన్ని బీజేపీ నిలుపుకుంది. ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ నందకుమార్ సింగ్ మరణం కారణంగా ఈ ఉపఎన్నిక అవసరమైంది. ఆయన బీజేపీ ఎంపీ కనుక మళ్ళీ బీజేపీ అభ్యర్థినే ఎన్నుకున్నారు. ఇందుకూ సానుభూతి కొంతవరకూ కారణం.

గమనించవలసిన మరో విశేషేం ఏమంటే ప్రాంతీయ పార్టీలు తమ బలం నిరూపించుకున్నాయి. ఒక్క టీఆర్ఎస్ మినహా తక్కిన ప్రాంతీయ పార్టీలన్నీ విజయాలు సాధించాయి. మమతాబెనర్జీ నాయకత్వంలోని త్రిణమూల్ కాంగ్రెస్ నాలుగు సీట్లు గెలుచుకుంది. వాటిలో రెండు తనసీట్లను నిలబెట్టుకుంది. మరి రెండు సీట్లను బీజేపీ నుంచి కైవసం చేసుకున్నది. శివసేన మహారాష్ట్రకు పరిమితమైన పార్టీ. అయినప్పటికీ ఆ పార్టీ కూడా దాద్రానగర్ హవేలీ లోక్ సభ సీటును సాధించింది. అదే విధంగా హరియాణాలో అజయ్ చౌథాల నాయకత్వంలోని ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఇఎన్ఎల్ డి) ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ బీజేపీని ఓడించి అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకుంది. ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ గెలుచుకున్నది అస్సాంలోని రెండు స్థానాలు మాత్రమే. తక్కిన స్థానాలన్నిటినీ బీజేపీ మిత్రపక్షాలు గెలుచుకున్నాయి.అవన్నీ ప్రాంతీయ పార్టీలే. కర్ణాటకలో సిగ్డీలో మరో ప్రాంతీయ పార్టీ జేడీ(ఎస్) అభ్యర్థి ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్, జేడీ(ఎస్) మధ్య పొత్తులేదు. రెండు పార్టీలూ పోటీ చేశాయి కనుక బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయి బీజేపీ అభ్యర్థి గెలుపొందాడు.

మధ్యప్రదేశ్ లో బీజేపీ ఖాండ్వా లోక్ సభ స్థానంతో పాటు రెండు శాసనసభ స్థానాలను (ప్రిథ్వీపూర్, జోబాట్ )కూడా గెలుచుకున్నది. కాంగ్రెస్ ఒక అసెంబ్లీ స్థానాన్ని (రాయ్ గాంవ్) నిలుపుకున్నది. జోబాల్ లో బీజేపీకి వచ్చిన ఆధిక్యం 6,100 ఓట్లు మాత్రమే. మహారాష్ట్రలోని దెగ్లూర్ లో కాంగ్రెస్ బీజేపీపైన 41,933 ఓట్ల మెజారిటీ సాధించి స్థానం నిలబెట్టుకున్నది.

హిమాచల్ ప్రదేశ్ లో, రాజస్థాన్ లో ఘనవిజయాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాలలో మట్టి కరిచింది. తెలంగాణ రాష్ట్రం హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ కు ధరావతు దక్కలేదు. ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య జరిగిన పోటీలో కాంగ్రెస్ పార్టీకి నాలుగు వేల ఓట్లు కూడా రాకపోవడం శోచనీయం. బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ 23వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రెండవస్థానంలో అధికారపార్టీ టీఆర్ఎస్ నిలిచింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో అధికార వైఎస్ఆర్ సీపీకి 90 వేల మెజారిటీతో విజయం లభించగా, ప్రతిపక్ష బీజేపీకి 22వేలకు పైగా ఓట్లు లభించగా కాంగ్రెస్ అభ్యర్థి ఏడు వేల ఓట్లు మాత్రమే సంపాదించుకొని ధరావతు కోల్పోయారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి 2018 ఎన్నికలలో 66 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఆ ఓట్లు ఎటు పోయాయో కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచించుకోవాలి. బీహార్ లో జరిగిన ఉపఎన్నికలో కూడా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ కాంగ్రెస్ ధరావతు కోల్పోయింది. రెండు స్థానాలనూ అధికార జేడీ(యూ) గెలుచుకున్నది. రాష్ట్రీయ జనతా దళ్ రెండో స్థానంలో నిలిచింది. లాలూ ప్రసాద్ యాదవ్ జైలు నుంచి విడుదలై బిహార్ లో నివాసం ఉంటున్నా ఉపఎన్నికలపైన ప్రభావం వేయలేకపోయారు.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దక్షత కారణంగా ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ, దాని మిత్రపక్షాలు ఘనవిజయాలు సాధించాయి. అస్సాంలో మూడు అసెంబ్లీ స్థానాలను బీజేపీ నిలబెట్టుకోగా, రెండు స్థానాలను బీజేపీ మిత్రపక్షం యూపీపీఎల్ రెండు స్థానాలు గెలుచుకున్నది. మేఘాలయలో బీజేపీ మిత్రపక్షం ఎన్ పీపీ రెండు అసెంబ్లీ స్థానాలను (మారీక్నెంగ్, రాజాబాలా), దాని మిత్రపక్షం యూడీపీ మాఫ్లాంగ్ స్థానం గెలుచుకున్నది. మిజోరంలో బీజేపీ మిత్రపక్షం ఎంఎన్ఎఫ్ ట్యూరియల్ నియోజకవర్గంలో విజయం సాధించింది. నాగాలాండ్ లో ణేషనలిస్ట్ డెమాక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ శామాటోర్ చెస్సోర్ అసెంబ్లీ స్థానం కైవసం చేసుకున్నది.

హరియాణాలో బీజేపీ అధికారపార్టీ అయినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థి ధరావతు గల్లంతు అయింది. ఆ రాష్ట్రంలో దేవీలాల్ మనుమడు అజయ్ చౌతాలా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ టిక్కెట్టుపైన పోటీ చేసి ఎయిలినాబాద్ స్థానం గెలుచుకున్నారు. రైతుల ఉద్యమానికి మద్దతు పలుకుతూ ఆయన రాజీనామా చేశారు. రైతులు సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు.

కర్ణాటకలో జేడీ(ఎస్)స్థానమైన సింగ్డీని బీజేపీ కైవసం చేసుకున్నది. బీజేపీ స్థానమైన హంగల్ ను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం విశేషం. ఈ నియోజకవర్గంలో నూతన ముఖ్యమంత్రి దేవరాజు బొమ్మైకి పలుకుబడి బాగా  ఉందని అంటారు. ఆయన పది రోజులపాటు ప్రచారం చేశారు. కర్ణాటక మంత్రులు పది మంది నియోజకవర్గంలోని మకాం ఉండి ప్రచారం చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ మానే గెలుపొందడం విశేషం.

మొత్తం ఫలితాలను సమీక్షించుకుంటే కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో చేసినటువంటి తప్పులు చేయకుండా, బీజేపీని ఎప్పటికప్పుడు ఎండగట్టుతూ, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తే వచ్చే యూపీ, ఉత్తరాఖండ్ ఎన్నికలలో ఏమైనా 2024 నాటికి ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించడానికి సరిపోను 150 సీట్లకు పైగా సంపాదించుకోగలదేమో ప్రయత్నం చేయాలి.     

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles