Thursday, November 30, 2023

సుగ్రీవుడితో సంధి చేసుకోవాలంటూ వాలికి తార హితోక్తులు

రామాయణమ్ 103

మహదానందమాయె రామా.

నీవు మిత్రుడగుట నా అదృష్టము.

ఇక వాలి నన్నేమీ చేయలేడు.

వానికిక చావు మూడినది.

పద ఇప్పుడే బయలుదేరి వెడదాము అని తొందరపెట్టి అందరినీ బయలుదేరదీసి కిష్కింధాపురి కేగి నగర ద్వారము వద్ద నిలచి భయంకరమైన రణన్నినాదము చేసి వాలిని యుద్ధమునకు రమ్మని సవాలు చేసి పిలిచెను.

రామలక్ష్మణహనుమంతులు చెట్లచాటున నిలబడి యుండిరి.

Also read: ఏడు సాల వృక్షములనూ ఒకే బాణముతో పడగొట్టిన రాముడు

సుగ్రీవుని పెనుకేకలు విన్న వాలి ఒక్క ఉదుటున ఉన్నచోటునుండి లేచి సుగ్రీవుని ఎదుర్కొనుటకై బయటకు వచ్చి ఆతనిని సమీపించెను.

అతనిని చూసిన రామచంద్రుడు విల్లు ఎక్కుపెట్టి బాణముతో సిద్ధముగా ఉండెను.

వాలిసుగ్రీవుల ద్వంద్వయుద్ధము ఆరంభమైంది. ఒకరినొకరు తీవ్రంగా నొప్పించుకుంటూ, గాయపరుస్తూ, ఘోరమైన యుద్ధము చేయసాగిరి.

క్రమక్రమముగా సుగ్రీవుని బలము క్షీణించి ఓపిక నశించి తగిలిన గాయములు తీవ్రముగా బాధపెడుతుండగా ప్రాణములు కాపాడుకొనుటకై మరల ఋష్యమూకమునకు పారిపోయెను.

Also read: సుగ్రీవునికి రాజ్యబహిష్కారం, వాలికి రాజ్యాధికారం

అతని వెనుక వెళ్ళిన రాముని చూసి సిగ్గుతో తలవంచుకొని, ‘‘ఏమయ్యా, అన్నతో దెబ్బలు తినిపించినావుకదా. నమ్మకముగా చేసినావుకదా’’ అని ఆక్షేపించెను.

అప్పుడు రాముడు సుగ్రీవునితో, ‘‘మిత్రమా, శత్రుప్రాణాంతకమగు బాణము నేను వదిలినట్లైన అది మీ ఇరువురిలో ఎవరికి తగులునో అని అనుమానము పొడసూపినది. పొరపాటున నీకు తగిలెనా సర్వనాశనమయ్యెడిది

మీ ఇరువురు అన్నదమ్ములూ రూపములో, శరీరదార్ఢ్యములో, రంగులో అన్ని విధాలుగా ఒకరినిపోలి మరొకరున్నారు. అందుచేతనే బాణము విడువలేదు. సుగ్రీవా. నీవు మరల నీ అన్నను యుద్ధానికి ఆహ్వానింపుము. ఈ సారి ఏదైనా ఆనవాలు ధరించుము’’ అనిపలుకుతూ లక్ష్మణుని వైపు చూశాడు శ్రీరాముడు. అప్పుడు లక్ష్మణుడు ఒక పుష్పలతను పెరికి ఆనవాలుగా సుగ్రీవుని కంఠమందు అలంకరింపచేసెను.

Also read: వాలికీ, తనకూ మధ్య వైరం ఎట్లా వచ్చిందో వివరించిన సుగ్రీవుడు

మరల అందరూ కిష్కింధ చేరినారు.

నలుడు, నీలుడు, హనుమంతుడు, తారుడు కూడా బయలుదేరి వెళ్ళినారు.

.

మరల ద్వారము వద్ద నిలబడి ప్రళయకాలపర్జన్యము వలె గర్జించినాడు సుగ్రీవుడు. ఆతని కంఠస్వరము కిష్కింధ అంతా మారు మ్రోగినది. ‘‘ఆకాశము బ్రద్దలయ్యేటట్లున్న ఆ గర్జన ఎవరిది? ఓహో అది సుగ్రీవుని కంఠస్వరమే. ఏమయినది వీడికి? ఇంకా బుద్ధిరాలేదా? ఇప్పుడే కదా చావుదెబ్బలు తిని బ్రతుకు జీవుడా అంటూ బయటపడినాడు. వీడికిక పోగాలము దాపురించినది’’ అని అనుకుంటూ దిగ్గునలేచి కన్నుల అగ్నికణాలుకురుస్తుండగా కదలినాడు వాలి. ఆయన పదఘట్టనలకు భూమి ఎక్కడికక్కడ కృంగిపోతున్నది. మహావేగంగా సాగుతున్న వాలికి ఒక్కసారిగా అడ్డము వచ్చి ఆపింది ఆయన భార్య తార. ఒక్కసారిగా భర్తను కౌగలించుకొని ‘‘నాధా, ఒక్క క్షణం ఆగు. నీ బుద్ధికి పదునుబెట్టి ఆలోచించు. ఇప్పుడే చావుతన్నులుతిని పోయినవాడు మరల అప్పుడే ఎందుకు వచ్చి సవాలు విసిరినాడు?  ఏదో బలమైన కారణముండే ఉండి ఉంటుంది. ఏవరో మహా వీరుల అండ లభించి ఉండి ఉంటుంది. అంగదుడు ఇప్పుడే అరణ్యము వరకు వెళ్ళి తన చారుల ద్వారా కొంత సమాచారాన్ని సేకరించినాడు.

Also read: సీత జారవిడిచిన ఆభరణాలను గుర్తించిన రాముడు

‘‘ఎవరో రాముడట. రణకర్కశుడట. ఇక్ష్వాకుకులతిలకుడట. బలాఢ్యుడట. శత్రు మర్ధనుడట. అజేయుడట. రఘురాముడు, అతనిసోదరుడు ఇరువురు  రణమందు నిలచియుండగా హరిహరాదులు కూడా ఎదిరించలేరట! నీ తల తీయుటకు తన తలను రామునిపాదములకాన్చిసుగ్రీవుడు శరణువేడి నాడట. రాముడు అభయమిచ్చినాడట! ఆయన శరణాగతవత్సలుడట. నాధా,            నా మాట విని సుగ్రీవునితో సంధి చేసుకో. తమ్ముని కన్న ఆత్మబంధువెవ్వడు? నీవు నాకు ప్రియము చేయవలెనని అనుకొన్న ఎడల,నేను నీ హితము కోరెడిదాననని అనుకొన్న ఎడల నా మాటల నాచరింపుము. దేవేంద్ర సమాన తేజస్సుగల రామునితో నీకు విరోధము తగదు’’ అని పలికిన తార పలుకులు రుచించక వాలి ముందడుగు వేసినాడు.

Also read: సుగ్రీవుని హృదయానికి హత్తుకున్న రాముడు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles