Friday, July 19, 2024

అగ్రనాయకుడు మహాత్మాగాంధీ: పుచ్చలపల్లి సుందరయ్య

(గాంధీభవన్ లో గాంధీ జ్ఞానమందిరం వారి ఆహ్వానంపై ఇచ్చిన స్మారకోపన్యాసం)

SUNDARAYYA
పుచ్చలపల్లి సుందరయ్య

సామాన్య ప్రజల దృష్టిలో గాంధీయిజానికి, కమ్యూనిజానికి ఉత్తర, దక్షిణ, ధృవాలకున్నంత దూరముందనీ, గాంధీయిజం అహింసా విధానాన్ని అవలంభిస్తే, కమ్యూనిజం హింసావాదాన్ని నమ్ముతుందని, గాంధీవాదులు ఆధ్యాత్మిక వాదులైతే, కమ్యూనిస్టులు భౌతికవాదులని భావించ బడుతుంది.

దేశంలోని రాజకీయ జీవితంలో కూడా గాంధీ రాజకీయాలకు, కమ్యూనిస్టు రాజకీయాలకు హస్తిమశకాంతర భేదముందని, అసలు మన దేశంలో కమ్యూనిజానికి తావేలేదని కూడా భావించ బడుతున్నది.

అలాంటప్పుడు గాంధీ భవనంలో గాంధీ జ్ఞాన మందిరం వారి ఆధ్వర్యాన జరిగే ఈ సభలో నన్ను ఉపన్యసించమని అడిగినప్పుడు కొంచెం తటపటాయించాను. అయినా ఈ సమితివారు నాకిచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని మరొకసారి ఈ విషయాన్ని గురించి మననం చేసుకునే అవకాశం కలిగింది. నేను వెలిబుచ్చే అభిప్రాయాలు ఈ విషయంపై ఇక ముందు జరగబోయే చర్చలకు ప్రాతిపదికగా వుంటాయనే ఉద్దేశ్యంతో ఈ సమావేశంలో ప్రసంగించడానికి అంగీకరించాను.

గాంధీ రచనల ప్రేరణతోనే ప్రజాసేవారంగంలోకి వచ్చాను

1925-30 సంవత్సరాల మధ్యకాలంలో ప్రజాసేవ చేయాలని, దేశసేవ చేయాలని నాలో ఉత్సాహం కలిగిందంటే అది గాంధీగారి రచనలను, వ్యాసాలను చదవడం వల్లనే. అలా చెప్పుకోవడానికి నేను గర్విస్తున్నాను కూడా. నిజానికి కమ్యూనిస్టుపార్టీలో అనేకమంది ఆయన రచనలను చదవడం ద్వారానే ఉత్తేజితులయ్యారు. ఆ అయిదు సంవత్సరాల్లో ఖద్దరు గురించి, అస్పృశ్యతా నివారణ, హిందూ ముస్లిం ఐక్యత, స్వదేశీ ఉద్యమం గురించి, సత్యాగ్రహం గురించి, మద్యపాన నిషేధం గురించి ఒకటేమిటి ఆయన వ్రాసిన రచనలన్నీ చదివాను.

కాని 1930 నాటికి కొన్ని అనుమానాలు పొడచూపడం ప్రారంభించాయి. గాంధీ గారి పద్ధతుల ద్వారా, గాంధీగారి విధానాల ద్వారా దేశ స్వాతంత్య్రాన్ని సాధించగల్గినా నూటికి తొంభైమందిగా వున్న కార్మిక, కర్షక, మధ్యతరగతి ప్రజల ప్రభుత్వంగా అది ఉంటుందా? లేక నూటికి 10 మందిగా వున్న పెట్టుబడిదారులు, భూస్వాముల ప్రభుత్వంగా ఉంటుందా? ఒకవేళ స్వాతంత్య్రం సిద్ధిస్తే అది బ్రిటీష్ సామ్రాజ్యవాదులతోనో లేక భారత పెట్టుబడిదారులతోనో రాజీపడటం ద్వారా వచ్చే స్వాతంత్య్రమే అవుతుందేమోనని అనుకోవడం జరిగింది.

1948లో గాంధీజీ చనిపోయేవరకు ఆయనతో మాకు అనేక విషయాల్లో భేదాభిప్రాయాలు ఉంటూ వచ్చాయి. అయితే, వారి వ్యాసాలను శ్రద్ధగా చదివాను. 1928లో నేను బాలభట సంఘంలో ఉండేవాణ్ణి. కానీ గాంధీజీ సభలకు వెళ్ళడానికి ఎప్పుడైతే నాకు అభ్యంతరం కలుగజేశారో అప్పుడు ఈ సంస్థ సామ్రాజ్యవాదులకు అనుకూలమైన సంస్థని భావించి ఇక ఒక్క క్షణం కూడా అందులో ఉండకూడదని ఇవతలకు వచ్చేశా. ఆ విధంగా గాంధీగారి రాజకీయాలకు దగ్గరగా వచ్చాను.

నూరు సంవత్సరాల సామ్రాజ్య వ్యతిరేక పోరాటంలో స్వాతంత్య్రం కోసం కృషి చేసినవారిలో గాంధీజీ అందరికన్నా అగ్రగణ్యులు, ముందున్న మహావ్యక్తి. గాంధీజీకి ముందు దాదాభాయ్, గోఖలే, రనడే, తిలక్ మొదలగు మహామహులు కాంగ్రెసు సంస్థకు పునాదులు వేసి పనిచేసినవారున్నారు. కొంతమంది ఉద్యోగస్తులను, అధికారులను భయోత్పాతం కలుగజేయటం ద్వారా వారిని తరిమివేయగలమని అనుకున్న “టెర్రరిస్టు”లున్నారు. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి ప్రజల్లో పనిచేస్తూ వచ్చింది. ఈ మహావ్యక్తుల ఉద్యమాలు స్వాతంత్య్ర సముపార్జనలో ముఖ్యపాత్ర వహించాయి. కానీ వీరందరికన్నా, ఉద్యమాలన్నింటికన్నా తలమానికంగా గాంధీజీ ఉంటూ వచ్చారు. గాంధీజీలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఇలా తలమానికంగా వుండటానికి కారణం ఏమిటి?

సామాన్య ప్రజలలో చైతన్యాన్ని కలిగించి వారందరూ కూడా పాల్గొనడానికి వీలయ్యే ఒక కార్యక్రమాన్ని ఇచ్చి ముందుకు నడిపించడంలోనే గాంధీజీ గొప్పతనం ఉంది. మనం సాధించిన స్వాతంత్య్రం గాంధీజీ కలలుగన్న స్వరాజ్యమేనా? ఒకరిని మరొకరు పీడించే, ఒక వర్గాన్ని మరొక వర్గం దోచుకునే వ్యవస్థకు స్వస్తి చెప్పి,సామాన్య ప్రజలకు పూర్తి స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన స్వరాజ్యమేనా? ఈ రోజున కాంగ్రెస్  అగ్రనాయకులు నిర్వహిస్తున్న సహకార సర్వోదయ సోషలిజమేనా ఈ స్వరాజ్యం?

స్వాతంత్ర్యానికి గాంధీయిజం పునాదులు

స్వాతంత్ర్యం సంపాదించడానికి గాంధీయిజం పునాదులు వేసింది. స్వాతంత్ర్యం అనే మన ఆశయాన్ని సాధించడంలో గాంధీజీ యొక్క ప్రముఖ పాత్రను కమ్యూనిస్టులు గుర్తిస్తారు. కాని అంతవరకు మాత్రమే. గాంధీజీ సిద్ధాంతాలు అంతకుమించి ముందుకు పోవడానికి తోడ్పడవు.

కమ్యూనిస్టు పదజాలం ద్వారా వివరించాల్సి వస్తే సమాజం అంతర్గత వర్గాలుగా విభజింపబడి వుంది. భారతదేశంలో కూడా బూర్జువావర్గం, గ్రామాల్లో భూస్వామ్య వర్గాలేగాక, కార్మికులు, రైతులు, మధ్య తరగతి ప్రజలు ఉన్న వర్గంగా విభజింపబడి ఉన్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో అన్ని వర్గాలవారూ పాల్గొన్నారు.

ఈ పోరాటానికి వ్యక్తులుగా ఎవరు నాయకత్వం వహించారన్నది చూసినట్లయితే మొదట గాంధీజీ, ఆ తర్వాత నెహ్రూ అని చెప్పవచ్చు. కాని వర్గరీత్యా చూస్తే బూర్జువా వర్గం లేక ధనికవర్గం అని చెప్పాల్సి వస్తుంది. ఇతర వర్గాలు కూడా స్వాతంత్ర్యం కోసం కృషి చేశాయి. కాని నాయకత్వం ప్రధానంగా బూర్జువా వర్గానిదే.

దేశాన్ని స్వాతంత్య్రం వైపుకు తీసుకొని పోవడంలోనైతేనేమి, ప్రజలందరినీ పోరాటంలోకి సమీకరించడంలోనైతేనేమి గాంధీజీ సిద్ధాంతాలు ప్రాముఖ్యత వహించాయి. కానీ ఆ సిద్ధాంతానికి పరిమితులున్నాయి. విదేశీ పెత్తనం పోవడానికి మాత్రమే పరిమితమైంది. కానీ నూటికి 90 మందిగా వున్న సామాన్య ప్రజానీకానికి నిజంగా స్వాతంత్ర్యం కలుగజేయడానికి ఈ సిద్ధాంతాలు చాలవు. నేనిదివరకే చెప్పినట్లు గాంధీ సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండే కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది.

దక్షిణాఫ్రికాలో పోరాటాలు

మనదేశంలో మాలలను దూరంగా, అంటరానివారుగా చూసినట్లే దక్షిణాఫ్రికాలో కూడా తెల్లవారు నీగ్రోలను తదితర జాతులవారిని దూరంగా వుంచేవారు. ఈ జాతి విద్వేష విధానాన్ని రూపుమాపి సమానత్వం సాధించడం కోసం గాంధీజీ సత్యాగ్రహం, సహాయ నిరాకరణ రూపాల్లో పోరాటం సాగించారు. హృదయపరివర్తన ద్వారా సాధించాలన్నారు గాంధీజీ. ఆ పోరాటంలో అనేకమంది పాల్గొన్నారు.

అలాగే 1917లో భారతదేశంలో మొదటిసారిగా బీహార్లోని చంపరాన్ లో బ్రిటీష్ తోట యజమానులకు వ్యతిరేకంగా “నీలి ఆకు రైతులు” పోరాటం (ఇండిగో స్ట్రగుల్) నడిపారు. ఆ తర్వాత జరిగిన సత్యాగ్రహ పోరాటాలు ముఖ్యంగా 1920-22, 1930-34,1940-45 సంవత్సరాల్లో మూడు దశల్లో జరిగాయి. 1922లో ఈ సత్యాగ్రహ పోరాటాన్ని గాంధీ- ఇర్విన్ ఒడంబడిక జరిగిన తర్వాత కూడా విరమింప చేయడం సరికాదని మా అభిప్రాయం. మళ్ళీ మన బలాలను సమీకరించుకోవడానికి తాత్కాలికంగా విరమిస్తే సరిగా ఉండేది. అది కూడా ప్రజల కనుకూలమైన షరతులతో విరమించి ఉండాల్సింది.

అయితే 1924లో,1934లోనూ అంతకు ముందు జరుగుతూ వచ్చిన పోరాటాలు విరమించడం సరి అయినదేనని నా అభిప్రాయం. ఆ రోజుల్లో మన ఉద్యమం బలహీనపడినప్పుడు శత్రువుదే పైచేయిగా ఉన్నప్పుడు విరమించబడమొక్కటే మార్గం. ఈ విధంగా 1927, 31 సంవత్సరాల్లో ఉద్యమాలు ఉచ్చస్థాయిలో ఉన్నప్పుడు పోరాటాలు విరమించడం అంటే ఆ ఉద్యమాలకు పరిమితులు పెట్టడమే అవుతుంది. ప్రాథమిక దశల్లో ప్రజల్లో చైతన్యం కలిగించి కదలించడానికి మాత్రమే ఈ సత్యాగ్రహ పోరాటాలు ఉపకరించాయి. వెనుకబడి తలెత్తుకోలేని ప్రజానీకాన్ని వారు పాల్గొనేటటువంటి కార్యక్రమం ఇవ్వడమే ఈ పోరాటాల ప్రాముఖ్యత.

రెండో ప్రపంచయుద్ధంతో డీలాపడిన బ్రిటన్

1945 నాటికి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి ప్రపంచ పరిస్థితులు మారాయి. బ్రిటీష్ సామ్రాజ్యవాదులు బాగా బలహీనపడ్డారు. దేశంలో అజాద్ హింద్ ఫౌజ్ పోరాటం, అనేక రాష్ట్రాల్లో కార్మిక, కర్షక పోరాటాలు, స్వదేశీ సంస్థానాల్లో తిరుగుబాట్లు- ఇవన్నీ బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని బలహీనపరిచి, వారు స్వాతంత్య్రం ఇచ్చేలా చేయడానికి దారి తీశాయి. అయితే స్వరాజ్యం వచ్చినా బ్రిటీష్ వారి ఆర్ధిక పెత్తనం అలాగే వుందని, ఆర్థిక పెత్తనం అలాగే వున్నంతకాలం అది సంపూర్ణ స్వరాజ్యం కాదనే మీమాంసలు వుండనే వున్నాయి. ఆర్థిక ప్రాబల్యం వున్నా, నేటి ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా బ్రిటీష్ వారు భారతదేశాన్ని తామనుకున్నట్లు తమ పిడికిలిలో ఉంచుకోలేకపోయారు. కాగా కేవలం గాంధీగారి అహింసా సిద్ధాంతాలతో ఏకీభవించనివారు కూడా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. అలాగే, మనకు స్వాతంత్ర్యం వచ్చిందంటే ఆనాటి ప్రపంచ పరిస్థితుల ప్రాబల్యం కూడా లేకపోలేదు.

కాగా కేవలం కాంగ్రెస్ పార్టీ కృషివలనే స్వాతంత్య్రం వచ్చిందనటం కూడా సత్యదూరం. అయితే, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాముఖ్యం ఉందనీ మాత్రం అంగీకరిస్తాం. మహాత్మాగాంధీ నిరంతరం హిందూ- ముస్లిం ఐక్యత కోసం కృషి చేస్తూ వచ్చారు. ఆఖరుకు ఒక హిందూ మతోన్మాది చేతిలో తుపాకీ కాల్పులకు బలి అయ్యారు. ఈ రోజున భారత్-పాకిస్తాన్ దేశాలను హిందూ మహ్మదీయ రాజ్యాలుగా ఒకరికి వ్యతిరేకంగా మరొకరిని సామ్రాజ్యవాదులు రెచ్చగొడుతున్న ఈ సందర్భంలో గాంధీజీ యొక్క ఈ కార్యక్రమం ఎంతైనా ప్రాముఖ్యం వహిస్తుంది. గాంధీజీ యొక్క ఈ ఆశయాన్ని ఇంకా మనం చేరుకోలేదు. గాంధీజీ కృషి చాలా ముఖ్యమైనది. కేవలం అంటరానితనం పోగొట్టడమే గాక ఏ కులంలో పుట్టినా సమానత్వం వుండాలని, సాంఘిక సమానత్వానికి భిన్నమైన ఈ పరిస్థితిని తొలగించాలని గాంధీజీ అవిరళ కృషి చేశారు.

అంటరానితనం నిర్మూలనలో విఫలమయ్యాం

స్వాతంత్య్రం వచ్చిన అనంతరం రాజ్యాంగ చట్టం ద్వారా, తదితర చట్టాల ద్వారా ఈ అంటరానితనాన్ని పోగొట్టటానికి కృషి జరిగింది. కానీ తొలగలేదనే చెప్పాలి. హోటళ్ళలోనూ, దేవాలయాలలోనూ ప్రవేశానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆర్థిక అసమానత తొలగనన్నాళ్ళూ ఈ సమస్య అపరిష్కృతంగానే వుంటుంది. మనదేశం ప్రధానంగా వ్యవసాయ దేశం, వ్యవసాయం ప్రధాన వృత్తిగా పెట్టుకొని జీవిస్తున్నవారికి గ్రామ పరిశ్రమలనేవి తీరిక సమయంలో మరికొంత ఆదాయాన్ని ఇస్తాయనేటంత వరకు అంగీకరిస్తాం. కానీ, గ్రామ పరిశ్రమల ద్వారానే ప్రధాన భారీ పరిశ్రమలు లేకుండానే దేశం ముందుకు పోతుందనే ఆర్థిక సిద్ధాంతాన్ని అంగీకరించలేము.  పరిశ్రమలో వికేంద్రీకరణ జరపాలనీ, భారీ పరిశ్రమలు మన నాగరికతకు గొడ్డలిపెట్టు అనే వాదనతో మేము ఏకీభవించలేము. కానీ గ్రామ పరిశ్రమలు వెనుకాలనున్న విదేశీతత్వంతో, మనదేశం స్వయంపోషకంగా వుంటూ మన దేశంలో తయారయ్యే వస్తువులను పుపయోగించుకోవాలనే దానితో మేము పూర్తిగా ఏకీభవిస్తాం.

కమ్యూనిస్టులు భౌతికవాదులు కాబట్టి, నిరాడంబర జీవనానికి వ్యతిరేకులని చాలా మంది అభిప్రాయం. గాంధీ అంత నిరాడంబరంగా ప్రతిపార్టీ కార్యకర్త నిరాడంబర జీవితం గడపాలి. అలా చేయకపోతే ప్రజలతో సజీవ సంబంధాలు పెట్టుకోలేం. ఈ విషయంలో గాంధీవాదులే గాంధీ సిద్ధాంతాలను ధిక్కరిస్తున్నారు. కొద్దో గొప్పో మేమే ఆయన సిద్ధాంతాలకు దగ్గరగా వున్నాం. అయితే ఇంకా కృషి చేయాల్సి వుంది.

ప్రజలు – మద్యపాన మత్తులై తాగి తందనాలాడి డబ్బు వృధా చేయాలని కమ్యూనిస్టులు కోరడం లేదు. అంతవరకూ మద్యపాన నిషేధ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాం. అయితే నిర్బంధంగా ఆ సిద్ధాంతాన్ని అమలుపరచడం అవివేకం. ఈ రోజున మనం చూస్తున్నట్లుగా అది మరింత ప్రమాదకరమైన పానీయాలు తాగడానికి దారితీస్తుంది. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకొని రావడం ద్వారానే మద్యపాన నిషేధాన్ని జయప్రదంగా అమలు పరచగలుగుతాం.

సంపన్నులలో హృదయ పరివర్తన అసంభవం

వందలవేల ఎకరాలు గల భూస్వాములు, లక్షల కోట్ల ఆదాయం గల పెట్టుబడిదార్లు ఈ ఆస్తులన్నింటికీ తామే యజమానులమనీ అనుకోకుండా ప్రజలకు ధర్మకర్తృత్వం వహించి ఆ డబ్బు ప్రజలకోసం, దేశం కోసం వినియోగించాలనేదే గాంధీగారి ధర్మకర్తృత్వ సిద్ధాంతం. ఈ సిద్ధాంతంతో మేమెన్నటికీ ఏకీభవించలేము. ఈ రోజున ఉత్పత్తి సాధనాలు వారి చేతుల్లో ఉన్నాయి. వాటిని తమస్వలాభం కోసం వినియోగించుకుంటున్నారు. దాన్ని వ్యతిరేకించి పోరాడక తప్పదని మేము భావిస్తాం. భారీ లాభాలు తగ్గించకుండా, వారి ఆస్తులు తగ్గించకుండా వారిలో హృదయపరివర్తన తీసుకొని రావడం అసంభవం. ఉద్యమానికి పరిమితులు పెట్టడం అవుతుంది. స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న రోజుల్లో ఈ వర్గాలు కూడా పోరాటంలో కొంతవరకు కలిసివచ్చారు. కాబట్టి అప్పుడు వ్యతిరేక పోరాటం కొంత పదును తగ్గించారంటే అర్థం చేసుకోవచ్చుగానీ స్వాతంత్య్రానంతరం అటువంటి దృక్పథం అవలంబించటం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. దీనినే మేము వర్గపోరాటం అంటాము. అయితే దీని అర్థం ఈరోజున కమ్యూనిస్టులు సాయుధ పోరాటం కావాలంటున్నారని మీరెవరైనా సాగదీసి అర్థం తీశారంటే మాకు అన్యాయం చేసినవారవుతారు.

హృదయ పరివర్తన ద్వారా లొంగితే మంచిదే. కానీ వారి సౌకర్యాలను కాపాడుకోవడానికి దౌర్జన్యానికి దిగితే,ఆ దౌర్జన్యానికి లొంగడం ద్వారా ఒక చెంపమీద కొడితే మరొక చెంపకూడా ఇవ్వడం ద్వారా హృదయ పరివర్తన కలుగుతుందా? లేక పెత్తందారీ వర్గాలు దౌర్జన్యానికి దిగినప్పుడు ఆత్మరక్షణకు పూనుకోవడం ద్వారా హృదయ పరివర్తన చేయగలమా? మార్పు శాంతియుతంగా జరగాలనేదే మా వాంఛ. అనేకమంది చనిపోవడాన్ని బుర్రలు బద్దలు కొట్టుకోవడాన్ని ఎవరు వాంఛిస్తారు? పెట్టుబడిదారులు, భూస్వాములు దౌర్జన్యానికి దిగే అవకాశం, సాహసం లేకుండా చేయాలనేదే మా ఉద్దేశ్యం.

ప్రజలే సమాధానం చెబుతారు

ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో భారతదేశం సోషలిజం కోరుతున్న పరిస్థితుల్లో పెట్టుబడిదారులు, భూస్వాముల అధికారం పోవాలని ప్రజలే ముందుకు వస్తున్నప్పుడు ధనిక వర్గాలు దౌర్జన్యానికి పూనుకోవడం కష్టం. వారు వెనుకంజ వేయవచ్చు. వారు దౌర్జన్యం చేయనప్పుడు ప్రతి దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేకుండాపోతుంది. అలా కాకుండా ఎక్కువమంది ప్రజలు దోపిడీ విధానం పోవాలని వాంఛించినప్పుడు అలాకాదు దౌర్జన్యం చేసి, దోపిడీ విధానాన్ని కాపాడుకుంటామంటే దానికి ఆ ప్రజలే సమాధానం చెపుతారు. వారు ఎన్ని దౌర్జన్యాలు చేసినా ప్రజలు అలాగే పడి వుంటారని మేముచెప్పడం లేదు. దాన్ని మరో కొసకులాగి మేము హింసను కోరుతున్నామని చెప్పడం అబద్దాలు చెప్పడమే అవుతుంది.

టెండూల్కర్ వ్రాసిన “గాంధీజీ చరిత్రలో” గత 20 సంవత్సరాలుగా జరిపిన పోరాటం అహింసా సిద్ధాంతాలను నమ్మి చేసిన పోరాటం కాదు. మరో మార్గంలేక బలహీనంగా వున్న ప్రజాశక్తులు సాగించిన ‘సాత్విక నిరోధం మాత్రమే’ అని గాంధీ వ్రాసిన లేఖను పేర్కొన్నారు. ఈ విషయం ఇక్కడ మీకు గుర్తుకు తీసుకువస్తున్నాను. గాంధీ దేశానికి ఏమీ చేయలేదని, ఆయన ప్రవచనాల నుంచి నేర్చుకొని ఆచరించేదేమీ లేదని మేము అనుకోవడం లేదని నేను వేరే చెప్పనవసరం లేదు. గాంధీజీ ధనికవర్గాల కోసం పనిచేస్తున్నాడని మేము ఇదివరకు బండగా చెబుతూ వచ్చాం. ఇదీ తప్పు. కాని ఆయన పెట్టిన పరిమితుల వల్ల అవలంబించిన కొన్ని పద్ధతులవల్ల ఆయన అనుకున్నా, అనుకోకపోయినా ధనికవర్గాల ప్రాబల్యం, పెత్తనం అలాగే ఉండిపోవడం జరిగింది.

సమానత్వమనేది గాంధీ సిద్ధాంతాల్లో కీలకం, దక్షిణాఫ్రికాలో తెల్లవారితో నల్లవారికి సమానత్వం, చంపారన్లో రైతుల సమానత్వం కోసం, విదేశాలతో భారతదేశం సమానత్వం కోసం, అన్ని కులాల వారి సమానత్వం కోసం, హిందూ ముస్లిం సమానత్వం కోసం, ఆర్థిక అసమానతలు తొలగించి సమానత్వం సాధించడం కోసం, మొత్తం ఆయన జీవితం అంతా సమానత్వం కోసం పోరాడారు. సమానత్వమనేది ఆయన నడిపిన ఉద్యమాలన్నింటికీ కీలకం, బీజం. ఈ సమానత్వం సాధించాలనే కర్తవ్యం ఇంకా మిగిలి వుంది. దాన్ని సాధించాలి. అలా చేసినప్పుడే గాంధీజీ ఆశయాలను నెరవేర్చిన వారమౌతాము. పూర్తి సమానత్వం సాధించటం మాట అటుంచి హెచ్చుతగ్గులు సాధ్యమైనంత వరకైనా తగ్గించాలి. భూమిపై, ఇతర ఆదాయాలపై సీలింగ్ విధించటం ద్వారా గాంధీజీ సిద్ధాంతాన్ని కొద్దిగానైనా ఆచరించినట్లవుతుంది. ఇది రెండవ కర్తవ్యం.

గాంధీజీ శాంతి కావాలన్నారు. ప్రపంచంలో కొన్ని దేశాలు, ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ సామ్రాజ్యవాదులు యుద్ధాన్ని రెచ్చగొడుతున్నారు. వారిని వ్యతిరేకించి ప్రపంచశాంతిని కాపాడటానికి కృషి చేయడం, హిందూ- ముస్లిం ఐక్యత, కులతత్వాలను తొలగించడం కూడా గాంధీజీ ఆశయాలను అమలుపరచడానికి చేసే కృషియే. ఇలా చేసిననాడే ప్రజల సౌభాగ్యం, దేశ సౌభాగ్యం, మానవ కల్యాణం సాధ్యమౌతాయి.

చైనాలో సన్ యట్ సేన్ ను ఆ దేశ కమ్యూనిస్టు పార్టీ ఎంతో గౌరవిస్తుంది. కమ్యూనిస్టు పార్టీ ఆయన అభిప్రాయాలన్నింటితో ఏకీభవించకపోయినా, ఆయన దేశాభివృద్ధికి ఒకానొక దశలో శాయశక్తులా కృషి చేశారు. ఆయనను కమ్యూనిస్టు పార్టీ తలమానికంగా ఎంచుతుంది. ఎన్ని లోపాలున్నా, పరిమితులున్నా అటువంటి వారిని గౌరవించి వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడం సత్సంప్రదాయం. అలాగే మహాత్మాగాంధీని, వారి సేవను గుర్తించి మనం గౌరవించాలి.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

సాహితీ మిత్రులు ప్రచురించిన “నేనెరిగిన సుందరయ్య-ఏ.పి విఠల్ ” పుస్తకం నుండి సేకరణ.

Related Articles

1 COMMENT

  1. Just a fast hello and also to thank you for discussing your ideas on this page. I wound up in your weblog right after researching physical fitness connected issues on Yahoo guess I lost track of what I had been performing! Anyway I’ll be back as soon as again inside the long run to verify out your blogposts down the road. Thanks!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles